Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఊపందుకున్న సమైక్యాంధ్ర ఉద్యమం

$
0
0

మచిలీపట్నం ఆగస్టు 1: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఊపందుకుంది. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు, ర్యాలీలు, బంద్‌లతో జిల్లా గురువారం హోరెత్తింది. ఉద్యోగ, విద్యార్థి, కార్మిక సంఘాలు, న్యాయవాదులతో కూడిన జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం తారస్థాయికి చేరింది. జిల్లా కేంద్రం మచిలీపట్నం సహా గుడివాడ, నూజివీడు, తిరువూరు, కైకలూరు, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, మైలవరం, చిల్లకల్లు, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి, పామర్రు ఇలా అన్ని మండలాల్లోనూ సమైక్యాంధ్ర ఉద్యమం వేడెక్కింది. మచిలీపట్నంలో కలెక్టరేట్ సహా మిగతా ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులు మూయించేశారు. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఎక్కడికక్కడ ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో పట్టణం అట్టుడికింది. బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసి నాలుగు రోడ్లను దిగ్బంధించారు. లక్ష్మీ టాకీస్ సెంటర్, రామానాయుడుపేట, కోనేరు సెంటరు తదితర ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలతో అభిషేకం చేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతామని హెచ్చరించారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రాన్ని యుపిఎ స్వార్థం కోసం ముక్కలు చేసిందని విరుచుకుపడ్డారు. ఆద్యంతం ప్రభుత్వ విధానంపై నిప్పులు చెరిగారు. ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. జెఎసి ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సమాలోచన చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాలతో పాటు కానె్వంట్స్ అసోసియేషన్, విద్యార్థి సంఘాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆర్యవైశ్య సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంఘం, లాయర్లు పాల్గొన్నారు. గుడివాడలో సంపూర్ణ బంద్ పాటించి మోటారు బైక్ ర్యాలీ పెద్దఎత్తున నిర్వహించారు. కొద్దిసేపు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. నూజివీడులో ఆందోళన చేస్తున్న 100 మందిని అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. రోజురోజుకూ సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రజల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది.
దివిసీమలో ఉద్ధృతమైన సమైక్యాంధ్ర ఉద్యమం
అవనిగడ్డ, ఆగస్టు 1: సమైక్యాంధ్రనే కొనసాగించాలని కోరుతూ అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలకు చెందిన విద్యార్థులు, వాణిజ్య, వ్యాపారవేత్తలు, ఎన్జీవోలు, న్యాయవాదుల సంఘం సభ్యులు, ఆర్టీసీ డిపో ఎంప్లారుూస్ యూనియన్ కార్మికులు ఆందోళన ఉద్ధృతం చేశారు. ఆయా సంఘాలకు చెందిన ప్రతినిధులు, సభ్యులు ప్రధాన వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రాన్ని విడదీస్తే కాంగ్రెస్ సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంపై అవగాహన లేని సోనియా, మన్మోహన్ తదితర నాయకులు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వారు తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ నాయకులు ధర్నా చేశారు. విద్యార్థులు రాస్తారోకో జరిపారు. న్యాయవాదులు విధులను బహిష్కరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సింహాద్రి రమేష్‌బాబు, కడవకొల్లు నరసింహారావు, యాసం చిట్టిబాబు, గాజుల మురళి, దాసి దేవదర్శనం తదితరులు ఆందోళనకారులకు మద్దతు తెలిపారు.
అదనపు జిల్లా జడ్జి రంగారావుకు ఘనంగా వీడ్కోలు
మచిలీపట్నం లీగల్ ఆగస్టు 1: ఆరవ అదనపు జిల్లా జడ్జిగా వ్యవహరించి రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టుకు ఇటీవల బదిలీ అయిన కె రంగారావుకు పట్టణ న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈసందర్భంగా న్యాయవాదుల సంఘ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంగారావు మాట్లాడుతూ న్యాయవాదుల సహకారం వల్ల తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించ గలిగానన్నారు. న్యాయ వ్యవస్థ పరంగా ఘన చరిత్ర కలిగిన మచిలీపట్నంలో అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జిల్లా జడ్జి జి చక్రధరరావు మాట్లాడుతూ రంగారావు న్యాయమూర్తిగా విధులను సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. న్యాయమూర్తి రంగారావును న్యాయవాదులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి పట్టణ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఆరెపు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.

