కర్నూలు, ఆగస్టు 6: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేమని యుపిఎ భాగస్వామ్య పక్షాలు తీసుకున్న నిర్ణయంలో మార్పు లేనిపక్షంలో రాయలసీమ ప్రాంతాన్ని మరో ప్రాంతంతో కలపకుండా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు. కోట్ల సూర్య కర్నూలు జిల్లాకు చెందిన ఎంపి ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, మురళీ కృష్ణ, లబ్బి వెంకట స్వామిలతో కలిసి మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాలు సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని తీసుకొని లోతైన అధ్యయనం తరువాత అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే దిశలో ప్రయత్నాలు చేయాలని కోరారు. ఇందుకు సోనియా గాంధీ స్పందిస్తూ యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని ఈ పరిస్థితిలో వెనక్కి తగ్గలేమని తేల్చి చెప్పారు. దీంతో కోట్ల సూర్య బృందం మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనివార్యమని తేలితే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని అదీ వీలు కాదన్న పక్షంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరారు. నాలుగు జిల్లాలతో కూడిన రాయలసీమను ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాల్లో దేంట్లో కలిపినా న్యాయం జరుగదనీ, ఇప్పటికే రాయలసీమకు ఎంతో అన్యాయం జరిగిందని నివేదిక సమర్పిస్తూ ఇంకా నష్టపోలేమని కష్టమైనా, సుఖమైనా ప్రత్యేక రాష్ట్రంలో రాయలసీమ వాసులు ఉండటానికి ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. దీంతో సోనియా స్పందిస్తూ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న అనంతరం కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంత సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం అత్యున్నత కమిటీని నియమిస్తున్నామని వారికి తమ సమస్యలు, ఆవేదన చెప్పుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇద్దరితో కూడిన కమిటీ కాకుండా ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంత సమస్యలు వాటి పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఇద్దరి సభ్యులను కమిటీలో చేర్చాలని కోరడంతో అందుకు అంగీకరించి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తామని వారు నివేదిక ఇచ్చే వరకు విభజన ప్రక్రియ పూర్తి కాదని వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి కార్యాచరణపై కర్నూలు వచ్చిన తరువాత నిర్ణయించుకోవాలని భావిస్తున్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేమని యుపిఎ భాగస్వామ్య పక్షాలు
english title:
r
Date:
Wednesday, August 7, 2013