విజయనగరం (్ఫర్టు), జూలై 29: విజయనగరం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహారదీక్షలను చేపట్టారు. రెండురోజులపాటు చేపట్టనున్న ఈ దీక్షలను ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి పి.్భనుమూర్తి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ డిపో పరిధిలో చీపురుపల్లి బస్ కాంప్లెక్స్ ఎటిబి ఏజెంట్ సీక్రెట్ కోడ్‌తో గుర్తు తెలియని వ్యక్తులు సైబర్ నేరానికి పాల్పడ్డాన్నారు. అయితే ఈ సంఘటన జరగడానికి కారకులైన పెద్ద ఉద్యోగులను విడిచిపెట్టి అమాయకులైన కిందస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. శాఖాపరమైన దర్యాప్తు కూడా ముగిసిందన్నారు. అయితే డిపోక్లర్క్ ఎంఎస్‌ఎన్‌రాజు, సిస్టిమ్ సూపర్‌వైజర్ లక్ష్మిని సస్పెండ్ చేశారన్నారు. ఈ వ్యహారంతో వీరికి సంబంధం లేకపోయినప్పటికీ అక్రమంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా సంబంధిత డిపో అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి పి.్భనుమూర్తి మాట్లాడుతూ అక్రమంగా సస్పెండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జోనల్ అధ్యక్షుడు పెదమజ్జి సత్యనారాయణ, డిపో నాయకులు పరమహంస, టెక్కలి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నెలివాడలో ఇరువర్గాల ఘర్షణ: 8 మందికి గాయాలు
బొండపల్లి, జూలై 29 : మండలంలోని నెలివాడ గ్రామంలో సోమవారం జరిగిన ఇరువర్గాల ఘర్షణలో ఎనిమిది మంది గాయపడగా 12 మందిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో ఒక వర్గంలో కొమ్మ శంకరరావు, మాకాల సూర్యారావు, నెట్టి రామలక్ష్మి, కల్ది కృష్ణవేణిలు గాయపడగా మరో వర్గంలో కునుగు నాగేంద్ర, శీర సత్యవతి, కునుకు అప్పలనాయుడు, కునుకు సావిత్రిలు గాయపడ్డారు. కునుకు నాగేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు కొమ్మ శంకరరావు, వనపర్తి పెంటాజీ, కల్ది రఘుబాబు, సాలాపు అప్పలబాస్కరరావు, కొండ కృష్ణ, పెంద్యాల శ్రీనివాసరావుపై కేసు నమోదు చేయగా, కల్ది కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కునుకు మారినాయుడు, పురమనేని బంగారునాయుడు, కెల్ల సూరి, కొండపల్లి సంతోష్‌కుమార్, పురంనేని పైడినాయుడులపై కేసు నమోదు చేసారు.
సీఎం ద్వారానే
సమైక్యాంధ్ర సాధ్యం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 29: రాష్ట్రం సమైక్యాంధ్రగా ఉండాలంటే అది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రుల ద్వారానే సాధ్యమవుతుందని ఎన్జీవో సంఘం రాష్టన్రాయకులు పేడాడ జనార్థనరావు అన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సీమాంధ్ర అభివృద్ధి జరగాలంటే మరో 30 ఏళ్లు సమయం పడుతుందని అన్నారు. అందువల్ల సమైక్యాంధ్ర కోసం మంత్రులు, ముఖ్యమంత్రి పాటు పడాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం ఎంపీలు కేంద్రంపై వత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎంపీలు మంత్రి పదవులతో సరిపెట్టుకున్నారే తప్ప, రాష్ట్రం కలసి ఉండటానికి గట్టి పోరాటం చేయకపోవడమే కారణమన్నారు. అందువల్ల తాము ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులపై విశ్వాసం ఉంచుతున్నామని తెలిపారు. సమైక్యాంధ్రగానే ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సమైక్యవాదులు ఏకం కావాలన్నారు.
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
గజపతినగరం, జూలై 29 : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దేవర ఈశ్వరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడుతూ మంగళవారం కూడా విధులు బహిష్కరిస్తామన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అభివృద్ది కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పాలన స్థంబించి ప్రాంతీయ విద్వేశాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పుతుందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదని ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. సమైక్యంగా ఉండటమే మేలు అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు చప్పా తిరుపతిరావు, గండి అప్పలనాయుడు, రెడ్డి శ్రీనివాసులనాయుడు, యు.రమేష్‌రాజు, కె.రామునాయుడు, గండి విద్యాసాగర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో ద్రాక్షతోట!
బొబ్బిలి, జూలై 29: కృషి ఉంటే ఎటువంటి పంటలనైన పండించవచ్చునని సాలా మురళీకృష్ణ నిరూపించారు. గాంధీ బొమ్మ సమీపంలో ఉన్న తన ఇంటి వద్ద ద్రాక్ష తోట వేసి పలువురిని అబ్బురపరుస్తున్నారు. ఏడాది క్రితం ఇంటి వద్ద ద్రాక్ష మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆ తోట కాపుకొచ్చి గుత్తుగుత్తులు కాసి చూపరులను ఆకట్టుకుంటోంది. ద్రాక్ష తోటకు అనువైన భూమి లేకపోయినా ఇంటి వద్దే ద్రాక్ష పాదులను వేసి పెంచారు. ఏడాది నుంచి ఈ తోట కాపు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటకు సేంద్రియ ఎరువు అధికంగా వినియోగించడం ద్వారా మంచి దిగుబడి వచ్చిందన్నారు. ద్రాక్ష తోటను మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయాధికారుల నుంచి మరిన్ని సూచనలు, సలహాలు తీసుకుని సస్యరక్షణ చర్యలు చేపడితే మరింత ఆదాయం లభించి ఉండేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోను ద్రాక్షను విస్తారంగా పండించవచ్చునని సాలా మురళీకృష్ణ నిరూపించారు.
బరంపురానికి కొత్త సర్వీసు
పార్వతీపురం, జూలై 29: పార్వతీపురం ఆర్టీసీ డిపో నుండి వచ్చే నెల ఒకటో తీదీ నుంచి బరంపురానికి కొత్త సర్వీసును నడుపుతామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పి అప్పన్న తెలిపారు. సోమవారం ఆయన పార్వతీపురం ఆర్టీసీ డిపోను పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ పార్వతీపురం నుండి అంతర్రాష్ట సర్వీసును నడిపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సర్వీసును వీరఘట్టాం, పాలకొండ, శ్రీకాకుళం, ఇచ్చాపురం మీదుగా నడపనున్నట్టు తెలిపారు. ఈ సర్వీసును ఈ ప్రాంత ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించడానికి ఆర్టీసీ సిబ్బంది అంకిత భావం కృషి చేయాలన్నారు. సంస్థ మనుగడకు కృషి చేసిన సిబ్బందికి సంస్థ తగిన విధంగా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఆర్టీసీ డిపోమేనేజర్ బివి ఎస్ నాయుడు, చీఫ్ ఇనస్పెక్టర్ సత్యనారాయణ, ఎంఎఫ్ డిజె సందరం పాల్గొన్నారు.
విజయనగరం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ
english title:
rtc
Date:
Tuesday, July 30, 2013