రామకృష్ణ మృతి, సిఐ కాల్పుల ఘటనలపై సబ్ కలెక్టర్ విచారణ
జి.కొండూరు, ఆగస్టు 1: మండల పరిధిలోని కోడూరు గ్రామానికి చెందిన యువకుడు పలగాని రామకృష్ణ అనుమానాస్పద మృతి, అప్పటి మైలవరం సిఐ బంగార్రాజు కాల్పులు జరిపిన సంఘటనలపై విజయవాడ సబ్ కలెక్టర్ దాసరి హరిచందన గురువారం మెజిస్టీరియల్ విచారణ నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7.30 గంటల వరకూ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా 50 మందికిపైగా సబ్ కలెక్టర్ ఎదుట హాజరై వారి వాంగ్మూలాలను ఇచ్చారు. మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో రామకృష్ణ భౌతికకాయానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన డాక్టర్ భారతి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బి శ్రీనివాసరావుతో పాటు అప్పటి జి.కొండూరు ఎస్‌ఐ అబ్దుల్ హక్, సిఐ యు బంగార్రాజు, మృతుడు రామకృష్ణ తల్లిదండ్రులు సాంబశివరావు, వాణి, బంధువులు పేరమ్మ, తాళం వెంకట రాంబాబు, మాజీ సర్పంచ్‌లు వీరంకి వెంకట నరసింహారావు, గరికపాటి జయపాల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేశం సుధాకరరెడ్డి, ఆహార సలహా సంఘం సభ్యుడు గార్లపాటి వెంకట్రావు, కొందరు విలేఖరులు సబ్ కలెక్టర్ ఎదుట హాజరై వాంగ్మూలాలను ఇచ్చారు.

రామకృష్ణది ముమ్మాటికీ హత్యే: తల్లి వాణి
తన కుమారుడు పలగాని రామకృష్ణను పోలీసుల సహకారంతోనే, బెజవాడ రాజేశ్వరికి చెందిన వారు పొట్టనబెట్టుకున్నారని తల్లి వాణి సబ్ కలెక్టర్‌కు విచారణలో తేల్చి చెప్పింది. రాజేశ్వరితో పాటు, తన కుమారుడు కలసి ఉన్నట్లు ఫోటోలు ఉన్నాయని చెప్పింది. తమిళనాడులోని సేలం వద్ద సర్వమంగళం పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరినీ స్వాధీనం చేసుకుని, చెన్నై నుంచి వచ్చే క్రమంలో తాడేపల్లి మండలం ఇప్పటం వద్ద తన కుమారుడిని రైలు నుంచి దింపి పథకం ప్రకారం హత్య చేశారని తెలిపింది. దీనిపై తనకు న్యాయం అడుగుదామని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తమ పట్ల ఎస్‌ఐ అబ్దుల్ హక్ దురుసుగా వ్యవహరించడంతో పరిస్థితి అదుపు తప్పిందని తెలిపింది. అంతలోనే సిఐ బంగారురాజు అక్కడికి చేరుకుని హఠాత్తుగా కాల్పులు జరిపారని వివరించింది. తనకు న్యాయం చేయమని సబ్ కలెక్టర్ ఎదుట కన్నీటి పర్యంతమైంది.

