Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విభజనపై మిన్నంటిన నిరసనలు

$
0
0

గుంటూరు, ఆగస్టు 1: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, సమైక్యాంధ్రను కొనసాగించాలని కోరుతూ వివిధ సంఘాలు, రాజకీయ పక్షాలు, విద్యార్థి, ఉద్యోగ లోకం ముక్తకంఠంతో నినదించింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ 72 గంటల బంద్‌లో భాగంగా రెండవ రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, బైఠాయింపులు, ధర్నా, మానవహారాలు నిర్వహిస్తూ తమ నిరసనను తెలియజేశారు. రెండవ రోజు కూడా విద్య, వాణిజ్య, వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా మూతపడగా ఎపి ఎన్‌జివో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గృహాన్ని ఎపి ఎన్‌జివో అసోసియేషన్, సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో ముట్టడించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను నిలిపివేయగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించి, హిందూ కళాశాల సెంటర్‌లో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాయపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాజ్‌సెంటర్‌లో రాష్ట్ర విభజనకు నిరసనగా వౌనదీక్షను చేపట్టారు. కన్న స్కూలు విద్యార్థులు కొత్తపేటలోని శనక్కాయల ఫ్యాకర్టీ సెంటర్‌లో అధిక సంఖ్యలో మానవహారం నిర్వహించి, సమైక్యాంధ్రను కోరుతూ నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ జెఎసి నాయకులు టిడిపి ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని వినతిపత్రం అందజేశారు. ఇలా ఉండగా జిల్లాలోని 12 డిపోల పరిధిలో బుధ, గురువారాల్లో బస్సులను ఆందోళన కారులు అడ్డుకోవడంతో 90 లక్షల రూపాయల ఆదాయానికి గండిపడింది. నవోదయం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమైక్యాంధ్రను కోరుతూ జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలియజేశారు.

రాజీనామా చేసి ఉద్యమంలోకి రండి
* ప్రజాప్రతినిధులకు సమైక్యాంధ్ర రాజకీయ జెఎసి పిలుపు
గుంటూరు (పట్నంబజారు), ఆగస్టు 1: ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని సమైక్యాంధ్ర రాజకీయ జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జిన్నాటవర్ సెంటర్‌లోని గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జెఎసి నాయకులు మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు చేయడాన్ని సాగతిస్తున్నామన్నారు. అధిష్ఠానం తాయిలా లు, బుజ్జగింపులకు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు లొంగితే ప్రజలు క్షమించరన్నారు. నాయకులను ద్రోహులుగా పరిగణించి వారి ఫొటోలను అన్ని గ్రామాల్లో ప్రదర్శిస్తామని జెఎసి నాయకులు హెచ్చరించారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఈనెల 2వ తేదీ జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామన్నారు. 3వ తేదీ జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం, 4వ తేదీ జాతీయ రహదారుల దిగ్బంధనం, 5వ తేదీ జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థులచే ర్యాలీలు, కలెక్టరేట్ ముట్టడి, 6వ తేదీ కేంద్రప్రభుత్వ కార్యాలయాల బంద్, 7వ తేదీ రైల్‌రోకో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సమైక్యాంధ్ర రాజకీయ జెఎసి అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, గౌరవాధ్యక్షుడు మోదుగుల పాపిరెడ్డి, నాయకులు ఎస్ శ్రీ్ధర్, క్రోసూరి వెంకట్, మండూరి వెంకట రమణ, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, ప్రొఫెసర్ ఎన్ శామ్యూల్, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బాలశౌరి గుడ్‌బై

గుంటూరు, ఆగస్టు 1: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా పార్లమెంటు మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వల్లభనేని బాలశౌరి గురువారం పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన బాలశౌరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి బాలశౌరి ఆంధ్రభూమితో మాట్లాడుతూ సీమాంధ్రకు సంబంధించి ఎటువంటి విధి విధానాలు రూపొందించకుండా నీటి వనరుల పంపిణీ తదితర అంశాలను చర్చించకుండా గుడ్డిగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ తదితరులు తెలంగాణ విషయంలో దీర్ఘంగా చర్చించిన తర్వాతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిర్ణయించారని, అటువంటిది ప్రస్తుతం తమ పూర్వీకుల మనోభీష్టాలను తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయం తీసుకుందని బాలశౌరి మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల పక్షాన నిలబడి తాను ఉద్యమంలో పాల్గొంటానని, రాజకీయాలకు అతీతంగా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతునిస్తున్నట్లు బాలశౌరి పేర్కొన్నారు.

