కర్నూలు, ఆగస్టు 6: జిల్లా వ్యాప్తంగా సమైక్య ఆందోళన మంగళవారం మిన్నంటింది. అన్నిరాజకీయ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమం విజయవంతం చేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిల్చిపోయాయి. కర్నూలు-బెంగుళూరు, కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారులపై సమైక్య ఆందోళనకారులు వంట-వార్పూ కార్యక్రమం, క్రీడా పోటీలను నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు సమైక్య ఆందోళనకు జిల్లాలోని గజిటెడ్ ఉద్యోగులు కూడా సంఘీభావం తెలుపుతూ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొంటుండగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయునిలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రం కావాలంటూ వైకాపా, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో విడివిడిగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా విద్యార్థి, ఉద్యోగ, న్యాయవాద సంఘాలు సంయుక్తంగా ఉద్యమంలో పాల్గొంటున్నాయి. జిల్లాలోని ఆదోని, నంద్యాల, డోన్, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతోంది. వరుసగా ఏడవ రోజున ఆర్టీసి బస్సులు రోడ్డెక్క లేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉద్యమంలో భాగస్థులు కావడంతో బస్సుల నిర్వహణ సాధ్యపడటం లేదని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాచేసిన అనంతరం దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమంతో కలెక్టరేట్ ప్రాంగణమంతా బూడిదమయమైంది. సమైక్య వాదుల ఆందోళన కారణంగా జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్థంబించి పోయింది. ఇక సమైక్య ఆందోళనకు మద్దతుగా కేబుల్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో మంగళవారం వార్తా చానళ్లు మినహా ఇతర అన్ని చానళ్ల ప్రసారాలను నిలిపివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర ఎన్జీవో సంఘం పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు ఎన్జీవోలు సిద్ధపడుతున్నారు. రాష్ట్ర విభజనచేస్తే రాయలసీమ, కోస్తాంధ్రా అగ్నిగుండంగా మారుతుందని శ్రీ కృష్ణ కమిటీ చెప్పినా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా రాష్టవ్రిభజన చేయడాన్ని సమైక్య ఆందోళనకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆమరణ దీక్షలు భగ్నం
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుతూ ప్రముఖ విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, సమైక్యాంధ్ర కోరుతూ ప్రముఖ వైద్యుడు డాక్టర్ ప్రసాద్‌లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలను మంగళవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. వారిద్దరు చేపట్టిన ఆమరణ దీక్ష 6వ రోజుకు చేరుకోవడంతో మంగళవారం ఉదయం ప్రభుత్వ వైద్యులు పరీక్షించి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వెంటనే దీక్షను విరమించాలని కోరారు. అయినా వారిద్దరు దీక్షను విరమించడానికి నిరాకరించారు. ఆ తరువాత కలెక్టర్ సుదర్శన్ రెడ్డి కూడా దీక్షలను విరమించి వైద్య చికిత్సలకు సహకరించాలని కోరుతూ వర్తమానం పంపారు. అయినప్పటికీ తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దాంతో కలెక్టర్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను ఎస్పీ రఘురామ్ రెడ్డికి పంపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాలతో కెవి సుబ్బారెడ్డి, ప్రసాద్‌లను దీక్ష విరమించి వైద్య పరీక్షలకు అంగీకరించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరించారు. అయినా దీక్ష విరమించేందుకు వారిద్దరు నిరాకరించి ఆమరణ దీక్షను కొనసాగించడానికే నిర్ణయించుకున్నారు. అంతేగాక తమ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తారని తమ మద్దతుదారులను నిరాహార దీక్ష శిబిరం వద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు బుధవారం తెల్లవారుజామున వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్న సమయంలో పోలీసులు భారీ సంఖ్యలో వచ్చి దీక్ష విరమించని పక్షంలో అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ వారిద్దరిని బలవంతంగా పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు వారికి అత్యవసర చికిత్సలు అందజేస్తూ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు.
జిల్లా వ్యాప్తంగా సమైక్య ఆందోళన మంగళవారం మిన్నంటింది
english title:
s
Date:
Wednesday, August 7, 2013