సర్వమంగళం నుంచి రాజేశ్వరిని మాత్రమే తీసుకువచ్చాం: హక్
తమిళనాడులోని సేలం వద్ద సర్వమంగళం పోలీస్ స్టేషన్ నుంచి బెజవాడ రాజేశ్వరిని మాత్రమే స్థానిక కానిస్టేబుల్ సాంబశివరావు తీసుకువచ్చాడని అప్పటి ఎస్‌ఐ అబ్దుల్ హక్ సబ్ కలెక్టరుకు వెల్లడించారు. రాజేశ్వరి కుటుంబ సభ్యులు కూడా కానిస్టేబుల్‌తో పాటు సర్వమంగళం వెళ్ళారన్నారు. సర్వమంగళం పోలీసులు రాజేశ్వరి, రామకృష్ణ కలసి ఉన్న ఫోటోలను తీశారని, ఆ ఫోటోలను స్థానిక కానిస్టేబుల్ తన సెల్‌ఫోన్‌లోకి లోడ్ చేశారన్నారు. అవే ఫోటోలను చూసిన ఇక్కడి బాధితులు ఇద్దరినీ తాము స్వాధీనం చేసుకుని, ఆ ఫోటోలు తామే తీసినట్లు భ్రమిస్తున్నారన్నారు. వాస్తవానికి రాజేశ్వరిని సర్వమంగళం పోలీసులు మహిళా హోమ్‌కు తరలించారన్నారు. రాజేశ్వరిని హోమ్ నుంచి తీసుకువచ్చి తమ కానిస్టేబుల్‌కు సర్వమంగళం పోలీసులు అప్పగించారన్నారు. దీనిపై తనకు ఎప్పటికప్పుడు కానిస్టేబుల్ సమాచారం అందిస్తుండగా, తాను పర్యవేక్షిస్తూ కానిస్టేబుల్‌కు మార్గదర్శకాలు ఇచ్చానన్నారు. రామకృష్ణను తమిళనాడు పోలీసులు తమకు అప్పగించలేదని వివరించారు. ఇదిలా ఉండగా జూలై 7న సాయంత్రం కోడూరు గ్రామస్థులు సుమారు 200 మందికి పైగా ఒక్కసారిగా వచ్చి తనపై, పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారన్నారు.

