Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమైక్య ఉద్యమ హోరు

$
0
0

శ్రీకాకుళం, ఆగస్టు 1: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో పలు కళాశాలల విద్యార్థులు సమైక్య గళంతోఉద్యమానికి ఊపందించారు. గురువారం ఉదయం పట్టణంలోని వివిధ డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులు తరగతులకు బహిష్కరించారు. జిల్లాలో శివానీ, శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలు, ఆదిత్య, ప్రతిభ, ఎస్‌ఎస్‌ఆర్, శ్రీ చైతన్య, సన్ , ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలు, ఆర్సీఎం, సాయిక్రిష్ణ తదితర జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర విభజనకు నిరసనగా రోడ్లెక్కారు. పట్టణంలో డే అండ్‌నైట్ జంక్షన్ వద్ద మానవహారం చేసి, అక్కడే కొద్ది సేపు బైఠాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు పూర్తి సంఘీభావం ప్రకటించారు. మాజీ మంత్రులు తమ్మినేని సీతారాం, గుండ అప్పలసూర్యనారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షులు చౌదరి బాబ్జి, లోక్‌సత్తా రాష్టక్రార్యదర్శి డి.విష్ణుమూర్తి, జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు చౌదరి పురుషోత్తం నాయుడు, హనుమంతు సాయిరాం, జామి భీమశంకరంలు మాట్లాడారు. రాజకీయ లబ్ధిని పొందేందుకు ప్రత్యేక తెలంగాణను ప్రకటించారన్నారు. ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. సోనియాగాంధీ కుమారుడున్ని ప్రధానమంత్రిని చేయడం కోసమే చీకటి ఒప్పందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 20 సూత్రాల అమలు ద్వారా నాడు దేశాన్ని గందరగోళం సృష్టించిన ఇందిరాగాంధీ మొండివైఖరి నేడు మరలా పునరావృత్తం కావడానికి సోనియా కారణమయ్యారన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనలో శాస్ర్తియత గానీ, తెలుగుప్రజల మనోభావాలను సైతం పరిగణలోనికి తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ కుఠిలరాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తేదీ జూలై 30 ఆంధ్రులకు చీకటి రోజుగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పదవులకు తక్షణమే రాజీనామాలు చేసి ఉద్యమానికి ఊపందించాలని, లేనిపక్షంలోవారి ఇళ్లను ముట్టడించి స్థంభింపజేస్తామని హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సమైక్యాంధ్ర ఆవశ్యకతను, రాష్ట్ర విభజన జరిగితే వాటిల్లే నష్టాన్ని సామాన్యప్రజలకు అర్థమమ్యేలా తెలియజెప్పి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అనంతరం విద్యార్థులతో జెఎసి నాయకులు ఏడురోడ్లజంక్షన్, పొట్టి శ్రీరాముల కూడలి వరకు ర్యాలీగా వెల్లి, అక్కడ సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నాలు నిర్వహించి, ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఈ ఉద్యమ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అద్యక్షుడు శ్రీనివాసానంద స్వామి, జేసీఐ అధ్యక్షుడు కోరాడ రమేష్,మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు సుగుణాకరరావు, ఉమామహేశ్వరరావు, గౌరీశంకర్, సింహాచలం, లైన్స్ క్లబ్ అద్యక్షులు బరాటం లక్ష్మణరావు, బార్ అసోసియేషన్ అద్యక్షులు పొన్నాడ వెంకటరమణతో పాటు వేలాది సంఖ్యలోవిద్యార్ధులు పాల్గొన్నారు.

