Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆగ్రహ జ్వాలలు

$
0
0

కర్నూలు, ఆగస్టు 1 : సమైక్య రాష్ట్రం కోసం ప్రజలు గురువారం పెద్దఎత్తున ఉద్యమించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చగా కర్నూలు నగరంలో మరింత వేడెక్కింది. నగరంలోని సి.క్యాంపు కూడలిలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. సమైక్య రాష్ట్రాన్ని చీల్చడానికి సోనియా గాంధీ కుట్ర పన్నిందంటూ సమైక్య వాదులు ర్యాలీగా వచ్చి మొదట విగ్రహానికి చెప్పుల దండ వేశారు. అనంతరం సైకిల్, మోటార్ సైకిల్ టైర్లను విగ్రహానికి తగిలించి కిరోసిన్ పోసి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టి ఫైరింజన్ సహాయంతో మంటలను ఆర్పారు. ఆందోళనకారులు అక్కడి నుంచి కలెక్టరేట్ చేరుకుని లోపలికి దూసుకుపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని వారించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో లాఠీచార్జి చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. సమైక్యవాదుల ఆందోళన హింసాత్మకంగా మారుతోందన్న విషయం తెలుసుకున్న ఎస్పీ రఘురామ్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి లాఠీ చేతబట్టి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇదే సమయంలో వైకాపా నేత ఎస్వీ మోహన్‌రెడ్డి అక్కడికి చేరుకోగా వెళ్లిపోవాలని సూచించినా ఎస్పీ ఆయన పట్టించుకోకుండా ఆందోళనకారులకు మద్దతుగా నినాదాలు చేస్తుండటంతో ఎస్వీని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులు, విద్యార్థి, కుల, ప్రజా సంఘాలతో పాటు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రం కావాలంటూ న్యాయ వాదులు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. న్యాయ వాదుల దీక్షకు మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ మద్దతు తెలిపారు. నగరంలో ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉద్యమ వేడి మరింత రాజుకుంది. డోన్ పట్టణంలోని మంత్రి ఏరాసు ఇంటిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. జాతీయ రహదారిపై పాత టైర్లు వేసి నిప్పంటించి రాకపోకలను అడ్డుకున్నారు. నంద్యాలలో సమైక్య వాదులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. సమైక్య వాదుల ఆందోళన ఫలితంగా జిల్లా వ్యాప్తంగా అప్రకటిక బంద్ వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసి వేశారు. యజమానుల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో పని చేస్తున్న బోధనా, బోధనేతర సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దాంతో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలను మూసి వేశారు. సమైక్య సెగలతో జిల్లా వేడెక్కడంతో వారికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మద్దతుగా నిల్చారు. ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా మోహన రెడ్డి, కాటసాని రామిరెడ్డి, లబ్బి వెంకట స్వామి తమ పదవులకు రాజీనామా చేసి ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని ప్రకటించారు. సమైక్య వాదానికి మద్దతు తెలిపిన నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి కూడా తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇక హైదరాబాద్‌లో ఉన్న మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి కూడా తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. జిల్లాలో సమైక్య వాదాన్ని కాంగ్రెస్, టిడిపి, వైకాపాలు పోటాపోటీగా వినిపించాయి. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ర్యాలీ, ధర్నా, రాస్తారోకో వంటి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని సమైక్యవాదులకు మద్దతు తెలిపారు. ఉద్యోగులు మూకుమ్మడిగా కార్యాలయాల్లో విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటున్నారు. కాగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఆందోళనలో భాగం పంచుకుంటే ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని పోలీసు శాఖ నిఘా వర్గాలు ప్రభుత్వానికి సందేశం పంపాయి.
