కడప, ఆగస్టు 1 : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో మొదలయిన సమైక్యాంధ్ర ఉద్యమం పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో ఉధృతమవుతోంది. ఓ పక్క సమైక్యాంధ్ర, విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ఆందళనలు సాగుతుండగా మరోపక్క వైకాపా, టిడిపి నేతలు కూడా రోడ్డెక్కడంతో ఉద్యమం వేడెక్కుతోంది. అది క్రమంగా విధ్వంసాలకు దారితీస్తోంది. గురువారం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎస్‌ఎండి అహ్మదుల్లా, సి.రామచంద్రయ్యలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమండ్ చేస్తూ ఆందోళనకారులు వారి ఇళ్లను ముట్టడించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు సోనియా గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనంతరం శవయాత్ర నిర్వహించారు. కడప సమీపంలోని మామిళ్లపల్లిలో ఇందిరాగాంధీ విగ్రహానికి నిప్పుపెట్టారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి చెప్పుల దండ వేసి పాక్షికంగా ధ్వంసం చేశారు. బద్వేల్‌లో ఆందోళనకారులు గడ్డి ట్రాక్టర్‌ను తగులబెట్టారు. హోరున వర్షం కురుస్తున్నా ఆందోళన ఆగలేదు. ఎర్రగుంట్లలో ఆర్టీపీపీ ఉద్యోగులు రెండవ రోజు కూడా ఆందోళన సాగించారు. ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి సంచలనం రేపాడు. సమైక్యాంధ్ర జెఏసీ కస్వీనర్ ఎస్ రామచంద్రారెడ్డి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన అమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు, విద్యార్థులు, కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు, న్యాయవాదులు రామచంద్రారెడ్డికి సంఘీభావం తెలుపుతూ ఉద్యమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైకాపా నాయకులు, కార్యకర్తలు మోటార్‌బైక్ ర్యాలీ చేశారు. మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత పసుపులేటి బ్రహ్మయ్య జెఎసి నాయకులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రవేటు వాణిజ్య సంస్థలను మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పలు ప్రాంతాల్లో బ్యాంకులు, పోస్ట్ఫాసులు, ప్రభుత్వ, ప్రవేటు రంగ సంస్థల ఉద్యోగులంతా మూకుమ్మడిగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో ఎక్కడ బస్సులను అక్కడ నిలిపివేశారు. ఆర్టీసీ అద్దె బస్సులు, ప్రవేటు వాహనాలను ఎక్కడ తిరగనీయలేదు. 18వ కర్నూల్ - చిత్తూరు, ముంబై - చెన్నై జాతీయ రహదారులపై సమైక్యాంధ్ర ఉద్యమకారులు మోహరించడంతో వందలాది వాహనాలు రోడ్లపై బారులు తీరాయి. సమైక్యాంధ్ర ఉద్యమకారులు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని శివారు ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా పెద్దరాళ్లను పడేశారు. కడపలో బుధవారం రెండు ఏటిఎంలు ధ్వంసం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎటిఎంలు పని చేయకపోవడంతో ఆర్థిక వ్యవహరాలు స్తంభించిపోయాయి. జిల్లాకు చెందిన ఉద్యమకారులతో జిల్లా ఎస్పీ, కలెక్టర్ సంప్రదింపులు చేశారు. ఆందోళనకారులు బంద్‌ను పాటించే సమయంలో కేంద్రానికి చెందిన 7 కంపెనీల బలగాలు, సివిల్ పోలీసులు ఆందోళనకారులను అనుసరిస్తూ పెద్దఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిల ఇళ్ల వద్ద ప్రవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ఎదుట కేంద్ర, స్థానిక పోలీస్ బలగాలను భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ ఉద్యమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సమైక్యాంధ్ర జెఏసీతో కలసి పనిచేస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో మానవహారాలు ఏర్పాటు చేసి, కెసిఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. జెఏసీ గౌరవాధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, జెఏసీ నేతలు రమణయ్య, నాగిరెడ్డి, టిడిపి నేత పుత్తా నరసింహారెడ్డి, కో-కన్వీనర్ ఎస్.గోవర్ధన్‌రెడ్డి, మంత్రి అహ్మదుల్లా తనయుడు హల్త్ఫా, అమీర్‌బాషా, బాలక్రిష్ణాయాదవ్, వైకాపా తరపున కడప ఇన్‌ఛార్జి అంజాద్‌బాషా, నిత్యానందరెడ్డి, అఫ్జల్‌ఖాన్, కాంగ్రెస్ నేలు నీలి శ్రీనివాసులు, అఫ్జల్, రాజా వెంగళరెడ్డి, అవ్వారు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం
* చిత్తశుద్ధి ఉంటే ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్
కడప, ఆగస్టు 1 : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గురువారం జరిగిన బంద్ సందర్భంగా ఆందోళనకారులు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీల తదితర నేతలపై విరుచుకు పడ్డారు. ఒకవైపు సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి శవయాత్ర చేస్తూ, మరో ప్రక్క జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన నేతల ఇళ్లను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజాప్రతినిథుల అసమర్థత వల్లే రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిందని ధ్వృజమెత్తారు. వారికి రాజకీయంగా పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఓ పక్క విభజన జరిగిపోతోందని సంకేతాలు వెలువడుతునప్పటికీ అధికార పార్టీ నేతలు చేతులకు గాజులు వేసుకుకుని కూర్చున్నారన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా స్పందించిన నేతలు ఇప్పటికీ గట్టి నిర్ణయం తీసుకుని పోరుబాటలోకి రావడం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఉధృతంగా ఆందోళన జరిగిన సమయంలో అధికార పార్టీ నేతలు నోరు మెదపక పోగా అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమంటూ కొంప ముంచారని ఆరోపించారు. ఇప్పట్లోనే ఉద్యమాన్ని ఉధృతంగా సాగిస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు రాజీనామాలు చేయని పక్షంలో వారి ఇళ్లను ముట్టడించి, సామాజికగం బహిష్కరిస్తామని హెచ్చరించారు.
అనూహ్య ఫలితాలపై అంతర్మథనం
* పల్లెపోరులో తగ్గిన హవాపై వైకాపా మల్లగుల్లాలు
* డీలా పడ్డ కాంగ్రెస్, టిడిపి నేతలు
కడప, ఆగస్టు 1 : జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిపై ప్రధాన పార్టీల నేతలు పోస్టుమార్టం ప్రారంభించారు. తమ తమ పార్టీల మద్దతుదారుల గెలుపు, ఓటములు, దక్కి న ఓట్లను బేరీజు వేస్తున్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్వంత జిల్లాలో వైకాపా మద్దతుదారులు అధికంగా గెలిచినప్పటికీ నేతలు ఊహించిన స్థాయిలో ఫలితాలు దక్కక పోవడంతో పార్టీ అధిష్ఠానం మదన పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో మ్యాచ్ ఫిక్సింగయ్యారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో మాత్రం ఎవరికి వారుగానే బరిలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు తమకు కీలకమైన గ్రామ పంచాయతీల్లో గెలుపొందడంతో వైకాపా నేతలు సమాలోచనలో పడ్డారు. మూడు విడతల ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులకు 405 పంచాయితీలు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు 145, కాంగ్రెస్ మద్దతుదారులకు 176 గ్రామ పంచాయతీలు దక్కాయి. తొలి, మలివిడతలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అంతంత మాత్రమే పోటీ చేసి 75 గ్రామ పంచాయితీలను మాత్రమే చేజిక్కుంచుకున్నారు. మలి విడతలో జమ్మలమడుగు నియోజకవర్గంలో అధిక స్థానాలు చేజిక్కించు కోవడంతో తెలుగుదేశం పార్టీ బలం మూడో విడతలో మరింత పెరిగింది. ఈ ఊపులో మరో 73 గ్రామ పంచాయితీలను దక్కించుకుంది. జమ్మలమడుగులో దేవగుడి సోదరులు ఒకరు వైకాపా, మరొకరు కాంగ్రెస్ మద్దతుదారులతో ఉమ్మడి పోరు సాగించారు. మొత్తం మీద ఇద్దరూ టిడిపి మద్దతుదారులతో పోటీ పడ్డారు. అయినా అక్కడ అక్కడ టిడిపి మాజీ మంత్రి పి రామసుబ్బారెడ్డి వర్గీయులకే అధిక స్థానాలు దక్కాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా దిగిన వైకాపా రెబల్స్ 56 గ్రామ పంచాయతీలను చేజిక్కించుకున్నారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గానికి చెందిన వేంపల్లెలో వైకాపా మద్దతుదారునిపై తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు స్వయంగా ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి సోదరుడు విష్ణువర్ధన్‌రెడ్డి గెలుపొందడంతో వైకాపాకు గట్టి దెబ్బ తగిలింది. మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు ఊహించిన స్థాయిలో గ్రామ పంచాయతీలు దక్కక పోవడం ఆ పార్టీ నేతలను ఆలోచనలో పడేసింది.