నేడు జిల్లా బంద్
శ్రీకాకుళం, ఆగస్టు1 : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న సంపూర్ణ బంద్‌ను విజయవంతం చేయాలని సమైఖ్య రాష్ట్ర పరిరక్షణ వేదిక(జేఏసీ) పిలుపునిచ్చింది. గురువారం స్థానిక ఎన్జీఓ హోంలో కార్యాచరణలో భాగంగా జేఏసి నేతలు నిర్వహించిన విలేఖరుల సమావేశంలోమాట్లాడారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు చౌదరి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కర్షక, కార్మిక, రవాణా, న్యాయవాద, స్వచ్ఛంద, ప్రజా, విద్యార్థి సంఘాలు బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రులు తమ్మినేని సీతారాం, గుండ అప్పలసూర్యనారాయణలు మాట్లాడుతూ ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రం అనే నినాదంతో ఉద్యమాన్ని విజయవంతం చేయడం ద్వారా సిక్కోలు వాణిని వినిపించాలన్నారు. పోరాటాలు జిల్లాకు కొత్తేమికాదని, రాష్ట్రాన్ని సమైక్యంగా నిలపడానికి ఎంతటి త్యాగానికైనా సిద్దం కావాలన్నారు. ఈ సందర్భంగా బంద్ ప్రణాళికలను వివరించారు. శుక్రవారం ఉదయం 5గంటల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ల వద్ద భైఠాయింపు, అలాగే ఉదయం 9 గంటల నుంచి పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వర్తక, వాణిజ్య, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, హోటల్స్, కలుపుతూ, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో జేఏసీ నాయకులు హనుమంతు సాయిరాం, జామి బీమశంకర్,శ్రీనివాసానంద స్వామి, పొన్నాడ వెంకటరమణ, సుగుణాకర్, బరాటం లక్ష్మణరావు, ఉమామహేశ్వరరావు, కోరాడ రమేష్, కోరాడ హరిగోపాల్, అంధవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

‘ప్రత్యేక’ పాలనకు తెర!
ఎచ్చెర్ల, ఆగస్టు 1: గ్రామాల్లో సుమారు రెండేళ్ల ప్రత్యేకాధికారుల పాలనకు నేటితో తెరపడనుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన పాలకవర్గాలు నేడు బాధ్యతలు స్వీకరించున్నాయి. వీరి పాలన ఐదేళ్ల పాటు కొనసాగనుంది. 2006 జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఆగస్టు 22వ తేదీన సర్పంచ్‌లుగా నాడు బాధ్యతలు స్వీకరించారు. అయితే వీరి పదవీకాలం 2011, జూలై 23వతేదీకి ముగియడంతో అప్పటినుంచి కిరణ్‌సర్కార్ ప్రత్యేక పాలనకు తెరలేపింది. సుమారు రెండేళ్లు ఈ పాలన కొనసాగడంతో పంచాయతీ ఆవాస ప్రాంతాల్లో నివాసముంటున్న పౌరులకు ప్రాథమిక అవసరాలు కూడా తీర్చలేకపోవడంతో అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాలు వంటి కనీస అవసరాలు ప్రత్యేక పాలనలో అధికార యంత్రాంగం తీర్చలేకపోయిందన్న అపవాదు ప్రభుత్వమే మోయాల్సి వచ్చింది. అదిగో ఇదిగో అంటూ రిజర్వేషన్ ప్రక్రియ షాక్‌గా చూపి రెండేళ్లపాటు ప్రత్యేక పాలనను పంచాయతీ వాసులపై ఇబ్బందులను ప్రభుత్వం రుద్దింది. చివరకు కోర్టు ఉత్తర్వుల మేరకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించింది. జిల్లాలో జూలై 23, 27, 31 తేదీల్లో 1093 పంచాయతీలకు ఎన్నికలు పూర్తిచేసింది. ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన సర్పంచ్‌లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించనుండడంతో ప్రత్యేకపాలనకు తెరపడింది. ఇప్పటివరకు పంచాయతీ ఖాతాలలో మూలుగుతున్న వివిధ పద్దులకు సంబంధించి నిధులతో అభివృద్ధి ఫలాలు పౌరులకు అందనున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణతోపాటు అనుబంధ గ్రామాలకు రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం వంటి పనులు వేగవంతం కానున్నాయని పౌరులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

