తిరుపతి, ఆగస్టు 6: రాష్ట్ర విభజన జరిగితే జీవితాతం తెలుగువారి మధ్య చిచ్చుపెట్టినట్లేనని తిరుపతి న్యాయవాద సంఘం నేతలు అన్నారు. శాప్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట వున్న దీక్షాశిబిరంలో మంగళవారం తిరుపతి న్యాయవాదుల సంఘం నేతలు దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాద సంఘం అధ్యక్షులు రమణ, కోశాధికారి దినకర్‌లు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో గాంధీకి ఒక న్యాయవాదిగా ఉద్యమాన్ని నడిపించాడన్నారు. ఆయన స్ఫూర్తితో న్యాయవాదులు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నామన్నారు. సోనియాగాంధీ పేరు చివరన గాంధీ అని పెట్టుకోవడానికి అనర్హురాలన్నారు. రాష్ట్ర విభజనతో జీవితాంతం సమస్య ఉత్పన్నం అవుతోందన్నారు. శాప్స్ నేతలు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఎన్ రాజారెడ్డిలు మాట్లాడుతూ జల మనోభావాలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రాన్ని సమైక్యాంగానే వుంచాలని డిమాండ్ చేశారు. తన కుమారుడ్ని ప్రధాని చెయ్యాలన్న కాంక్షతో సోనియాగాంధీ, తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్షతో కేసిఆర్‌ల ఇరువురి స్వార్ధానికి రాష్ట్ర ప్రజలు బలి అయ్యారన్నారు. దేశంలో విభజన ఉద్యమాలకు ఆజ్యం పోసిన సోనియాగాంధీ చరిత్ర హీనురాలుగా మారిపోతుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 జిల్లాలు, ఒక యూనివర్శిటిలో ఆందోళనలు చేస్తే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ నేడు 13 జిల్లాల్లో, 15 యూనివర్శిటిల్లో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున లేస్తోందన్నారు. సోనియాగాంధీ తెలుగువారిని విడదీసి చారిత్రక తప్పు చేసిందన్నారు. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవలసి వుంటుందని హెచ్చరించారు. ఇకనైనా సోనియాగాంధీ చేసిన తప్పును సరిదిద్దుకోవాలని లేని పక్షంలో జీవితంలో కాంగ్రెస్ పార్టీని ఏ తెలుగువాడు నమ్మడన్నారు. అయితే సమైక్య ఉద్యమం ప్రజల చేతుల్లో వుందని ఇప్పటికైనా తెలుసుకుని కేంద్రం తిరిగి సమైక్య ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి,విజయలక్ష్మి, మబ్బు చెంగారెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, నరసింహయాదవ్, దంపూరి బాస్కర్, బుల్లెట్ రమణ, కుమారమ్మ, సిందుజ, భారతి, సరోజమ్మ, హరిప్రసాద్, దంపూరి శివ తదితరులు మద్దతుపలికారు. కాగా దీక్షల్లో న్యాయవాదులు పి రమణ, టి దినకర్, అప్పప్పిలి, ఉమాపతి ఆచారి, కె విజయలకుమార్, గిరిబాబు, దొరబాబు, వి శ్రీనివాసులు, బాస్కర్, వినుత, అల్లానురాధా, జి సుజాత, శంకర్లు, పత్తికొండ మురళీ తదితరులు పాల్గొన్నారు.
* శాప్స్ ఆధ్వర్యంలో న్యాయవాదుల దీక్షలు
english title:
deeksha
Date:
Wednesday, August 7, 2013