నెల్లూరు, ఆగస్టు 2: రాష్ట్ర విభజనను నిరసిస్తూ మూడవరోజు కూడా నెల్లూరులో నిరసనలతోపాటు యుపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ శవయాత్ర నిర్వహించారు. రాజీనామాలను వెంటనే ఆమోదించేందుకు స్పీకర్‌పై ఒత్తిడి తేవాలని విద్యార్థి జేఏసి నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నామంటూ కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం విద్యార్థి జేఏసి ఆధ్వర్యంలో స్థానిక విఆర్‌సి కూడలి వద్ద సోనియా శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమలనాయుడు, జెఏసి జిల్లా కన్వీనర్ జయవర్దన్, ఆదిత్యసాయిలు మాట్లాడుతూ సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంతంలోని మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పటికీ ఆ రాజీనామాలు ఒక రాజకీయ ఎత్తుగడే అని, నిజంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా రాజీనామాలను ఆమోదించే విధంగా శాసనసభ స్పీకర్‌పై ఒత్తిడి తీసుకోరావాలని డిమాండ్ చేశారు. కాగా విఆర్‌సి కూడలి వద్ద నిర్వహిస్తున్న సోనియా శవయాత్రను ఒకటవ నగర సిఐ మద్ది శ్రీనివాసరావు అతని సిబ్బందితో వచ్చి అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి జేఏసి నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సోనియా దిష్టిబొమ్మను పోలీసులు తీసుకెళ్లడంతో ఆగ్రహించిన విద్యార్థులు, నాయకులు అక్కడే రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థుల ఉద్యమాలను పోలీసుల చేత అణచివేయాలని చూస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హర్షచౌదరి, శ్రావణ్, అఖిల్, సాయిశివ, మోమిత్‌షా, ప్రమోద్, వంశీ, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా విభజనను నిరసిస్తూ హరనాధపురం సెంటర్‌లో విద్యార్థులు భారీగా చేరుకొని టైర్లను దగ్ధం చేశారు. దీంతో ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొంతమంది విద్యార్థులను నాల్గో నగర సిఐ రామారావు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గొలగమూడి క్రాస్‌రోడ్డు జాతీయ రహదారిని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు దిగ్భందం చేశారు. కిలో మీటర్ మేర రెండువైపులా వాహనాలను ఆగిపోయాయి. గంట సేపు ఆ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. సమాచారం అందుకున్న ఐదవ నగర సిఐ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చచెప్పి అక్కడ నుండి పంపివేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా వాహనాలను యధావిధిగా పంపించారు. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.
టిడిపి కార్యాలయాన్ని ముట్టడించిన సమైక్యాంధ్ర నేతలు
విభజనకు నిరసనగా అందరూ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే టిడిపి నేతల్లో స్పందన లేదని, దీంతో శుక్రవారం సమైక్యాంధ్ర నేతలు జిల్లా టిడిపి కార్యాలయాన్ని ముట్టడించారు. నిరసనలు తెలియజేస్తుండగా కేంద్ర బలగాలలు అక్కడకి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాల
నెల్లూరు, ఆగస్టు 2: పంచాయతీ పాలకవర్గాలు ఎట్టకేలకు కొలువుదీరాయి. సరిగ్గారెండేళ్ల క్రితమే పాత పంచాయతీ పాలకవర్గాలకు పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఆర్నెల్లపాటు ప్రత్యేక అధికార్ల పరిపాలనను పొడిగిస్తూ వచ్చి రెండేళ్ల తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శుభ ఘడియలు చూసుకుని జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగించుకున్న అన్ని పంచాయతీలకు పాలకవర్గాల పదవీ బాధ్యతల స్వీకరణ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు దగ్గరుండి సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించే తంతు చేపట్టారు. దాదాపుఅన్ని పంచాయతీల్లోనూ ఖాళీ ఖజనాలతోనే కొత్తపాలవర్గాల బాధ్యతల స్వీకరణ మహోత్సవాలు జరిగాయి. అయితే గ్రామాల్లో కనీస వౌలిక సదుపాయాలు ఒనగూరాలంటే తగినంత ఆర్థిక వనరుల సమీకరణ అనేది సవాల్‌గా పరిణమించే అంశం. ప్రధానంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు లోపించాయి. వర్షాల సీజన్ వచ్చినందున ఈ దుస్థితి మరింత వర్ణనాతీతం. ఇంతేగాక రాత్రి వేళల్లో వీధిలైట్లు కూడా వెలగక గ్రామాలన్నీ అంధకారంలోనే మగ్గుతున్నాయి. ఆర్థిక వనరుల సమీకరణలో గ్రామాల్లో ఇంటి, కుళాయి పన్నుల వసూలు ప్రక్రియ అనేది చాలా కష్టతరమైన వ్యవహారం. పన్నుల వసూలు సంగతి అటుంచితే ఇక గ్రామ పంచాయతీలకు ఎస్‌ఎఫ్‌సి, 13వ ఆర్థిక సంఘ నిధులే దిక్కు. గ్రామాల్లో ఉండే జనాభా సంఖ్య ఆధారంగా మాత్రమే ఈ నిధులు సమకూరుతాయి. గ్రామాల్లో ఉండే భూముల రిజిస్ట్రేషన్ సందర్భంలో స్టాంప్ డ్యూటీ మొత్తాలు కూడా పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు. ఈ మొత్తాలను రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పంచాయతీలకు బదలాయింపుజరిగేలా కసరత్తు కీలకం.
‘గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి’
కోవూరు, ఆగస్టు 2: నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఆయా గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ఇఓపిఆర్‌డి బాలాజీ కోరారు. శుక్రవారం పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎంపికైన సర్పంచ్ కె ఉమ, ఉపసర్పంచ్ ఐ మల్లారెడ్డి, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు కొనసాగాయని, ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌లు ఎన్నిక కావటంతో గ్రామాల అభివృద్ధి బాధ్యత సర్పంచ్‌లపై పడిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవసరమైన పారిశుద్ధ్యం, నీటి వసతి తదితర సౌకర్యాల కోసం పాటుపడాలన్నారు. మండలంలోని ఆరు పంచాయతీలకు ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఆయా పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో కోవూరు పంచాయతీ కార్యదర్శి వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు.