నెల్లూరు, ఆగస్టు 2: రాష్ట్ర విభజనను నిరసిస్తూ శుక్రవారం నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను ఫ్యాక్స్ ద్వారా అసెంబ్లీ స్పీకర్‌కు పంపించారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు . కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందన్నారు. సిడబ్ల్యుసిలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని పునసమీక్షించుకోకుంటే టిడిపి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విభజన నిర్ణయాన్ని ఉపహరించుకుని రాష్ట్రం సమైక్యంగా ఉండే విధంగా చూడాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం అందరూ ఉద్యమం బాట పట్టాలని పిలుపునిచ్చారు. విలేఖర్ల సమావేశంలో గూడూరు, సూళ్లూరుపేట, కావలి, వెంకటగిరి ఎమ్మెల్యేలు బల్లి దుర్గాప్రసాద్, పరసా వెంకటరత్నం, బీద మస్తాన్‌రావు, కురుగొండ్ల రామకృష్ణలు పాల్గొని వారి రాజీనామాల లేఖలను స్పీకర్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించారు.
అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి
బిట్రగుంట, ఆగస్టు 2: పంచాయతీ ఎన్నికలలోప్రజలు ఇచ్చిన విజయాన్ని పంచాయతీ అభివృద్ధి కోసం వినియోగించి, పార్టీకి మంచి పేరు తేవాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అన్నారు. శుక్రవారం విశ్వనాథరావుపేట పంచాయతీ సర్పంచి సాతుపాటి శ్రీదేవి పదవీ బాధ్యత స్వీకార కార్యక్రమానికి విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలోప్రజల సమస్యలు గుర్తించి పని చేయాలని సూచించారు. మండలంలో టిడిపికి ప్రజలు మద్దుతు ఇచ్చారని వారి నమ్మకాన్ని వమ్ముచేయకూడదన్నారు. అప్పుడే పదవిని అలంకరించిన సర్పంచులకు, వార్డు సభ్యులు పేరొస్తుందన్నారు. బోగోలు మండలంలోని పలు పంచాయతీలో సర్పంచులు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి పాసం రవీంద్రబాబు, మండల కన్వీనర్ పిన్నిబోయిన సుధాకర్, బోగోలు సర్పంచి దొడ్ల రమణమ్మ, ఉప సర్పంచి దొడ్ల అంజయ్య యాదవ్ మాజీ మండల అధ్యక్షులు పాయసం శ్రీనివాసులు, యువత అధ్యక్షుడు సాతుపాటి ఉదయ్‌కుమార్, మండల కార్యదర్శి సమీల్లా పాల్గొన్నారు.