‘సమైక్య’ జేఏసీ ఆధ్వర్యంలో తెనాలి బంద్ ప్రశాంతం
* యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం * పాసింజర్ రైలును అడ్డుకున్న ఆందోళనకారులు
తెనాలి, ఆగస్టు 1: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రెండవ రోజైన గురువారం కూడా ఉద్యమ జెఎసి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఉదయం 9గంటలకు శివాజీచౌక్‌కు చేరుకున్న ఉద్యమ జెఎసి నాయకులు వైఎస్‌ఆర్ సిపి ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అన్నాబత్తుని సదాశివరావు ఆధ్వర్యంలో యువత పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలో పాల్గొని పట్టణంలో బంద్‌కు పిలుపుఇచ్చారు. దీంతో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ఆందోళనకారులకు సహకరించి షాపులు మూసి వేశారు. సినిమా థియేటర్లు రెండు పగటి ఆటలు నిలిపివేశారు. బ్యాంకులు కూడా మూతపడటంతో బ్యాంక్ లావాదేవీలలోప్రధానంగా పెన్షన్‌దారులు కొంత అసౌకర్యానికి లోనయ్యారు. ఎటిఎంలు కూడా మూతపడటంతో వినియోగ దారులకు అసౌకర్యానికి లోనయ్యారు. ఉద్యమకారులు భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనలను వినియోగించడం వల్ల బంద్ లక్ష్యం నెరవేరింది. జై సమైక్యాంధ్ర, కేసిఆర్ డౌన్ డౌన్,సోనియా డౌన్ డౌన్ అంటు యువత నినాదాలు చేశారు. గాంధీచౌక్‌లో, చెంచుపేట సెంటర్‌లో ఉద్యమ కారులు సోనియ దిష్టిబొమ్మను, యుపిఎ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓ దశలో రైల్వేస్టేషన్ సెంటర్‌కు చేరుకున్న ఆందోళనకారులు ముఖ్యంగా యువత ఒక్కసారిగా తమ ద్విచక్రవాహనాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి వెళ్ళి, వాహనాలుప్రధాన ద్వారం వద్ద నిలిపి వేసి స్టేషన్‌లోకి పరుగులు తీశారు. అప్పుడే వచ్చిన గుంటూరు పాసింజర్ సేషన్‌లో నిలువగానే, ఆందోళనకారులు రైలు ఇంజన్ ముందుభాగంలో బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆందోళనకారులను హుకుం జారీ చేయడంతో ఆందోళన కారులు సమైక్యవాద నినాదాలు చేస్తూ పట్టాల మీద నుండి పక్కకు వచ్చారు. ప్రజల నిత్యావసరాలైన పాలు, కూరగాయలు, మెడికల్ షాపులకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఉద్యమ జెఎసి ముఖ్యులు ఆందోళనలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి
గుంటూరు , ఆగస్టు 1: సకల సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో రాష్ట్రం కలిసి ఉంటే ఉపయోగమా, విడిపోతే ఉపయోగమా అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్‌జిఒల సంఘం మాజీ అధ్యక్షుడు బి సాంబిరెడ్డి మాట్లాడుతూ విభజన, సమైక్యత ఏదైనా వాస్తవిక రాజ్యాంగ ప్రాతిపదికపై ఉండాలన్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి రాజ్యాంగం ఇస్తున్న అధికారాన్ని ఉపయోగించాలని కేంద్రంలో పాలకులు నిర్ణయించినప్పుడు భావోద్వేగాలకే పరిమితమైతే ఫలితం ఉండదన్నారు. కోట్ల మందికి సంబంధించిన ఈ సమస్యను అన్ని పార్టీలతో ముడిపడిన వ్యవహారాన్ని