చిత్తూరు, ఆగస్టు 7: జిల్లా కేంద్రమైన చిత్తూరుతోపాటు జిల్లాలో బంద్ సందర్భంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. వారంరోజుల పాటు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే, ప్రజానాయకుడు సికె బాబు సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసులు దీక్ష భగ్నం చేయడంతో అప్పటి నుండి ఒకటిన్నర రోజుపాటు చిత్తూరు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుండే జిల్లాకేంద్రమైన చిత్తూరుపట్టణంలో దుకాణాలు మూసుకున్నాయి. ఇంకోవైపు రెండు రోజుల క్రితమే తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లె శ్రీనివాసులు సమైక్యాంధ్ర కోరుతూ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బంద్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. రెండు పార్టీలు బంద్‌కు పిలుపునివ్వడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళనతో ఒక్క దుకాణం కూడా తెరుచుకోలేదు. బుధవారం బంద్‌కు సికె బాబు అనుచరులు పిలుపునివ్వడంతో ఆటోలు, ఎలాంటి వాహనాలు చిత్తూరుపట్టణంలో తిరగలేదు. మరోవైపు తమిళనాడు- ఆంధ్ర సరిహద్దులోని గుడిపాల మండలంలో పోటాపోటీగా టిడిపి, కాంగ్రెస్ నాయకులు వాహనాలను నిలిపివేయడంతో పక్కరాష్ట్రాల నుండి వచ్చేవాహనాలు ఒక్కటికూడా చిత్తూరులోకి రాలేదు. ఇంకోవైపు పలమనేరు నియోజకవర్గ పరిధిలోని గంగవరం మండలం పత్తికొండ వద్ద జాతీయ రహదారిని స్తంభింపచేశారు. దీంతో కర్ణాటక నుండి కూడా ఎలాంటి వాహనాలు రాలేదు. అలాగే కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం మండలం మల్లానూరు బార్డర్, (మిగతా 7వ పేజీలో)
(1వపేజీ తరువాయ)గుడుపల్లి మండలంలో, శాంతీపురం మండలం ఏడవమైలు తదితర ప్రాంతాల్లో తమిళనాడు, కర్ణాటక నుండి చిత్తూరుజిల్లాలోకి రవాణా సాగించే వాహనాలను బుధవారం ఉదయం ఆందోళనకారులు నిలిపివేశారు. అలాగే మదనపల్లె డివిజన్‌లోని తంబళ్ళపల్లె నియోజకవర్గం, మదనపల్లె నియోజకవర్గాల్లో కర్ణాటక, అనంతపురం నుండి వచ్చే వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పక్కరాష్ట్రాల నుండి జిల్లాకు వచ్చే ప్రజల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయింది. దాదాపుగా వారం రోజులపాటు ఆర్టీసీ యూనియన్ నాయకులు కూడా సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వడంతో ఎక్కడా వాహనాలు రాకపోకలు సాగలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా చిత్తూరు జిల్లాకు రావాల్సిన అవసరం ఉంటే వారు రైళ్ళపై ఆధారపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో రైళ్ళు యధావిధిగా తిరుగుతూనే ఉన్నాయి. అయితే పక్క జిల్లాల్లో రైల్‌రోకోలు జరుగుతుండడంతో అవి కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. సమైక్యవాదం వినిపిస్తూ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కాకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలు, యువత స్వచ్ఛందంగా రోడ్లపైకి రావడంతో బంద్ ప్రశాతంగా సంపూర్ణగా జరుగుతోంది. ఇంకోవైపు ఎన్‌జివోలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జెఎసి ఆధ్వర్యంలో గత ఏడు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు సైతం బోసిపోయి దర్శనమిస్తున్నాయి. ఒక పక్క పంచాయతీ ఎన్నికలు ముగియకమునుపే గత ఎనిమిది రోజులుగా సీమాంధ్ర ప్రాంతంలోని 13జిల్లాల్లో సమైక్యాంధ్ర కోసం బంద్, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. వారం రోజులపాటు ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. బుధవారం జిల్లాలో బ్యాంకులు, ఏటిఎంలు కూడా దాదాపుగా మూసివేశారు.
