ఒంగోలు, ఆగస్టు 2: జిల్లాలో సమైకాంధ్ర ఉద్యమసెగలు నేతలకు తాకాయి. దీంతో వారు తమ పదవులకు రాజీనామా సమర్పించి సమైకాంధ్రకు మద్దతు పలికారు. జిల్లాలోని నేతల రాజీనామాలు ఒకపక్క మరోకపక్క ఉద్యమాల సెగతో సమైకాంధ్ర ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతొంది.రాజీనామాలు సమర్పించినవారిలో రాష్టప్రురపాలకశాఖమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంటుసభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, చీరాల,కనిగిరి, పర్చూరు శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఉన్నారు. చీరాల శాసనసభ్యుడు ఆమంచి శాసనసభసభ్యత్వానితోపాటు జిల్లాకాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రజలమనోభావాలకు అనుగుణంగానే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంత్రి మహీధర్‌రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ తన ఎంపి పదవీకి రాజీనామా చేస్తున్నట్లు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి శుక్రవారం ఫ్యాక్స్‌ద్వారా లేఖ పంపించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో రాష్ట్రప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు, ఒబిసిల అభివృద్దికి రాష్ట్రప్రభుత్వం ఎంతో కృషిచేసిందని ఆయన తెలిపారు. రాష్ట్రం విడిపోతే తాను సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ నుండి పోటీచేస్తానని చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించారు. అలాగే నెల్లూరు, కడప, ప్రకాశంజిల్లా పరిధిలో రైతుల ఆశాజ్యోతి అయిన వెలుగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపుపై విభజన సమయంలో చర్చించనందుకు నిరసనగా మార్కాపురం టిడిపి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈపాటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా సమర్పించారు. ఒంగోలులోని మంగమూరురోడ్డు జాతీయరహదారి జంక్షన్ వద్ద బాలినేని రాస్తారాకోనిర్వహించారు. ఈసందర్భంగా వాహనరాకపోకలు రెండుగంటలకుపైగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాస్తారాకో సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో బాలినేనితోపాటు మరికొంతమందిని పోలీసులు బలవంతంగా అరెస్టుచేసి ఒంగోలు తాలుకా పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా బాలినేని మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం కేవలం రాజకీయలబ్ధి కోసమే రాష్ట్రాన్ని విభజించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఓట్లతో సీట్లు సంపాదించవచ్చునని సోనియాగాంధీ భావిస్తున్నారని ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోలేదని ఆయన ఆరోపించారు. అందరికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాన్ని యుపిఏ ప్రభుత్వం తీసుకోలేదని ఆయన విమర్శించారు.అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి అందరి అభిప్రాయాలను తీసుకుని నిర్ణయిస్తే బాగుండేదని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని విభజించటం వలన హైదరాబాదులాంటి అభివృద్ది చెందిన ప్రాంతం తెలంగాణాప్రాంతంలోకి పోవటం వలన విద్యార్ధులు,ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. రాష్టవ్రిభజనను వెనక్కితీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణాపై చంద్రబాబు నోరుమెదపటం లేదని ఆయన ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర ఉద్యమం గ్రామగ్రామాన ఉప్పెనలా ఊపందుకుంది. రాష్ట్రం సమైక్యాంగానే ఉండాలంటూ విద్యార్ధి, ఉద్యోగ జెఎసి నేతలు డిమాండ్‌చేస్తున్నారు. ఆర్‌టిసి బస్టాండు వద్ద విద్యార్థి జెఎసి నేతలు టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. అదే విధంగా రైస్, సంఘమిత్ర హాస్పిటల్ వద్ద విద్యార్థి,ఉద్యోగ జెఎసి నేతలు రాస్తారాకో, మానవహారాన్ని చేపట్టారు.
అదేవిధంగా మంగమూరు రోడ్డు వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మను విద్యార్థులు తగలబెట్టి నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో విద్యార్థి జెఎసి నాయకులు రాయపాటి జగదీష్, ఎన్‌జివో సంఘ నేతలు షేక్ బషీర్,రాజ్యలక్ష్మి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో సమైకాంధ్ర ఉద్యమసెగలు నేతలకు తాకాయి
english title:
resignatons
Date:
Saturday, August 3, 2013