కమలాపురం, ఆగస్టు 2 : హైదరాబాద్ తెరాసా అధ్యక్షుడు కెసిఆర్ జాగీరా అని ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ఫోన్ ద్వారా రాజధాని నుంచి విలేకర్లతో మాట్లాడుతూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమైనవని మండిపడ్డారు. ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని మరింతగా ఆయన వ్యాఖ్యలతో రెచ్చగోడుతున్నట్లు ఉందన్నారు. ఆయన సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ విడిచి వెళ్లాలని చెప్పడం పట్ల ఈ ప్రాంత ఉద్యోగులకు ఆగ్రహం వచ్చేలా ఉందన్నారు. తెలంగాణా,హైదరాబాద్ అభివృద్ధికి ఈ ప్రాంత ఉద్యొగులు ఎంతగానో కృషిచేసిన విషయం ఆయన గుర్తుంచుకోవాలన్నారు. ఏమైనప్పటి కెసిఆర్ నిజస్వభావం బయట పడిందన్నారు. కేంద్ర అధిష్ఠానం తెలంగాణా ప్రక్రియపై పునఃపరిశీలన చేయకపోతే సీమాంధ్రలో ప్రజాప్రతినిధుల రాజీనామాతో పాటు ఉద్యమం మరింతగా మరింత ఉధృతమవుతుందన్నారు. దీని పరిణామాలు తీ్రంవగా ఉంటాయన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలనాటికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేయాలి
* ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా
కడప, ఆగస్టు 2 : ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా గత మూడు రోజులుగా జిల్లాలో శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జిల్లా వాసులు సాగించిన సమైక్య ఉద్యమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు లేకుండా జరగడం అభినందనీయమని ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో మీడియా పాత్ర కూడా అభినందనీయమన్నారు. ఇకపోతే జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చెదురుమొదరు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేసిన ప్రజలు, అధికారులు, పోలీసులు చేసిన కృషి అమోఘమన్నారు. నగర సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న ఇందిరమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో పదిమంది ఉద్యమకారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు ఉందని అయితే నిబంధనలకు అతిక్రమించినప్పుడు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యమాల సమయంలో రాజకీయ నాయకులు, ప్రజలు సమన్వయంతో వ్యవహరించి శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి, రూరల్ సిఐ నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్ధృతమైన సమైక్య ఉద్యమం
రాజంపేట, ఆగస్టు 2 : సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న బంద్ శుక్రవారం మూడోరోజు కూడా రాజంపేటలో విజయవంతమైంది. స్వచ్ఛంధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా రంగంలోకి దిగి బంద్ నిర్వహించడం జరిగింది. పట్టణంలో నాలుగైదు బ్యాచ్‌లుగా విద్యార్థులు విడిపోయి కలియతిరుగుతూ జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. దీంతో పట్టణంలో సంపూర్ణంగా బంద్ విజయవంతమైంది. సినిమాహాల్స్, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, సినిమా థియేటర్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఆర్టీసి బస్సులు డిపో వదలి బయటకు రాలేదు. సమైక్యాంధ్ర కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని ముఖ్యంగా విద్యార్థులు తెగేసి చెపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలను కాదని విద్యార్థులు స్వచ్ఛంధంగా వచ్చి ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం విశేషం. ఒక ప్రక్క పట్టణంలో జెఎసి ఆధ్వర్యంలో బంద్ జరుగుతుండగా, వివిధ గ్రామాలతో పాటు పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రదర్శన నిర్వహిస్తూ బంద్ పాటించమని వ్యాపారస్తులను కోరుతూ వెళ్ళడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే పట్టణ జెఎసితో పనిలేకుండా విద్యార్థులే బంద్ నిర్వహించడం వల్లే సంపూర్ణంగా విజయవంతమైంది. జెఎసి ఒకటే బంద్ పాటించి ఉన్నా ఇంత స్థాయిలో బంద్ విజయవంతమై ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. దుకాణాల షెట్టర్స్ మాత్రమే వేసి బీగాలు వేయని దుకాణాలను కూడా గుర్తిస్తూ విద్యార్థులు కట్టెలు పట్టుకొని నినాదాలతో హోరెత్తించడంతో అక్కడక్కడ తెరిచి ఉన్న వ్యాపార సంస్థలను కూడా మూసివేశారు. విద్యార్థులు రంగంలోకి నాలుగైదు బ్యాచ్‌లుగా రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమైంది. పోలీసులు కూడా ఆందోళనకారుల వద్ద లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపించాయి. మొత్తానికి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బంద్ విజయవంతమైందని చెప్పవచ్చు.
రైల్వేకోడూరులో...
