తిరుపతి, ఆగస్టు 1: రాష్ట్ర విభజన నేపధ్యంలో సీమాంధ్రలో ఉవ్వెత్తున లేచిన సమైక్య ఉద్యమంతో కలియుగ ప్రత్యక్షదైవం అయిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా గురువారం కేవలం 40 వేల మంది మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ కేవలం 19 వేల మంది మాత్రమే స్వామివారిని దర్శించుకోవడం గమనార్హం. గతంలో కొన్ని సందర్బాల్లో తిరుమలలో రద్దీ తగ్గినప్పటికి ఈ స్థాయిలో రద్దీ తగ్గిన దాఖలాలు లేవు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు అర్ధగంట, 50 రూపాయలు క్యూలలో వెళ్లే భక్తులకు ఒకటిన్నర గంట, సర్వదర్శనం క్యూలో వెళ్లే భక్తులకు రెండుగంటల సమయం పడుతోంది. సాయంత్రం 6 గంటల వరకూ మూడు కంపార్ట్‌మెంట్లలో ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు, ఐదు కంపార్టుమెంట్లలో కాలిబాట భక్తులు, 15 కంపార్టుమెంట్లలో సర్వదర్శనం భక్తులు వేచి వున్నారు. ఇతర ప్రాంతాలనుంచి బస్సులు తిరుపతికి రాకపోవడంతో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు తిరుమలలోనే బస చేసి పలుమార్లు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అయితే రద్దీతగ్గినా స్వామి ఆదాయం తగ్గలేదని టిటిడి అధికారులు తెలిపారు.
ప్రజలను మభ్యపెట్టే రాజీనామాలు చేయను
* కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామా చేయాలి
* సమైక్యాంధ్ర వచ్చేంత వరకు దీక్షలు ఆగవు
* సీమాంధ్రులను అరెస్టుచేస్తే
ఉంచేందుకు జైళ్లు చాలవు
* చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబు స్పష్టం
చిత్తూరు, ఆగస్టు 1: ప్రజలను మభ్యపెట్టి, ఫొటోలకు ఫోజులిచ్చే రాజీనామాలు తాను చేయడంలేదని, స్పీకర్ ఆమోదించేటట్లయితే సత్వరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చిత్తూరు శాసన సభ్యులు సికె బాబు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన చిత్తూరు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద దీక్షా శిబిరంలో విలేఖర్లతో మాట్లాడుతూ పలువురు ఇప్పుడు ఫొటోలకు ఫోజులిచ్చి ఉత్తుత్తి రాజీనామాలు చేస్తున్నారని విమర్శించారు. రాజీనామాలను స్పీకర్ ఆమోదించేటట్లయితే సత్వరం తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తనకు సమైక్యాంధ్రా కావాలని ఆయన అన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రులు వారి పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర కోసం సిఎంపై వత్తిడి తేవాలని ఎమ్మెల్యే అన్నారు. కేంద్రమంత్రులు, ఎంపిల రాజీనామాతోనే సమస్యకు ఒక పరిష్కార మార్గం లభిస్తుందన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాల ధ్వంసం దురదృష్టకరమని ఎమ్మెల్యే అన్నారు. సీమాంధ్రలో పోలీసు కేసులకు భయపడేవారు ఎవ్వరూ లేరన్నారు. అలా పోలీసులు అరెస్టుచేస్తే తామందరినీ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఉండే జైళ్ళు సరిపోవని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలు గట్టిగా ఊపిరి పీల్చి వదిలితే ఆ గాలికి కెసిఆర్ కొట్టుకుపోతారని, తమగురించి మాట్లాడే అర్హత అతనికి లేదని సికె తేల్చి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉన్నా ప్రత్యేక తెలంగాణా ఇస్తే పరిస్థితి ఇలాగే ఉండేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని, దాన్ని ముక్కలు చేస్తే ఊర్కోనే పరిస్థితుల్లో ఇక్కడ ఎవ్వరూ లేరన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రకటించేవరకు ఈ ఉద్యమాలు ఆగవని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. సమైక్యవాదులారా అందరూ కలసి రండి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుదామంటూ చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబు విలేఖర్ల సమావేశంలో పిలుపునిచ్చారు.
సమైక్యాంధ్ర కోసం
మదనపల్లె ఎమ్మెల్యే రాజీనామా
* ఎమ్మెల్యే షాజహాన్‌బాషా రిలే దీక్ష
మదనపల్లె, ఆగస్టు 1: యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటించడం అర్ధరహితం అని, సీమాంధ్రుల మనోభావాలు తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని తెలంగాణా ప్రకటించడం సరికాదని అసెంబ్లీ సమావేశాలకు ముందే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు మదనపల్లె ఎమ్మెల్యే ఎం షాజహాన్‌బాషా పేర్కొన్నారు. గురువారం ఉదయం నుంచి వివిధ సంఘాల, ప్రజలు, విద్యార్థులు ఐక్యంగా సమైక్యాంధ్రకై ఎమ్మెల్యే కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆందోళన చేయడం, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధ్యాహ్నం ప్రాంతంలో మదనపల్లెకు చేరుకుని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ బెంగళూరుబస్టాండు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుటే రిలేదీక్ష చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యకార్యచరణ కమిటీతో కలిసి సమైక్యత కోసం ఉద్యమాలు చేపడతానని ఎమ్మెల్యే షాజహాన్ ప్రకటించారు. రాత్రి 8గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే దీక్షను నిమ్మరసంతో విరమింపజేసి సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగప్ప, లక్ష్మీనారాయణ, చినబాబు, బషీర్, ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు, యుపిఎఫ్ నాయకులు రవిప్రకాష్ తదితరులు ఉన్నారు.
పిసిసి సంయుక్త కార్యదర్శి పదవికి నవీన్‌కుమార్‌రెడ్డి రాజీనామా
తిరుపతి, ఆగస్టు 1: జిల్లాలో ముఖ్యమంత్రికి అత్యంత ముఖ్య సన్నిహితుడుగా ఉన్న నవీన్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజనకు మనస్థాపం చెంది తన పిసిసి సంయుక్త పదవికి రాజీనామా చేస్తూ గురువారం పిసిసి ఆధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫాక్స్ ద్వారా రాజీనామా పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ముక్కలు కావడాన్ని జీర్ణించుకోలేక తాను తన పిసిసి సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తరతరాల తెలుగువారిని విడదీయడాన్ని ఎవ్వరు జీర్ణించుకోలేరన్నారు. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లోనే పార్టీల జెండాలు, అజెండాలు పక్కన పెట్టి సమైక్యాంధ్ర నినాదంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు రోడ్లపైకి రావాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. అన్ని పార్టీలు ఒకె అజెండాతో ఉద్యమిస్తే అనుకున్నది సాధించుకోవచ్చునన్నారు. సిడబ్ల్యుసి నిర్ణయం శాసనం కాదని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును అన్ని పార్టీలు ఏకమై వ్యతిరేకిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చునన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విగ్రహాలను, పదవులు త్యాగం చేసిన త్యాగమూర్తుల విగ్రహాలను ధ్వంసం చేయడం అనాగరికమన్నారు. శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడిపి అనుకున్నది సాధించుకోవచ్చునన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు. ఇందుకు మహాత్మాగాంధీ సిద్ధాంతమే నిదర్శనమన్నారు.
నెహ్రూ విగ్రహం ధ్వంసం
పలమనేరు, ఆగస్టు 1: పలమనేరు పట్టణంలోని స్వాతంత్య్ర ఉద్యమనాయకుడు, భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ విగ్రహాన్ని రాయలసీమ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు గురువారం ధ్వంసం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న నిరసన దీక్షల్లో సోనియాకు వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ రాయలసీమ ఐక్యవేదిక కార్యకర్తలు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈకార్యక్రమంలో రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షులు నగరం బాలాజీ, సైదుల్లా తదితరులు ఉన్నారు. పట్టణంలో ఎంతో చారిత్రాత్మకమైన ఈ విగ్రహాన్ని ధ్వంసంచేయడం అమానుషమని స్వతంత్య్ర సమరయోధులు వాపోతున్నారు.