నిరుద్యోగుల్లో కలవరం
శ్రీకాకుళం, ఆగస్టు 1: రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సిఫార్సు చేయడం సమైక్య ఆందోళనలు ఊపందుకున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ఊరించి ఉద్యోగ నియామకాలకు ఇటీవలి నడుంబిగించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు నిరుద్యోగులంతా పుస్తకాలతో కుస్తీపట్టడమే కాకుండా కోచింగ్ సెంటర్లలో తిష్ఠవేసి వేలాది రూపాయలు చెల్లించి శిక్షణ పొందుతున్నారు. ఇటువంటి వారి ఆశలపై రాష్ట్ర విభజన నిర్ణయం నీళ్లుచల్లింది. ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించాల్సిన టెట్‌తోపాటు జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ అధ్యాపకులు, ఎ.ఇ.లు వంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీఆ నియామకాలపై నీలినీడలు అలముకున్నాయి. అంతేకాకుండా జోనల్ స్థాయి ఉద్యోగ నియామకాలు భర్తీ అయ్యే పరిస్థితులు కానరావడం లేదు. గ్రూపు-2 నోటిఫికేషన్‌పై ఎన్నో ఆశలు పెంచుకున్న విద్యాధికులపై విభజన నిర్ణయం పిడుగుపిడినట్లయింది. ఈ నోటిఫికేషన్ మరింత జాప్యం అవుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. రెవెన్యూ, పోలీసు, హెల్త్ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీకి కిరణ్‌సర్కార్ చేసిన కసరత్తు వృథాగా మిగిలిందని నిరుద్యోగులంతా పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనల కారణంగా విద్యార్థిలోకం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇదిలావుండగా, ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరగోరు అభ్యర్థులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది ఆగస్టు ఆరవ తేదీ నుంచి కౌనె్సలింగ్ నిర్వహించినప్పటికీ ఆ పరిస్థితులు నేడు కానరాకపోవడం తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిన్నటివరకు పంచాయతీ ఎన్నికల కోడ్ ఎంసెట్ కౌనె్సలింగ్‌కు అడ్డంకిగా నిలవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎడ్‌సెట్, లాసెట్ సీట్ల భర్తీకి కౌనె్సలింగ్ కూడా నిర్వహించని పరిస్థితి నెలకొనడటంతో ఆ పరీక్షలకు అర్హత పొందిన విద్యార్థులను విద్యాసంవత్సరం ఎక్కడ చేజారుతుందోనన్న భయం వెంటాడుతోంది. బి.టెక్ మొదటిసంవత్సరం విద్యార్థులకు నిర్వహిస్తున్న సెమిస్టరీ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దుచేయడంతో వారంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మెడికో విద్యార్థులకు అడ్మిషన్లు పూరె్తైనా, తరగతులు ప్రారంభమయ్యేందుకు ప్రతికూల అంశాలు వెంటాడటంతో ఒకింత అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. యు.జి., పి.జి. కోర్సుల్లో చేరే విద్యార్థులంతా సమైక్యాంధ్ర అంటూ చదువులకు స్వస్తిపలికి ఉద్యమబాట పట్టారు. ఇలా విద్యార్థులతో విభజన నిర్ణయం ఆటలాడుకోవడంపై వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.
ఇక జూడాలు, 108 సిబ్బంది, కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మెబాట పట్టి వారాలు గడుస్తున్నా సమస్య అపరిష్కృతంగా మిగిలిపోవడం ఇంతలోనే విభజన నిర్ణయంపై ఆందోళనలు ఊపందుకోవడంతో వీరు సంకట పరిస్థితిని చవిచూడాల్సి వచ్చింది. ఇలా విద్యార్థిలోకాన్ని, నిరుద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్ధకంగా యుపిఏ తీసుకున్న అనాలోచిత విభజన నిర్ణయం ముంచేసిందన్న ఆగ్రహం అంతటా వ్యక్తమవుతోంది.