రైల్వేకోడూరు : కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైల్వేకోడూరు పట్టణంలో మూడో రోజు కూడా బంద్ విజయవంతంగా సాగింది. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దగ్ధంతో శుక్రవారం పట్టణం అట్టుడుకి పోయింది. వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా పూర్తిగా స్థంభించి పోయింది. సమైక్యాంధ్ర జెఏసీ ఛేర్మన్ చెన్నంశెట్టి రమేష్, డిసిసి అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డిసిసిబి మాజీ ఛేర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సిఐ రమాకాంత్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బంద్ నిర్వహించారు. లారీ ఓనర్లు, ఆటోడ్రైవర్లు, వస్త్ర, షరాబు వ్యాపారులు, విద్యార్థి సంఘాలు, సమైక్యాంధ్ర జెఏసీ కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు ఇలా పార్టీలకు అతీతంగా వేలాది మంది పట్టణంలోని ప్రధాన రహదారిపై ఒక్కసారిగా రావడంతో రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, యుపీఏ ఛేరపర్సన్ సోనియాగాంధీ, ద్విగిజయ్‌సింగ్, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను ఈ సందర్భంగా దగ్ధం చేశారు. ఎమ్మెల్యే కొరముట్ల, డిసిసి అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర, జేఏసీ ఛేర్మన్ రమేష్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడం సరియైంది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలన్న పొట్టిశ్రీరాముల కల కేంద్రం నిర్ణయంతో ఛిన్నాభిన్నమైందని అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టకుండా సమైక్యంగానే ఉంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమాల్లో పాల్గొనాలని, లేనిపక్షంలో వారి ఇళ్లను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్లమెంటులో పార్టీలకు అతీతంగా ఎంపీలంతా కలసి అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆనాదిగా రాయలసీమ ప్రాంతం యేళ్ల తరబడి నష్టపోతుందని, ఇపుడు విడిపోతే సీమలో మరింత ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతాయన్నారు. సమైక్యంగానే రాష్ట్రాన్ని ఉంచుతామని కేంద్రం ప్రకటన చేసేంతవరకు ఉద్యమం ఆగదన్నారు. పలువురు ఉద్యమకారులను ఈ సందర్భంగా పోలీసులు అరెస్టు చేసి, పూచీకత్తుపై వదిలేశారు. పట్టణంలో ప్రధాన రహదారిపై ఈ కార్యక్రమాలు జరగడంతో రాకపోకలు స్థంభించి, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వేస్టేషన్‌లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జెఏసీ నాయకులు మందల నాగేంద్ర, నందా బాలసుబ్రమణ్యం, పంజం సుకుమార్‌రెడ్డి, ఎన్జీఓ సంఘ అధ్యక్షులు పొలిచెర్ల ఓబులేశు, వ్యాపార సంఘాల నాయకులు మేడా వెంకటసుబ్బయ్య, బివి కృష్ణ, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు నారాయణరెడ్డి, మణి, అన్వర్‌బాషా, సుబ్రమణ్యం తదితరులు పాల్గొని, ప్రసంగించారు.
ఎర్రగుంట్లలో...
ఎర్రగుంట్ల : రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు పోరాడుదామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రమైన ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. అక్కడే వంటావార్పు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సకలజనుల సమ్మె తరహాలో మనందరం కలసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా కార్మిక, కర్షక, మహిళలు, విద్యార్థులు ఉద్యమించాలని కోరారు. అప్పుడే సమైక్య రాష్ట్రాన్ని సాధించుకోవచ్చన్నారు. అయితే ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించాలన్నారు. సమైక్యాంధ్ర కోసం ముందుగానే రాజీనామా చేసి మార్గదర్శకుని అయ్యాయని, తాను రాజీనామా చేసినంత మాత్రాన గొప్పవాడిని కాదని మీరందరూ కలసి వస్తే సమైక్య రాష్ట్రం సాధించవచ్చన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే ముందు మనమందరం సమైక్యంగా ఉండాలన్నారు. అందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఇక జాతీయ నాయకుల విగ్రహాల జోలికి వెళ్లవద్దని సూచించారు. ప్రజాస్వామ్య రీతిలో శాంతియుతంగా మన డిమాండ్‌ను సాధించుకోవాలని, అందుకు పోలీసులతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అంతకు ముందు నాలుగు రోడ్ల కూడలిలో వందలాది మంది సమైక్యాంధ్రవాదులు నడిరోడ్డుపై వంటావార్పు చేపట్టి రాస్తారోకో కారణంగా నిలిచిన వాహనదారులకు అన్నదానం చేశారు. అలాగే ఆర్టీపీపీలో ఉద్యోగ,కార్మిక సంఘాల నాయకులు ఒక రోజు నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాలకు చెందిన యూనియన్ నాయకులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
టిడిపి మద్దతుదారుడిదే టంగుటూరు
* ఆర్డీఓ సమక్షంలో రీ కౌంటింగ్