స్వంతపార్టీ ప్రయోజనాల పాకులాటగా మార్చింది కాంగ్రెస్ నాయకత్వమేనన్నారు. అధ్యాపకులు ఇ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్న, పాలించాలనుకుంటున్న పార్టీలన్నీ వారు చేయగూడనిపని చేశారని ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య తంపులు పెట్టారన్నారు. ఇకనైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలన్నారు. కిసాన్ ఫౌండేషన్ డైరెక్టర్ కె మురళీధరరావు మాట్లాడుతూ పైకి ఏం చెప్పినా తమ తమ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి ఎక్కడ ఏమి చేయాలన్నది పార్టీలు, నాయకులు కూడా ఆలోచిస్తున్నారన్నారు. గోష్ఠికి అధ్యక్షత వహించిన అవగాహన సంస్థ కార్యదర్శి కొండ శివరామిరెడ్డి మాట్లాడుతూ విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామంటున్న తెలంగాణ వాసులకి హైదరాబాద్‌ని శాశ్వతంగా ఉమ్మడి రాజధానిగా కోనసాగిస్తే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ గోష్ఠిలో సంస్థ సీనియర్ సభ్యుడు భీమినేని దయాసాగర్, రిటైర్డ్ అధికారి బి సూరయ్యచౌదరి, పిఎస్ మూర్తి, ఎల్ మురళీకృష్ణ తదితరులు ప్రసంగించారు.
వర్సిటీలో పిజిఇసెట్ కౌనె్సలింగ్‌ను అడ్డుకున్న జెఎసి నాయకులు
నాగార్జున యూనివర్సిటీ, ఆగస్టు 1: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర నిరసనలు నాగార్జున వర్సిటీలో రెండవరోజు కూడా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అన్ని విద్యార్థి సంఘాలు, సమైక్యాంధ్ర జెఎసి నేతలు వర్సిటీలో ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనలో భాగంగా రెండవరోజైన గురువారం కూడా వర్సిటీలో విద్యార్థులు బంద్ పాటించి తెరిచి ఉంచిన పరీక్షాభవన్, పలు విభాగాలను మూయించి వేశారు. వర్సిటీ హెల్ప్‌లైన్ సెంటర్‌లో జరుగుతున్న పిజిఇసెట్ కౌన్సిలింగ్‌ను జెఎసి నేతలు అడ్డుకున్నారు. ఈ సంధర్భంగా పిజిఇసెట్ కౌన్సిలింగ్ అధికార్లు, విద్యార్థులకు స్వల్ప వాగ్వివాదం జరిగింది. రాష్ట్రంలోని ప్రతిఒక్కరి ప్రయోజనాలను ఆశించి తాము సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నామని, తమకు సహకరించి కౌన్సిలింగ్‌ను వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థులు కౌన్సిలింగ్ సెంటర్ వద్ద ధర్నా చేశారు. ఇదే సమయంలో పోలీసులు పెద్దయెత్తున్న ఆ సెంటర్‌కు చేరుకోవటంతో విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దత్తుగా నినాదాలు చేశారు. దీంతో అధికారులు గురువారం, శుక్రవారం జరగాల్సిన పిజిఇసెట్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేసినట్లు ప్రకటించారు. దీనికి సంతృప్తి చెందిన విద్యార్థులు ఆందోళన విరమించి ప్రదర్శనను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ సమైక్యాంధ్ర జెఎసి నాయకులు బి ఆశీరత్నం, పి శ్యాంసన్, కె కిషోర్, వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

‘తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు’
