Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పదవులకు ఆనం సోదరుల రాజీనామా

$
0
0

నెల్లూరు, ఆగస్టు 1: సమైక్యాంధ్రా పరిరక్షం కోరుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి తమ పదవులకు రాజీనామా చేసారు. రామనారాయణ రెడ్డి మంత్రి పదవితోపాటు శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు. గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈసంఘటనతో నెల్లూరు జిల్లాలో సమైక్యాంధ్రా ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకుంది. ఆనం కుటుంబీకులు ఆది నుండి సమైక్యవాదులేనన్న సంగతిని నిరూపించుకుంటూ జిల్లాలోని ఎమ్మెల్యే సోదరులిద్దరు రాజీనామాలు సమర్పించటం విశేషం. తొలుత అన్న, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. కొద్ది గంటల వ్యవధిలోనే అన్నబాటులోనే తమ్ముడు ఆర్థిక మంత్రి రామనారాయణరెడ్డి కూడా రాజీనామా చేయటం గమనార్హం. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం తన పదవిని త్యాగం చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి ప్రకటించారు. గురువారం సాయంత్రం ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పంపినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు, వైకాపాకు చెందిన మరో ఇద్దరు ఇప్పటి వరకు రాజీనామాలు సమర్పించారు. దీంతో ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించగా, తెలుగుదేశంకు చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల నిర్ణయం మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్గదర్శకం ప్రకారమే ఉంటుందని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.
సైన్స్‌లో పరిశోధనకు అవకాశాలు అపారం
నెల్లూరుసిటీ, ఆగస్టు 1: సైన్స్‌లో పరిశోధనకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అందిపుచ్చుకోవడానికి విద్యార్థులకు అంకిత భావం పట్టుదల ఉన్నట్లయితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని డాక్టర్ ఎస్‌జెఎస్ ఫ్లోరా స్పష్టం చేశారు. గురువారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 2013 ఇన్‌స్పైర్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ చదవాలని విద్యార్థులు ఒక్కసారి నిర్ణయించుకుంటే పరిశోధనపై ఆసక్తి ఉన్నట్లయితే ఎన్నో అవకాశాలు వారి ముందు ఉన్నాయని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న వివిధ వ్యాధులలో ఎన్నో వ్యాధులు విష పదార్థాలకు మానవ జీవ కణజాలం లోను కావడం మూలంగా జరుగుతున్నవేనని ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తూర్పున ఉన్న ప్రాంతాలలో ఆర్సెనిక్ అను విష పదార్ధం వల్ల 70 మిలియన్ల మంది వివిధ రకాల జబ్బున బారిన పడుతున్నారని తెలిపారు. తాను చేస్తున్న పరిశోధన ద్వారా ఆ వ్యాధి నివారణకు ఆయన చేస్తున్న కృషిని వివరించారు. ఉపకులపతి జి రాజారామిరెడ్డి మాట్లాడుతూ నాడీ వ్యవస్థపై ఆర్సెనిక్ ప్రభావం యొక్క విష పదార్థనికి సరైన నివారణపై వారు చేస్తున్న పరిశోధన అని తెలిపారు. రిజిస్ట్రార్ నాగేంద్ర మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో పలు జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల సందడితో ఒక పండుగ వాతావరణం నెలకొన్నదని తెలిపారు. ఇన్‌స్పైర్ కార్యక్రమానికి వివిధ కళాశాలల నుంచి 150మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని దేశంలో అత్యున్నత శాస్తవ్రేత్తలను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులురెడ్డి, పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్యశాలలోనే
కాన్పులు చేయించుకోవాలి
సంగం, ఆగస్టు 1 : గ్రామీణ ప్రాంతాలలోని గర్భవతులందరూ ప్రభుత్వ వైద్యశాలలోనే కాన్పులు చేయించుకోవాలని డిఎంహెచ్‌ఒ సుధాకర్ తెలిపారు. గురవారం సంఘం ప్రభుత్వ వైద్యశాలలో అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్యఅతిథులుగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పోరేట్ వైద్యశాలలకు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలలు కొనసాగుతున్నాయని, గర్భవతులందరూ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి కాన్పులు చేయించుకునేందుకు సిబ్బంది సహకరించాలని అన్నారు. ప్రభుత్వ పరంగా గర్భవతులకు ఇచ్చే రాయితీలను తప్పనిసరిగా అప్పుడే అందిస్తామని ఆయన తెలిపారు. గ్రామాలలో ఉన్నటువంటి ఆశా, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు ఆయా ప్రాంతాల గర్భవతుల నమోదు కార్యక్రమాలను చేసే సమయంలోప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి వౌలిక సదుపాయాలను వివరించాలని ఆయన అన్నారు. గతంలో ప్రభుత్వ వైద్యశాలలో వౌళిక సదుపాయాలు లేకుండా ఉండడంతో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం మంది ప్రైవేట్ వైద్యశాలల వైపు వెళ్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలలో కూడా మెరుగైన సేవలు అందించేందుకు వైద్య అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం తహశీల్దారు కేధర్‌నాధ్ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా గర్భవతులకు, బాలింతలకు అనేక రాయితీ నిధులు మంజూరవుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఈ నిధులను ఉపయోగించుకునేందుకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ పరంగా సర్ట్ఫికేట్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆరోగ్యపరంగా అంగన్‌వాడీ కేంద్రాలలో పౌష్టికాహారాలు తీసుకోవడం వలన గర్భవతులకు, బాలింతలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, ఆత్మకూరు డివిజన్ ఆర్డీఓ కమలకుమారి, ఎస్‌పిహెచ్‌ఓ సుధాకర్‌రెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్యాధికారి స్వర్ణముఖి పాల్గొన్నారు.