రాజుపాళెం, ఆగస్టు 2: టంగుటూరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం మండల కేంద్రమైన రాజుపాళెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రీ కౌంటింగ్ నిర్వహించారు. ఈ ఓట్ల లెక్కింపు ఆర్డీ ఓ రఘునాథరెడ్డి సమక్షంలో లెక్కించారు. ఈ లెక్కింపులో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు బండి హరోన్ 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి బాలబ్బి ఎన్నికల దృవీకరణ పత్రాన్ని అందజేశారు. గత బుదవారం ఈ గ్రామ పంచాయతీ జరిగిన ఓట్ల లెక్కింపులో వై ఎస్ ఆర్‌సిపి మద్దతుదారుడు తిమ్మా చిన్నబాబు సర్పంచ్ అభ్యర్థిగా 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అదేరోజు రాత్రి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దరోడ్డుపై బైఠాయించి పోలింగ్ అధికారులను కదలనివ్వకుండా రీ పోలింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. పోలైన ఓటుబాక్స్‌లను రాజుపాళెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎంపిడి ఓ, తహశీల్దార్, ఆర్డీ ఓతో చర్చించిన తరువాత శుక్రవారం ఈ పంచాయతీకి సంబంధించి రీ కౌంటింగ్ నిర్వహించారు. సర్పంచ్ ఓట్లనే లెక్కించారు. ఈపంచాయతీకి 2602 ఓట్లు పోలు కాగా 2412 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 195 ఓట్లు చెల్లలేదు. పోస్టల్ బ్యాలెట్‌కు ఐదు ఓట్లు రాగా అందులో రెండు ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఈ రీ కౌంటింగ్‌లో వై ఎస్ ఆర్‌సిపి మద్దతుదారుడు తిమ్మా చిన్నబాబుకు 16 ఓట్లు చెల్లుబాటు కావడంతో ఆయనకు 1118 ఓట్లు లభించాయి. టిడిపి మద్దతుదారుడు బండి హరోన్‌కు 1127 ఓట్లు లభించాయి. తిమ్మా లుకయ్యకు 167 ఓట్లు వచ్చాయి. ఉత్కంఠ భరితంగా మారిన రీ కౌటింగ్‌లో టిడిపి మద్దతుదారులు సర్పంచ్‌గా ఎన్నికవడంతో వై ఎస్ ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు రీ కౌంటింగ్ వద్ద రోడ్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సి ఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ ఐ సుబ్బారావు, ఆద్వర్యంలో పోలీసులు బందోబస్తును నిర్వహించారు. టంగుటూరు గ్రామంలో పోలీసు ఫికటింగ్ ఏర్పాటు చేశారు.
కెసి కాలువలకు నీరు విడుదల
* వరి సాగుకు రైతుల సన్నాహాలు
చెన్నూరు, ఆగస్టు 2 : శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటం వల్ల పొత్తిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి కడప, కర్నూలు కాలువలకు నీరు విడుదల చేయడంతో చెన్నూరు, బుడ్డాయపల్లె, రామనపల్లె, ముళ్లపల్లె, రాచినాయినపల్లె, కెసి ఉప కాలువలు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు వరినారు కయ్యల కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 50 క్యూసెక్కుల నుంచి 75 క్యూసెక్కుల వరకు ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట నుంచి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీరు చెన్నూరు వద్ద పెన్నానదిలో శుక్రవారం ఉదయం 800 క్యూసెక్కుల నీరు దిగువన ఉన్న సోమశీల ప్రాజెక్టులోకి వెళ్తోంది. పెన్నానదిలో నీరు ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగిపోవడంతోపాటు సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు తీరిపోయాయి. గత సంవత్సరం కేసీ కెనాల్ ఆయకట్ట కింద వరి సాగుచేయకపోవడంతో ఈ సారైనా తమ కష్టాలు తీరుతాయన్న ఆశతో రైతులు వరిసాగుపై దృష్టి పెట్టారు.
కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం
గాలివీడు, ఆగస్టు 2 : గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచ్‌లు అంకితాభావంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం వెలిగల్లు సర్పంచ్ చంద్రారెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆయన అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ప్రథమ పౌరులైన సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం తూముకుంట గ్రామ పంచాయతీ సర్పంచుగా అనితమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయుల నాయక్, మాజీ సర్పంచ్ వీరభద్రప్పనాయుడు, మాజీ ఎంపిటిసి పాపాసాబ్, స్థానిక నాయకులు కదిరినాయుడు, గూడూసాబ్, రాంమోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
లక్కిరెడ్డిపల్లెలో...
లక్కిరెడ్డిపల్లె : కొత్తగా ఎన్నికైన ఆయా పంచాయతీల సర్పంచులు శుక్రవారం ఆయా పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కాలాడి ప్రభాకర్‌రెడ్డి, మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సంబేపల్లెలో...
సంబేపల్లె : మండల పరిధిలోని గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయా గ్రామాల సర్పంచ్‌లు తెలిపారు. శుక్రవారం మండల వ్యాప్తంగా ఉన్న 14 గ్రామ పంచాయతీల్లో ఇఓపిఆర్‌డి తారకేశ్వర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు హాజరయ్యారు.
సుండుపల్లెలో...
సుండుపల్లె : గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని సుండుపల్లె మండల పంచాయతీల సర్పంచ్‌లు పేర్కొన్నారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచ్‌లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీ కార్యదర్శులు సురేష్, ఆంజనేయులు, రాజా, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
వీరబల్లెలో...
వీరబల్లె : మండల పరిధిలోని ఆయా పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
వేంపల్లెలో...
వేంపల్లె : ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని వేంపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ సింగారెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని 20 వార్డు మెంబర్ల సభ్యులతో కలిసి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఇఓ షాకీర్‌అలీఖాన్, తేదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.