ఖమ్మం, ఆగస్టు 7: గోదావరి వరద తాకిడికి జిల్లాలోని 14మండలాల పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరివాహక ప్రాంతంలోని రైతులు గోదావరి వరద తాకిడికి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలనే దానిపై ఆందోళనలో ఉన్నారు. జూలై మొదటి వారంలో పత్తిగింజలను నాటిన పరివాహక ప్రాంత రైతులు పంట బాగుందని అనుకునేలోగానే గోదావరి నదికి వరద రావటంతో పంట కొట్టుకపోయింది. మళ్ళీ విత్తనాలు వేయగానే మరొక సారి వరద రాగా, తీవ్రంగా ఆందోళన చెందారు. అయినప్పటికీ మనోధైర్యంతో మరొసారి విత్తనాలు వేయగా వెంటనే గడిచిన రెండు సార్ల కంటే అధికంగా గోదావరి వరద ఉధృతంగా రావటంతో తీవ్రంగా నష్టపోయారు. మూడు సార్లు విత్తనాలతో పాటు ఎరువులను వేయటం, అవి వరద వల్ల నష్టం ఏర్పడటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మళ్ళీ పెట్టుబడి పెట్టే పరిస్థితి లేక చేసిన అప్పులను తీర్చలేక ఒక్క కుక్కునూరు మండలంలోనే ఇప్పటికి ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనేక మంది మంచాన పడ్డారు. వీరందరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం గమనార్హం. గతేడాది కూడా నీలం తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవు. ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి ఈ ఏడాది వ్యవసాయం ప్రారంభించిన రైతులకు గోదావరి వరద మరింత నష్టాన్ని చేకూర్చింది. ఇదిలా ఉండగా పెట్టుబడిదారులు సైతం ఈ ఏడాది రైతులకు అప్పులు ఇవ్వకపోవటం గమనార్హం. కొద్దిమంది పెట్టుబడిదారులు గతేడాది అప్పులు తీరిస్తేనే ఈ ఏడాది ఇస్తామని చెప్పటం, మరికొంత మంది ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇప్పుడు ఇకలేమని చెప్తున్నారు. పరివాహక ప్రాంతంలోని సుమారు 20వేల ఎకరాల్లో పత్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకు సంబంధించి వేలాది మంది రైతులు తిరిగి పత్తిగింజలు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేక తమ చేలను బీళ్ళుగా వదిలేసేందుకు సిద్ధ పడుతున్నారు. మరి కొంత మంది వేలేరుపాడు, కుక్కునూరు, అశ్వారావుపేట మండలాల నుంచి కూలీ పనులు చేసుకునేందుకు ఖమ్మం, కొత్తగూడెంలకు కూడా వస్తున్నట్లు సమాచారం. గోదావరి వరద వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం కూడా పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఆంధ్ర ప్రాంతంలోని రైతులను ఆదుకునేందుకు ప్రతి ఏడాది చర్యలు తీసుకుంటున్నదని, ఖమ్మం జిల్లా రైతులను మాత్రం పట్టించుకోవటం లేదని వివిధ రాజకీయ పక్షాల నాయకులు ఆరోపించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు మళ్ళీ వ్యవసాయం తప్ప వేరే పనులు చేసే మార్గాలు లేవు కనుక ఇబ్బందులను, అప్పులను సైతం ఎదుర్కొని వ్యవసాయాన్ని చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ప్రస్తుతం పత్తి తోటలన్ని గోదావరి ముంపుకు గురవటంతో ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల రైతులు పెసర, మినుము, కంది పంటలతో పాటు మరి కొంత మంది మళ్ళీ పత్తిని సాగు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లలోని లక్షలాది ఎకరాల్లోని పత్తి పంట ముంపుకు గురై రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నప్పటికీ వ్యవసాయ శాఖాధికారులు గాని, రెవెన్యూ అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గోదావరి ముంపుకు గురైన పంటలను సర్వే చేపించి, రైతులకు నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులను సొంత పిల్లల్లా భావించండి
* నాణ్యమైన విద్యనందించి 100శాతం ఉత్తీర్ణత సాధించాలి
* హెచ్‌ఎంలతో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్
