విజయనగరం (కలెక్టరేట్), మార్చి 2: ఇంటర్మీడియెట్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షలకు ఇంటర్‌బోర్డు యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేయడంతో పాటు ముందుగా విద్యార్థులకు హాల్‌టికెట్ల జారీ, సెంటర్ల వివరాలను తెలపడంతో విద్యార్థులు నిర్ధేశించిన సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు జరిగిన ఈ పరీక్షల్లో మొదటి రోజు పట్టణంలోని పలు కేంద్రాలను ఆర్.ఐ.ఓ గవర గోవిందరావు సందర్శించి ఏర్పాట్లను, పరీక్ష జరుగుతున్న విధానాలను పరిశీలించారు. శుక్రవారం నాటి పరీక్షకు జిల్లావ్యాప్తంగా 20,744 మంది విద్యార్థులు హాజరుకాగా 2,098 మంది విద్యార్థులకు అబ్‌సెంట్ అయినట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో చీపురుపల్లి పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి స్లిప్పులు పెట్టి పరీక్ష రాస్తుండగా అధికారులకు పట్టుబడటంతో డిబార్ చేసినట్టు ఆర్.ఐ.ఓ తెలిపారు.
ప్రజలకు నీటి సమస్య రానివ్వం
విజయనగరం (కలెక్టరేట్), మార్చి 2: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎక్కడ ఎటువంటి సమస్యలురాకుండా ఉండేందుకు వేసవిలో నీటిఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందుస్తుప్రణాళికలతో సిద్దంగా ఉన్నామని ఆర్‌డబ్ల్యుఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.మెహర్‌ప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం తన చాంబర్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఈనెల మొదటి వారంలో క్రాష్ ప్రోగ్రాం ద్వారా జిల్లాలోని అన్నిమండలాల్లో బోర్లు బాగుచేయడంతోపాటు బాగున్న బోర్లకు మెయింటినెన్స్ చేయడం వంటి కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇందులో బాగంగా మండలానికి ఒక వాహనం కేటాయించి ఇందులో మెకానిక్‌లతోపాటు నాలుగురు ఎన్.ఎం.ఆర్‌లు ఉంటారని, అలాగే బోర్ల మరమ్మతులకు అవసరమైన అన్ని సామగ్రి ఇందులో ఉంచుతామన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను వీరు పరిశీలించి బోర్లు బాగు చేస్తారని దీనితో ఎక్కడా సమస్య ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. నిధుల కొరత లేదని, పూర్తి స్థాయిలో నిదులు సమకూర్చేందుకు కలెక్టర్ సిద్దంగా ఉన్నారని అలాగే పంచాయతీల్లో జనరల్ నిధులు వాడుకోవచ్చని ఎంపిడిఓలకు కలెక్టర్ తెలిపారన్నారు. ఈ క్రమంలో మండల అభివృద్ది అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి ద్వారా నీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. అయితే జిల్లాలో అవసరానికి మించి బోర్లు ఉన్నాయని వాటిని సక్రమంగా నిర్వహించగలిగితే అసలు సమస్య ఉత్పన్నమవదని అభిప్రాయపడ్డారు. అయితే మనకు వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ బోర్లు ఎండిపోయే పరిస్థితి రాదని స్పష్టం చేశారు. కనుక ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ ప్రాంతాల్లో బోర్ల రిపేరు అయిన పక్షంలో మండల అధికారులకు సమాచారం ఇవ్వాలని వారుస్పందించని పక్షంలో డివిజన్ అదికారులకు తెలపాలని కోరారు. 250 మందికి ఒక బోరు చొప్పున జిల్లా రూరల్ జనాబాకు 8వేల వరకు బోర్లు అవసరంకాగా మొత్తం 14,298 బోర్లు ఉన్నాయన్నారు.