అనంతపురం, ఆగస్టు 1: జిల్లాలో విభజన సెగలు సద్దుమణగలేదు. రెండవ రోజు గురువారం జిల్లా వ్యాప్తంగా రోడ్లపై టైర్లు కాల్చారు. రాజీవ్, ఇందిరా విగ్రహాలను ధ్వంసం చేశారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వారు. నగరంలో పలు చోట్ల రాజీవ్ చిత్రపటాలను దగ్ధం చేశారు. సమైక్యాంధ్ర జెఎసి, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా గురువారం బంద్ విజయవంతమైంది. సమైక్యాంధ్ర ఉద్యమకారులకు ప్రజలు సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సోనియాగాంధీ దిష్టిబొమ్మలకు శవయాత్ర, కర్మకాండలు, దహనాలను నిర్వహించారు. గుత్తి, గుంతకల్లు, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర, పెనుకొండ, ఉరవకొండ, గోరంట్ల, తాడిపత్రిలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలపై రాళ్లు రువ్వారు. విగ్రహాలపై టైర్లు వేసి కాల్చే ప్రయత్నం చేశారు. పలు చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. కదిరిలో రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచె వేసి టైర్లు కాల్చి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఇంటి ముందు ఉద్యమకారులు బైఠాయించి మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటిపై ఉద్యమకారులు రాళ్లు రువ్వారు. పోతుకుంటు గేటు సమీపంలోనిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఎస్‌కె యూనివర్శిటీలో విద్యార్థులు రోడ్డు పై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసులు భారీగా మోహరించారు. బందోబస్తు కోసం ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటల నుంచే పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి చేరుకుని ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, రాస్తోరోకో నిర్వహించారు. బంద్ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, పెట్రోలు పంపులు, సినిమా థియేటర్లు మూసివేశారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు బస్సులు తిరగనీయలేదు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.
రాజకీయ నాయకుల స్వార్థానికి
బలి కావద్దు
* ఎస్‌కెయూలో కడపకు చెందిన ఫ్యాక్షన్ క్రిమినల్
* విద్యార్థులకు ఎస్పీ విజ్ఞప్తి
అనంతపురం, ఆగస్టు 1 : జిల్లాలోని సమైక్యాంధ్ర ఉద్యమంలోపాలు పంచుకుంటున్న విద్యార్థులు కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థానికి బలి కావద్దని ఎస్పీ ఎస్.శ్యామ్‌సుందర్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. అలాగే కొంతమంది ప్రొఫెసర్లు, లెక్చరర్లు వీరిని సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ గైడ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గురువారం పోలీసు సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. అందుకే విద్యార్థుల తల్లితండ్రులు వారిని ఆయా ఉద్యమాల్లో పాల్గొనకుండా చూడాలన్నారు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల స్వార్థానికి విద్యార్థులు వారి జీవితాలను బలి చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. కొంతమంది ప్రొఫెసర్లు కూడా వారిని దీంట్లో పావులుగా వాడుకుంటున్నారన్నారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కునే విద్యార్థులకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయన్నారు. ఎస్‌కెయూలో నాన్ బోర్డర్‌లు ఉండకుండా చూడాలని ఆయన కోరారు. ఇప్పటికే అక్కడ కడపకు చెందిన ఒక ఫ్యాక్షన్ క్రిమినల్ ఉన్నట్లు గుర్తించామని అతనిపై కేసు కూడా నమోదు చేశామన్నారు. అక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై విచారణ చేస్తున్నామన్నారు. ఇలాంటి వారిని గుర్తించి వారిని ఎస్‌కెయూ హాస్టళ్ళ నుంచి బయటకు పంపించివేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 30 పోలీసు యాక్టు అమలులో ఉన్న కారణంగా ఐదుగురు ఒక దగ్గర ఉండకూడదన్నారు. సమైక్యాంధ్ర పేరుతో ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగించే వారిపై పిడిపిపి యాక్టు, రైటింగ్ యాక్టులను ప్రయోగిస్తామని హెచ్చరించారు. జిల్లాలో13000 మంది ఫోర్స్ ఉందని ఎలాంటి ఇబ్బందుల నైనా తాము ఎదుర్కొంటామని తెలిపారు. ఇలాంటి ఉద్యమాల్లో విద్యార్థులు పాల్గొనడం వల్ల వారు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. అందుకు గానూ వారి తల్లితండ్రులు విద్యార్థుల భవిష్యత్తు పట్ల అప్రమత్తంగా ఉండి వారు ఇలాంటి వాటిలోపాల్గొనకుండా నిరోధించాలని తెలిపారు. ఈ సమావేశంలోఅడిషనల్ ఎస్పీ నవదీప్‌సింగ్ పాల్గొన్నారు.