ఎంపిడివో కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామస్థులు
సైదాపురం, ఆగస్టు 1: స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని తురిమెర్ల గ్రామస్థులు గురువారం ముట్టడించారు. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తప్పు జరిగిందని ఒక వర్గం పట్టుపట్టగా మళ్లీ ఓట్లలెక్కింపు చేశారు. అయితే ఈదఫా రెండువర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీద్వారా ఒకరిని ఎన్నికైనట్టు ప్రకించారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థి వర్గం తనకు న్యాయం చేయాలంటూ తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు, బుధవారం జరిగిని ఎన్నికల్లో తురిమెర్ల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా పొట్టేళ్ల సుజాతమ్మ, సన్నిబోయిన యశోదమ్మ పోటీ చేశారు. సుజాతమ్మకన్నా యశోదమ్మకు 3 ఓట్లు అదనంగా రావడంతో రీ కౌంటింగ్ నిర్వహించారు. రీ కౌంటింగ్‌లో యశోదమ్మకు పడిన ఓట్లలో 3 ఓట్లు చెల్లని ఓట్లుగా జోనల్ అధికారి జయచంద్రారెడ్డి గుర్తించి వాటిని పక్కన పెట్టడంతో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా వచ్చాయి. లాటరీ విధానంతో అభ్యర్థిని నిర్ణయించేందుకు అభ్యర్థుల సమ్మతితో జోనల్ అధికారి లాటరీ తీయగా అందులో పొట్టేళ్ల సుజాతమ్మ గెలుపొందారు. దీంతో బుధవారం సాయంత్రం కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తిరిగి గురువారం ఉదయం స్థానిక ఎండివో కార్యాలయం ఎదురుగా పెద్ద సంఖ్యలో ఓడిన వర్గానికి చెందిన వారు బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలుచేశారు. విధుల్లో ఉన్న సిబ్బందిని బయటకు పంపారు. తమకు న్యాయం జరిగేంత వరకు కదలబోమని భీష్మించుకొన్నారు. దీంతో పోలింగ్ అధికారి ఎన్నికల కేంద్రంలో జరిగిన విషయాన్ని రాత పూర్వకంగా గ్రామస్థులకు తెలియజేశారు. ఎస్సై ఖాదర్ బాష తన సిబ్బందితో శాంతి భధ్రతలు పరిరక్షించారు.