చంద్రగిరిలో రైల్వే స్టేషన్‌కు నిప్పు
* నడిరోడ్డుపైన చెవిరెడ్డి స్నానాలు, వంటా వార్పు
చంద్రగిరి, ఆగస్టు 1: రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ గత రెండురోజులుగా జరుగుతున్న సీమాంధ్ర బంద్ గురువారం చంద్రగిరిలో కూడా సంపూర్ణంగా జరిగింది. వైఎస్‌ఆర్‌సిపి నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. నడిరోడ్డుపైనే స్నానాల కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రగిరి కోటపైకి ఎక్కి ఆందోళన చేసేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో ఉద్యోగులు నాగాలమ్మ మలుపు వద్ద జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి, మదుసూదన్‌రావు, సురేష్, సురేంద్రనాద్‌రెడ్డి, చంద్రమోహన్, జయలక్ష్మి, లలతకుమారి, కొండయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌పార్టీ కార్యదర్శి షఫీ ఆధ్వర్యంలో ఐతేపల్లిలో గ్రామస్ధులు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. రంగంపేటలో రాకేష్ ఆధ్వర్యంలో గ్రామస్ధులు గంటపాటు రాస్తారోకో చేశారు. వంటావార్పు, స్నానాల కార్యక్రమంలోచెవిరెడ్డితో పాటు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీరాములు, యుగంధర్, కేశవులు, నాగరాజు తదితరులు వంటావార్పులో పాల్గొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు చంద్రగిరి రైల్వే స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఇది ఆందోళనకారులు చేసిన పని కాదని, స్విచ్‌బోర్డులో విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా మంటలు ఏర్పడ్డాయని రైల్వే అధికారులు అంటున్నారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఇందిరమ్మ విగ్రహం ధ్వంసం
మదనపల్లె, ఆగస్టు 1: సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఆందోళనలో భాగంగా బుధవారం రాత్రి ఇందిరమ్మ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. అయితే గురువారం రాత్రి ఆ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఒక పక్క ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, కొంతమంది సమైక్యవాదులు ధ్వంసమైన విగ్రహానే్న పూర్తిగా పడగొట్టేశారు. సమీపంలోనే పెద్దమసీదు ఉండటంతో ఆప్రాంతంలో స్పెషల్ పోలీస్ ఫోర్స్ బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్తలు నిమిత్తం పట్టణంలోని ప్రధాన కూడళ్ళవద్ద పికెట్ ఏర్పాటుచేస్తున్నట్లు సిఐ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. బెంగళూరు బస్టాండులోని విగ్రహం ధ్వంసంపై డిఎస్‌పి రాఘవరెడ్డి పరిశీలించారు. అంతేకాకుండ పట్టణంలోని రహదారులు, జాతీయరహదారులలో సమైక్యవాదులు చేసిన విధ్వసకర సంఘటనలను పరిశీలించారు.