మన్యసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలి
* రాష్ట్ర కోకన్వీనర్ సింహాచలం డిమాండ్
సారవకోట, ఆగస్టు 1: రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో గిరిజనుల అభివృద్ధి కోసం మన్యసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర సాధనసమితి కోకన్వీనర్ మాలువ సింహాచలం డిమాండ్ చేశారు. గురువారం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇదివరకే మన్యసీమ రాష్ట్రం ఏర్పాటు కోసం పలు పోరాటాలు చేశామని, రాష్ట్ర నాయకులతో పాటు రాష్టప్రతి వరకు వివిధ స్థాయిల్లోని అధికార ప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందించామన్నారు. తమ విజ్ఞప్తులను, డిమాండ్లను పక్కనపెట్టి రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో గిరిజనుల శ్రేయస్సును, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇదే సమయంలో గిరిజనుల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి
* జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్
పాతశ్రీకాకుళం, ఆగస్టు 1: సీమాంధ్రప్రజల ఆవేదనను అర్ధంచేసుకొని రాష్ట్ర విభజన ప్రక్రియను పునసమీక్షించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నర్తు నరేంద్రయాదవ్, రత్నాల నర్సింహమూర్తిలు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఇందిరావిజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. హైదరాబాద్ ప్రతీ తెలుగువాడి ఊపిరన్నారు. హైదరాబాద్ లేని రాష్ట్రాన్ని ఊహించుకోలేమన్నారు. తెలుగుదేశం, వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు కాళ్ల సిద్దాంతాన్ని అవలంభిస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన కోరుతూ కేంద్రానికి లేఖలు కూడా రాసాయన్నారు. ఈ అంశంపై పునసమీక్షించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెలతామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో డీసీసీ నేతలు ముస్తాక్ మహ్మద్, డీఎస్‌కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పోస్ట్ఫాసుల ద్వారా పింఛను బట్వాడా
సారవకోట, ఆగస్టు 1: ఇప్పటివరకు బ్రెడ్స్ స్వచ్చంధ సంస్థ నిర్మించిన బి.ఎస్.పి.ల ద్వారా గ్రామాల్లో వివిధ పింఛను లబ్ధిదారులకు పైకం అందించేవారు. అయితే నేటి నుండి సి.ఎస్.పి.ల వ్యవస్థను రద్దుచేయడంతో పింఛన్ల పైకాన్ని రెండు సంస్థలు ద్వారా బట్వాడా చేయనున్నారు. పోస్ట్ఫాస్‌లో ఉన్న గ్రామ పంచాయతీల పరిధిలో సంబంధిత పోస్టుమాస్టర్ ద్వారా పింఛన్లను నెలవారీ అందిస్తారు. ఆ పంచాయతీ పరిధిలోని పింఛనుదారులందరూ ప్రతీనెలా విధిగా పోస్ట్ఫాస్‌కు వెళ్లి పైకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన పంచాయతీలో ఐకెపి ద్వారా స్వయంశక్తి సంఘాల మహిళలను ఎంపిక చేసి బట్వాడా చేశారు. దీంతో బిఎస్‌పి వ్యవస్థ పూర్తిగా రద్దైంది. ధర్మలక్ష్మీపురం, చిన్నకిట్టాలపాడు, గొర్రెబంద, సాపవకోట, అలుదు, అంగూరు, పెద్దలంబ, కె.ఎస్.పల్లి, అన్నుపురం, జమచక్రం, తొగిరి, బుడితి, బద్రి పంచాయతీల్లో 2,600 మంది పింఛనుదారులకు ఆయా పోస్ట్ఫాస్‌ల ద్వారా పింఛను పైకం బట్వాడా చేయనున్నట్లు బ్రెడ్స్ కోఆర్డినేటర్ బి.రామచంద్రరావు స్పష్టంచేశారు. పింఛన్ల పంపిణీ విధానం అకస్మాత్తుగా మార్పుచేయడంతో పలు గ్రామాల్లో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.