ఆత్మరక్షణ కోసమే కాల్పులు : సిఐ బంగార్రాజు
జి.కొండూరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తున్నారనే సమాచారం మేరకు తాను అక్కడికి చేరుకున్నానని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపానని సబ్ కలెక్టర్‌కు కాల్పులు జరిపిన సిఐ యు బంగారురాజు తెలిపారు. పలగాని రామకృష్ణ మృతి గురించి కానీ, తమకు అన్యాయం జరిగిందని కానీ కోడూరు గ్రామ బాధితులు తన దృష్టికి తీసుకురాలేదన్నారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వెంటనే తనపై దుడ్డుకర్రలతో దాడికి దిగారని, రాళ్లు రువ్వి గాయపర్చారని, అప్పటికీ రెండుసార్లు గాలిలోకి, మరోసారి జీపుపై కాల్పులు జరిపి హెచ్చరించానని వివరించారు. తనపై దాడికి దిగిన తర్వాత కాల్పులు జరిపినట్లు బంగారురాజు సబ్ కలెక్టరుకు తెలిపారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం: సబ్ కలెక్టర్ హరిచందన
రామకృష్ణ మృతి చెందిన వ్యవహారంపై ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకమని విజయవాడ సబ్ కలెక్టర్, మెజిస్టీరియల్ అధికారిణి దాసరి హరిచందన వెల్లడించారు. జి.కొండూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆమె గురువారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడుతూ ప్రాథమిక పోస్ట్‌మార్టమ్ నివేదికలో రామకృష్ణ శరీరంపై గాయాలు లేవని తేలిందన్నారు. రామకృష్ణ ఎప్పుడు మృతిచెందాడనే విషయంపై కూడా డాక్టర్లు కచ్చితంగా తేల్చి చెప్పలేకపోయారన్నారు. జి.కొండూరు, మైలవరం పోలీసులను ఇంకా విచారించాల్సి ఉందన్నారు. పోలీసులు బందోబస్తులో ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోయారన్నారు. బహిరంగ విచారణలో ఎవ్వరైనా నిర్భయంగా వారి వాంగ్మూలాలను ఇవ్వవచ్చన్నారు. కోడూరులో విచారణ నిమిత్తం ముందుగానే టాంటాం ద్వారా గ్రామస్థులకు తెలిపామన్నారు. మరో రోజు ఇక్కడే విచారణ చేస్తామన్నారు. విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం..
* నేడు విద్యార్థుల ర్యాలీ, రాస్తారోకో
* రేపు బందరు బంద్
మచిలీపట్నం, ఆగస్టు 1: రాష్ట్ర విభజన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనుకకు తీసుకోవాలని ఏపిఎన్‌జివో తూర్పు కృష్ణా శాఖ ప్రధాన కార్యదర్శి ఉల్లి కృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్‌జివో హోంలో గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపార, కార్మిక, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కృష్ణ మాట్లాడుతూ సమైక్యాంధ్రను ప్రకటించేంత వరకు దశలవారీగా ఉద్యమం నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం విద్యార్థులతో ర్యాలీ, రాస్తారోకో, శనివారం బందరు బంద్ నిర్వహిస్తామన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జాతి ప్రయోజనాలు విస్మరించి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. చిదంబరం ప్రకటనకు ముందు ఈ పరిస్థితి లేదన్నారు. 505 రోజులు పోర్టు ఉద్యమాన్ని నిర్వహించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమం, 1973 జై ఆంధ్ర ఉద్యమాల్లో అనేక మంది ప్రాణత్యాగం చేశారన్నారు. అయినప్పటికీ రాష్ట్ర విభజనకు అనుమతించని ప్రభుత్వం నేటి కెసిఆర్ బెదిరింపుల కారణంగా, రాజకీయాల కారణంగా విభజన ప్రకటన చేశారని విమర్శించారు. ఉద్యమ నిర్వహణకు అన్ని వర్గాల సహకారం, చిత్తశుద్ధి అవసరమన్నారు. ప్రజల విలువైన ఆస్తులు, పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. మచిలీపట్నం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ బొర్రా విఠల్ మాట్లాడుతూ కింది స్థాయి నుండి ఉద్యమాలు నిర్వహించాలన్నారు. వైఎస్‌ఆర్‌సీపి నాయకుడు మాదివాడ రాము మాట్లాడుతూ ఉద్యమానికి పురిటిగడ్డ మచిలీపట్నం అన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ షేక్ సలార్ దాదా మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. చైతన్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్ మాట్లాడుతూ ఉద్యమ నిర్వాహకులకు నిశ్చితమైన అభిప్రాయాలు, కచ్చితమైన ప్రణాళిక ఉండాలన్నారు. ఏపి ప్రైవేట్ కానె్వంట్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు వి సుందరాం, జిల్లా శాఖ అధ్యక్షుడు కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా, విద్యార్థి కేంద్రీకృతంగా ఉద్యమాలు నిర్వహించాలని సూచించారు. మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు బాధ్యులేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జివో పట్టణ శాఖ నాయకుడు తస్లిం బేగ్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ బలగం విజయశేఖర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దారపు శ్రీనివాసరావు, ఆకూరి శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరెపు వెంకటేశ్వరరావు, ఐఎంఎ అధ్యక్షుడు డా. బి కేశవ కృష్ణ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి సత్యనారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం పట్టణంలోని అన్ని కళాశాలల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు.
జిల్లావాసులు సంయమనం పాటించాలి
* ఎస్పీ ప్రభాకరరావు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం ఆగస్టు 1: రాష్ట్ర విభజనపై జరుగుతున్న కసరత్తు నేపథ్యంలో జిల్లా ప్రజలు సంయమనం పాటించాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనలు తెలియజేయవచ్చన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినప్పటికీ అవనిగడ్డ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీస్ చట్టం సెక్షన్ 30 అమల్లో ఉందన్నారు. ఎవరైనా సభలు, సమావేశాలు నిర్వహించడానికి సంబంధిత డిఎస్పీ నుండి విధిగా అనుమతి పొందాలన్నారు. హింసాయుతంగా నిరసనలు తెలియజేసేవారు తక్షణ చర్యలకు బాధ్యులవుతారని, పాల్గొనేవారితో పాటు జెఎసి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎవరి మనోభావాలను గాయపర్చకుండా శాంతియుత మార్గంలో నిరసనలు తెలుపవచ్చన్నారు. అదుపుతప్పి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జాతీయ నాయకుల విగ్రహాలను కూల్చడం, తగలపెట్టడం, రూపుమార్చడం వంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారని, జాతీయ నాయకులను గౌరవించడం మన బాధ్యత అని ఎస్పీ హితవు పలికారు.

