సూళ్లూరుపేట, ఆగస్టు 2: మండల పరిధిలోని గోపాలరెడ్డిపాళెంలో జూలై 31న జరిగిన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎన్నికల అధికారుల ఏకపక్షంగా వ్యవహరించారని తమకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీమండల అధ్యక్షుడు చిలకా యుగంధర్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పంచాయతీ సర్పంచ్ బరిలో మొత్తం ముగ్గరు అభ్యర్థులు ఉండగా మొత్తం 978 ఓట్లు పోలింగ్ అయ్యినట్లు తెలిపారు. పోలయిన ఓట్లల్లో ఇద్దరికి 320 ఓట్లు సమానంగా రాగా ఒక అభ్యర్థికి 312 ఓట్లు వచ్చాయన్నారు. ఇరువురికి సమానంగా ఓట్లు రావడంతో చెల్లని ఓట్లు కలిపి వైకాపా అభ్యర్థి బూదూరు పోతయ్యను విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీకౌంటింగ్‌కు ఆదేశించిన అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి కౌంటింగ్ ఏజెంట్లు సంతకాలు పూర్తికాకుండానే విజయంగా ప్రకటించారని ఆరోపించారు. అందరి సమక్షంలో బ్యాలెట్లు ఓట్లు పత్రాలను లెక్కించాలని డిమాండ్ చేశారు. అధికారులు అలా చేయకపోతే కోర్టుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అలవల సురేష్,నాయకులు జెట్టి వేణుయాదవ్, భైరి పార్థసారధిరెడ్డి,గంపల హరికృష్ణ తదితరులు ఉన్నారు.
దొంగను పట్టుకోబోయిన ఎస్‌ఐకి గాయాలు
వెంకటాచలం, ఆగస్టు 2: దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఎస్‌ఐ చేయి విరిగిన సంఘటన వెంకటాచలంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో దొంగలు సంచరిస్తున్న సమాచారం అందటంతో వెంకటాచలం ఎస్‌ఐ వై సోమయ్య సిబ్బందితో ఆప్రాంతానికి వెళ్ళారు. పోలీసుల రాకను గమనించిన దొంగలు రైల్వే క్వార్టర్స్ ప్రహరీగోడను దూకి పారిపోవటాన్ని గమనించి ఎస్‌ఐ గోడ దూకే ప్రయత్నం చేయగా, గోడ కూలిపోయింది. దీంతో ఎస్‌ఐ ఎడమచేయి మణికట్టు భాగం విరిగిపోయింది. ఆయన ప్రస్తుతం నెల్లూరులోని బొల్లినేనిలో చికిత్స పొందుతున్నారు.