ఖానాపురం హవేలి, ఆగస్టు 7: విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి వారికి నాణ్యమైన విద్యనందించి 100శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంబి గార్డెన్స్‌లో వార్షిక విద్య కార్యాచరణ ప్రణాళిక అమలుపై ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అలాంటి సమయాల్లోనే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతామన్నారు. సమస్యలను ఎత్తిచూపటమే లక్ష్యంగా పెట్టుకోకుండా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తూ విద్యనందించటం ద్వారానే ఏదైనా సాధించవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన అనేక మంది ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారని, అందులో తాము ఒకరమనే విషయాన్ని చెప్పుకునేందుకు గర్వంగా ఉందన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఉన్నతాధికారులతో ఒక కమిటీని వేసి వారి పర్యవేక్షణలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం జెసి సురేంద్రమోహన్ మాట్లాడుతూ ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో పాటు ఎంత శాతం ఉత్తీర్ణత సాధించామనే దాని కంటే మన వద్ద నేర్చుకున్న విద్యార్థుల్లో ఎంత మందికి నాణ్యమైన విద్యనందించాం అనే విషయాలపై ఆలోచించి, విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ప్రస్తుతం పదో తరగతి ఫలితాల్లో 84శాతం ఉత్తీర్ణత సాధించారని, రాష్టస్థ్రాయిలో 19వ స్థానంలో ఉన్నామని, ఈ ఏడాది మొదటి స్థానానికి వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐటిడివో పిఓ వీరపాండ్యన్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులందరూ ఆయా పాఠశాలల్లో పాఠశాల ముగిసిన అనంతరం స్టడీ అవర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ప్రధానోపాధ్యాయులు స్థానికంగా ఉండి ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తగిన సలహాలు, సూచనలు అందిస్తూ వారిలో వెనుకబడిన వారిని సైతం ఉత్తీర్ణులయ్యే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. అధికారులంతా తమ వంతు పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రధానోపాధ్యాయులు కృషి చేసి ఉన్నత స్థానాలకు చేరుకునే విధంగా ప్రయత్నాలు చేయాలన్నారు. అనంతరం గతేడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నూరు శాతం ఫలితాలు సాధించిన 23పాఠశాలల ప్రధానోపాధ్యాయులను జిల్లా కలెక్టర్ శ్రీనరేష్, అధికారులంతా ఘనంగా సన్మానించారు. డిఈఓ రవీంధ్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీ సిఇఓ జయప్రకాశ్ నారాయణ, డిఆర్‌డిఏ పిడి పద్మజారాణి, ఏజన్సీ డిఈఓ, ఆయా మండలాల ఎంఇఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
శాంతించిన గోదారమ్మ
భద్రాచలం, ఆగస్టు 7: భద్రాచలం వద్ద వారం రోజుల పాటు ప్రజలను, అధికారులను ఉరుకలు పెట్టించిన ఉగ్ర గోదావరి శాంతించింది. మంగళవారం 45 అడుగులు ఉన్న నీటి మట్టం బుధవారం నాటికి 42 అడుగులకు చేరుకుంది. దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను సబ్ కలెక్టర్ భరత్ గుప్తా ఉపసంహరించారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 12 మండలాల్లో గోదావరి వరదలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు ఇప్పుడిప్పుడే తమతమ ఇళ్ళకు పయనవౌతున్నారు. ఇంకా పునరావాస కేంద్రాల్లో 8 వేల మంది ఆశ్రయం పొందుతూనే ఉన్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. కాగా పలు చోట్ల రోడ్లపై బురదనీరు ఉండటంతో ప్రయాణీకులు, వాహనచోదకులు ఫీట్లు చేస్తున్నారు. మండలాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాగా కొన్ని గ్రామాలకు సరఫరా జరగడం లేదు. భద్రాచలం రామాలయం చుట్టూ, పరిసర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, గోదావరి నదీ తీరం వద్ద స్నానఘట్టాలు, ఉప ఆలయాలు, వైకుంఠఘాట్‌లో వరదల నుంచి తేరుకున్నాయి. విస్తా కాంప్లెక్సు, సుభాష్‌నగర్, అశోక్‌నగర్ కొత్తకాలనీ తదితర ప్రాంతాలు వరదలు తగ్గడంతో బురదమయంగా ఉన్నాయి. వరదలు తగ్గడంతో అధికారులు పారిశుద్ధ్య పనులు ప్రారంభించగా వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు వైద్యసేవలందిస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో మెరుగుపడకపోగా లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు వరదలోనే ఉండటంతో ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతోంది.