వేడెక్కిన సమైక్యాంధ్ర ఉద్యమం
* చిత్తూరులో హోరెత్తిన నిరసనలు
* ఎమ్మెల్యే సికె బాబు దీక్షకు మంచి స్పందన
* మరో శిబిరంలో టిడిపి దీక్షలు
* వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో శవయాత్ర
చిత్తూరు, ఆగస్టు 1: జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమం వేడెక్కింది. బుధవారం సాయంత్రం నుంచి చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబు సమైక్యాంధ్ర కోసం 48గంటల దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో అప్పటి నుండే వేలాది మంది పట్టణ నడిబొడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని సికె బాబు దీక్షకు మద్దతు పలికారు. గురువారం ఉదయం ప్రభుత్వ డాక్టర్లు ఎమ్మెల్యే సికె బాబు దీక్షా శిబిరం వద్దకు వచ్చిన ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేశారు. మరోవైపు చిత్తూరు పట్టణంలోని పలు అసోసియేషన్, బంగారు దుకాణదారులు, వ్యాపారులు, వస్తవ్య్రాపారులు, మండీ యజమాన్యం, పూల వ్యాపారులు తమ తమ మద్దతు తెలిపారు. మరోవైపు పట్టణంలోని సుమారు 10 కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి సికె బాబు తలపెట్టిన సమైక్యాంధ్ర దీక్షకు మద్దతు పలికారు. అలాగే ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జెఎసి నాయకులు, జిల్లా ఎన్‌జివో సంఘం అధ్యక్షులు క్రిష్ణమనాయుడు, ప్రధాన కార్యదర్శి దేవప్రసాద్, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ నాయకులు గంటామోహన్, రెడ్డిశేఖర్‌రెడ్డి, ప్రైవేటు లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పరెడ్డి, చిత్తూరు మండల విద్యాశాఖ, మున్సిపల్ వర్కర్స్, ఆర్టీసీ ఎంప్లారుూస్, జిల్లాపరిషత్ ఉద్యోగులు తదితరులు వేలాదిగా తరలివచ్చి సికె బాబు దీక్షకు మద్దతు పలికారు. ఒకపక్క బంద్ లేదు, కేవలం రిలే దీక్షలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించినా చిత్తూరు పట్టణంలో బంద్ వాతవరణం నెలకొంది. బస్సుల రాకపోకలు అంతంతమాత్రంగా కొససాగాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో సీమాంధ్రలో ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలని నాయకులు ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే సీమాంధ్రలోని మంత్రులు, ఎం.పిలు వారి వారి పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చరిత్రహీనులవుతారని పలువురు హెచ్చరించారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాన్ని విభజించడం ఏమిటని వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా, చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబు, ఆయన సతీమణి సికె లావణ్యబాబు సమైక్యాంధ్ర కావాలంటూ నిరాహార దీక్షకు కూర్చోవడంతో విషయం తెలుసుకున్న అభిమానులు చిత్తూరు నియోజకవర్గ పరిసర మండలాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. రిలే దీక్షలకు ఎక్కువ మంది ప్రజలు హాజరవుతారని ముందుగానే గ్రహించిన పోలీసులు కూడా తగిన బందోబస్తు ఏర్పాటుచేశారు.
జనతాబజార్ కాంప్లెక్స్ వద్ద టిడిపి దీక్షలు
కాగా, తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణంలోని గాంధీ విగ్రహానికి కొంతదూరంలో ఉన్న జనతా బజార్ కాంప్లెక్స్ వద్ద షామియానా వేసి రిలే దీక్షలు చేపట్టారు. ఈ శిబిరంలో మాజీ ఎంపి ఎన్‌పి దుర్గారామకృష్ణ, మహిళా నాయకురాలు వైవి రాజేశ్వరి, బిసి సంఘం నాయకులు విల్వనాధన్, సిఎం విజయాతోపాటు మరికొందరు పాల్గొన్నారు. వారు కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ నినాదాలు చేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేసింది.
వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో శవయాత్ర
చిత్తూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సిపి ఇన్‌చార్జి ఎఎస్ మనోహర్ గిరింపేటలోని తన స్వగృహం నుండి సోనియాగాంధీ శవయాత్ర నిర్వహించారు. గిరింపేట నుండి పలకలు కొడుతూ టపాకాయలు కాల్చుతూ తెలుగువారి మధ్య చిచ్చుపెట్టిన సోనియా అంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గిరింపేట నుండి బిఎస్ కణ్ణన్ జూనియర్ కళాశాల, అంబేద్కర్ విగ్రహం మీదుగా శవయాత్ర సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం సత్వరం తెలంగాణా ప్రకటనను వెనక్కు తీసుకోని పక్షంలో రాష్ట్రంలో ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతాయని హెచ్చరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి ఎంఎస్‌ఆర్ సర్కిల్ మీదుగా గాంధీవిగ్రహం వద్దకు శవయాత్ర చేరుకొంది. అక్కడ సోనియాగాంధీ శవదిష్టిబొమ్మను పలువురు చెప్పులతో, కర్రలతో కొట్టారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మపై కిరోసిన్‌పోసి ఎఎస్ మనోహర్ నిప్పుపెట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు కత్తినరసింహారెడ్డి, కుట్టిరాయల్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో...