మంత్రులు కోట్ల, టిజి ఇళ్లకు భారీ భద్రత
కర్నూలు : ఢిల్లీ పెద్దలు తెలంగాణ ఇచ్చినట్లు ప్రకటించడంతో సమైక్య వాదులు కర్నూలు నగరంలోని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర చిన్ననీటిపారుదలశాఖ మంత్రి టిజి వెంకటేష్ ఇళ్ల దగ్గర భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామ చేయాలనే డిమాండ్‌తో ఉద్యమకారులు మంత్రుల ఇళ్ల ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. అలాగే మంత్రి టిజివి హోటల్, ఫ్యాక్టరీ, కార్యాలయం వద్ద కూడా భద్రత ఏర్పాటు చేశారు. గురువారం కర్నూలు నగరంలో సమైక్య ఉద్యమకారులు రేచ్చిపోయి హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పుపెట్టి ఇనుప భారీ కేడ్లను తొలగించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో రాళ్లు విసరడంతో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. ఉద్యమకారులు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ వాణిజ్య సంస్థలను ముయించి వేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ఎస్పీ డా. కె.రఘురామ్‌రెడ్డి స్వయంగా రోడ్డుపైకి వచ్చి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆందోళనులు శాంతియుతంగా చేపడితే పోలీసులు కూడా సహకరిస్తారని ఎస్పీ తెలిపారు. హింసాత్మక సంఘటనలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమైక్యాంధ్ర కోసం
యువకుల బలిదానం
ఆదోని/ఆస్పరి, ఆగస్టు 1 : రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేక నగరూరు కు చెందిన ఇద్దరు యువకులు ఆత్మహ త్యకు పాల్పడ్డారు. వివరాలు.. ఆదోని డివిజన్‌లోని ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన బాలరాజు (18), గొల్ల విష్ణు (16) టివిలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటన వార్తలు, సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలను చూసి కలత చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 10వ తరగతి వరకూ చదువుకున్న బాలరాజు, 8వ తరగతి వరకూ చదువుకున్న విష్ణు మధ్య లోనే చదవు మానేసి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా కూలి పనుల కు వెళ్లేవారు. జూలై 30వ తేదీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటన నేపథ్యం లో అర్ధరాత్రి వరకు టివి చూస్తుండగా బాలరాజు తండ్రి నాగరాజు ఇక నిద్ర పోండని చెప్పగా నిద్రపోయారు. అయితే వారిద్దరు ఉదయం బహిర్భూమికి అని ఇంట్లో చెప్పి వెంట పురుగుల మందు తీసుకెళ్లి ఉరి చివరిలో ఉన్న పొలంలో నీళ్లలో పురుగుల మందు కలుపుకుని తాగి అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. వీరిని గమనించిన ప్రజలు విషయాన్ని బాలరాజు తల్లిదండ్రులు నాగరాజు, హనుమంతమ్మ, విష్ణు తల్లిదండ్రులు ఎర్రిస్వామి, శకుంతలమ్మకు తెలుపగా వారు వెళ్లి చూసే సరికి అప్పటికే బాలరాజు మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న విష్ణును ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ విష్ణు మృతి చెందాడు. ఈ సంఘటనపై ఆస్పరి పోలీసు స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ జఫూరుల్లాఖాన్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసమే తమ పిల్లలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరి మరణంతో బంధువుల రోధనలతో గ్రామంలో నగరూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాష్ట్ర విభజన ప్రకటనే బలి తీసుకుంది
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటనే తన బిడ్డను బలితీసుకుందని బాలరాజు తండ్రి నాగరాజు పేర్కొన్నాడు. అర్ధరాత్రి వరకూ టివి చూస్తుంటే మందలించగా వారిద్దరూ నిద్రపోయారని, ఉదయం లేచి చూసే సరికి సమైక్య రాష్ట్రం పురుగుల మందు తాగి బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రంతా టివిలో వార్తలు చూశారని, సమైక్యాంధ్ర కోసం చివరికి ప్రాణాలు కూడా వదిలారని విష్ణు తల్లి శకుంతలమ్మ బోరున విలపించింది.

ఎంపి, ఎమ్మెల్యేల రాజీనామా
* సమైక్య ఉద్యమంలో పాల్గొంటామన్న నేతలు
కర్నూలు, ఆగస్టు 1: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాకు చెందిన ఎంపి ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామి, మురళీకృష్ణ, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు తమ పదవులకు గురువారం రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సభాపతి నిర్ణయించిన పద్ధతిలోనే సమర్పిస్తున్నట్లు వారు హైదరాబాద్‌లో తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన చేసి రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఆ ప్రాంతీయులకు, పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రకటించి కోస్తాంధ్ర వాసులకు వరాలు ప్రకటించి రాయలసీమకు మొండి చేయి చూపడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర విభజనలో న్యాయం, శాస్ర్తియత కనిపించకపోవడం వల రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మనస్తాపాన్ని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని చీల్చవద్దని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించ లేదని ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేనపుడు పదవిలో ఉండటం భావ్యం కాదని రాజీనామా చేస్తున్నామని ఇక ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనలో భాగస్వామిని కాలేనని పేర్కొంటూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి స్పష్టం చేశారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీని వీడేందుకు కూడా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.