ఎస్‌కెయూ విద్యార్థులపై లాఠీచారిజ
ఎస్‌కెయూ క్యాంపస్‌లో గురువారం సాయంత్రం ఎస్పీ ఎస్.శ్యామ్‌సుందర్ వ్యవహార శైలితో విద్యార్థులు రెచ్చిపోయారు. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. పలువురు విద్యార్థులతో పాటు వార్తా సేకరణకు వెళ్లిన ఓ పాత్రికేయుడికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం ఎస్‌కెయూ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లిన ఎస్పీ ఆందోళన విరమించాలని సూచించారు. ధర్నా చేస్తే మీపై కేసులు పెడతామని, ధర్నాలో పాల్గొంటున్న వారందరినీ వీడియోలో చిత్రీకరిస్తున్నామని, కేసు నమోదైతే ఉద్యోగాలు, పాసుపోర్టు లాంటివి రావని బెదిరించారు. అయినా విద్యార్థులు కదలకపోవడంతో వీడియో తీయండంటూ ఎస్పీ పురమాయించారు. దీంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మరింత రెచ్చిపోయిన పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. ఫలితంగా క్యాంపస్‌లో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతియుతంగా ధర్నా, రాస్తారోకో చేస్తున్న తమ పట్ల ఎస్పీ దురుసుగా ప్రవర్తించడం వల్లే పరిస్థితి అదుపుతప్పిందని విద్యార్థులు ఆరోపించారు. కాగా ప్రజలకు ఇబ్బంది కలిగిలా విద్యార్థులు ప్రవర్తించినందునే లాఠీచార్జి చేయాల్సి వచ్చిందని ఎస్పీ పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాజీనామా
అనంతపురం, ఆగస్టు 1: సమైక్యాంధ్ర కోరుకుంటున్న పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జెసి దివాకర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సుధాకర్, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తమ పదవులకు రాజీనామా చేశారు. అదే విధంగా టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు పార్థసారథి, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, కందికుంట వెంకటప్రసాద్, అబ్దుల్ ఘనీ, ఎమ్మెల్సీలు శమంతకమణి, మెట్టు గోవిందరెడ్డి రాజీనామా చేశారు. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఇప్పటికే పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
గడేకల్లు స్కూల్‌లో
బ్యాలెట్ పేపర్లు లభ్యం
* అన్యాయం జరిగిందని అభ్యర్థితో పాటు టిడిపి నాయకుల రాస్తారోకో
ఉరవకొండ, ఆగస్టు 1: ఉరవకొండ నియోజక వర్గం, విడపనకల్లు మండలంలోని గడేకల్లులో గురువారం బ్యాలెట్ పేపర్లు లభ్యమయ్యాయి. పొలింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమకు అన్యాయం జరిగిదంటూ అభ్యర్థి శారదతో పాటు టిడిపి నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. గురువారం ఉదయం పాఠశాలకు విచ్చేసిన విద్యార్థులు బ్యాలెట్ పేపర్లు ఆవరణంలో పడి వున్న సంఘటన సంచలనం రేపింది. దీంతో సమాచారం అందుకున్న నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. బుధవారం గడేకల్లు గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారుడు, బుట్ట గుర్తు అభ్యర్థి దీపకు 1872 ఓట్లు లభించాయని, అదే విధంగా టిడిపి మద్దతు దారురాలు శారద, ఎన్నికల గుర్తు ఉంగరం గుర్తుకు 1409 ఓట్లు లభించాయి. దీంతో పాటు చెల్లని ఓట్లు 193 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అత్యధిక ఓట్లు సాధించిన దీపను పంచాయతీ సర్పంచ్‌గా అధికారులు ధ్రువీకరించారు. అయితే గురువారం ఉదయం స్కూల్ ఆవరణంలో బ్యాలెట్‌లు విద్యార్థులు లభ్యమైన సమాచారం అందుకున్న ప్రధాన ఉపాధ్యాయుడు గుండురావు సేకరించి భద్రపరిచాడు. దాదాపు 13 కట్టలు గల 395 ఓట్లు గల ఉంగరం గుర్తు బ్యాలెట్ పేపర్లు లభ్యం కావడంతో పోలింగ్‌లో అవతవకలు జరిగాయని, అభ్యర్థి శారదతో పాటు టిడిపి నాయకులు శ్రీనివాసులు, రాములతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఎన్నికల రీ కౌంటింగ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ఎంపిడిఓకు సమాచారం అందించి సంఘటన స్థలానికి రావాలని నాయకులు కోరారు. సాయంకాలం ఆందోళన కారుల వద్దకు లభ్యమైన బ్యాలెట్ పేపర్‌లను సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని ఎంపిడిఓ నాగరాజు హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.