గుంటూరు , ఆగస్టు 1: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, సీమాంధ్ర ప్రజల మనోభావాలకు దెబ్బతగిలే విధంగా యుపిఎ ప్రభు త్వం వ్యవహరించిందని, తగిన విధం గా బుద్ధిచెప్పేందుకు తాము ఏ నిముషంలోనైనా రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఎం, పార్లమెంటు సభ్యులు, మంత్రు లు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధిన తాకట్టుపెట్టారని, విభజనకు ముందు సోనియాగాంధీ ఇచ్చిన ముసాయిదాను తీసుకోకుండా వెనుదిరిగి వచ్చి, ఇప్పుడు రాజీనామాలు చేస్తామని మరో మోసపూరితమైన తెర లేవనెత్తారన్నారు. విభజనకు ముందే రాజీనామాలు చేసి ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదన్నారు. తెలుగుజాతిని ఒక ప్రయోగశాలగా మార్చుకుని కేంద్రం ఈ నిర్ణయాని కొచ్చిందన్నారు.ప్రత్యేక రాష్ట్రం నిర్ణయంలో మార్పులేక పోతే సీమాంధ్ర ప్రాంతంలో 5 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించి రాష్ట్ర విభజన పెట్టే బిల్లులో దీనికి గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ దొంగే దొంగ అని పిలిచినట్లుగా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారన్నారు. శాసనసభ్యులు స్పీకర్‌కు, మంత్రులు గవర్నర్‌కు రాజీనామాలు ఇస్తే ఆమోదం లభిస్తుందే తప్ప అర్హత లేని వారికి రాజీనామాలు ఇస్తే ఎలా ఆమోదం పొందుతాయని ప్రశ్నించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి రాజామాస్టారు, దామచర్ల శ్రీనివాసరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు, నల్లపనేని విజయలక్ష్మి, పానకాల వెంకట మహాలక్ష్మి, రావిపాటి సాయి, పప్పుల దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్న సమైక్యాంధ్ర ఉద్యమ జెఎసి నేతలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులకు వినతిపత్రాన్ని అందజేశారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమైక్యతకు తూట్లు పొడిచారని, రాష్టవ్రిభజనకు సానుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. సమైక్యాంధ్ర కోసం తెలుగదేశం పార్టీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించారు. వినతిపత్రం అందజేసిన వారిలో చంద్రగిరి ఏడుకొండలు వైవి సురేష్, రాంబాబు, వెంకటరమణ, లంకా మాధవి తదితరులున్నారు.
మల్లవోలులో లాఠీచార్జి
మాచవరం, ఆగస్టు 1: మండలంలోని మల్లవోలులో తమ ఓట్లను తొలిగించారనే కారణంతో గురువారం తెల్లవారుఝాన ఒక వర్గానికి చెందిన మహిళలపై మరొకవర్గం వారు దాడిచేశారు. ఈదాడిలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోడంతో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పిడుగురాళ్ళ రూరల్ సిఐ బిలాలుద్ధీన్, ఎస్‌ఐ షఫీ గ్రామానికి చేరుకుని ఇరువర్గాలవారికి నచ్చచెప్పగా, వినకపోవడంతో ఇరువర్గాలపై లాఠీచార్జి చేశారు. లాఠీచార్జిలో ఇద్దరు గాయాలపాలయ్యారు. గ్రామంలో పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటుచేశారు.