కనీస వేతనాలు అమలు చేయాల్సిందే
* కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఆగస్టు 1: ప్రభుత్వం ప్రతిపాదించిన కనీస వేతనాలను ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఖచ్చితంగా అమలుచేయాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కనీస వేతనాలు అమలుపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2013-14 సంవత్సరానికి మస్తర్ రోల్‌లో లేని కూలీలకు 9.06 శాతం పెరుగుదలతో వేతనాల పెరుగుదలకు విజయనగరం కేంద్ర వినియోగదారుల సూచి సంఖ్యల కేంద్రం సూచించగా ఆ వేతనాలను కేటగిరీల వారీగా కనీసం 6.99 శాతం నుండి 58 శాతం వరకు హెచ్చిస్తూ కలెక్టర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కనీస వేతనాలను ఖచ్చితంగా అమలుచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలోను కనీస వేతనాలు అమలుజరగాలన్నారు. కనీస వేతనాల పట్టికను గనులశాఖ సహాయ సంచాలకులు, వాణిజ్య పన్నుల శాఖ తదితర సంబంధిత శాఖలకు పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళికాధికారి ఎం.శివరామనాయకర్, పంచాయతీ రాజ్ ఎస్.ఇ బివిఎస్ చిరంజీవి, కార్మిక శాఖ ఉపకమీషనర్ ఎం.రామారావు, నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

కదం తొక్కిన విద్యార్థులు
ఎచ్చెర్ల, ఆగస్టు 1: యు.పి.ఏ సర్కార్ రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థులంతా గురువారం కూడా కదంతొక్కారు. వీరంతా తరగతులు బహిష్కరించి క్యాంపస్ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహం నుంచి యు.పి.ఏ ప్రభుత్వానికి శవయాత్ర నిర్వహించి వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. అక్కడ నుంచి ర్యాలీగా సోనియా డౌన్..డౌన్.., యు.పి.ఏ డౌన్..డౌన్, సి.ఎం.డౌన్..డౌన్.,..ఒకే భాష-ఒకే రాష్ట్రం అంటూ జాతీయ రహదారి దద్దరిల్లేలా నినదించారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విభజనపై పునరాలోచించకుంటే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తామని హెచ్చరించారు. ప్రాణాలైనా అర్పిస్తాం..సమైక్యాంధ్ర సాధిస్తామంటూ నినాదాలు మిన్నంటాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటిగంట వరకు ఎంతో పోరాట పటిమతో సమైక్యాంధ్రకు జై అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించారు. హైవేపై రాస్తారోకో కొనసాగించడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. రాస్తారోకోను విరమించాలని పోలీసులు ఎన్నిమార్లు హెచ్చరికలు జారీ చేసినా వాటిని బేఖాతరు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జె.ఆర్.పురం సి.ఐ వేణుగోపాలనాయుడు, ఎస్సై పి.వి.ఎస్.ఉదయ్‌కుమార్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక బలగాలు పహారా కాసాయి.
పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన
రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయం తీసుకోవడం సబబుగా లేదని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు నిరసనకు దిగారు. వీరంతా తరగతులు బహిష్కరించి కళాశాల నుంచి కుశాలపురం బైపాస్ వరకు ఆర్.అండ్.బి రహదారిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బైపాస్‌వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఆచార్యుల సంఘీభావం
రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆచార్యులు స్పష్టంచేశారు. అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగఫలితాన్ని తెలుగువారంతా సమిష్టిగా ఉండి కాపాడుకోవాలని హితవుపలికారు. సంఘీభావ దీక్షల్లో ఆచార్యులు జి.తులసీరావు, ఎం.చంద్రయ్య, టి.కామరాజు, బి.అడ్డయ్య, టీచింగ్ అసోసియేట్స్, నాన్‌టీచింగ్ సిబ్బంది సమైక్యాంధ్రకు జైజైలు పలికారు.

