మనుబోలు, ఆగస్టు2:మండల పరిధిలోని జట్లకొండూరు సత్రం జాతీయరహదారి పక్కన ఉన్న ఇందిరమ్మ విగ్రహానికి శుక్రవారం నుండి పోలీసు రక్షణ కల్పించారు. రాష్ట్రంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీవ్ గాంధీ, ఇందిరమ్మ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో విద్యార్థులు, సమైక్యాంధ్ర మద్దతుదారులు విగ్రహానికి హాని చేపట్టకుండా ముందు జాగ్రత్తగా విగ్రహానికి రక్షణ ఏర్పాట్లు చేసినట్లు స్థానిక ఎస్.ఐ మారుతీకృష్ణ చెప్పారు.
వార్డుల వారి పోలింగ్ స్టేషన్ జాబితా విడుదల
నెల్లూరుసిటీ, ఆగస్టు 2: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ వార్డుల వారి పోలింగ్ స్టేషన్‌ల జాబితాను సంబంధిత వార్డు రిటర్నింగ్ ఆఫీసర్‌లచే సంబంధిత వార్డు ఆఫీసులలో శుక్రవారం అందుబాటులో ఉంచుతున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ డి జాన్ శ్యాంసన్ తెలిపారు. నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లను తనిఖీ చేశారు. వార్డుల వారి పోలింగ్ స్టేషన్‌ల జాబితా రిటర్నింగ్ అధికారులు వార్డు కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం, రెవిన్యూ డివిజన్ అధికారి కార్యాలయం, తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, జిల్లా కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు, జిల్లా గ్రంథాలయం, తపాల కార్యాలయం, బ్యాంకులలో కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాబితాలో అభ్యంతరాలు ఉన్న వారు శనివారం నుండి సోమవారం లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌కు రాత పూర్వకంగా తెలిపాలని కోరారు.
వైభవంగా కృష్ణ్ధర్మరాజుల బ్రహ్మోత్సవాలు
నెల్లూరు కల్చరల్, ఆగస్టు 2: స్థానిక మూలపేటలోని శ్రీకృష్ణ్ధర్మరాజస్వామి దేవస్థానంలో శ్రీకృష్ణ ధర్మరాజ, ద్రౌపదీ అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అత్తిపాటి బ్రహ్మయ్య ఉభయకర్తలుగా చప్పర ఉత్సవం చేశారు. మూలవర్లకు విశేష అభిషేకాలు, పూజలు, అలంకారాలు జరిగాయి. ఉదయం ప్రముఖ కవి, పండితులు ఆలూరి శిరోమణిశర్మ భాగవత పఠనం చేశారు. సాయంత్రం ఎన్ వసంతకుమారిచే మహాభారత పురాణ కాలక్షేపం జరిగింది. రాత్రి ద్రౌపదీమాన సంరక్షణ అలంకారం నిర్వహించారు. పంచాగ్నుల గౌరీశంకరప్రసాద్, వరలక్ష్మి ఉభయకర్తగా వ్యవహరించారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మిమిక్రీ కళాకారుడు పరమేశ్వర్ ప్రదర్శించిన మాట్లాడే బొమ్మ, ధ్వన్యనుకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను దేవస్థానం కార్యనిర్వాహణాధికారి మల్లికార్జునరెడ్డి, వేణుగోపాల్, ఇన్స్‌పెక్టర్ శైలేంద్ర, మాజీ పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు. వందలాదిగా భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉత్సవాల్లో అతి ముఖ్యమైన తపస్సుమాను ఉత్సవం జరుగుతుంది.
భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు
కోవూరు, ఆగస్టు 2: భూ సమస్యల పరిష్కారానికే గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు కోవూరు తహశీల్దార్ సాంబశివరావు అన్నారు. శుక్రవారం మండలంలోని లేగుంటపాడు, చెర్లోపల్లి గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాలలో పేరుకుపోయిన భూ సమస్యలను ఈసదస్సుల ద్వారా పరిష్కరించినట్టు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
జివికెకు పిండప్రదానం
* 108 సిబ్బంది నిరసన
నెల్లూరు, ఆగస్టు 2: జివికె యాజమాన్యానికి 108 సిబ్బంది పిండ ప్రదానం చేసి తమ నిరసన వ్యక్తపరిచారు. శుక్రవారం ఉదయం నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద 108 సిబ్బంది తమ నిరసన కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. తమ సమస్యలు న్యాయబద్ధమేనని ఓ వైపున అంగీకరిస్తూ కూడా పరిష్కరించేందుకు విముఖత చూపడం తగదంటూ జివికె యాజమాన్యాన్ని ఉద్దేశించి దుయ్యబట్టారు. నిరసనలో ఉన్న తమను ఉద్యోగాల నుంచి తొలగించే కుట్ర దారుణమని వాపోయారు.