రెండో రోజూ స్కూళ్లకు సెలవే!
* నేడూ బంద్‌కు పిలుపు
పాయకాపురం, ఆగస్టు 1: రెండవ రోజు కూడా విద్యా సంస్థలు పాటించిన బంద్ విజయవంతం అయింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా నగర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పిలుపు మేరకు బుధవారం నాటి బంద్ విజయవంతం కాగా, గురువారం నాడు స్వచ్ఛందంగానే విద్యా సంస్థలు పాఠశాలల్ని, కళాశాలల్ని మూసివేశాయి. ఈక్రమంలో బుధవారం సాయంత్రమే గురువారం కూడా విద్యా సంస్థ మూసివేస్తున్నట్లుగా విద్యా సంస్థలు విద్యార్ధుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. ఒకవైపు బస్సుల రాకపోకల్ని నాయకులు నిలిపేయడం, దుకాణాల్ని, కళాశాలల్ని, పాఠశాలల్ని మూసివేయించడంతో బుధవారం నాడు విద్యా సంస్థల్ని కొనసాగించేందుకు యజమాన్యాలు సాహసించలేదు. రోడ్ల పై బస్సుల్ని నిలుపుదల చేయడంతో విద్యార్ధులు కూడా పాఠశాలలు, కళాశాలలకు చేరుకోవడం కష్టమని భావించడంతో బంద్‌కు మద్దతుగా విద్యా సంస్థలు మూసి వేస్తున్నట్లుగా విద్యార్ధుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చాయి. గురువారం కూడా పాఠశాలల్ని తెరిచేందుకు వారు సాహసించలేదు. కాగా, శుక్రవారం నాడు కూడా బంద్‌ను కొనసాగించేందుకు విద్యా సంస్థలు నడుం బిగించాయి. ఈక్రమంలో బంద్ కొనసాగింపు గురించిన సమాచారాన్ని విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు గురువారం సాయంత్రమే ఫోన్ల ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా విద్యా సంస్థల యాజమాన్యాలు అందించాయి. దీంతో మూడవ రోజు బంద్ నిర్వహిస్తున్నట్లుగా విద్యా సంస్థలు సమాచారమిచ్చారు. విద్యా సంస్థల బంద్‌కు పలు విద్యా సంస్థల అసోసియేషన్లు సైతం మద్దతు తెలియజేశాయి. బయట అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో తమ పిల్లల్ని పాఠశాలలకు, కళాశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు సైతం విముఖత ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు ఆర్టీసి బస్సులు నడవకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్ధులు సైతం కళాశాలలకు వెళ్లే ఆలోచనను విరమించుకుంటున్నారు. విద్యార్ధులకు సైతం ఇబ్బందికలిగించకుండా విద్యా సంస్థలే బంద్‌కు సహకరిస్తూ ముందస్తు జాగ్రత్తగా విద్యా సంస్థల్ని మూసివేస్తున్నాయి.