వరకట్న వేధింపులతో నవవధువు ఆత్మహత్య
* పెళ్లి అయిన మూడు నెలలకే విషాదం
* మృతురాలి ఒంటిపై నగలతో భర్త పరార్
బైరెడ్డిపల్లె, ఆగస్టు 7: వరకట్న వేధింపులతో ఒక నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కైగల్ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. మృతురాలి తండ్రి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన స్వాతి అలియాస్ కోటేశ్వరి(19)కు బైరెడ్డిపల్లె మండలం కైగల్ గ్రామానికి చెందిన రామచంద్రనాయుడు కుమారుడు శ్రీనివాస్ అలియాస్ హరీష్‌కు 2013 మే 22వ తేది విజయవాడలో వివాహం జరిగింది. శ్రీనివాస్ హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు కోటీశ్వరి ఏడాది క్రితం పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. శ్రీనివాస్ తాను ప్రేమించిన కోటీశ్వరి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పెళ్లి చేయాలని కోరాడు. ఏడాది క్రితం కోటీశ్వరి తల్లిదండ్రులు తొలుత వివాహానికి అంగీకరించలేదు. ఈనేపథ్యంలో కోటీశ్వరిని తనతోపాటు శ్రీనివాస్ కైగల్‌కు తీసుకొచ్చాడు. అప్పట్లో కోటీశ్వరి మైనర్ అని తన కుమార్తెను శ్రీనివాస్ కిడ్నాప్ చేశాడని విజయవాడ పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈసమాచారాన్ని తెలుసుకున్న శ్రీనివాస్ వెంటనే కోటీశ్వరిని వారి తల్లిదండ్రులకు అప్పగించాడు. అనంతరం కోటీశ్వరికి మైనర్ తీరిందని మళ్లీ శ్రీనివాస్ అమ్మాయి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తనకు తల్లిదండ్రులు లేరని మీ అమ్మాయిని వివాహం చేస్తే ఇల్లరికం ఉంటానని నమ్మించడంతో వారు పెళ్లికి అంగీకరించి మే నెలలో పెళ్లి చేశారు. పెళ్లి అయిన వెంటనే తనకు బెంగళూరులో పని ఉందని కోటీశ్వరిని కైగల్‌కు తీసుకొచ్చాడు. వివాహ సమయంలో తమ కుమార్తెకు ఒకటిన్నర లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేశానని ఆమె తండ్రి పేర్కొన్నాడు. పెళ్లి అయిన కొన్ని రోజులకే అదనం కట్నం కావాలని కోటీశ్వరిని శ్రీనివాస్ వేధించేవాడు. దీంతో రెండు విడతలుగా 50వేల రూపాయలను కోటీశ్వరి తండ్రి అల్లుడి బ్యాంకు ఖాతాకు జమ చేశాడు. కానీ మంగళవారం రాత్రి శ్రీనివాస్ మద్యం సేవించి తన తల్లితో ఘర్షణపడి భార్యను అదనపుకట్నం తీసుకురావాలని వేధించడంతో జీవితంపై విరక్తి చెంది కోటీశ్వరి అత్త ఇంటిలోనే ప్యాన్‌కు ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడింది. భర్త వెంటనే చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోటీశ్వరి చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే తన మామకు సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలిపాడు. అనంతరం మృతురాలి వంటిపై ఉన్న బంగారు నగలను తీసుకెళ్లి శ్రీనివాస్ పరారైయ్యాడు. బుధవారం మృతురాలి తల్లిదండ్రులు బైరెడ్డిపల్లె పోలీసులకు ఈమేరకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు. ఎస్సై మునస్వామి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సమైక్యాంధ్ర కోసం కిరోసిన్ పోసుకుని ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం
కెవిబిపురం, ఆగస్టు 7: టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు రామాంజుల నాయుడు ఆధ్వర్యంలో ఆది పంచాయతీలో పెద్ద ఎత్తున ప్రజలు ధర్నా నిర్వహించి, సోనియా, రాహుల్‌గాంధీ, చిదంబరం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు యువకులు వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడ్డారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకుని విరమింపజేశారు. ప్రాణాలు పోగొట్టుకుంటే మీ కుటుంబాలు వీధిన పడతాయని వారికి పోలీసులు హితబోధ చేశారు. రామాంజయులనాయుడు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బాలనాయుడు, సుబ్రహ్మణ్యం, గోపీనాయుడు సుమారు 200 మందికిపైగా యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్‌ఐ సునీల్‌కుమార్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
లొంగిపోయిన తిరుమలలో హత్య కేసు నిందితులు