సమైక్యాంధ్రకు మద్దతుగా పలు సంఘాలు గాంధీ విగ్రహం వద్ద సోనియాగాంధీ, యుపిఎ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మొదటగా శంకరయ్యగుంట మహిళలు ర్యాలీగా వచ్చి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధంచేశారు. అనంతరం అక్కడే నిరసన దీక్షలు చేస్తున్న సికె బాబుకు మద్దతు తెలిపారు. ఇంకోవైపు పాపుదేశి వెంకటక్రిష్ణమనాయుడు ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సోనియాగాంధీ, కెసిఆర్‌కు వ్యతిరేంగా నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద సోనియాగాంధీ, కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. రిలేదీక్షల్లో ఉన్న సికె బాబుకు మద్దతు తెలిపారు. అలాగే ఎబివిపి, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు రూపేష్‌రెడ్డి, కార్తీక్‌తోపాటు పలువురు విద్యార్థులు గాంధీ విగ్రహం వద్ద అర్థనగ్న ప్రదర్శన చేస్తూ సమైక్యాంధ్రకోసం నినాదాలు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జెఎసి నాయకులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు గాంధీ విగ్రహం వద్ద నిరసనలు, రిలేదీక్షలు చేపట్టారు.
పశ్చిమాన బంద్ విజయవంతం
* మదనపల్లెలో ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసం, కాల్చివేత
* ఎమ్మెల్యే ఇంటెదుట నిరసనలు
మదనపల్లె, ఆగస్టు 1: రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గురువారం నిర్వహించిన రెండోరోజు బంద్ విజయవంతమైంది. కాగా, బుధవారం అర్ధరాత్రి సమయంలో మదనపల్లె పట్టణం బెంగళూరు బస్టాండు సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహాన్ని సమైక్యవాదులు ధ్వంసం చేసి ఆపై కాల్చివేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సిఐ నారాయణస్వామిరెడ్డి పోలీస్ స్పెషల్ ఫోర్సుతో బెంగళూరు బస్టాండు సర్కిల్‌లో మోహరింపజేశారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటివద్ద ఆందోళన అనంతరం ఇందిరాగాంధీ విగ్రహానికి 20 అడుగుల దూరంలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విద్యార్థులు బైఠాయించి నినాదాలు చేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జ్ఞానాంబిక కళాశాల, సాయిచైతన్య జూనియర్ కళాశాల, వివేకానంద డిగ్రీకళాశాల, శ్రీనివాస డిగ్రీ కళాశాల విద్యార్థినులు వేలసంఖ్యలో ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్టాండు అంబేద్కర్ సర్కిల్‌లో బైఠాయించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను పాదరక్షలతో దేహశుద్ధి అనంతరం దగ్ధం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, విద్యార్థులు వేలసంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అదేవిధంగా మదనపల్లె మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ప్రైవేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, శాప్స్ నాయకులు మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించి సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ర్యాలీగా చిత్తూరు బస్టాండు వాల్మీకిసర్కిల్, టౌన్‌బ్యాంకు సర్కిల్, అవెన్యూరోడ్డు, బెంగళూరు బస్టాండ్, మల్లికార్జున సర్కిల్, అనీబెసెంట్ సర్కిల్, పటేల్‌రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, నీరుగట్టువారిపల్లె వరకు ర్యాలీ నిర్వహించారు. నీరుగట్టుపల్లెకు చెందిన చేనేత కార్మికులు సోనియాగాంధీకి శవయాత్ర నిర్వహించారు. శవాన్ని మోసుకుంటూ ముందు బ్యాండుమేళం వాయిస్తూ మదనపల్లె పుర వీధులలో ఊరేగించారు. కాగా, మదనపల్లె, తంబళ్ళపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో బంద్ విజయవంతమైంది. ములకలచెరువు, బురకాయలకోట, కాండ్లమడుగు క్రాస్, అంగళ్ళు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు మీదుగా వెళ్ళే ముంబై-చెన్నై జాతీయ రహదారి పొడవునా టైర్లు కాల్చుతూ వాహనాలను నిలిపేశారు. వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి ఆందోళనలో పాల్గొన్నారు. మదనపల్లె, పీలేరు, పలమనేరు ఆర్టీసీ డిపోలలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సైతం సమైక్యవాదానికి మద్దతు పలుకుతూ విధులను బహిష్కరించారు. పశ్చిమ ప్రాంతాలలో ఎక్కడ చూసినా సమైక్య నినాదంతో హోరెత్తింది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు మూతబడ్డాయి. కొన్నిచోట్ల రోడ్లుపై వంటవార్పు చేపట్టారు. బంద్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ బలగాలు మోహరించాయి.