ఐదుగురు టిడిపి, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు
విజయవాడ, ఆగస్టు 1: రాష్ట్ర విభజనపై ప్రజలు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసేందుకు ఇటు తెలుగుదేశం, అటు కాంగ్రెస్ శాసన సభ్యులు పోటీపడుతున్నారు. మొదటిగా కాంగ్రెస్ సభ్యులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు హైదరాబాద్‌లో స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేసి ఆ పత్రాల్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అందజేశారు. అదే సమయంలో కృష్ణాజిల్లాకు చెందిన ఏకైక మంత్రి పార్ధసారధి ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖను అందజేశారు. నగరానికి చెందిన మూడవ శాసన సభ్యుడు యలమంచిలి రవి కూడా అదే బాటలో పయనిస్తానని, రేపోమాపో రాజీనామా లేఖను పంపుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఎత్తుకు పైఎత్తులో అందెవేసిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు క్షణాలపై జిల్లాకు చెందిన తోటి శాసన సభ్యులను రప్పించుకుని వ్యూహరచన చేశారు. గత శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున ఎనిమిది మంది గెలుపొందగా వారిలో గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని, నూజివీడు శాసన సభ్యుడు రామకోటయ్య ఆ పార్టీ నుండి వైదొలిగారు. ఇక అవనిగడ్డ శాసనసభ్యుడు బ్రాహ్మణయ్య అకాల మరణానికి గురయ్యారు. ఇక మిగిలిన ఐదుగురు కూడా రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం), శ్రీరాంతాతయ్య (జగ్గయ్యపేట), తంగిరాల ప్రభాకరరావు (నందిగామ), దాసరి బాలవర్ధనరావు (గన్నవరం), జయమంగళ వెంకటరమణ (కైకలూరు) నేరుగా స్పీకర్‌కే అది స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా పత్రాల్ని పంపుతున్నట్లు ఉమ తెలిపారు.

ఎంపి లగడపాటి ఇల్లు ముట్టడి
* పోలీసుల విస్తృత బందోబస్తు
అజిత్‌సింగ్‌నగర్, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించకుండా సమైక్యంగానే ఉంచాలని కోరుతూ నగర వ్యాప్తంగా నిరసన ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సమైక్యాంధ్రపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు నగరంలోని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇల్లు మరియు కార్యాలయం వేదికగా మారింది. రాజగోపాల్ ఇంటివద్ద జరుగుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని నగర పోలీసు అధికారులు పోలీసు బలగాల నిరంతర పర్యవేక్షణలో ఉంచారు. గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమిటీ తోపాటు బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎంపి లగడపాటి ఇంటి ముట్టడించేందుకు విఫలయత్నం చేసారు. తొలుత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఇన్‌చార్జ్ పి గౌతంరెడ్డి నాయకత్వంలో వైకాపా నేతలు, కార్యకర్తలు చేసిన ఆందోళన హోరెత్తింది. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగానే
ఉండేందుకు కృషి చేస్తానని తెలుగు ప్రజలకు హామీ ఇచ్చిన ఎంపి లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ అధిష్టానం వద్ద సమైక్యవాదాన్ని వినిపించడంలో ఘోరంగా విఫలమైనారని, రాష్ట్ర విభజన చర్యలకు పూనుకొంటున్న యుపిఎ చర్యలను అడ్డుకోకుండా నిమ్మకు నీరెత్తి ఉండటంతోనే ప్రస్తుత విపత్కర పరిస్థితులు దాపురించాయని, ఇందుకు బాధ్యత వహిస్తూ ఎంపి తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. వేర్పాటు వాదాన్ని కాంగ్రెస్ పార్టీయే పెంచి పోషించిందని, రాష్ట్ర విభజన జరగడంలో కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత వహించాలన్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు రాష్ట్రం విడిపోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే పూర్తి కారణమన్నారు. వేర్పాటు వాదాన్ని వినిపించిన కాంగ్రెస్ నాయకుల స్థాయిలో సమైక్య వాదాన్ని విమిపించలేకపోయిన సీమాంధ్ర నాయకులు వైఫల్య పాపం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలదేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, ఎంపి లగడపాటి రాజగోపాల్ కు వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు నినాదాలు చేయడంతో రాజగోపాల్ నివాస గృహం వద్ద వున్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోబోవడంతో కొద్ది సేపు ఇరు వర్గీయులకు వాగ్వాదం జరిగింది. పరిస్థితి విషమిస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆందోళన చేస్తున్న వైకానేతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసారు. ఈ దశలో పోలీసులకు, వైకాపా నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో పెనుగులాట జరిగింది. పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించి మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ కార్పొరేటర్ యాదల శ్రీనివాసరావు, కె రత్నకుమార్, వి చైతన్య, ముప్పూరి రాజా, దడిగ సుబ్రమణ్యం, వీరంకి నాగు, కిషోర్, వి నాగేశ్వరరావు, వేము దుర్గారావు, ఆర్ రాజు, తదితరులతో సహా మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచికత్తుపై వదిలిపెట్టారు.

