చిత్తూరు, ఆగస్టు 6: చిత్తూరు ఎమ్మెల్యే సి.కె.బాబు సమైక్యాంధ్ర కావాలంటూ గత వారం రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షను పోలీసలు భగ్నం చేశారు. ఆదివారం నుంచి ఎమ్మెల్యే సికె బాబు దీక్షను పోలీసులు భగ్నం చేస్తారని నాయకులు, స్థానిక ప్రజలు అనుకుంటూనే ఉన్నారు. అయితే రెండు రోజులు గుట్టుచప్పుడు కాకుండా ఉన్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 20నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా పోలీసు బలగాలు గాంధీ విగ్రహం వద్ద సికె బాబు ఆమరణ నిరాహారదీక్ష వద్ద గుమికూడాయి. ఏమి జరుగుతుందో అని నాయకులు, సి.కె.బాబు అభిమానులు ఆలోచించే లోపే దీక్ష చేస్తున్న సి.కె.బాబును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టును ఆయన అభిమానులు, నాయకులు, సతీమణి సికె లావణ్యబాబు, కుమారుడు సాయిక్రిష్ణ అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో సికె లావణ్యబాబుకు తలపై స్వల్పగాయమైంది. ఎట్టకేలకు పోలీసులు పన్నిన వూహ్యం ఫలించడంతో ఎమ్మెల్యే సి.కె.బాబాను అంబులెన్సులో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనపై ఉన్న అభిమానంతో అభిమానులు, నాయకులు, చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నుండి వేలాదిగా చర్చివీధిలో అంబులెన్సుకు ముందు, వెనుకగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు వెళ్ళారు. ఆసుపత్రి గేట్లవద్ద అంబులెన్సు లోనికి వెళ్ళగానే పోలీసులు గేట్లు వేయడంతో అభిమానులు గేట్లవద్దనే ఆగిపోవాల్సి వచ్చింది. హుటాహుటిన వైద్యులు సి.కె.బాబుకు క్యాజువాలిటి పక్కనే ఉన్న ఐసియులో చేర్పించి ప్లూయిడ్స్ ఎక్కించారు. ఆయన ఎంత వారించినా పోలీసులు, డాక్టర్లు ఆయన మాట పట్టించుకోకుండా ప్లూయిడ్స్ ఎక్కించారు. చివరకు మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో సి.కె.బాబు కుమారుడు సాయిక్రిష్ణ తండ్రికి జూస్ తాగించి దీక్షను విరమింపజేశారు. అయితే సి.కె.బాబును అరెస్టుచేయడంతో ఒక్కసారిగా చిత్తూరుపట్టణం అట్టుడికిపోయింది. గత వారం రోజులుగా సి.కె.బాబు అమరణ నిరాహారదీక్ష చేస్తున్నా పట్టణంలో దుకాణాలు తెరచుకొని వ్యాపారులు వ్యాపారాలు చేసుకొంటు ఉండేవారు. అయితే మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేను అరెస్టుచేసిన విషయం తెలిసి తెలియగానే వ్యాపారులు అందరు తమ దుకాణాలను మూసివేశారు. ఇంకోవైపు ఆందోళన చెందిన సి.కె.బాబు అభిమానులు, సమైక్యాంధ్ర వాసులు చిత్తూరు ఆర్టీసీ రెండవ డిపోలో ఒక బస్సు టైర్లకు నిప్పుపెట్టారు. అయితే అది పూర్తిగా కాలకమునుపే ఆర్టీసీ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇంకోవైపు ఎం.ఎస్.ఆర్ సర్కిల్ వద్ద ఒక తోపుడు బండిన అంటించేశారు. రెడ్డిగుంట కలెక్టరేట్ వద్ద తెరచివున్న రెండు మూడు దుకాణాలను సమైక్యాంధ్ర వాదులు ధ్వంసంచేశారు. అయితే అప్పటికే తేరుకున్న పోలీసులు చిత్తూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. అప్పటికే చిత్తూరులో సమైక్యాంధ్రకోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సి.కె.బాబును అరెస్టుచేసిన విషయం తెలుసుకున్న వ్యాపారులు, దుకాణదారులు వారి వారి దుకాణాలనుమూసివేశారు. చివరకు మెడికల్‌షాపులను సైతం చిత్తూరుపట్టణంలో మూసివేసి బంద్‌ను పాటించారు.
* ఆసుపత్రికి తరలించిన పోలీసులు * పలుచోట్ల విధ్వంసం
english title:
ck babu
Date:
Wednesday, August 7, 2013