Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నిరసనల హోరు

$
0
0

ఒంగోలు, ఆగస్టు 1: జిల్లాలో రెండవ రోజైన గురువారం సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. విద్యార్థి జెఎసి నేతలు, ఎపి ఎన్‌జివో సంఘ నేతలతోపాటు, పాఠశాల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి ఇంటిని కారంచేడులో సమైక్యవాదులు ముట్టడించారు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలపాలని సమైక్యవాదులు నినాదాలు చేశారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని మంగమూరు రోడ్డు జంక్షన్ జాతీయ రహదారిని సమైక్యవాదులు దిగ్బంధించారు. ఈసందర్భంగా రోడ్డుకు ఇరువైపుల పెద్దఎత్తున వాహనాలను నిలిచిపోయాయి. పనికిరాని టైర్లను జాతీయ రహదారిపై తగులబెట్టి నిరసన తెలిపారు. సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోవటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాగా ఒంగోలులోని చర్చిసెంటరు వద్ద సమైక్యాంధ్ర ఉద్యోగ జెఎసి నేతల ఆధ్వర్యంలో మానవహారం జరిగింది. తొలుత ర్యాలీ నిర్వహించి నేతలు తలకిందులుగా నిలబడి వినూత్న ప్రదర్శన చేశారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సమైక్యవాదులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జిల్లాలోని కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేయకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాగా గిద్దలూరు, మార్కాపురం డిపోల నుండి కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు వెళ్ళాల్సిన బస్సులను నిలిపివేశారు. దీంతో ఆర్‌టిసికి నష్టం వాటిల్లింది. ఈ సమైకాంధ్ర ఉద్యమ కార్యక్రమంలో విద్యార్థి జెఎసి నేతలు రాయపాటి జగదీష్, చెన్నుబోయిన అశోక్, జగన్నాధం మహేష్, గోరంట్ల రవికుమార్, పి వెంకటేశ్వర్లు, ఉద్యోగ జెఎసి నేతలు షేక్ బషీర్, రాజ్యలక్ష్మి, బండి శ్రీనివాసరావు, గ్రంధి శ్రీను, కెఎల్ నరసింహరావు, న్యాయవాదుల జెఎసి నేతలు శిరిగిరి రంగారావు తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

పంచాయతీ ఎన్నికల్లో
టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి పోటాపోటీ
చతికిలపడ్డ కాంగ్రెస్
ఒంగోలు, ఆగస్టు 1: జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల హవా సాగింది. పోటాపోటీగా పంచాయతీల్లో నువ్వానేనా అన్నరీతిలో ఫలితాలు సాధించుకున్నాయి. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవటంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. జిల్లావ్యాప్తంగా 1020 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఐదు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. జిల్లాలో 1015 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా తెలుగుదేశం పార్టీకి 359 పంచాయతీలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 350, కాంగ్రెస్ పార్టీకి 206 పంచాయతీలు లభించాయి. మొదటి, రెండవ విడతల్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగగా, తుదివిడత జరిగిన మార్కాపురం డివిజన్‌లో మాత్రం వైఎస్‌ఆర్‌సిపి అత్యధిక స్థానాలను కైవశం చేసుకుంది. దీంతో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిల మధ్యే పోటీ నెలకొనగా కాంగ్రెస్ పార్టీ డీలాపడింది. కాగా ఎవరికివారే తమకే ఎక్కువ పంచాయతీలు వచ్చాయంటూ ప్రకటనలు గుప్పించటం పరిపాటిగా మారింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు, మద్యం ఏరులైపారింది. పంచాయతీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తితోపాటు ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సమష్టిగా కృషి చేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. దీంతో టిడిపి మద్దతుదారులు జిల్లాలో అత్యధిక పంచాయతీలను కైవశం చేసుకున్నారు. జిల్లాలో అత్యధిక పంచాయతీలను కైవశం చేసుకోవటం పట్ల పార్టీశ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. ఇదిలాఉండగా వైఎస్‌ఆర్‌సిపికి కూడా మెరుగైన ఫలితాలు రాకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీతో తలపడింది. మూడవ విడత జరిగిన ఎన్నికలే వైఎస్‌ఆర్‌సిపికి ప్రాణం పోశాయి. లేనిపక్షంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉండేదని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో మాత్రం ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి. ఈ ఫలితాల ప్రభావం త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలపై చూపే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎక్కువమంది శ్రేణులు వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు పలుకుతుండటంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా ఒంగోలు, పర్చూరు, సంతనూతలపాడు, దర్శి, కందుకూరు, కొండెపి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అధిక స్థానాలు రాగా వైఎస్‌ఆర్‌సిపికి మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో అధిక స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ కనిగిరి, చీరాల నియోజకవర్గాల్లో మాత్రం గుడ్డిలోమెల్లగా అధిక స్థానాలను గెలుచుకుని పరువు నిలుపుకుంది. మొత్తంమీద తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

అద్దంకిలో ఏర్పాటుచేసిన వివాదాస్పదమైన ఫ్లెక్సీ
ఫ్లెక్సీ తొలగించాలంటూ రాస్తారోకో చేస్తున్న టిడిపి కార్యకర్తలు
అద్దంకిలో భగ్గుమన్న సమైక్యాంధ్ర ఉద్యమం
అద్దంకి, ఆగస్టు 1: కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రకటించడంతో అద్దంకిలో రెండవ రోజు కూడా సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు ఎగిసిపడ్డాయి. గురువారం సమైక్యాంధ్ర జెఎసి, వైఎస్‌ఆర్‌సిపి, న్యాయవాదుల ఆధ్వర్యంలో పట్టణంలోని అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఆర్‌టిసి బస్సులు నిలిపివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. పట్టణంలో రాస్తారోకో సందర్భంగా ఇరువైపుల వాహనాలు బారులు తీరాయి. పాత బస్టాండ్ సెంటరులోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలకోసం తెలుగుజాతిని విడగొట్టేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రులంతా ఒక్కటై ఉండగా, కొందరు స్వార్ధం కోసం ఉద్యమం చేస్తే, దానిని ఆసరాగా తీసుకొని రాష్ట్రాన్ని విడగొట్టడం దారుణమన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రాంతంలో కాంగ్రెస్‌పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కోస్తాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతుంటే సోనియాగాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలుగువారి మనోభావాలు తెలుసుకోకుండా, అధికారం ఉందిగదాని రాష్ట్రాన్ని విడగొడితే దాని ప్రభావం రాబోయే ఎన్నికల్లో చూపిస్తామన్నారు. పార్లమెంటులో తెలంగాణా బిల్లును సమైక్యవాదులంతా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు నర్రా నాగేశ్వరరావు, కరి పరమేష్, కాకాని రాధాకృష్ణమూర్తి, చుండూరి మురళీసుధాకర్, నటరాజు, జెఎసి నాయకులు ప్రవీణ్, జగదీష్, రమణయ్య, హరీష్, నాని, సుధీర్, న్యాయవాదులు వజ్రాల అంజిరెడ్డి, కరి రామకృష్ణ, హనుమంతరావు, వడ్లవల్లి వీరనారాయణ, కుసుమకుమారి, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా మోటారుబైక్ ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు
కందుకూరు, ఆగస్టు 1: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం పట్టణంలో మోటారుబైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా స్థానిక కోర్ట్భువన సముదాయం సమీపం నుండి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికోటేశ్వరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ ప్రారంభించి పట్టణంలోని ప్రధాన రహదారులలో నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా విభజన వద్దు సమైక్యాంధ్ర ముద్దు అనే నినాదాలతో న్యాయవాదులు హోరెత్తించారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు మల్లికార్జున్, డివి కృష్ణారావు, రాజేంద్రప్రసాద్, శ్రీ్ధర్‌నాయుడు, మస్తాన్‌వలి, మహేష్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి ఇల్లు ముట్టడి
కారంచేడు, ఆగస్టు 1: సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, పర్చూరు శాసనసభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంటిని గురువారం సమైక్యవాదులు ముట్టడించారు. ఆందోళనకారులు ఇంటి లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించటంతో పోలీసులు ప్రధాన ద్వారం వద్దనే వారిని నిలిపివేశారు. పోలీసులను నెట్టుకొని ఇంటిలోకి ప్రవేశించిన సమైక్యవాదులు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. దగ్గుబాటి దంపతులు సమైక్యాంధ్రకు కట్టుబడి వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఓటు వేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి షేక్ సుభానికి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని బ్యాంకులను, ప్రభుత్వ పాఠశాలలను మూసివేయించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సిఐ మహమ్మద్ ఫిరోజ్, చీరాల టౌన్ సిఐ భీమానాయక్ బందోబస్తు నిర్వహించారు.
కొడవలివారిపాలెంలో దిష్టిబొమ్మ దగ్ధం
తెలంగాణాను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా మండలంలోని కొడవలివారిపాలెంలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, టిఆర్‌ఎస్ అధ్యక్షులు కెసిఆర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. గురువారం గ్రామ సర్పంచ్ కొసరాజు దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించి బస్టాండ్ సెంటర్‌లో వాటిని దగ్ధం చేశారు. గ్రామంలోని పాఠశాలలను మూసివేయించి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కొసరాజు సురేంద్ర, కొడాలి రమేష్, కొసరాజు శ్రీనివాసరావు, ఆదినారాయణ, ఐనంపూడి గోపి తదితరులు పాల్గొన్నారు.