రాజీనామాలతో సాధించే దేమిటి?
* సమైక్యవాదానికై ఆమరణ దీక్షకైనా సిద్ధం
* డిసిసి అధ్యక్షుడు మధుసూదన్‌గుప్తా
అనంతపురం టౌన్, ఆగస్టు 1: రాజీనామాలతో సాధించేదేమి ఉండదని, అమరజీవి పొట్టి శ్రీరాములు తరహాలో గాంధేయ పద్ధతుల్లో సమైక్యవాదానికై ఆమరణ నిరాహార దీక్షను చేపట్టటానికైనా తాను సిద్ధమని డిసిసి అధ్యక్షుడు మధుసూదన్‌గుప్తా అన్నారు. గురువారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యవాద పోరాట ముసుగులో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను కూల్చివేయటం సిగ్గుచేటని అన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సమైక్యవాదానికి ఇందిరాగాంధీ ప్రతిరూపమైతే, సామరస్యవాదానికి, అభ్యుదయానికి రాజీవ్‌గాంధీ ప్రతిరూపమన్నారు. వైఎస్ నిర్వాకంతోనే తెలంగాణా పోరాటానికి అంకురార్పణ జరిగిందన్నది వాస్తవం కాదాయని ఆయన వైఎస్‌ఆర్‌సిపిని ప్రశ్నించారు. తెలంగాణ ప్రకటనపై యుపిఎ ప్రభుత్వం పునఃసమీక్షించుకునేలా వత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే తెలుగుదేశం, వెకాపా, సిపిఐ, బిజెపిలు సమైక్యవాదానికి మద్దతుగా లేఖలిస్తే యుపిఎపై వత్తిడి తెచ్చేందుకు సిద్ధమన్నారు. రాజీనామాలు, విధ్వంసాల వలన సమైక్యాంధ్ర రాదన్నారు. రాజీనామాలపై తనకు నమ్మకం లేదన్నారు. డిసిసి అధ్యక్షుడిగా పార్టీని నడిపించాల్సిన గురుతర బాధ్యత ఉందన్నారు. అసెంబ్లీలో తెలంగాణానికి కోరం ఉందన్నారు. తాము రాజీనామా చేయటం వలన వారికి ప్రయోజనం చేకూర్చినట్లవుతుందన్నారు. తాను ప్రజా నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత డిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులతో కలిసి విగ్రహాలు ధ్వంసం చేసిన ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నా యకులు దాదాగాంధీ, రషీద్ అహమ్మద్, సాయిరాం, శం కర్, రవిశంకర్‌రెడ్డి, వేణుగోపాల్, నాగరాజు, ఖలీఖుల్లాఖా న్, విజయభాస్కరరెడ్డి, వేణు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
లోకాయుక్త వలలో బుడా గుమస్తా
బళ్ళారి, ఆగస్టు 1: ఒక కేసుకు సంబందించి బళ్ళారి డెవలప్‌మెంట్ అథారిటి బుడాలో గుమస్తాగా పనిచేస్తున్న నాగరాజు ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుంటు లోకాయుక్త అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే స్థానిక మోతిసర్కిల్ సమీపంలోనున్న బుడా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న గుమస్తా నాగరాజు అనంతపురం రోడ్డులోనున్న రాఘవేంద్ర కాలనీ రెండవ స్టేజి 20-30 సైజ్‌కు సంబంధించి సైట్ యజమాని రాయచూరుకు చెందిన వెంకటేశ్ ఖాతా మార్పుకు సంబంధించి రూ.50వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. తన తల్లి పేరుమీదున్న భూమిని తన పేరుకు చేసుకోవాడానికి ముందుగానే రూ.10వేలు ఇచ్చినట్లు, తదుపరి మొత్తాన్ని మరల ఇవ్యాలంటూ నాగరాజు డిమాండ్ చేశారని, దీనితో వెంకటేశ్ రాయచూరు లోకాయుక్తా అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న లోకాయుక్తా అధికారులు బళ్ళారి జిల్లా లోకాయుక్తా అధికారులకు విషయం అందించారు. ఈనేపథ్యంలో గురవారం ఉదయం రాయచూరు నుంచి బళ్ళారి లోకాయుక్త పోలీస్ అధికారులకు వెంకటేశ్ ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఇన్‌స్పెక్టర్ రమేశ్ తన సిబ్బందితో బుడా కార్యాలయంపై దాడి చేశారు. ఇదే సమయంలో గుమస్తా వెంకటేశ్ నుండి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండ్‌గా పట్టుపడ్డాడు. నిందితుని తమ ఆధీనంలో తీసుకొని విచారణ చేపట్టారు.
