కుప్పం, ఆగస్టు6: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, కుప్పం శాసనసభ్యుడు నారాచంద్రబాబు నాయుడు కనుబడుట లేదని మంగళవారం కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక వైకాపా నాయకులు కుప్పం శాసనసభ్యుడు కనుబడుటలేదని సమైక్యాంధ్రాకు మద్దతుగా ముందుండి పోరాటం చేయాల్సిన చంద్రబాబునాయుడు గత మూడురోజులుగా కనుబడుటలేదని ఆఫిర్యాదులో కె.కన్నన్, శెల్వంసార్, వెంకటేష్‌బాబు, యశోద, మురళీధర్ తదితరులు పేర్కొన్నారు.
బస్సు, లారీ దగ్ధం కేసులో ఇద్దరు అరెస్ట్
* పరార్‌లో ముగ్గురు
తిరుపతి, ఆగస్టు 6: సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యంలో స్థానిక అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని మున్సిపల్ పార్కు వద్ద ఆగి ఉన్న అలిపిరి డిపో ఆర్‌టిసి బస్సుకు, మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో వున్న లారీకి మంగళవారం నిప్పు పెట్టారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. అలిపిరి డిపో ఆర్‌టిసి డ్రైవర్ శేఖర్‌రాజు మున్సిపల్ పార్కు సమీపంలో బస్సును వదిలి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆందోళనకారులు బస్సుకు నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో తిరుపతికి చెందిన మస్తాన్, సుబ్రహ్మణ్యం అలియాస్ బాబులను అరెస్టు చేసినట్లు అలిపిరి సిఐ రాజశేఖర్, ఎస్సై హరిప్రసాద్‌లు వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మున్సిపల్ పార్కు సమీపంలో ఏర్పాటు చేసి ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
సిఎం రాజీనామా చేయాలి: పెద్దిరెడ్డి
పుంగనూరు రూరల్, ఆగస్టు 6: రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి రాయలసీమ గడ్డ రక్తం పంచుకుని పుట్టి ఉంటే వెంటనే సిఎం పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఇనే్నళ్లుగా అభివృద్ధి చేసుకొన్న నగరాన్ని మన చేతగాని సిఎం వల్లే వదులుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అసమర్థ సిఎం వల్లే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. హైద్రాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసుకున్న నగరమని అలాంటి నగరం ఒక ప్రాంత పరం కావడానికి చంద్రబాబు వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళవారం ఆయన పుంగనూరు పట్టణంలో సమైక్యాంధ్రాకు మద్దతుగా మహిళా మండలి సభ్యులు, న్యాయవాధులు, జేఏసి నాయకులు, ట్రాన్స్‌కో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, చక్కెర ఫ్యాక్టరీ కార్మీకులు, వివిధ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కలసి సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఇందిరాసర్కిల్‌లో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి వైకరి వల్లే రాష్ట్రం ముక్కలవుతోందని తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల భద్రత గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందన్నారు. రాష్టన్రికి నిజమైన సీమాంధ్ర ద్రోహులు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలేననని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో జగన్ ప్రభావం తగ్గించే ప్రయత్నంలో ఈరెండు పార్టీలు కుమ్మకయ్యాయని ఆరోపించారు. సోనియా గాంధీని ఎదిరించి ప్రజల పక్షం నిలచే ధైర్యం మన సిఎంకు కాని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు గాని లేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన సీమాంధ్రకు చెందిన ఎంపీలు సైతం ఉత్తుత్తి రాజీనామాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వారు జిల్లాలకు వస్తే ప్రజల నుంచి రాళ్లు, చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వెంకటరెడ్డి యాదవ్, నాగరాజరెడ్డి, నాగభూషణం, రెడ్డెప్ప, వరదారెడ్డి, రాజేష్, సత్యన్న, అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.