దేహం ముక్కలైనా రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం
* ఎమ్మెల్యే ప్రత్తిపాటి రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళన

చిలకలూరిపేట, ఆగస్టు 1: దేహం ముక్కలైనా రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమంటూ నినదిస్తూ చిలకలూరిపేట విద్యార్థి సంఘాలు సమైక్యాంధ్ర కోరుతూ గురువారం పట్టణంలో ర్యాలీ, నిరసన, బంద్‌లు నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు మద్దతుగా వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి. సుగాలి కాలనీ యూత్ ఆధ్వర్యంలో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో పాఠశాలలను మూయించివేశారు. ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని జాతీయ రహదారిపై ఎఎంజి విద్యార్థులు, పలు విద్యార్థి సంఘాలు మానవహారంగా ఏర్పడి జాతీయ రహదారిపై దిగ్బంధించారు. ఈ నిరసనకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతున్న సమయంలో విద్యార్థులు ఆయన రాజీనామా చేయాలంటూ ఆందోళన చేశారు. స్పందించిన పుల్లారావు ప్రజాభిప్రాయం మేరకు తాము ఏ త్యాగానికైనా సిద్ధమని, ఎమ్మెల్యే పదవి తృణప్రాయమన్నారు. అదేవిధంగా స్థానిక వైఎస్‌ఆర్ సిపి నాయకులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో అనేక చోట్ల కెసిఆర్, సోనియాగాంధీల గడ్డిబొమ్మలను విద్యార్థి సంఘ నాయకులు దగ్ధం చేశారు.

ఆర్టీసీ ఆదాయానికి
90 లక్షలు గండి
గుంటూరు , ఆగస్టు 1: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర జెఎసి నాయకులు తలపెట్టిన బంద్ కారణంగా గత రెండు రోజులుగా రీజియన్ పరిధిలోని 12 డిపోల్లో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి 90 లక్షల రూపాయల ఆదాయానికి గండి పడినట్లు ఆర్‌ఎం పివి రామారావు పేర్కొన్నారు. సమైక్యాంధ్ర జెఎసి నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్ వద్ద బుధ, గురువారాలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని పలు డిపోల వద్ద ఆందోళన కారులు బస్సులను అడ్డుకోవడంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం తెనాలి, చిలకలూరిపేట డిపోల నుండి బస్సులను బయటకు రానివ్వకుండా సాయంత్రం 3 గంటల వరకు ఆందోళన కారులు అడ్డుకోగా గుంటూరు ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లో ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆందోళన కారులు బస్సులు నిలుపుదల చేశారు. జిల్లాలో ఇతర డిపోల్లో కూడా మధ్యాహ్నం వరకు బస్సులు కదలకపోవడంతో రీజియన్ పరిధిలోని 12 డిపోల్లో రెండు రోజులకు గాను 90 లక్షల రూపాయల ఆదాయానికి గండిపడినట్లు రామారావు తెలిపారు.
సమైక్యాంధ్ర కోరుతూ విద్యార్థుల భారీ ర్యాలీ
మంగళగిరి, ఆగస్టు 1: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రగానే రాష్ట్రాన్ని ఉంచాలని డిమాండ్ చేస్తూ గురువారం మంగళగిరి పట్టణంలో పట్టణ పరిసర గ్రామాలకు చెందిన పలువురు ప్రైవేట్ సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాలిగోపురం ఎదుట గల గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా తాలూకా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరింది, అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారంగా ఏర్పడి తెలంగాణా వద్దని, సమైక్యాంధ్రే కావాలని నినాదాలు చేశారు. విజె డిగ్రీ కళాశాల, నిర్మలా జూనియర్ కాలేజీ, వాణీ మోడల్ హైస్కూల్, ఎస్‌ఎల్‌ఎం చైతన్య హైస్కూల్, నాగార్జున, విజేత, ఎస్‌ఎస్ టాలెంట్, న్యూ కెనడీ, అరవింద హైస్కూల్‌కు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

పునరావాస పనులు
నెలాఖరులోగా పూర్తి చేయాలి
* కలెక్టర్ సురేష్‌కుమార్
గుంటూరు, ఆగస్టు 1: పులిచింతల ప్రాజెక్టు ముంపు బాధితులకు కల్పిస్తున్న పునరావాస సహాయ కార్యక్రమాలను నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం డిఆర్‌సి సమావేశ మందిరంలో ప్రాజెక్టు అధికారులు, నిర్వాసితులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించే అవకాశమున్నందున బాధితులకు సహాయ చర్యలను వేగవంతం చేయాలన్నారు. అమ్మహస్తం పథకం కింద నిత్యావసర సరుకుల పంపిణీని ఈనెల నుండి కొత్త కాలనీలోని కుటుంబాలకు అందించడం జరుగుతుందన్నారు. చౌకధరల దుకాణాలు, కమ్యూనిటీ భవనాలు దేవాలయాలు, తదితర సౌకర్యాలను త్వరితగతిన ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెసి డి మురళీధర్‌రెడ్డి, ప్రాజెక్టు ఇన్‌చార్జి ప్రత్యేక కలెక్టర్ కె నాగబాబు, డ్వామా, డిఆర్‌డిఎ పిడిలు ఎస్ ఢిల్లీరావు, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో 87 శాతం పోలింగ్
