గుంటూరు, ఆగస్టు 7: స్వచ్ఛందంగా కదలిన ప్రజానీకంతో 8వ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం కదంతొక్కింది. వివిధ వర్గాల ప్రజల నిరసనల జోరు... నినాదాల హోరుతో నగరం ప్రతిధ్వనించింది. సమైక్యాంధ్రే లక్ష్యంగా ప్రజలు తరలిరావడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది. బుధవారం ఎపి ఎన్‌జివో అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక బృందావన గార్డెన్స్‌లోని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జెడి శీలం ఇంటిని ముట్టడించి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. మంత్రి శీలం అందుబాటులో లేకపోవడంతో ఆయన ప్రతినిధికి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు టివి రామిరెడ్డి పలువురు నాయకులు వినతిపత్రం అందజేశారు. నవోదయం పార్టీ అధ్యక్షుడు నల్లక విజయరాజు సమైక్యాంధ్రకు మద్దతుగా హిందూ కళాశాల సెంటర్‌లో ఆమరణ దీక్ష చేపట్టారు. కేంద్రం స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించిందని, రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న యోచనను విరమించుకోకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కాంక్షిస్తూ విజ్ఞాన్, హిందూ కళాశాలల విద్యార్థులు స్థానిక లక్ష్మీపురంలోని మదర్‌థెరిస్సా విగ్రహం నుండి హిందూ కాలేజ్ సెంటర్ వరకు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి సమైక్యాంధ్రకు మద్దతుగా హిందూ కాలేజ్ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కాగా మూడవ రోజూ విధులు బహిష్కరించిన నగరపాలక సంస్థ ఉద్యోగులు మున్సిపల్ వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు ర్యాలీ, లాడ్జిసెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ల నాయకులు శంకర్‌విలాస్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. తెలుగుజాతి ప్రజలు విడిపోకుండా సమైక్యంగా ఉండాలంటూ రాజస్థాన్ యంగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగంరలో ర్యాలీ నిర్వహించారు. ఎంపి రాయపాటి యువసేన నాయకులు స్థానిక కన్నా వారితోటలోని సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాగా నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు సమావేశమై ఆర్టీసీ యాజమాన్యానికి 8న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించారు.
కాజ రామాలయంలో చోరీ
* 3.5 లక్షల సొత్తు అపహరణ
మంగళగిరి, ఆగస్టు 7: మండల పరిధిలోని కాజగ్రామంలో గల కోదండ రామస్వామి ఆలయంలో బుధవారం తెల్లవారుఝామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి సుమారు మూడున్నర లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు దోచుకుపోయారు. పోలీసుల కథనం ప్రకారం ఆలయ ప్రహరీ దూకి లోనికి ప్రవేశించిన దుండగులు ప్రధాన ద్వారానికి ఉన్న తాళాలను పగులగొట్టి గర్భాలయంలోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బంగారు నెక్లెస్, మంగళసూత్రాలతో పాటు వెండి శఠారు, పంచపాత్ర, ధనుస్సు, బాణం, కిరీటాలు మొదలైనవి అపహరించుకు పోయారు. ఆలయ ఇఓ కృపాల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఎస్పీ ఎం మధుసూధనరావు, రూరల్ సిఐ మురళీకృష్ణ, ఎస్సై సత్యనారాయణ సంఘటనా స్థలికి చేరుకుని ఆలయ అర్చకులు రొంపిచర్ల సత్యప్రసాద్, ఇఓ కృపాల్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి చుట్టూ ఉన్న ప్రహరీ గేట్లకు తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. ప్రహరీ గోడను దూకి దుండగులు లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. క్లూస్‌టీంను రప్పించి నేరస్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ మధుసూదనరావు తెలిపారు. కాగా గ్రామంలోని పంచాయితీ ఆఫీసు ఎదుట ఉన్న పడమట దేశిమ్మ తల్లి ఆలయం, శ్రీకృష్ణ మందిరంలో కూడా దుండగులు ప్రవేశించి రెండు ఆలయాల్లో హుండీలను పగులగొట్టి భక్తులు సమర్పించిన కానుకలను అపహరించుకుని పోయారని గ్రామస్తులు తెలిపారు. ఒకేరోజు గ్రామంలో మూడు ఆలయాల్లో చోరీలు జరగడం పట్ల గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తంచేశారు. పోలీసు గస్తీ పెంచుతామని డిఎస్పీ మధుసూదనరావు హామీ ఇచ్చారు.
సమైక్యోద్యమాన్ని పట్టించుకోని కేంద్రం
* వైఎస్సార్ సీపీ నేత అప్పిరెడ్డి
గుంటూరు, ఆగస్టు 7: రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాల అనంతరం ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టిడిపి ధోరణి విచిత్రంగా ఉందని వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం అరండల్‌పేటలోని తన కార్యాలయంలో అప్పిరెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో ఉద్యమాలు ఎగిసిపడుతున్నప్పటికీ కేంద్రప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. తెలంగాణ విభజనకు అనుకూలంగా టిడిపి, కాంగ్రెస్ కూడబలుక్కుని మద్దతు తెలుపుతున్నాయని, ఇదే సమయంలో దివంగత వైఎస్‌పై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. 2009లో టిడిపి టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణ కావాలని అడిగిందన్నారు. అధికారంలోకి వచ్చి న వైఎస్ తెలంగాణ అంశాన్ని ఎస్సార్సీకి సిఫార్సు చేశారని తెలిపారు. వీటన్నింటినీ కప్పిపుచ్చి టిడిపి నాయకులు వైఎస్‌పై బురద జల్లడం హేయమని అప్పిరెడ్డి ఖండించారు. బాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగానే రాష్ట్రాన్ని విభజన గండం వచ్చిందన్నా రు.