ప్రతిష్ఠాత్మకంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలి
నెల్లూరుసిటీ, ఆగస్టు 1: జిల్లాలో ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అధికారులను సంయుక్త కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. గురువారం స్థానిక గోల్డెన్‌జూబ్లీ హాలులో ఆగస్టు 15న పోలీసు పెరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించునున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖ ద్వారా పెరేడ్‌గ్రౌండ్ వద్ద జాతీయపతావిష్కరణ, కవాతు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ శాఖ అధికారులకు సూచించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వేడుకకు విచ్చేసే అతిధులు, ప్రేక్షకులు, అధికారులు, బడి పిల్లలను దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా షామియానాలు, సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, న్యాయశాఖ అధికారులు, ఇతర ముఖ్యలకు ఆహ్వానాలు పంపాలన్నారు. విద్యాశాఖ పర్యవేక్షణలో వివిధ పాఠశాలల పిల్లలలను తీసుకుని వచ్చి క్రమశిక్షణతో పిల్లలు కూర్చొని వేడుకలు తిలకించే విధంగా ఏర్పాట్లు చూడాలన్నారు. పాఠశాల పిల్లలను పోలీసు గ్రౌండ్‌కు చేర్చేందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో 15వ తేదీ సాయంత్రం కస్తూర్భా కళాక్షేత్రంలో వివిద సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయుటలో నిర్ణీత సయమం కేటాయించి క్రమపద్దతిలో నిర్వహించేలా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్‌ఫర్మేషన్ ఇంజనీరింగ్ శాఖ వారు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు, వివిధ పాఠశాలలకు సంబంధించిన పిల్లల ప్రదర్శించే కార్యక్రమాల సిడిలను విడి విడిగా తీసకుని స్పష్టత ఉండేలా చూడాలన్నారు. నగరపాలక సంస్థ ద్వారా పెరేడ్ గ్రౌండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీటీ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర వైద్య సేవలందించేందుకు అవసరమైన వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేయాలని జిల్లా పౌరసరాఫరాలశాఖ అధికారికి ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలను ఆయా శాఖల పరిధిలో చూపరులను ఆకట్టుకునే విధంగా శకటాలను తయారు చేసి పెరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రదర్శించేలా చూడాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్నిశాఖల అధికారులతో పాటు సిబ్బంది తప్పని సరిగా హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బి రామిరెడ్డి, నెల్లూరు ఆర్‌డిఓ మాధవీలత, డ్వామా పిడి గౌతమి, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

వైఎస్ మరణంతో ఆగిన సంక్షేమం
కోట, ఆగస్టు 1: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంతో రాష్ట్రంలో సంక్షేమం పూర్తిగా ఆగిపోయిందని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. గూడూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సిపి అధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో గురువారం కోటలో విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం వైఎస్ ఎన్నో పథకాలను ప్రవేశపెడితే అధికారంలో వున్న కాంగ్రెస్ నేతలు వాటిని తుంగలో తొక్కారన్నారు. వైఎస్ మృతిచెందడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమన్నారు. వైఎస్ బతికివుంటే రాష్ట్రం రెండు ముక్కలు అయ్యేది కాదన్నారు. వైఎస్ పథకాలను అమలుపరిచే సత్తా జగన్‌కే ఉందన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో తమ పార్టీ మద్దతుదారులు 36 స్థానాలను కైవసం చేసుకొని వైఎస్‌ఆర్‌సిపి జెండాను ఎగురవేశారన్నారు. కోట పంచాయతీలో నల్లపరెడ్ల కోటను కాపాడిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోట పంచాయతీ సర్పంచ్ రాఘవయ్య గెలుపుతో పంచాయతీ అభివృద్ధికి తొలిమెట్టు వేశామన్నారు. అనంతరం కోట, వాకాడు చిట్టమూరు మండలాల్లో వైఎస్‌ఆర్‌సిపి మద్దతుతో సర్పంచ్‌లుగా గెలుపొందిన వారిని ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా నాయకులు మానికల పవన్‌కుమార్, పాశం సునీల్‌కుమార్, పార్టీ నాయకులు నల్లపరెడ్డి హర్‌నాధ్‌రెడ్డి, నల్లపరెడ్డి రాజేంద్రకుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి జగధీష్‌కుమార్‌రెడ్డి, వంకా రమణయ్య, కోట మండల పార్టీ కన్వీనర్ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, వైకాపా మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నల్లపరెడ్డి అభిమానులు, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్ర విభజనపై విద్యార్థి జెఏసి
ఆగ్రహం
ఆగ్రహం
నెల్లూరు, ఆగస్టు 1: రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థి జెఏసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం ఉదయం నగరంలోని స్థానిక చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. దీంతో విజయవాడ నుండి వచ్చే వాహనాలు, అటు చెన్నై వైపు నుండి వచ్చే వాహనాలు రెండు కిలోమీటర్ల వరకు భారీగా నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యాసంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమలనాయుడు, వైఎస్‌ఆర్‌సి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జయవర్థన్‌లు మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించకపోతే ప్రాణత్యాగానికైనా సిద్దమని హెచ్చరించారు. జిల్లాలో విద్యార్థి జెఏసిగా ఉద్యమం చేస్తుంటే కనీసం ఏ రాజకీయ పార్టీ నాయకులైన మద్దతు తెలపకపోవడం దారుణమన్నారు. ఈ నాయకులు తెలుగుజాతికి ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రప్రభుత్వం పునరాలోచించి సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన చేయకపోతే అమరజీవి పొట్టిశ్రీరాములను ఆదర్శంగా తీసుకొని విద్యార్థి జెఏసి ఆధ్వర్యంలో ఆమరణ దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. బంద్‌లో భాగంగా డిసిసి ఇన్‌చార్జ్ చాట్ల నరసింహారావు స్కూల్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఆందోళనకారులు స్కూల్ వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించకుండా స్కూల్ నిర్వహించడం దారుణమని స్కూల్ ఎదుట బైఠాయించారు. చాట్ల నరసింహారావు బయటకు రాకపోవడంతో ధర్నా నిర్వహించారు. అరగంట తర్వాత చాట్ల బయటకు వచ్చి విద్యార్థి జెఏసి నాయకులకు మద్దతు ప్రకటించి జై సమైక్యాంధ్ర అని నినాదం చేయడంతో నేతలు వెనుతిరిగారు. అలాగే నగరంలోని పలు విద్యాసంస్థలు బంద్ పాటించకుండా నిర్వహిస్తుండటంతో విద్యార్థి జెఏసి నేతలు సంబంధిత స్కూళ్ల వద్దకు చేరుకొని మూసివేయించి విజయవంతం చేశారు. అనంతరం నగరంలో భారీ మోటార్‌సైకిళ్ల నిర్వహించారు. జనజీవనం స్తంభించింది. జాతీయ రహదారి, నగరంలో రోడ్లన్నీ నిర్మూనుష్యంగా మారి కర్ప్యూను తలిపించాయి. బాలాజీనగర్ సిఐ మంగారావు, ఐదవ నగర సిఐ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డిలు బలగాలను వెంట పెట్టుకొని చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు జాతీయరహదారి వద్దకు చేరుకొని ఆందోళనకారులకు నచ్చచెప్పి పంపివేశారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించి వాహనాలను అక్కడ నుండి పంపివేయడంతో యధావిధిగా వాహనాలు నడిచాయి. ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం 7 గంటల నుండి బంద్ ప్రాంరంభం కావడంతో జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద విద్యార్థి సంఘ నేతలు ఇంజనీరింగ్ కళాశాలల బస్సులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద కేంద్ర బలగాలతో కూడిన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జెఏసి నాయకులు శ్రావణ్, హర్షచౌదరి, అఖిల్, సాయిశివ, అశోక్, మురళికృష్ణ, జగన్, మోను తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్‌కు సోనియాగాంధీకి వివాహం
*సమైక్య నాయకులు వినూత్న నిరసన
ఆత్మకూరురూరల్, ఆగస్టు 1 : రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర నాయకులంతా రెండవ రోజైన గురువారం కెసిఆర్, సోనియాగాంధీల దిష్టిబొమ్మలకు వివాహ కార్యక్రమాల మహోత్సవాలను తప్పెట్లు, తాళాల నడుమ వేద పండితుల మంత్రాల సాక్షిగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సమైక్యాంధ్రవాదులకు ఆత్మకూరు సోమశిల సెంటర్‌లోని నడిరోడ్డుపై వంట చేసి విందు ఏర్పాటుచేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రాన్ని రెండు విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ అధినేతలు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న పద్ధతిలో సోనియాగాంధీ, కెసిఆర్ బొమ్మలను ఊరేగిస్తూ చెప్పులతో కొడుతూ సమైక్య నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు సోమశిల రోడ్డు సెంటర్ వద్ద కెసిఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలకు స్థానిక శివాలయం సహకారంతో శాస్త్రోక్తంగా వివాహం చేశారు. అనంతరం ఆ బొమ్మలను దగ్ధం చేశారు. వచ్చిన సమైక్యాంధ్ర వాదులకు భోజనం ఏర్పాటు చేశారు. రెండవ రోజు జెఏసి నాయకులు ఆత్మకూరు పట్టణ పరిధిలోని దుకాణాలను, వాహనాలను అడ్డుకోవడం జరిగింది. ముందుగానే పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. బస్టాండ్ సెంటర్ నుండి ఆర్టీసీ డిపో వరకు సమైక్య వాదులు కేసిఆర్, సోనియాగాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డిపోలోని బస్సులు రెండవ రోజు కూడా నిలిపి వేయడం జరిగింది.

సమైక్యాంధ్రా పరిరక్షం కోరుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం
english title: 
anam

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>