జిల్లాలో ఆందోళనలు ఉధృతం
* జిల్లాలో రెండవ రోజు బంద్ సంపూర్ణం
* బంద్ ఎఫెక్ట్ - శ్రీవారి దర్శనానికి గంటే
* జెఎసిల ఆధ్వర్యంలో ఎంపిలు, మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి
* చిత్తూరు, మదనపల్లె, తిరుపతిలో ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు
* తిరుపతిలో మరో కారుకు నిప్పు
* రాజీవ్‌గాంధీ విగ్రహంపై చెప్పులు, కోడిగుడ్లు విసిరిన సమైక్యవాదులు
* చిత్తూరులో ఎమ్మెల్యే సికె బాబు దీక్షకు మంచి స్పందన
* మదనపల్లెలో ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసం, కాల్చివేత
* పలమనేరులో నెహ్రూ విగ్రహం ధ్వంసం
* చంద్రగిరిలో రైల్వే స్టేషన్‌కు నిప్పు
తిరుపతి, ఆగస్టు 1: రాష్ట్ర విభజన అంశంపై గురువారం కూడా చిత్తూరు, తిరుపతి, మదనపల్లి ప్రాంతాల్లో సమైక్యవాదుల ఆందోళనలు అట్టుడికాయి. జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. బంద్ నేపధ్యంలో ఆందోళనకారులు బస్సులను అడ్డుకోవడంతో తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ చాలా తగ్గింది. ఈ నేపధ్యంలో గంటలోగా స్వామివారిని దర్శించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలిబాట భక్తులతోనే భక్తులు అంతంత మాత్రంగా తిరుమలలో రద్దీ ఉంది. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు తీసుకున్నారు. మదనపల్లిలో ఇందిరమ్మ సిమెంటు విగ్రహాన్ని, పలమనేరులో నెహ్రూ సిమెంట్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తిరుపతి నగరంలో రాజీవ్‌గాంధీ, ఇందిరమ్మ విగ్రహాలను ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. నగరంలోని హీరోహోండా షోరూమ్ సమీపంలో ఆందోళనకారులు ఒక కారుకు నిప్పు పెట్టారు. న్యాయవాదులు, విద్యార్థులు, కార్మికులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, యువజన సంఘాలు, టిటిడి ఉద్యోగులు ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. ఇక ఉదయం 6 గంటల నుండే సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి అన్ని ప్రధాన జంక్షన్లలో రోడ్లపై టైర్లు కాల్చివేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతికి ప్రధాన మార్గాలైన మంగళం రోడ్డులో టిడిపి, కాంగ్రెస్, వైసిపి నేతలు రాస్తారోకో చేయడంతో కడప మార్గం నుండి వచ్చే వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. ఇక చెన్నై మార్గం నుండి వచ్చే వాహనాలను దామినేడు ప్రాంతంలో, రేణిగుంట రోడ్డు ఆటోనగర్ ప్రాంతంలో ఆందోళనకారులు రాస్తారోకో చేశారు. ఎస్వీయూ అధ్యాపక జెఎసి నేత శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్వీయూ విద్యార్థి జెఎసి నేతలు ఓబుల్‌రెడ్డి, కృష్ణయాదవ్, హరికృష్ణయాదవ్, ఉద్యోగ జెఎసి నేత కోటగారం మురళి, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నిర్మల, ఎన్‌జిఓ అసోసియేషన్ నేత కుసుమ తదితరులు 2వేల మందికిపైగా చిత్తూరు ఎంపి ఎన్ శివప్రసాద్, తిరుపతి ఎంపి చింతామోహన్, కరకంబాడిలోని మంత్రి గల్లా అరుణకుమారి ఇళ్లను ముట్టడించారు. మంత్రి కారును అడ్డగించారు. జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ కాంగ్రెస్ విధానాలపై దుమ్మెత్తిపోశారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహంపై కోడిగుడ్లు వేశారు. చెప్పులతో కొట్టారు. ఆగ్రహించిన సమైక్యవాదులు బంద్ సంపూర్ణం చేశారు. తెల్లవారుజాము 6 గంటల నుండి రాత్రి 6 గంటల వరకూ బంద్ సంపూర్ణంగా కొనసాగింది. సిపిఐ మినహా కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. విద్యార్థుల ఆగ్రహానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రశ్నించిన పోలీసులపై సైతం విద్యార్థులు తిరగబడ్డారు. విద్యార్థుల ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, పిసిసి కార్యదర్శి వూకా విజయ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆర్‌టిసి బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ఇచ్చారు. నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగే తిరుపతి నగరం జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. దుకాణాల మూతతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా తయారయ్యాయి. ప్రజాప్రతినిధులైన తిరుపతి ఎంపి చింతామోహన్, చిత్తూరు ఎంపి ఎన్ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, జిడి నెల్లూరు గుమ్మడి కుతూహలమ్మ నివాసం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే రవి, మాజీ ఎమ్మెల్యేలు చదలవాడ కృష్ణమూర్తి, వెంకటరమణ నివాసాల ఎదుట రక్షణగా బలగాలను ఏర్పాటు చేశారు. నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేకంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. తిరుపతి బార్ అసోసియేషన్ నేతలు రమణ, సామంచి శ్రీనివాస్, దినకర్, వజ్రాల చంద్రశేఖర్‌ల నేతృత్వంలో తిరుపతి టౌన్‌క్లబ్, కృష్ణాపురంఠాణా, నాలుగుకాళ్ల మండపం, ఆర్‌టిసి బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం, లీలామహల్ సర్కిల్, అన్నారావు సర్కిల్, మున్సిపల్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో స్కూటర్ ర్యాలీలు నిర్వహించారు. విభజనకు కారణమైన సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్‌తో పాటు టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ దిష్టిబొమ్మలను శ్రీవెంకటేశ్వర వెటర్నరీ వర్శిటీ ఎదుట విద్యార్థులు, అధ్యాపకులు దగ్ధం చేశారు. తెలుగుజాతిని విడదీసేందుకు ఉత్తరాది అగ్ర కాంగ్రెస్ నేతలు, పక్క రాష్ట్రానికి చెందిన చిదంబరంలు కుట్రపన్నారన్నారు. తెలుగువారు ఒక్కటిగా ఉంటే ఢిల్లీ పీఠంపై కనే్నస్తారనే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికి రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సోనియా కుట్రపన్నారన్నారు. తమ స్వార్థం కోసం సోనియాగాంధీ దేశాన్ని విదేశాలకు అయినా తాకట్టుపెడుతున్నారన్నారు. అధికారం ఇచ్చిన తెలుగువారిని చీల్చి చెండాతున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్వీయూ ప్రొఫెసర్లు కృష్ణారెడ్డి, శాప్స్ నేతలు ఎన్ రాజారెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరిరావు, ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి, దంపూరి భాస్కర్, ఎస్వీ ప్రసాద్, విశ్వనాధరెడ్డి, విద్యార్థి జెఎసి నేతలు కృష్ణమూర్తి, సప్తగిరి ప్రసాద్, రాజశేఖర్‌రెడ్డి, నగేష్, ఓబుల్‌రెడ్డి, తేజ్‌ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.