భార్యను హత్యచేసిన భర్త
కనిగిరి, ఆగస్టు 1: భార్యను భర్త హత్యచేసిన సంఘటన గురువారం నగర పంచాయతీలోని శివనగర్ కాలనీలో జరిగింది. ఈసంఘటన కనిగిరిలో సంచలనం రేపింది. వివరాలలోకి వెళితే భర్త రాచూరి రవి డ్రైవర్‌గా పనిచేస్తుండగా భార్య రాచూరి సుగుణ (25) కాలనీలో ఇస్ర్తి బంకు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వ్యసనాలకు బానిసైన రవి భార్యను అతి కిరాతకంగా ఇంట్లోనే మొద్దుకత్తితో నరికాడు. చేతి బొటనవేలు అక్కడే పడి ఉంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భార్యను ఇంటిముందు నడిరోడ్డుపై ఈడ్చుకుపోయి మొద్దుపై తలనుపెట్టి మెడ తేగేలా అతి దారుణంగా నరికి చంపాడు. ఆతరువాత కత్తితో సహా బజారులో నడిచివెళుతూ అడ్డుపడిన వారిని విపరీతంగా దుర్భాషలాడుతూ ఉండగా వెంకటేశ్వర మహల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలికి ఏడేళ్ల కూతురు అనూష, ఐదేళ్ల కుమారుడు కార్తీక్ ఉన్నారు. తల్లి మృతిచెందగా, తండ్రి జైలుపాలవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈసంఘటన తెలుసుకున్న పట్టణ ప్రజలు తండోపతండాలుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అమాయక చూపులతో చూస్తున్న చిన్నారులను చూసి అక్కడికి చేరిన జనం కంటతడిపెట్టారు. సంఘటనా స్థలాన్ని సిఐ పి కరుణాకర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసిన మంత్రి మహీధర్‌రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి
కందుకూరు, ఆగస్టు 1: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా కందుకూరు శాసన సభ్యులు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలు గురువారం సాయంత్రం శాసనసభ సభ్యత్వానికి రాజీనామాలను చేసి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. ఈప్రాంతంలోని ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారిరువురు రాజీనామాలు సమర్పించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ప్రజలు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు తాము సమాదానం ఏవిధంగా చెప్పాలని అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి మహీధర్‌రెడ్డి సీమాంధ్ర మంత్రులతో కలిసి రాష్ట్ర విభజనకు ముందు ఢిల్లీ చేరుకుని విభజనను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే సీమాంధ్ర మత్రులు, నాయకులు, ఎంపిలు అధిష్ఠానాన్ని ఒప్పించడంలో విఫలం చెందగా, విభజన ప్రకటన రావడం జరిగింది. విభజన ప్రకటన వెలువడిన అనంతరం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ప్రజలు ఆందోళనబాట పట్టగా ప్రజల మనోభావాలకు విలువనిచ్చి తమ రాజీనామాలను అందజేసినట్లు తెలుస్తోంది.
సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో
కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం
ఒంగోలు, ఆగస్టు 1: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులో కొవ్వొత్తులతో గురువారం ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక సివిఎన్ రీడింగ్ రూము వద్ద అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద మానవహారాన్ని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. తొలుత పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ డౌన్ డౌన్, యుపిఏ ప్రభుత్వం డౌన్ డౌన్, ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తరువాతనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్‌సిపి వారు రాజీవ్‌గాంధీ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయండి మాకు పదవులు ముఖ్యం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. విజయవాడ ఎంపి లగడపాటి రాజ్‌గోపాల్ తన పదవికి రాజీనామా చేయకుండా సమైక్యాంధ్రపై మాట్లాడడం సరైంది కాదన్నారు. పదవికి రాజీనామా చేస్తే ఏం ఉపయోగం ఉంటుందని రాజ్‌గోపాల్ అనడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రాజకీయాలకు అతీతంగా బయటకువచ్చి సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాటం అరుణమ్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సిపి ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టడం అన్యాయమని, సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌సిపి జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి సూర్య మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని, సమైక్యాంధ్రను సాధించేంత వరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు రొండా అంజిరెడ్డి, నరాల రమణారెడ్డి, వెల్నాటి మాధవరావు, కెవి ప్రసాద్, ముదివర్తి బాబూరావు, దుంపా చెంచురెడ్డి, భీమేష్, చింతపల్లి గోపి, కెకె రాజు, తోటపల్లి సోమశేఖర్, రమేష్, మహిళా నాయకురాళ్ళు గంగాడ సుజాత, కావూరి సుశీల, బడుగు ఇందిర, బి రాజేశ్వరి తదితర నాయకులు కార్యకర్తలు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

జిల్లాలో ఊపందుకున్న సమైక్యాంధ్ర ఉద్యమం కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులు జాతీయ రహదారి దిగ్బంధనం ఒంగోలులో మానవహారం
english title: 
protests

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>