భద్రాచలాన్ని తాకిన విభజన సెగ
* డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి, ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాలి
* భద్రాచలం పరిరక్షణ కమిటీ డిమాండ్
భద్రాచలం, ఆగస్టు 7: భద్రాచలం ప్రాంతాన్ని విభజన సెగ తాకింది. బుధవారం భద్రాచలానికి చెందిన గిరిజన, గిరిజనేతర సంఘాలు కలసి భద్రాచలం పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ క్రమంలో స్థానిక రాజుల సత్రంలో జరిగిన సమావేశంలో కన్వీనర్ పివిఎస్ విజయవర్మ మాట్లాడుతూ 1956వ సంవత్సరానికి ముందు నుంచి తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగిన భద్రాచలం డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రంపచోడవరం ఏజెన్సీ కేంద్రంగా ఉన్న భద్రాచలం డివిజన్‌ను సౌలభ్యం దృష్ట్యా ఖమ్మం జిల్లాలో కలపాల్సి వచ్చిందన్నారు. కాగా నేడు అన్ని విధాలా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం ద్వారా స్థానిక గిరిజనులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. అలా కాకుండా తెలంగాణలో కలిపినట్లైతే గిరిజనులు పూర్తిగా తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని విజయవర్మ ఆవేదన వ్యక్తం చేశారు. 1956కి ముందున్న తెలంగాణ కావాలని నిన్నటి వరకు పోరాటం చేసిన నాయకులు నేడు తెలంగాణపై మాట మార్చడం దారుణమన్నారు. ఇది ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. రామయ్య గుడి నిర్మాణానికి రామదాసు ఖర్చుపెట్టిన డబ్బులను స్వామివారు చెల్లించి జైలు నుంచి విడిపించిన కథనాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. పిల్లల వాదన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే స్థానిక ప్రజానీకం ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. అదే సమయంలో తెలంగాణాలో కలిపే ఏ ప్రయత్నం చేసినా సహించేది లేదన్నారు. భద్రాచలానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి విద్య, ఉద్యోగ, నీరు, రవాణా, ఆరోగ్య రంగాలలో ముందుకు తీసుకెళ్లడం ద్వారానే ఇక్కడ నిజమైన అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఇకపై భద్రాచలం ఆంధ్రాలో విలీనం ప్రకటన వచ్చే వరకు సంతకాల సేకరణ, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి చేపట్టనున్నట్లు తెలిపారు. భద్రాచలంను ప్రత్యేక జిల్లా చేసి ఆంధ్రాలో విలీనమయ్యే ప్రక్రియకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. వాస్తవ కోణంలో ఆలోచించి ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని, లేదంటే స్థానిక ప్రజానీకం దృష్టిలో చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. ఇదిలా ఉండగా సమావేశం జరుగుతున్న సమయంలో తెలంగాణవాదులు ఒక్కసారిగా వచ్చి అడ్డుకున్నారు. జై తెలంగాణ, ఆంధ్ర నాయకుల్లారా ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. పోలవరంనకు జాతీయ హోదా వచ్చిందని, ఏజెన్సీని ముంచెత్తే ప్రయత్నం చేస్తుంటే మీరెలా ఆంధ్రాలో విలీనం చేయాలని మద్దతు పలుకుతున్నారని నిలదీశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తారా స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు సున్నం వెంకటరమణ, పి వెంకన్నరాజు, చిచ్చడి శ్రీరామ్మూర్తి, కారం సత్తిబాబు, సున్నం లక్ష్మయ్య, మర్మం నర్సింహారావు, గొంది బాలయ్య, అపకా శ్రీను, నాగయ్య, వీరస్వామి, వేణు, మున్నావర్, ఆదినారాయణ, కృష్ణంరాజు, కొర్సా రాజు, మామిడి పుల్లారావు, అలవాల రాజా, ఆవుల సుబ్బారావు, పడిసిరి శ్రీను, బాదం జగదీశ్ తదితరులు ఉన్నారు.
గూడు చెదిరే... గోడు మిగిలే...