డోన్‌లో రగిలిన సమైక్య ఉద్యమం
* మంత్రి ఏరాసు ఇల్లు ముట్టడి, కిటికీలు ధ్వంసం
* రాజీవ్ గాంధీ విగ్రహం ధ్వంసం, కాల్చివేత
* గూడ్స్‌రైలును నిలిపివేసిన ఆందోళనకారులు
డోన్, ఆగస్టు 1 : రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తట్టుకోలేక ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలతో గురువారం డోన్ పట్టణం దద్దరిల్లిపోయింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహన్ని ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. సోనియా డౌన్ డౌన్ , సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ మోహనరెడ్డి పాత బస్టాండ్‌కు చేరుకుని జెఎసి నాయకులపై మండిపడ్డారు. దీంతో సమైక్యవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో మిన్నకుండిపోయారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు వలసల రామకృష్ణ, విక్రమసేనారెడ్డి, సిద్దార్థ కృష్ణారెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, శేషశయనగుప్త ఆధ్వర్యంలో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి స్వగృహానికి చేరుకున్న ఆందోళనకారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంటిలోకి చొరబడి ఫర్నిచర్‌ను కిందపడ వేయడంతో పాటు కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మంత్రి ఏరాసు దృష్టికి తీసుకెళ్లగా సమైక్యాంద్ర కోసం తాను రాజీనామా చేస్తానని, ఉద్యమంలో కూడా పాల్గొంటానని ఫోన్ ద్వారా తెలపడంతో వారు ఆందోళన విరమించారు. రైల్వే స్టేషన్‌లో డోన్ నుంచి నంద్యాల వైపు వెళ్తున్న గూడ్స్‌రైలును అడ్డుకున్నారు. వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రైలుకు అడ్డంగా నిలబడి నినాదాలు చేశారు. సోనియా డౌన్ డౌన్, కోట్ల రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో రైల్వే స్టేషన్ ప్రాంతం హోరెత్తిపోయిం ది. ఓ చికెన్ వ్యాపారి రైలు కిందకి దూరడంతో పాటు రైలెక్కి హల్‌చల్ చేస్తూ కాసేపు పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. చివరకు సిఐ డేగల ప్రభాకర్ రంగంలోకి దిగి ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమించారు. పట్టణంలోని ఇందిరాగాంధీ, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి విగ్రహాలకు ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని శాంతియుతంగా చేపట్టాలని జెఎసి నాయకులు మహేష్‌కన్నా, అధ్యక్షుడు పామయ్య, కోశాధికారి ఆలా శ్రీ్ధర్, కాలేషా తెలిపారు. అలా గే ఈనెల 2వ తేదీ తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమాల్లో నాగభూషణంరెడ్డి, ఓంప్రకాష్, కమాల్, పాల్గొన్నారు.
ప్రత్యేక రాయలసీమ ఇవ్వాల్సిందే!
* కెవి సుబ్బారెడ్డి ఆమరణ దీక్ష
* మద్దతు తెలిపిన బైరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఆగస్టు 1: జిల్లావ్యాప్తంగా సమైక్య ఉద్యమం సెగలు కక్కుతుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం మరో వైపు ఆందోళన ప్రారంభమైంది. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ విద్యాసంస్థల అధినేత, డాక్టర్ కెవి సుబ్బారెడ్డి గురువారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. మొదట ఆయన శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద నివాళులు అర్పించి తన దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరుగుతుందని ముందే సంకేతాలు ఉన్నా అప్పుడు ఎవరూ మాట్లాడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను తాము వినిపించామని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో రాయలసీమ ఏ విధంగా నష్టపోయింది అన్ని ఆధారాలతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పించామని వెల్లడించారు. దేశంలోనే వెనకబడిన ప్రాంతాల్లో రాయలసీమ మొదటి మూడు స్థానాల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఏ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కృషి చేసిన దాఖలాలు లేవన్నారు. అలాంటప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉండి సాధించేదేమీ లేదని, రాయలసీమ రాష్ట్రంగా ప్రకటిస్తే ఈ ప్రాంత సహజ వనరులు, మేథాశక్తితో అభివృద్ధి చెందుతామని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమకు చెందిన మేథావులు, విజ్ఞులు ఆలోచించి రాయలసీమ రాష్ట్ర ఆవశ్యకతను గుర్తించాలని కోరారు. సమైక్య వాదంతో ఆందోళనలు చేస్తున్న వారు తమ ఆలోనను పునఃపరిశీలించుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే దీక్ష చేస్తున్న సుబ్బారెడ్డిని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఖాయమని తాను గత ఆరు నెలలుగా చెప్తూ వస్తున్నానని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనలో భాగంగా ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడాలని పిలుపునిస్తూ తాను చేసిన ఆందోళనకు ఎవరూ స్పందించకపోవడం వల్లనే ఇప్పుడు నష్టపోతున్నామని మండిపడ్డారు. రాయలసీమ విషయమే చర్చించకుండా రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్, రాయలసీమ అభివృద్ధి కోసం ఏం చేస్తామో చెప్పకపోవడం అహంకారానికి నిదర్శనమన్నారు. రాయలసీమలోని రాజకీయ పార్టీ నాయకుల చేతగాని తనం వల్ల ప్రజలు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమైక్యవాదులు ఆ నినాదాన్ని పక్కన పెట్టి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సుబ్బారెడ్డికి దీక్షా శిబిరంలో పలు సంఘాల నాయకులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు.