* 8న 13 పంచాయతీలకు రీపోలింగ్ * నేడు పంచాయతీల్లో తొలి సమావేశాలు: కలెక్టర్ సురేష్‌కుమార్
గుంటూరు, ఆగస్టు 1: జిల్లా వ్యాప్తంగా గత నెలలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 87 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1010 గ్రామ పంచాయతీలకు గాను 838 గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌లు ఎన్నికయ్యారని తెలిపారు. 2 గ్రామ పంచాయతీల్లో ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదని, 142 పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. వివిధ కారణాల వల్ల ఎన్నిక వాయిదా పడిన 13 గ్రామ పంచాయతీల్లో ఈనెల 8వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రీపోలింగ్ జరగనున్న పంచాయతీల్లో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని పేర్కొన్నారు. 10654 వార్డులకు గాను 3,484 వార్డులు ఏకగ్రీవం కాగా 40 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదన్నారు. 6991 వార్డుల్లో ఎన్నికలు జరిగాయని, 139 వార్డులకు ఈనెల 8వ తేదీన రీపోలింగ్ జరగనుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంలో సహకరించిన వారికి ఈ సందర్భంగా కలెక్టర్ అభినందనలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఈనెల 2వ తేదీన తొలి సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. ఈసమావేశంలో రిటర్నింగ్ అధికారులు ధృవపత్రాలు అందజేయడమే కాకుండా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. ఉప సర్పంచ్ ఎన్నిక జరగని గ్రామ పంచాయతీలకు ఈనెల 6న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఉప సర్పంచ్‌ను ఎన్నుకోవాల్సి ఉందన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించిన 107 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి 342 కేసులు నమోదు చేయగా 236 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గుంటూరు నగరపాలక సంస్థ మినహా మిగిలిన 12 మున్సిపాలిటీలలో గురువారం నుంచి పోలింగ్ స్టేషన్ల ఖరారు ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పారు. 2వ తేదీన ముసాయిదా జాబితా విడుదల చేస్తామని అభ్యంతరాలేవైనా ఉంటే ఈనెల 3 నుండి 5 వరకు ఆయా మున్సిపల్ కమిషనర్లు స్వీకరిస్తారన్నారు. 12వ తేదీన అన్ని మున్సిపాలిటీలలో పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 667 పోలింగ్ కేంద్రాలు అవసరమవుతాయని అంచానా వేసినట్లు చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో 10,85,651 మంది ఓటర్లు ఉండగా గుంటూరు మినహా 6,05,072 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. రచ్చబండలో స్వీకరించిన పించన్ల దరఖాస్తులలో కొత్తగా 34,945 పించన్లు మంజూరయ్యాయని కలెక్టర్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు.
హైవేపై గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడేపల్లి, ఆగస్టు 1: తాడేపల్లి మండల పరిథిలోని కుంచనపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న హైవేపై గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతునికి సుమారు 35-40 సంవత్సరాల వయస్సు వుండవచ్చని భావిస్తున్నారు. మృతదేహం సమీపంలో ఒక పక్కగా విడిచిన లెదర్ షూ మోడల్‌లో ఉన్న చెప్పుల జత వుంది. మృతుడి ఒంటిపై బ్లూ రంగు చారల చొక్కా, ఆకుపచ్చ రంగు ప్యాంటు, మెడలో ఎర్రదారంతో కూడిన రుద్రాక్ష ధరించి వున్నాడు. హైవే పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందించడంతో తాడేపల్లి ఎస్‌ఐ రవిబాబు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో ప్రమాదవశాత్తు సదరు వ్యక్తి మృతిచెంది వుంటాడని గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు
మంగళగిరి, ఆగస్టు 1: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను గురువారం మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసరావు, తహశీల్దార్ పి శివరామకృష్ణ పరిశీలించారు. పట్టణంలో 32 వార్డుల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో భాగంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించామని కమిషనర్ తెలిపారు.
పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయం
అమరావతి, ఆగస్టు 1: పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని లేమల్లె సర్పంచ్ మేకల చిన్నచెంచు అన్నారు. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిన వివిధ పెన్షన్ల సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగ పర్చుకోవాలని కోరారు. లేమల్లె గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కంతేటి కృష్ణకె సునీల్, పి శంకర్, బందంరావూరి శ్రీనివాసరావు, షేక్ ఖాశిం, శ్రీనివాసరావు, మేకల నాగులు తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర కోసం ధర్నా
యడ్లపాడు, ఆగస్టు 1: యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై డైట్ కళాశాల విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దాదాపు గంటసేపు ధర్నా నిర్వహించి ఆందోళన విరమించారు.
పొన్నూరులో వైఎస్‌ఆర్ సిపి ఆధ్వర్యంలో బంద్
పొన్నూరు, ఆగస్టు 1: రాష్ట్ర విభజనకు పూనుకున్న కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చర్యలను గర్హిస్తూ వైఎస్‌ఆర్ సిపి పిలుపుమేరకు గురువారం పొన్నూరు పట్టణ బంద్ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సిపి కార్యకర్తలతో పాటు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు పట్టణ కూడలిలో రాస్తారోకో జరిపారు. విభజన యోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సమైక్యవాదులు, విద్యార్థులు కూడా ర్యాలీ జరిపారు. సోనియాగాంధీ గడ్డిబొమ్మను పట్టణ కూడలిలో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి నేతలు బి రంగారావు, గురుబాలు, వెంకటస్వామి, పరశురామయ్యతో పాటు నియోజకవర్గ వైఎస్‌ఆర్ సిపి ఇన్‌చార్జి రావి అనుచర బృందం పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో దారిదోపిడీ దొంగలు
అచ్చంపేట, ఆగస్టు 1: పశువుల సంత నుండి నగదుతో వస్తున్న యువకుని వద్ద నుండి డబ్బులు బలవంతంగా కాజేయాలని చూసిన దారిదోపిడి దొంగల ముఠాను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన అంకర్ల వీరయ్య క్రోసూరులో జరుపుతున్న పశువుల సంతలో 11 వేలకు గేదెను అమ్ముకుని తిరుగు ప్రయాణమయ్యాడు. అప్పటికే విషయాన్ని గ్రహించిన దొంగల ముఠా ఆటోతో వచ్చి అచ్చంపేట వైపు వెళ్తున్నామని ఆటోలో ఎక్కించుకున్నారు. గ్రంథసిరి గ్రామ అడ్డరోడ్డు వద్దకు చేరుకోగానే మూడు ముక్కలాట పేరుతో అతని వద్ద నుంచి నగదు కాజేయాలని ప్రయత్నించారు. దీంతో ఎదురు తిరిగిన అతడిని ఆటో నుండి పడవేయాలని ప్రయత్నిస్తుండగా అటువైపుగా వస్తున్న పోలీసులు గమనించి ముఠా సభ్యులైన సత్తెనపల్లికి చెందిన కాపుశెట్టి రామారావు, వంకాయలపాటి శివప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. వీరయ్య ఫిర్యాదు మేరకు అచ్చంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* మంత్రి కన్నా ఇంటిని ముట్టడించిన ఎపి ఎన్‌జివోలు * రెండో రోజూ కొనసాగిన సమైక్య బంద్
english title: 
ngos

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>