చింతూరు, ఆగస్టు 7: శబరి నది గత కొద్ది రోజులుగా ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. దీంతో మండలంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. మంగళవారం శబరి ఉగ్రరూపం శాంతించింది. ఉద్ధృతి తగ్గడంతో నీట మునిగిన రోడ్లు, ఇళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. గత నాలుగు రోజులుగా వరదనీటిలో మునిగి ఉన్న పలు పూరిళ్లు నేడో రేపో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరదల నుంచి బయటపడటంతో ముంపునకు గురైన ఇళ్లను బాధితులు ఇప్పుడిప్పుడే శుభ్ర పర్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా శబరి బుధవారం సాయంత్రానికి 28 అడుగులకు చేరుకొని ప్రవహిస్తోంది. కాగా చీకటివాగు, సోకిలేరు, కుయుగూరు వాగులు ఇంకా రోడ్లపైనే ఉన్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నేటికీ పునరుద్ధరణ కాలేదు. వరదలు తగ్గడంతో బాధితులు బురదలోనే నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లి ఒండ్రు పట్టిన ఇళ్లను శుభ్రపర్చుకుంటూ మట్టిని తొలగిస్తున్నారు. పూర్తిగా ముంపునకు గురైన ఇళ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇప్పటి వరకు పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు కొన్ని ఇళ్లు బయటపడటంతో సామగ్రి, పిల్లా పాపలతో ఇళ్లకు పయనమయ్యేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. వారం రోజుల పాటు వరద నీటిలో నానిపోయిన తమ ఇళ్లు ఎలా ఉన్నాయోనని సగం మేర బయటపడ్డ ఇళ్లను బాధితులు పరిశీలించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పూర్తిగా, పాక్షికంగా నీట మునిగిన, వరద చుట్టుముట్టిన ఇళ్లకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
వేలేరుపాడు మండలంలో..
వేలేరుపాడు: గత నెల 18 నుంచి పదే పదే వస్తున్న గోదావరి వరదలు వేలేరుపాడు మండల ప్రజలకు తీరని కష్టాలు మిగిల్చాయి. పదే పదే సంభవిస్తున్న వరదలకు గోదావరి పరీవాహక గ్రామాలైన రుద్రంకోట, రేపాకగొమ్ము, వేలేరుపాడు, తిర్లాపురం, తాట్గూరుగొమ్ము, నాళ్లవరం, చిగురుమామిడి, కట్కూరు, ఎడవెల్లి, కొయిదా, కాకిసనూరు, టేకుపల్లి, టేకూరు, పేరంటపల్లి గ్రామాల ప్రజలంతా ఇప్పటికే మూడుసార్లు ఇళ్లను ఖాళీ చేసి సామగ్రి సహా మెరక ప్రాంతాలకు తరలివెళ్లారు. వరదలు తగ్గడంతో మళ్లీ గృహాలకు చేరడం వంటి పనులతో విసిగెత్తిపోతున్నారు. ఈ సమయంలో ఇంట్లోని సామగ్రిని చాలా వరకు వదిలేయాల్సి వచ్చిందని వాపోతున్నారు. బుధవారం గోదావరి వరద ప్రవాహం తగ్గడంతో పునరావాస కేంద్రాల్లోని ప్రజలంతా మళ్లీ ఇళ్లకు సామగ్రిని తరలించే పనిలో అష్టకష్టాలు పడుతున్నారు. ఇలా ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి వారు పడే బాధలు వర్ణనాతీతం. ఇక వరదలు మిగిల్చిన దుర్గంధభరితమైన దుర్వాసనకు పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక వేసిన పంటలన్నీ కోల్పోయి రైతుల్లో తీవ్ర నిరాశ నిస్ప్రహలు అలముకొన్నాయి. వరదల తాకిడికి కొన్ని ఇళ్లు కూలిపోగా పలు ఇళ్ల గోడలు పడిపోగా బాధితులు కన్నీరు పెడుతున్నారు. ఈ తరుణంలో చిల్లిగవ్వ లేని తమకు బతకష్టమే కష్టమనుకుంటే మళ్లీ ఇళ్లు నిర్మించుకోవడం ఎలా సాధ్యమని ఆందోళనకు గురౌతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పోలింగ్ బూత్‌ల ఏర్పాటుపై అభ్యంతరాలు