ఇక మునిసిపల్ పోరు
* రిజర్వేషన్లకు నోటిఫికేషన్ జారీ
* అందరి కళ్ళూ అందలంపైనే
కడప, ఆగస్టు 1 : రాష్టవ్య్రాప్తంగా నగర, పురపాలక సంఘాల్లో వార్డుల రిజర్వేషన్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో పట్టణాల్లో రాజకీయ వేడి రగులుకుంది. జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల ప్రమేయం లేకుండా గుర్తులతోనే ఎన్నికలు జరగడంతో ఎవరి దారిలో వారు నానా తంటాలు పడి అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇందుకు భిన్నంగా మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో పోటీ చేయాల్సి రావడంతో నేతల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్‌తో వైకాపా అభ్యర్థులను పలు చోట్ల ఓటమి పాలు చేశారు. పురపాలక ఎన్నికల్లో పార్టీ గుర్తులతో పోటీ చేయాల్సి రావడంతో మ్యాచ్‌ఫిక్సింగ్‌లను పక్కన పెట్టి నేతలు గెలుపుగుర్రాల అనే్వషణలో వెతుకులాట ప్రారంభించారు. జిల్లాలో కడప కార్పొరేషన్, రాయచోటి, రాజంపేట, బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, యర్రగుంట్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో వార్డుల రిజర్వేషన్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యింది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో జమ్మలమడుగు, పులివెందుల అసెంబ్లీ సెగ్మంట్స్‌లో మినహా అన్ని నియోజకవర్గాల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరిగాయి. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుల కేటాయింపు వల్ల అధిక ఓట్లు ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల కోసం నేతలు అనే్వషిస్తున్నారు. గ్రామ పంచాయితీల ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎత్తులు, పైఎత్తులతో తమదైన శైలిలో అభ్యర్థుల వేటలో దిగారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులది గెలుపుకాదని, బలుపని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు తుదివిడత ఎన్నికల అనంతరం ప్రచారం చేస్తున్నారు. మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలపై వైకాపా నేతలు ఆశలు పెట్టుకున్నారు. త్వరలో చైర్మన్ పదవులకు కూడా రిజర్వేషన్లు ప్రకటించేలోపు కార్పోరేషన్‌లో డివిజన్‌లకు, మున్సిపాలిటీల్లో వార్డులకు అభ్యర్ధులను ఖరారు చేయాలని అన్ని పార్టీల నేతలు హైరానా పడుతున్నారు.
ఊపందుకున్న సమైక్యాంధ్ర ఉద్యమం
* రాజంపేట ఎంపి అచూకీపై స్టేషన్‌లో ఫిర్యాదు
రాజంపేట రూరల్, ఆగస్టు 1 : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరు తూ చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం రెండవ రోజు తీవ్రస్థాయి లో జరిగింది. ఒక్కసారిగా వివిధ స్వచ్చంధ సంస్థలు, వ్యాపార, ప్రభు త్వ, ప్రవేటు ఉద్యోగ సంఘాలు ఈ ఉద్యమంలో స్వచ్చంధంగా పాల్గొనడంతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉదృతరూపం దాల్చింది. ముందుగా స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేశారు. జెఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక, కర్షక, విద్యా ర్థి సంఘాల నాయకులు పాల్గొని ఆం దోళన చేపట్టారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి ర్యాలీగా వస్తూ రాజంపేట ఎంపి గత రెండు రోజులుగా కన్పించలేదని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జెఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, ఖజానా కార్యాలయాల్లోని ఉద్యోగులు స్వచ్చంధంగా ఈ బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని జెఏసీ పిలుపుతో వారు విధులను బహిష్కరించి బంద్‌లో పాల్గొన్నారు. కెసిఆర్, సోనియాగాంధీల దిష్టిబొమ్మలతో పురవీధుల్లో ర్యాలీ చేశారు. ఇందుకు మాజీ మంత్రి, దేశం ఇన్‌ఛార్జి పసుపులేటి బ్రహ్మయ్య మద్దతు తెలిపి ఉద్యమంలో పాల్గొన్నారు. స్థానిక సబ్ కలెక్టరేట్‌కు చేరుకుని రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సబ్ కలెక్టర్ ప్రీతిమీనాను కోరారు. అనంతరం వ్యాపార సంఘాలు, స్వర్ణకారులు కలసి పాతబస్టాండ్ కూడలిలో మానవహారంగా ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి, సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ నాయకులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసి, ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం విడిపోతున్నదన్న సమాచారం కాంగ్రెస్ మంత్రులు, ఎంపిలకు తెలిసినప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర సమైక్యత కోసం పాటుపడక పోవడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. నేతలను గ్రామాల్లో తిరగనివ్వకుండా తరమి తరమి కొట్టాలని వారు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం విడివిడిగా ఉద్యమాలు చేపట్టకుండా అందరూ కలసికట్టుగా ఒకే తాటిపై నడిచి ఉద్యమాలు నిర్వహించాలని కార్మిక సంఘాల నాయకులు సూచించారు. సమైక్యాంధ్ర కోసం కర్నూల్ జిల్లాలో ఇద్దరు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరంగా ఉందని విద్యార్థి సంఘం నాయకులు పరశురాం, ప్రభాకర్, బాలాజీ, రెడ్డయ్య, బ్రహ్మయ్యలు అవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని ప్రాణ త్యాగాలైన చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వెనుకాడబోమని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి సంఘ నేతలు పాల్గొన్నారు.
ఉద్యమం మరింత ఉద్ధృతం
కడప (టౌన్), ఆగస్టు 1 : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నగరంలో నిర్వహిస్తున్న ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని సమైక్యాంధ్ర జెఎసి నిర్ణయించింది. జెఎసి నాయకుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గురువారం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలో ఉద్యమ కార్యాచరణను రాయలసీమ పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్షుడు రమణయ్య ప్రకటించారు. ఇందులో భాగంగా నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే బస్సులు, పాఠశాలలు, కళాశాలలకు వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. రాస్తారోకోలు, నాయకులు ఇళ్ల ముట్టడి కార్యక్రమం ఉంటుందన్నారు. అయితే శాంతియుతంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, టిడిపి నేతలు ఎస్ గోవర్దన్‌రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైకాపా నాయకుడు నిత్యానందరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం ప్రతి ఒక్క తెలుగువాడి కష్ట్ఫలితంగానే అభివృద్ధి చెంది మహానగరంగా ఆవిర్భావించిందన్నారు. దీన్ని పొగొట్టుకోవాలంటే శరీరంలో తలలేని మొండెంలా కాశ్మీర్ లేని భారతదేశంలా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తెలంగాణను ప్రకటించేటప్పుడు మూడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా తెలంగాణకు హైదరాబాద్‌ను, కొస్తాకు పోలవరం ఇచ్చారని, రాయలసీమకు మాత్రం రాళ్లు మిగిలాయన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల యాజమాన్యం, ఉద్యోగ సంఘాలు, ప్రజలు పాల్గొన్నారు.
ఉద్యమం ముసుగులో విధ్వంసాలు
* కాంగ్రెస్ అధికార ప్రతినిధి మురళి
కడప,(కల్చరల్) ఆగస్టు 1 : సమైక్యాంధ్ర ఉద్యమం ముసుగులో విధ్వంసాలకు పాల్పడుతున్న అరాచక శక్తులను పోలీసులు అరెస్టు చేయాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళి, నాయకులు గౌస్‌పీర్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కేవలం కాంగ్రెస్‌ను దోషులుగా చూపడం రాజకీయ లబ్ధిపొందేందుకే అన్నారు. వైకాపా, టిడిపిలు విధ్వంసాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటించిందన్నారు. అంతమాత్రాన ఒక్క కాంగ్రెస్ పార్టీనే దోషిని చేస్తూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలు ధ్వంసం చేయడం సరికాదన్నారు. పోలీసులు దాడులు జరిపిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు బాలసుబ్రమణ్యం, నిజాం, శ్రీరాము లు, ఖలందర్, విఠల్ ప్రసాద్, నారాయణ, హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
జమ్మలమడుగు వద్ద పెన్నానదిలో
నాటు బాంబులు లభ్యం
జమ్మలమడుగు, ఆగస్టు 1 : జమ్మలమడుగు పెన్నానది పరీవాహక ప్రాంతంలో గురువారం సాయంత్రం 50 నాటుబాంబులను పోలీసులు కనుగొన్నారు. దీంతో జమ్మమడుగు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఈ విషయమై డియస్పీ జాన్‌మనోహర్ మాట్లాడుతూ పోలీసులకు అందిన సమాచారం మేరకు పెన్నానది పరీవాహక ప్రాంతానికి వెళ్లి పరిశీలించామన్నారు. ఆ ప్రాంతంలో మూడు బకెట్లతోపాటు 50 నాటు బాంబులున్న మరో బకెట్ లభ్యమైందన్నారు. ఈ సంఘటనపై విచారణ చేస్తామన్నారు. డిఎస్పీ వెంట అర్బన్ సిఐ రవిబాబు, పోలీసు సిబ్బంది వున్నారు.