ప్రకాశం బ్యారేజీ వద్దగణనీయంగా పడిపోయన నీటిమట్టం
విజయవాడ, ఆగస్టు 1: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం గణనీయంగా పడిపోతున్నది. గురువారం రాత్రి సమయానికి ఆందోళనకర రీతిలో 9.9 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ జలాశయం నుంచి మంగళవారం రాత్రి విడుదల చేసిన ఏడువేల 640 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరడానికి కనీసం మరో రెండు రోజుల వ్యవధి పట్టనుంది. సుదీర్ఘకాలం తర్వాత నీటిని విడుదల చేస్తుండటంతో మార్గమధ్యంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నిండుకోవాల్సి వస్తున్నది. దీనివలన జాప్యం జరుగుతున్నది. ప్రస్తుతం డెల్టా కాలువలన్నింటికి కలిపి 1949 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది.

పది వేలతో ఎసిబికి చిక్కిన విద్యాశాఖ ఉద్యోగులు
విజయవాడ క్రైం, ఆగస్టు 1: అవినీతి నిరోధక శాఖ విసిరిన వలలో జిల్లా విద్యాశాఖలో పని చేస్తున్న ఓ అధికారితోపాటు మరో ఉద్యోగి చిక్కారు. కృష్ణలంకలోని ఓ ప్రైవేటు స్కూలు నిర్వాహకుల నుంచి లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయారు. ఎసిబి డిఎస్‌పి ఎం నరసింహారావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కృష్ణలంక ద్వారకానగర్‌లోని స్టార్ పబ్లిక్ స్కూల్‌ని యాజమాన్యం ఏడాదిన్నరగా నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు షేక్ నాగుర్ బి, ఆమె భర్త మెహబూబ్‌లు కరస్పాండెంట్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా గత నెల జూలై 19న విధి నిర్వహణలో భాగంగా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ డి శ్రీనివాసరావు, ఆఫీస్ అసిస్టెంట్ హరిరామ్ నాయక్ తదితర సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సదరు అధికారులు కరస్పాండెంట్‌ను ప్రశ్నిస్తూ పాఠశాల హక్కులు రామచంద్రరావు అనే పేరుతో ఉండి కదా అనే అడగడమే కాకుండా కరస్పాండెంట్ నాగుర్ బి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో పాఠశాల పై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు గాను రూ. 25వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో కరస్పాండెంట్ రూ. 10వేలు ముట్టచెప్పగలనని బేరం కుదుర్చుకున్న మీదట సదరు అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి అధికారులు వ్యూహం ప్రకారం అరండల్ పేటలోని కార్యాలయంలో గురువారం సాయంత్రం ఫిర్యాది నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ శ్రీనివాసరావుతో పాటు కార్యాలయ గుమస్తా హరిరామ్ నాయక్‌ను ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఎసిబి డిఎస్‌పి నరసింహారావుతోపాటు సిఐలు రవి, నాగరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించటంతో జైలుకు తరలించారు.

వెలంపల్లి రాజీనామాకు మద్దతుగా మానవహారం
ఇంద్రకీలాద్రి, ఆగస్టు 1: విజయవాడ పశ్చిమ నియోజకర్గ శాసన సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు సమైక్యాంధ్ర మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఆయనకు మద్దతుగా కృష్ణా జిల్లా ఎన్‌ఎస్‌యుఐ జిల్లా మాజీ అధ్యక్షుడు పిళ్లా శ్రీనివాసరావు నాయకత్వంలో గురువారం రాత్రి చిట్టినగర్ సెంటర్‌లో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిళ్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా వెలంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేసిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సమైక్యాంగా వుండాలని మరింత పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

* జెఎసి ఆధ్వర్యంలో ర్యాలీలు, రాస్తారోకోలు * బందరులో మూతబడిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు * నూజివీడులో 100 మంది అరెస్టు * గుడివాడలో బంద్ సంపూర్ణం
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>