ఒంగోలు, ఆగస్టు 2: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలో జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని వైఎస్‌ఆర్‌సిపి చీఫ్‌విప్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు జిల్లాలోని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పోరాటం చేయాలని ఆయన కోరారు. యుపిఏ చైర్మన్ సోనియా గాంధీ రాజకీయ లబ్థి కోసం రాష్ట్రాన్ని విభజించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించడం వలన సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్ట పోతారన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను ప్రత్యేక తెలంగాణాలో కలపడం వలన సీమాంధ్రకు చెందిన విద్యార్థులు, యువకులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించడం వలన సీమాంధ్ర అభివృద్ధిలో మరో 20 సంవత్సరాలు వెనక్కి పోయినట్లు ఆవుతుందని తెలిపారు. రాష్ట్రం ముక్కలు అవుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నోరు మెదపకపోవడం చూస్తుంటే రాష్ట్రం సమైక్యంగా ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుగా ఉందని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టిందే తెలుగు జాతి మొత్తం ఒక్కటిగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే అని, అయితే చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రాన్ని విడగొట్టేందుకు సముఖత వ్యక్తం చేయడం సిగ్గు చేటైన విషయమన్నారు. కావూరి సాంబశివరావు తాను సమైక్యవాదినని పేర్కొన్నారని అయితే ఆయనకు కేంద్ర మంత్రి పదవి రాగానే అధిష్టానం ఇష్టమే తన ఇష్టమని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు అఖిలపక్షం సమావేశం అందరి అభిప్రాయాలు తీసుకొని అందరికి ఆమోదయోగ్యమయ్యే విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుండేదని, అలాకాకుండా అధికారం ఉంది కదా అని ఏకపక్షం నిర్ణయం తీసుకోవడం వలన సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా సాగు నీటికి సంబంధించి శ్రీకాకుళం నుండి కర్నూల్ వరకు సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యను ఎవరు పరిష్కరిస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఐదు లక్షల కోట్లు కేంద్రం ఇస్తే సీమాంధ్రను అభివృద్ది చేసుకుంటామన్నట్లు మాట్లాడుతున్నారని, ఎన్ని లక్షల కోట్లు ఇస్తే హైదరాబాద్ లాంటి నగరం ఇక్కడ ఎర్పడుతుందని ఆయన ప్రశ్నించారు. అంతే కాకుండా కొంత మంది రాజకీయ పార్టీల ఎమ్మెల్యే తాము సమైక్యాంధ్ర కోసం తొలుత రాజీనామాలు చేసిన తరువాత వారు కూడా రాజీనామాలు చేసి డ్రామా ఆడుతున్నారని వారిలో చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసిన ప్రతి ఎమ్మెల్యే స్పీకర్ వద్ద ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకున్నప్పడే వారు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసిన వారు అవుతారని పేర్కొన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో వై యస్ ఆర్ సిపి జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి సూర్య, ఒంగోలు నగర వైయస్ ఆర్ సిపి కన్వీనర్ కుప్పం ప్రసాద్, కటారి రామచంద్రరావు, కటారి శంకర్, ముదివర్తి బాబూరావు, కాటం అరుణమ్మ, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు నరాల రమణారెడ్డి, టి సోమశేఖర్, రొండా అంజిరెడ్డి, మహిళా నాయకురాళ్ళు గంగాడ సుజాత, పోకల అనురాధ, బడుగు ఇందిర, కావూరి సుశీల, తదితరులు పాల్గొన్నారు.
* ఎమ్మెల్యే బాలినేని
english title:
dist bandh
Date:
Saturday, August 3, 2013