ఎస్‌ఆర్‌ఎంసికి గండ్లు
* వృథా అవుతున్న నీరు
పాములపాడు, ఆగస్టు 1: పోతిరెడ్డిపాడుకు ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల ము ప్పు ఏర్పడింది. శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు ప్రధాన కాలువకు 0.5 నుంచి 5వ కి.మీ వరకు గత రెండు రోజులుగా గండ్లు పడుతున్నాయి. ఇప్పటి వరకూ 5 చోట్ల భారీ స్థాయిలో గండ్లు పడగా మిగతా చోట్ల చిన్న చిన్న గండ్లు పడ్డా యి. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రస్తుతం 4.12 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతుండడంతో పోతిరెడ్డిపాడుకు వరద నీరు అధికమవుతుంది. ఈ బ్యాక్‌వాటర్ పోతిరెడ్డిపాడు లోతట్టు ప్రాంతం నుంచి ఎస్‌ఆర్‌ఎంసి కట్టలపై నుంచి ప్రవహిస్తూ గండ్లకు కారణమవుతుంది. 2009 వరదల సమయంలో ఈ ఎస్‌ఆర్‌ఎంసి కట్టలు తెగిపోయాయి. అయితే ప్రభుత్వం కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎస్‌ఆర్‌ఎంసి కుడివైపు ఉన్న కాలువ కట్టలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. 15 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఎస్‌ఆర్‌ఎంసికి కట్ట వెంట రోజు రోజుకూ గండ్లు అధికమవుతున్నాయి. ఎడమ గట్టు స్టాండెట్ బ్యాంకు నిర్మాణంలో నాణ్యత లోపించడం, 2009 వరదల అనంతరం పోతిరెడ్డిపాడు జలాశయం దిగువ ప్రాంతంలో ఉన్న నల్లమట్టి చేత అప్పట్లో గండ్లను తాత్కాలికంగా పూడ్చి వేశారు. అయితే ఆ మట్టి కొట్టుకుపోయి గండ్లు పడ్డాయి. దీంతో ఒక్కో గండి నుంచి రోజుకు దాదాపు 500 క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంది. ఐదు రోజుల క్రితం పోతిరెడ్డిపాడు వద్ద ఉన్న ఎన్‌సిపిల్ మినీ పవర్ ప్లాంట్ నుంచి ఎస్‌ఆర్‌ఎంసికి నీరు విడుదల చేయగ 24 గంటల్లోనే సరఫరా నిలిచిపోయింది. తిరిగి గురువారం స్వల్పంగా ఎస్‌ఆర్‌ఎంసికి నీరు విడుదల చేస్తున్నారు. మున్ముందు ఆల్మట్టి నుంచి భారీ వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ఇదే నీటి ప్రవాహం పెరిగితే ఎస్‌ఆర్‌ఎంసికి పడ్డ గండ్లు మరింత అధికమయ్యే ప్రమాదం ఉంది. ఈ నీరు అధికమై పంట పొలాలను ముంచెత్తకముందే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని పాములపాడు ప్రాంత రైతులు అధికారులను మొరపెట్టుకుంటున్నారు.
ఎమ్మెల్యే పదవికి
కాటసాని రామిరెడ్డి రాజీనామా
బనగానపల్లె, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఎ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో మనస్తాపం చెంది ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేస్తూ ఆ పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు పంపినట్లు కాటసాని రామిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన బనగానపల్లెలో స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ టిడిపి, వైకాపా, బిజెపి తెలంగాణకు మద్దతు పలకడం తో యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ విభజనకు సానుకూలంగా స్పం దించారని తెలిపారు. ఈ ప్రకటనతో ముఖ్యంగా రాయలసీమ వాసులు ఎక్కువ నష్టపోయారన్నారు. తొలుత రాజధానిగా కర్నూలును వదలుకుని, ఇప్పుడు విభజనతో రెండు సార్లు నష్టపోయారన్నారు. రాయలసీమ ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా యు పిఎ ప్రభుత్వం విభజనను ప్రకటించ డం విచారకరమన్నారు. సీమాంధ్ర మంత్రులు హైదరాబాద్‌లో సమావేశమై మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనా మా చేసి యుపిఎ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు నిర్ణయించారని ఈ మేరకు తాము రాజీనామా చేసినట్లు తెలిపారు. అయితే భవిష్యత్తు కార్యచరణ ప్రణాళిక ప్రకారం నడుచుకుంటామని, సమైక్య ఉద్యమానికి అం డగా నిలుస్తామని ప్రకటించారు. విభజనను అడ్డుకునేందుకు సకల జనుల సమ్మె చేయాలని కాటసాని పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజనను అడ్డుకుంటాం:్భమా
కర్నూలు, ఆగస్టు 1: దేశంలో ఏ రాష్ట్రాన్నైనా విభజించే ముందు ఆ రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించి వాటికి పరిష్కార మార్గం చూపి ఆ తరువాతే విభజన నిర్ణయం తీసుకుంటారని, అయితే మన రాష్ట్ర విభజన అందుకు వ్యతిరేకంగా జరగుడాన్ని తాము అడ్డుకుంటున్నామని వైకాపా కేంద్ర పాలకమండలి సభ్యుడు, మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. కర్నూలులో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి నాటకాల కారణంగానే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించే సాహసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన ముందు అందరితో సంప్రదించాలని తమ పార్టీ రాసిన లేఖను సైతం పట్టించుకోకుండా ఏకపక్షంగా విభజన చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించారే కానీ రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలకు ఎలాంటి న్యాయం చేస్తున్నారో చెప్పకపోవడం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని చీలుస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించినా టిడిపి వౌనం వహించడాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాల్సిన చంద్రబాబు కాంగ్రెస్ నిర్ణయం వెలువడ్డాక ఆ పార్టీకి సలహాలు ఇచ్చినట్లుగా మాట్లాడారే కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగిన తీరును ప్రశ్నించలేకపోయారని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు నియోజకవర్గ నేత ఎస్వీ మోహనరెడ్డి పాల్గొన్నారు.
మోటార్‌బైక్‌లు ఢీ: ఇద్దరి మృతి
గొనెగండ్ల, ఆగస్టు 1: ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి గొనెగండ్లలో జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రాళ్లదొడ్డికి చెందిన నాగరాజు(30), మాబాష మోటార్‌సైకిల్‌పై కర్నూలు నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. నెరడుపల్లికి చెందిన తిక్కన్న(25) గొనెగండ్ల నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. గొనెగండ్ల శివారులో రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్నాయి. దీంతో నాగరాజు, తిక్కన్న అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మాబాషను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ వెంకటరామిరెడ్డి సంఘటనాస్థలాన్ని సందర్శించారు.
భవిష్యత్తులో కాంగ్రెస్
ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదు:ఎంపి
వెలుగోడు, ఆగస్టు 1: భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టే ప్రసక్తే లేదని ఎంపి ఎస్పీవై రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వన్నార్ తూము గేట్లు ఎత్తి దిగువకు సాగునీరు విడుదల చేశారు. అనంతరం నంద్యాల వెళ్తుండగా మార్గమధ్యలో విద్యార్థి సంఘాలు ఎంపి వాహనాన్ని అడ్డుకుని ఎంపి పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని డిమాండ్ చేశాయి. దీంతో ఎంపి వెలుగోడు అయ్యపురెడ్డి కాలనీ నుంచి విద్యార్థులతో కలిసి ర్యాలీగా పొట్టిశ్రీరాములు సెంటర్ చేరుకున్నారు. అక్కడ ఎంపి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ సమస్య ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదని పార్లమెంటులో తెలంగాణా బిల్లును సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో కలిసి అడ్డుకుంటామన్నారు. అనంతరం స్వయంగా ఆయన సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

* కర్నూలు, డోన్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహాలకు నిప్పు * డోన్‌లో మంత్రి ఏరాసు ఇంటిపై రాళ్లు, ఫర్నిచర్ ధ్వంసం * ధర్నాలు, రాస్తారోకోలు * సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దగ్ధం
english title: 
knl

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>