విజయనగరం(టౌన్), ఆగస్టు 5 : సమైక్యాంధ్ర ఉద్యమ కార్యక్రమాలు, భారీ వర్షం వంటి పరిస్థితుల కారణంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సోమవారం నాటి గ్రీవెన్స్ సెల్‌కు వినతులు తగ్గాయి. సమైక్యాంధ్ర ఉద్యమ కార్యక్రమాలు సోమవారం కూడా పట్టణంలో కొనసాగడంతో గ్రీవెన్స్ సెల్‌కు అర్జీదారుల సంఖ్య తగ్గింది. పలు సమస్యలకు సంబంధించి కేవలం 80 వినతులు అందాయి. డిఆర్‌ఒ హెచ్‌ఎస్ వెంకటరావు వినతులు స్వీకరించారు. ఈ ఏడాది వర్షా భావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సీజన్‌లో వరినాట్లు పలు చోట్ల మొదలు కాలేదని సెప్టెంబర్ నెలాఖరుకుగాని వరినాట్లు పూర్తయ్యే పరిస్థితులు లేనందున పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువు తేదీని సెప్టెంబర్ నెలాఖరు వరకూ పొడిగించాలని కోరుతూ ఎపి రైతు సంఘం జిల్లా నాయకులు మర్రాపు సూర్యనారాయణ వినతినిచ్చారు. ఇందిరమ్మ పథకం క్రింద తమకు మంజూరైన ఇళ్లను నిర్మించి రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ బిల్లులు అందలేదని న్యాయం చేయాలంటూ ఎస్ కోట మండలం శివరామరాజుపేట గ్రామానికి చెందిన జయలక్ష్మి తదితరులు వినతినిచ్చారు. ఎల్‌కోట మండలం చందులూరు గ్రామంలోని ఒక రేషన్ డీలర్ వద్ద ఉన్న బోగస్ రేషన్ కార్డుల విషయమై దర్యాప్తు జరిపించాలని అదే గ్రామానికి చెందిన ఎస్.శ్రీను తదితరులు వినతినిచ్చారు. వికలాంగ పింఛన్‌ను పెంచాలని కోరుతూ విజయనగరానికి చెందిన బి.సూరమ్మ కోరింది. పూసపాటిరేగ మండలం కొల్లాయివలస గ్రామంలోని ఎంపిపి స్కూల్‌లో బోరు నిర్మించాలని కోరుతూ పలువురు వినతినిచ్చారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నిరోధానికి టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని ఎస్.కోటకు చెందిన ఎస్.శ్రీనివాసరావు తదితరులు కోరారు. ఎల్.కోట మండలం లచ్చంపేట గ్రామంలో ఉపాధి హామీ పధకం పనుల్లో అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు ఫిర్యాదు చేశారు. క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ కొంతమంది ర్యాలీ నిర్వహించి వినతిపత్రం ఇచ్చారు.
మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఆందోళన
విజయనగరం (కంటోనె్మంట్), ఆగస్టు 5:మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ మెస్ బిల్లుల బకాయిల చెల్లింపుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని గతంలో అనేక సార్లు అధికారులకు విన్నవించడంతో కొన్ని మండలాల్లో కొంతమేర చెల్లించారని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పెంచినట్లు ప్రకటించిన 500 రూపాయల గౌరవ వేతనం, పెంచిన మెనూ ధరలు జిల్లాలో అమలు కాలేదన్నారు. నిర్వాహకులపై ఇటీవల కాలంలో రాజకీయ వేధింపులు పెరిగాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో డిఇఓ ఇచ్చిన హామలు అమలకు నోచుకోలేదన్నారు. గౌరవ వేతనాన్ని తక్షణమే చెల్లించాలని, పెంచిన మెనూ ధరలను అమలు చేయాలని, గ్యాస్,గుడ్లు ప్రభుత్వం సరఫరా చేయాలని, చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షరాలు టి.శారధ, ప్రధాన కార్యదర్శి బొత్స సుధారాణి, సిఐటియు జిల్లా కార్యదర్శి టి.వి రమణ పాల్గొన్నారు.
‘సీమాంధ్రులకు అన్యాయం
జరిగితే సహించేదిలేదు’
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 5: రాష్ట్రాన్ని ముక్కలు చేసి అన్యాయం జరిగితే సహించేదిలేదని సమైక్యాంధ్ర జెఎసి జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు హెచ్చరించారు. సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో సోమవారం మయూరి జంక్షన్‌లో కెసిఆర్, దిగ్విజయ్‌సింగ్, షిండే, సోనియాగాంధీ మాస్కులు ధరించి ఇనుప సంకెళ్లతో బంధించి వినూత్నన రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఎంతోమంది మహానుబావుల త్యాగఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించడం దారుణమన్నారు. అంతర్జాతీయస్థాయిలో హైదరాబాద్‌ను అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకుంటామన్నారు. అయితే సమైక్యాంధ్ర ద్రోహులైన ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు.