విజయనగరం, ఆగస్టు 5: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య సెగలు జోరందుకున్నాయి. రాస్తారోకో, మానవహారాలు, పిండప్రదానాలు, శవయాత్రలు, దిష్టిబొమ్మల దగ్ధం తదితర నిరసనలతో ప్రజలు అట్టుడికిపోతున్నారు. సోమవారం జిల్లా అంతటా నిరసన జ్వాలలు రగిలాయి. రామభద్రాపురంలో నలువైపులా ట్రాఫిక్‌ను దిగ్బంధించడంతో నాలుగు రాష్ట్రాల వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలో విశాఖపట్నం వైపు వెళ్లే వై జంక్షన్ వద్ద టైర్లతో మంటలు ఏర్పాటు చేసి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారు. పట్టణంలోని బీసీ కాలనీ సమీపంలో రైల్వే పట్టాలపై సమైక్యావాదులు ధర్నా చేయడంతో ఉద్త్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యాంధ్ర జై.. కెసిఆర్ డౌన్..డౌన్.. అంటూ నినాదాలు చేశారు. పట్టణంలో లారీ యజమానులు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగుల 72 గంటల పిలుపులో భాగంగా విధులను బహిష్కరించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు, ఐవిపి రాజుల నేతృత్వంలో మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ, రిలే నిరాహార దీక్షలను కొనసాగించింది. దాదాపు ఏడు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. చీపురుపల్లి, ఎస్.కోటలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. అలాగే డెంకాడ-కుమిలి రహదారిపై చెట్లను రోడ్డుకు అడ్డంగా వేసి అటువైపుగా రాకపోకలను నిలిపివేశారు. ఇక పట్టణంలో కలెక్టరేట్ జంక్షన్, బాలాజీ జంక్షన్, మయూర జంక్షన్, కోట తదితర ప్రాంతాల్లో సమైక్యాంధ్ర జెఎసి, విద్యార్థి సంఘాలు, ప్రింటింగ్ ప్రెస్ యూనియన్, మోటార్ యూనియన్‌లతోపాటు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. బోగాపురం మండలంలోని ఐదో జాతీయ రహదారి సవరవిల్లిలో వర్షంలో కూడా వంటావార్పు కార్యకమం నిర్వహించారు. జామిలో దాదాపు ఆరు గంటల పాటు ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఈ విధంగా జిల్లా అంతటా సమైక్యాంధ్ర నినాదాలతో మార్మోగింది.
రెండోరోజుకు చేరిన కాంగ్రెస్ నిరాహారదీక్ష
విజయనగరం (్ఫర్టు) : రాష్ట్ర విభజనకు వ్యితిరేకంగా జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు సోమవారం నాటికి రెండోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియ జరగడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వ్యవహించి, ఇప్పుడు మాటమార్చడం దారుణమన్నారు. అన్ని రాజకీయపార్టీలు అనుకూలంగా వ్యవహరించడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానవర్గం సుముఖం వ్యక్తం చేసిందన్నారు. ఈ నిరాహారదీక్షలో కాంగ్రెస్ నాయకులు బొద్దాన అప్పారావు, బోడసింగి ఈశ్వరరావు, పిన్నింటి రాజేష్, ఎస్.మంగాదేవి, వేముల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఉద్యోగుల విధుల బహిష్కరణ
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఇక్కడ మున్సిపల్ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. 72 గంటల ఆందోళనలో భాగంగా విధులను బహిష్కరించినట్లు మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.అప్పయ్యశెట్టి తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులను విధులను బహిష్కరించడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు.
పిడుగుపాటుకు
ఇద్దరి మృతి
శృంగవరపుకోట, ఆగస్టు 5 : మండలంలోని కొట్టాం గ్రామం నడిమశెట్టి కల్లం వద్ద సోమవారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా పక్కనే ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈవార్తకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొట్టాం గ్రామానికి చెందిన గుర్రపు ముత్యాలు (50), బొడ్డు సూర్యారావు (56), మరో నలుగురితో కలిసి పొలం పనికి కల్లాలకు వెళ్లారు. వర్షానికి వీరంతా ఒక చెట్టు క్రిందకు చేరారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగుపడటంతో గుర్రపు ముత్యాలు, బొడ్డు సూర్యరావులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిలో కె.ముచ్చుడు,అప్పన్న,అవతారం,సింహాద్రి లకు గాయలుకావడం వీరిని జామి ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. మృతులు రైతు కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం ఎస్‌కోట సిహెచ్‌సికి తరలించారు.
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఆగస్టు 5: జిల్లా కేంద్రంలో సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల తమ వ్యాపారం సాగడం లేదని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వద్ద మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టర్‌ను కలసి తమ వ్యాపారాలకు ఇబ్బంది కలుగకుండా తగిన రక్షణ కల్పించాలని కోరారు. సమైక్యాంధ్రాకు తాము మద్దతు పలుకుతున్నప్పటికీ ఆకతాయిల వల్ల వ్యాపారాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎక్కడైన ఇబ్బందులు ఉంటే వాటిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కె.ప్రకాష్, కాశీ విశ్వనాధం, రాజు తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనల వెల్లువ
చీపురుపల్లి, ఆగస్టు 5 : నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లిలో సమైక్యాంధ్ర సెగలు, నిరనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి జెసిసి ఆధ్వర్యంలో ఐదవ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలో శిష్టకరణ సంక్షేమ సంఘ సభ్యులు మన్మధరావు, మూర్తి, ప్రబాష్,శ్రీనివాసరావు,వెంకటేశ్వరరావు, రఘు, శివ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. మండలంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన రాజకీయ నాయకులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు 10 కిలో మీటర్లు పాదయాత్రగా తరలివచ్చారు. కొంత మంది విద్యార్ధులు గుండ్లు కొట్టించుకుని సమైక్యాంధ్రకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. చీపురుపల్లి మూడురోడ్ల జంక్షన్ వద్ద మానవహారం చేస్తూ కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మండల ఉపాధ్యాయులు టెలికాన్పరెన్స్‌ను బహిష్కరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అలాగే స్థానిక ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్ధులు రాజాం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య సెగలు జోరందుకున్నాయి.
english title:
a
Date:
Tuesday, August 6, 2013