ఉలిక్కిపడ్డ జమ్మలమడుగు
పెన్నానది పరీవాహక ప్రాంతంలో ఒకే సారి 50 నాటు బాంబులు పోలీసులకు లభ్యమవడంతో ప్రశాంతంగా వున్న జమ్మలమడుగు ప్రజలు ఉలిక్కిపడ్డారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు జమ్మలమడుగు ప్రాంతంలో జరిగాయి. ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు ముశాయని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బాంబులు బయటపడడం అందరినీ కలవరపెడుతోంది. ఇప్పటికే జమ్మలమడుగు ఫ్యాక్షన్‌గడ్డగా పేరుంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన మరుసటి రోజే పెద్ద ఎత్తున బాంబులు బయటపడడం జమ్మలమడుగు ప్రాంతంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తడాకా చూపిస్తామన్న ప్రతినిధులు ఎక్కడ?
* సిపిఎం జిల్లా కార్యదర్శి నారాయణ
కడప,(కల్చరల్) ఆగస్టు 1 : ‘రాష్ట్రాన్ని విడదీస్తే మా సత్తా.. తడాకా చూపిస్తాం’ అంటూ ప్రగల్బాలు పలికిన సీమాంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.నారాయణ ప్రశ్నించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రపై భూర్జువా పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటన చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలో ఒక మాట, సీమాంధ్రలో మరోమాట మాట్లాడుతున్న ఒకే పార్టీకి చెందిన నాయకుల ధ్వంధ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలను మోసం చేయడానికి భూర్జువా రాజకీయ పార్టీలు నాటకం ఆడుతున్నాయన్నారు. వీటిని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాయకులు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లయితే పార్లమెంట్, అసెంబ్లీలో తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ విధమైన ఒత్తిడిని ప్రజలు నాయకులపై తీసుకోవాలన్నారు. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు అని కాదు, జాతి, మాట్లాడే భాష, జీవన విధానం ఆధారంగా ఏర్పాటైన రాష్ట్రాలు మనవని గుర్తుచేశారు. రాష్ట్రం సమైక్యాంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ విషయం శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదనీ, ఇల్లు అలకగానే పండుగ కాదన్నారు. సిడబ్లుసి ప్రకటన చేసినంత మాత్రాన తెలంగాణ వచ్చినట్లు కాదని స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీలో తీర్మానం చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందన్నారు. భూర్జువా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపిలు అసెంబ్లీ , పార్లమెంట్‌లో సమైక్యాంధ్ర మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్ రూ 100
రాయచోటి, ఆగస్టు 1 : రెండు రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో రాయచోటిలో లీటర్ పెట్రోల్ 100 రూపాయలు పలికింది. రెండు రోజులుగా ఎక్కడా కూడా పెట్రోల్ బంకులు తెరవలేదు. దీంతో పెట్రోల్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. బంద్ ప్రభావంతో బస్సులు, ఇతర వాహనాలు ఏవీ తిరగడం లేదు. ఈ నేపథ్యంలో ఏ పని చేయాలన్నా ద్విచక్రవాహనాలు తప్పనిసరి అయ్యాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మతబడ్డ బంకుల్లో పెట్రోల్ తీసుకొచ్చి బయట అధిక రేటుకు విక్రయిస్తున్నారు. చేసేది లేక వారు చెప్పిన రేటుకు కొనాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధం
వేంపల్లె, ఆగస్టు 1 : సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాని ఎమ్మెల్సీ సతీష్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం స్వగృహంలో తనను కలిసిన సమైక్యాంధ్ర జెఎసి నేతలతో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం పదవితో పాటు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. తర్వాత సమైక్యవాదులు స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.