ఖమ్మం (ఖిల్లా), ఆగస్టు 7: కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు సంబంధించి ఏర్పాటు చేయనున్న ఎన్నికల పోలింగ్ బూత్‌ల ఏర్పాట్ల గురించి సిపిఐ, సిపిఎం, టిడిపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్, లోక్‌సత్తా పార్టీలకు చెందిన నాయకులు తమ అభ్యంతరాలను తెలిపారు. బుధవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ 11వ డివిజన్ పరిధి ఇల్లెందు క్రాస్ రోడ్ నుండి రోటరీనగర్ వరకు విస్తరించి ఎక్కువ పోలింగ్ బూత్‌లను కలిగి ఉందని, పోలింగ్ కేంద్రాలను వీలైనంత వరకు ఒకే చోట కాకుండ వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా డివిజన్ల పరిధిలోనే ఆ డివిజన్‌కు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వేరోక డివిజన్‌లో ఏర్పాటు చేస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. కొత్తగా కార్పొరేషన్‌లో కలిసిన ధంసలాపురం, అగ్రహారం గ్రామాలకు సంబంధించి సీతారామపురంలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని 37 డివిజన్‌కు కేంద్రంగా ఉన్న ఎస్‌విఎం స్కూల్లో ఏర్పాటు చేస్తే అందరికి అనూకూలంగా ఉంటుందన్నారు. అనేక అభ్యంరాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కమిషనర్ శ్రీనివాస్ సమాధానం చెబుతూ ఓటర్లకు సౌకర్యంగా ఉండేందుకు డివిజన్ ప్రాంతంలో రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రతి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కొ పోలింగ్ బూత్‌లో 12వందల నుండి 1400 ఓటర్లు ఉంటారని తెలిపారు. గతంలో పోలింగ్ జరిగిన భవనాలలోనే ఇప్పుడు కూడ పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటు చేసేందులు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ సమావేశంలో టిపివో అఖిల్, ఆర్‌ఐ శ్రీనివాస్, రాంరెడ్డి, రవీంధ్రబాబు, సత్యనారాయణరెడ్డి, సాంబశివారెడ్డి, ఎర్రా శ్రీకాంత్, పంతంగి వెంకటేశ్వర్లు, పెనుగొండ ఉపెందర్, దొడ్డా అశోక్, తోట రామారావు, తవిడిశెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు.
కళాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే యువజనోత్సవాలు
* కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్
ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 7: గ్రామీణ కళాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు యువజనోత్సవాలను ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవనంలో ఖమ్మం నియోజకవర్గ స్థాయి యువజనోత్సవాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో యువజనోత్సవాలు జిల్లా స్థాయిలో మాత్రమే జరిగేవని, ప్రస్తుతం కళాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నియోజకవర్గ స్థాయిలో యువజనోత్సవాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. అక్టోబర్ 1తో ఖమ్మం జిల్లా ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తవుతున్న దృష్ట్యా డైమండ్ జూబ్లీ ఉత్సవాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15నుంచి జనవరి 26వ తేదీ వరకు ఆరు నెలల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. జిల్లాలో నిరుద్యోగ శాతం అధికంగా ఉందని, ఉపాధి అవకాశాలు ఆశించిన మేరకు లేనందున ఈ సమస్య తలెత్తుతుందన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సెట్‌కం సిఇఓ ఎస్ వెంకటరంగయ్య మాట్లాడుతూ జానపద, గేయాలు, ఏకపాత్రాభినయం, హిందూస్థాని, కర్ణాటక సంగీత వాయిద్యాలు, హార్మోనియం, గిటార్, క్లాసికల్ డాన్స్, వక్తృత్వ, జానపద నృత్యం, క్విజ్, వ్యాసరచన, పెయింటింగ్ తదితర వాటిలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఖమ్మం నియోజవర్గంలో నిర్వహించిన యువజనోత్సవాలకు అనూహ్య స్పందన లభించిందన్నారు. మొత్తం 291 ఎంట్రీలు వచ్చాయన్నారు. ఈ అంశాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన యువ కళాకారులకు నవంబర్‌లో జరిగే జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ వీరపాండ్యన్, భద్రాచలం సబ్ కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, ఆర్డీవోలు సంజీవరెడ్డి, జడ్పీ సిఇఓ జయప్రకాశ్ నారాయణ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నాసిరకంగా రోడ్డు నిర్మాణ పనులు