ఎస్కేయూలో బలగాల మోహరింపు
*చుట్టుపక్కల గ్రామాల ప్రజల నిరసన
* రెండో రోజుకు చేరిన ఆమరణ దీక్ష
అనంతపురం సిటీ, ఆగస్టు 1: శ్రీకృష్ణదేవరాయుల విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న ఉద్యమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా రెండవ రోజు కూడా జెఎసి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి శాంతియుతంగా బంద్ నిర్వహించారు. రెండవ రోజు ఎస్కేయూ మెయిన్ గేట్ వద్ద బంద్ చేయడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు భారీగా మద్దతును తెలిపి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎస్కేయూ మెయిన్ గేట్‌కు ఇరువైపులా రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఉదయం పది గంటలు ఉరితీసిన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆకుతోటపల్లిలో ఉన్న వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ఎస్కేయూ మెయిన్‌గేట్ వరకు ర్యాలీ నిర్వహించి మద్దతును తెలియజేసారు. ఎస్కేయూ ప్రొఫెసర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం కూడా ఎస్కేయూ బంద్ పాటించనున్నట్లు జెఎసి నాయకులు తెలిపారు.
భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం ....
సీమాంధ్రకు చెందిన మంత్రులు తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్కేయూలో విద్యార్థులు రెండంతస్తుల భవనంపైకి ఎక్కి నినాదాలు చేశారు. విద్యార్థులు నరసింహారెడ్డి, ప్రతాప్, అమర్‌నాథ్, ఓబిలేసు, నాగరాజు, రమేష్, మాదన్నలు భవనంపై ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయారు. మంత్రులు రాజీనామాలు చేశారని జెఎసి నాయకులు సదాశివారెడ్డి వారికి తెలపడంతో కిందకు దిగి వచ్చారు.
నగరంలో ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నగరంలోని శ్రీ సత్యసాయి బాలవికాస్ స్కూల్‌లోని విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సమైక్యాంధ్ర ముద్దు తెలంగాణ వద్దు అనే నినాదాలలు చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత కృష్ణవేణి, డైరెక్టర్ రవిచంద్రారెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు చేసిన ప్రకటనలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్‌ఎంలు రమాదేవి, కేశవయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జి చేయడం అమానుషం
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గురువారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై జిల్లా ఎస్పీ శ్యాంసుందర్, స్పెషల్ పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషమని మన విద్యార్థి సత్తా జిల్లా అధ్యక్షుడు అమర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అమర్ యాదవ్ మాట్లాడుతూ శాంతియుతంగా సమైక్య ఉద్యమాలు చేస్తున్న విద్యార్థి నాయకులను, విద్యార్థులను అడ్డుకోవడం చాలా దారుణమన్నారు. విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం చూస్తే ఎస్పీ తెలంగాణవాదులకు కొమ్ముకాస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు. కావున ఎస్పీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మల్లికార్జున, సాగర్, హరీష్, సంతోష్, రమేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి
యుపిఎ ప్రభుత్వం సిడబ్ల్యూసి సమావేశంలో రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ప్రతినిధుల ఇళ్లను ఉపాధ్యాయ జెఎసి నాయకులు ముట్టడించారు. గురువారం స్థానిక ఎన్‌జిఓ హోమ్ నుండి ఉపాధ్యాయులు ర్యాలీగా బయలుదేరి సప్తగిరి సర్కిల్, విద్యుత్ నగర్ సర్కిల్ మీదుగా ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్, అనంతపురం ఎంపి అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే కేశవ్, పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి ఇళ్లను ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులకు, జెఎసి నాయకుల మధ్య కొంత సమయం వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ జెఎసి నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం లోపు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు సమైక్య ఉద్యమంలో పాల్గొనాలన్నారు. రాష్ట్ర విభజనను ఉపాధ్యాయులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ జెఎసి నాయకులు నరసింహులు, రామచంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, కె.హరికృష్ణ, రామాంజనేయులు, చలపతి, రామన్న, అంజయ్య, నారాయణస్వామి, రాజశేఖర్, రత్నం, కె.వెంకటరెడ్డి, పిఇటి నాగరాజు ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.