సాదాసీదాగా షర్మిల పాదయాత్ర
పలాస, ఆగస్టు 1: దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమారై వై ఎస్ షర్మిల పాదయాత్ర సాదాసీదాగా గురువారం జరిగింది. మండలంలోని వీరభద్రాపురం నుండి బయలుదేరిన ఆమె వెంకటాపురం, బెండిగేటు, సరియాపల్లి, గరుడఖండి, చినబాడాం, కాశీబుగ్గల మీదుగా రంగోయిలకు చేరుకుంది. కాశీబుగ్గలోని రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, షర్మిలను చూసేందుకు అభిమానులు పోటీపడడంతో ఆమె సెక్యూరిటీ సిబ్బంది అభిమానులపై అడపాదడపా పిడిగుద్దులు దాడి చేస్తుండడంతో అభిమానులు వారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పలాస వైకాపా సమన్వయకర్తలు కణితి విశ్వనాధం, వజ్జ బాబురావులు ఆమె వెంట నడుస్తూ కనబడ్డారు. నేతలకు సంబంధించి ముఖ్య అనుచరులను ఆమె వెంట నడిచేందుకు ప్రెవేట్ సైన్యం అవకాశం ఇవ్వకపోవడంతో వైకాపా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షర్మిలను చూసేందుకు మహిళలు పోటీ పడ్డారు. దారి పొడవునా పలు చోట్ల ఆమెకు బొట్టుపెట్టి హారతి ఇచ్చేందుకు మహిళలు ప్రయత్నించినప్పటికి ఆమె సున్నితంగా నిరాకరిస్తూ మహిళలను అభివాదం చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. ఈమె వెంట నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, వైకాపా నాయకులు ధర్మాన పద్మప్రియ, వరుదు కల్యాణి, బొడ్డేపల్లి పద్మజ, నర్తు ప్రేమ్‌కుమార్, డబ్బీరు నాగు, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ శ్రీ్ధర్, డాక్టర్ జీవితేశ్వరరావు, పాలవలస వైకుంఠరావు, తాళాసు ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ఆదిత్యుని కల్యాణం
శ్రీకాకుళం, ఆగస్టు 1: ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నేతృత్వంలో అర్చకులు ఉషాపద్మిని ఛాయాసహిత అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషాలంకరణతో అనివెట్టి మండపం వద్ద నెలకొల్పారు. ముందుగా 500 రూపాయలు చెల్లించి కల్యాణవేదికలో పాల్గొన్న భక్తులకు కంకణాధరణ చేశారు. స్వామి, అమ్మవార్ల గోత్రనామాలు, మేళతాళాలు మధ్య వేదమంత్రాలు పఠించి శాస్త్రోక్తంగా పరిణయ తంతు పూర్తిచేశారు. అనంతరం భక్తులకు కంకణాలు తొలగించారు. ఆశీర్వచనాలు పలికి తీర్ధప్రసాదాలు, వ్రస్తాలు అందించారు.

తల్లి పాల ఆవశ్యకతను చాటిచెప్పాలి
పాతశ్రీకాకుళం, ఆగస్టు1 : తల్లి పాల ఆవశ్యకతను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. 21వ ప్రపంచ తల్లి పాలవారోత్సవాల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్ నుంచి రిమ్స్ ఆస్పత్రి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం స్థానిక ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బిడ్డకు కావల్సిన పోషకపదార్ధాలు, వ్యాధినిరోధక శక్తి తల్లి పాల ద్వారా లభిస్తాయన్నారు. ప్రాణాంతకమైన వ్యాధులను నుంచి పిల్లలకు రక్షణ ఉంటుందన్నారు. పుట్టిన గంటలోపే ముర్రుపాలు బిడ్డకు అందించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి గీతాంజలి మాట్లాడుతూ ఈనెల ఒకటి నుంచి 7 వ తేదీ వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా వారికి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను వివరిస్తున్నామన్నారు. డైరక్టర్ తెనె్నటి జయరాజ్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదపడతాయన్నారు. మాతా,శిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీటవేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండ్ ఆర్.అరవింద్, ఐసీడీఎస్ పీడీ చక్రధరరావు,సీడీపీఓ శోభారాణి,స్వచ్చంద సంస్థల ప్రతినిధి రమణ, తదితరులు పాల్గొన్నారు. ముందుగా తల్లి పాల వారోత్సవాల బ్రోచర్‌ను ఏజేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలోపౌష్టికాహారం- తల్లిపిల్లల ఆరోగ్యంపై పొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేసారు. పిన్నింటిపేటకు వాసి చింతాడ భాగ్యలక్ష్మికి పౌష్టికాహార కిట్స్‌ను ఏజేసీ అందించారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>