* అడ్డుకున్న సిపిఎం నాయకులు
మధిర, ఆగస్టు 7: మండల పరిధిలోని ఆత్కూరు నుంచి మాటూరు క్రాస్‌రోడ్డు వరకు నిర్మిస్తున్న ఆర్ అండ్ బి రహదారి పనులు నాసిరకంగా ఉండటంతో బుధవారం సిపిఎం నాయకులు అడ్డుకొని నిలిపివేయించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు ఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ మండల పరిధిలోని సిరిపురం - నెమలి, మధిర - తిరువూరు రహదారి మరమ్మతు పనుల కోసం 1.96కోట్లు మంజూరయ్యాయన్నారు. అయితే మధిర - తిరువూరు రహదారిలో తారు వేస్తున్న రోడ్డు నాసిరకంగా ఉండటంతోవేసిన రెండు రోజులకే చిప్స్‌తో కూడిన తారు లేచిపోయి గుంటలు గుంటలుగా ఏర్పడిందన్నారు. వాస్తవంగా రహదారి 25మిల్లి మీటర్ల మందంతో నిర్మించాల్సి ఉండగా సంబంధిత కాంట్రాక్టర్ మాత్రం కేవలం 18నుంచి 20మిల్లి మీటర్ల మందంతోనే రోడ్డును నిర్మిస్తున్నప్పటికీ ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అదే విధంగా సైడ్‌బర్మ్‌లు మూడు అడుగులు వదిలిపెట్టి తారు రోడ్డును నిర్మించాల్సి ఉన్నప్పటికీ సైడ్‌బర్మ్‌ల నిర్మాణం చేయకుండానే రోడ్డును నిర్మిస్తుండటంతో అడ్డదిడ్డంగా ఉందని విమర్శించారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఇతర వాహనాలు రహదారిపైకి రాకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదన్నారు. వర్షం కురుస్తున్న సమయంలో కూడా నిర్మించకూడదనే నిబంధన ఉన్నా దీనికి విరుద్ధంగా రోడ్డు నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారని, దీని వల్ల రోడ్డుకు బీటలు వారే ప్రమాదముందన్నారు. రహదారి పనుల నిర్మాణం జరిగే సమయంలో ఆర్ అండ్ బి ఏఈతో పాటు డిఈ కూడా పర్యవేక్షణ జరపాల్సి ఉన్నప్పటికీ ఆ శాఖకు సంబంధించిన వారు ఎవరూ లేకుండానే ఇష్టం వచ్చిన రీతిలో కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేస్తున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా గత పది హేను రోజుల క్రితం నిర్మించిన దెందుకూరు - చిలుకూరు రోడ్డు రహదారి పనులు కూడా నాసిరకంగా చేయటం వల్ల పలు చోట్ల రహదారిపై గుంటలు ఏర్పడ్డాయని, రోడ్డు వేసిన తర్వాత సైడ్‌బర్మ్‌లు నిర్మించకపోవటంతో ఈ రోడ్డు ప్రమాదకరంగా మారిందన్నారు. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఎస్టీమేషన్ సమయంలో చేపట్టాల్సిన దాని కన్నా అదనంగా ఎస్టీమేషన్లు తయారు చేశారని ఆరోపించారు. ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లు, అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, క్వాలిటీ కంట్రోల్ శాఖ అధికారులు మండలంలో జరుగుతున్న అన్ని రహదారి మరమ్మతు పనులను పరిశీలించి నాసిరకంగా నిర్మించిన కాంట్రాక్టర్లపై, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలిన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండవ కృష్ణారావు, ఆవుల శ్రీనివాసరావు, వైవి అప్పారావు, వేముల శ్రీనివాసరావు, ఎస్‌కె మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరులో సిపిఎం ర్యాలీ
మణుగూరు, ఆగస్టు 7: పశ్చిమబెంగాల్‌లో సిపిఎం కార్యకర్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ హత్యా రాజకీయాలను ఖండిస్తూ బుధవారం మణుగూరు సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ స్థానిక ఆంధ్రబ్యాంకు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్ చేస్తున్న నిరంకుశ దాడి దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. పశ్చిమబెంగాల్‌లో తుపాకీలతో, ఆంధ్రరాష్ట్రంలో డబ్బుతో ప్రజాస్వామ్యం కూని అవుతోందన్నారు. సిపిఎం కార్యకర్తలపై నిర్బంధకాండను కొనసాగిస్తే భవిష్యత్‌లో తృణముల్ కాంగ్రెస్ పతనం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాటబోయిన నాగేశ్వరరావు, నెల్లూరి నాగేశ్వరరావు, రావులపల్లి రామ్మూర్తి, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, నయనారపు నాగేశ్వరరావు, గద్దల శ్రీనివాసరావు, బండి రాజేష్, సమితిసింగారం ఉపసర్పంచ్ బోడ నాగమ్మ, ఎస్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
తగ్గుముఖం పట్టిన గోదావరి
కూనవరం, ఆగస్టు 7: గత కొద్ది రోజులుగా తీవ్రరూపం దాల్చి ప్రవహించిన వరద గోదావరి నెమ్మదిగా తగ్గుతోంది. బుధవారం సాయంత్రంకు 36 అడుగులకు చేరి క్రమంగా తగ్గుతోంది. కొండ్రాజుపేట కాజ్‌వేపై వారం రోజులుగా వరదనీరు నిలిచే ఉంది. దీంతో సుమారు పది గిరిజన గ్రామాలకు రాకపోకలు నాటి నుంచి నేటి వరకు పునరుద్ధరణ కాలేదు. వారం రోజులుగా పంట చేలపై వరద ప్రవహించడంతో పత్తి చేలు పూర్తిగా నాశమయ్యాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో విద్యుత్ శాఖాధికారులు మండలానికి విద్యుత్‌ను పునరుద్ధరించారు. రోడ్లపై ఉన్న వరదనీరు తగ్గడంతో భద్రాచలం నుంచి కూనవరం, వి.ఆర్.పురం మండలాలకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. వరద ఉద్ధృతికి పోలిపాక వద్ద ప్రధాన రహదారి మూడు చోట్ల కొట్టుకుపోయింది. దీంతో ఆర్‌అండ్‌బి అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి రవాణాకు చర్యలు చేపట్టారు. రెవెన్యూ శాఖాధికారులు వరద ముంపునకు గురైన ఇళ్లను సర్వే చేస్తున్నారు. వ్యవసాయ శాఖాధికారులు మండలంలో పర్యటిస్తూ ముంపునకు గురైన పంట పొలాలను సర్వే చేపడుతున్నారు. ఇదిలా ఉండగా వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను బుధవారం డిపిఓ పి ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. వరదనీరు చేరిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించేందుకే తాను వచ్చానని, స్థానిక అధికారులతో 14 ప్రత్యేక బృందాలను జిల్లాలో నియమించామన్నారు. డిఎల్పీఓ ఆర్ ఆశలత, ఈఓఆర్డీ ఎ సత్యనారాయణ, ఈఓ ఆర్ సత్యనారాయణ, సర్పంచ్ కట్టం సునీత తదితరులు పాల్గొన్నారు.
24 క్రస్ట్‌గేట్ల ఎత్తివేతతో
సాగర్‌డ్యాం నుండి కృష్ణమ్మ పరవళ్లు
విజయపురిసౌత్, ఆగస్టు 7: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్‌కు బుధవారం 4.50 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో సాగర్ జలాశయం గరిష్టస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో కృష్ణమ్మతల్లికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ యల్లారెడ్డి, ఎస్‌ఇ ఉదయరంజన్, డిఇ అంజ య్య సాంప్రదాయబద్ధం గా, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్విచాన్ చేసి క్రస్ట్‌గేట్లను ఎత్తారు. తొలుత 14వ నంబర్‌తోపాటు ఆరుగేట్లను ఐదడుగుల మేరకు ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదీలోకి వదిలారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆరుక్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుండి వరదనీరు ఉద్ధృతి పెరగడంతో సాయంత్రం మరో 12గేట్లను ఎత్తారు. ఎగువ జలాశయాలైన జూరాల, రోజాప్రాజెక్టుల నుండి శ్రీశైలానికి 3.44లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుండి సాగర్‌కు 4.80లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో సాగర్ నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 585.80అడుగులకు చేరుకుంది. ఇది 306.90 టిఎంసిలకు సమానం, సాగర్ జలాశయం నుండి కుడి కాలువకు 8,006, ఎడమ కాలువకు ఎనిమిదివేల క్యూసెక్కులను, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,047, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుండి మొత్తం 1,92,567 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం 883.90 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది 209 టిఎంసిలకు సమానమని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.