* భార్యలను వేధించారనే చంపేశాం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఆగస్టు 7: తమ భార్యలను తరచూ వేధిస్తున్నాడని హెచ్చరించినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా తీరు మారలేదని ప్రకాశం జిల్లాకు చెందిన వెంకట్రావ్ అనే హాకర్‌ను హత్య చేసినత ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు బుధవారం తిరుమల పోలీసుల ఎదుట లొంగిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణానాయక్ అనే కాంట్రాక్టర్ వద్ద నల్గొండకు చెందిన నగేష్, సురేష్ అనే ఇద్దరు కూలీలు పనిచేసేవారు. వీరి భార్యలను తిరుమలలో చిరు వ్యాపారం చేసుకుని జీవించే వెంకట్రావ్ తరచూ వేధిస్తుండేవాడు. అతని వేధింపులు భరించలేని ఆ మహిళలు తమ భర్తలకు విషయాన్ని తెలియజేశారు. నగేష్, సురేంద్రలు తమ భార్యలను వేధించడం తగదని పలుమార్లు హెచ్చరించారు. అప్పటికి తీరు మారకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు హెచ్చరించినా ప్రకాష్ తన తీరు మార్చుకోలేదు. దీంతో ఆగ్రహించిన నగేష్, సురేంద్రలు ప్రకాష్‌ను హత్య చేశారు. అనంతరం ఈ విషయాన్ని తమ కాంట్రాక్టర్ కృష్ణానాయక్‌కు తెలిపారు. ఆయన వారిని పోలీసులకు లొంగిపోవాల్సిందిగా సూచించారు. దీంతో వారు బుధవారం తిరుమల పోలీసులకు లొంగిపోయారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తిరుమల నారాయణగిరి కొండల్లో ట్రాక్టర్ బోల్తా
* ఒకరు మృతి
తిరుపతి, ఆగస్టు 7: తిరుమల నారాయణగిరి పాదాలకు వెళ్లే మార్గంలో జరుగుతున్న నిర్మాణ పనులకు కూలీలతో వెళుతున్న ఒక ట్రాక్టర్ బుధవారం నాడు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో శ్రీకాకుళంకు చెందిన ఒక కూలీ అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ప్రయాణిస్తున్న 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే తిరుపతి రుయాసుపత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. ప్రస్తుతం వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు శ్రీకాకుళం వాసులు కాగా మిగతా ఏడుగురు కార్మికులు చిత్తూరు జిల్లా వెదురుకుప్పంకు చెందిన వారు ఉన్నారు. సముద్ర మట్టానికి సుమారు 2500 అడుగుల ఎత్తులో ఉన్న నారాయణగిరి కొండల్లో ఉన్న స్వామివారి పాదాలను దర్శించేందుకు వెళుతున్న విషయం పాఠకులకు విదితమే. ఈ నేపధ్యంలో పలు రోడ్డు ప్రమాదాలు జరిగి భక్తులు ప్రాణాలను కోల్పోయారు. అయినప్పటికి వాహన చోదకులకు టిటిడి తగిన హెచ్చరికలు చేయడంలో వైఫల్యం చెందుతూ ఉందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండాలంటే టిటిడి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఆ ప్రాంతంలోని మలుపులను, రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని భక్తులు చెపుతున్నారు.
11 నుండి ఈ- దర్శన్ కౌంటర్లలో వరలక్ష్మీవ్రతం సేవా టిక్కెట్ల విక్రయం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఆగస్టు 7: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 16వతేదీన నిర్వహించనున్న వరలక్ష్మీవ్రతంలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం ఈ నెల 11వతేది నుండి ఈ- దర్శన్ కౌంటర్లలో టిక్కెట్లు విక్రయాలు జరుగనున్నట్లు టిటిడి తిరుపతి జెఇఓ వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. బుధవారం వరలక్ష్మీవ్రతం ఏర్పాట్లకు సంబంధించి ఆయన శ్రీపద్మావతి అతిథిగృహంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12వతేది నుండి పద్మావతి ఆలయం వద్ద ఉన్న కౌంటర్లలో టిక్కెట్ల విక్రయం జరుగుతుందన్నారు. 500 రూపాయలు చెల్లించిన గృహస్తులు ఇద్దరు వరలక్ష్మీవ్రతంలో పాల్గొనవచ్చునన్నారు. వరలక్ష్మీవ్రతాన్ని పురస్కరించుకుని ఈ నెల 16వతేది సాయంత్రం భక్తుల భజనలు, కోలాటాల నడుమ స్వర్ణరథం ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. 10 వేల మంది భక్తులకు అన్న ప్రసాదాలను కూడా సిద్దం చేస్తున్నారన్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా అదే రోజు ఆలయంలో అమ్మవారికి అభిషేకం అనంతరం జరిగే దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల సేవను రద్దు చేశారన్నారు. ఈ వరలక్ష్మీవ్రతంలో తిరుపతి, తిరుచానూరు ప్రాంత ప్రజలతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సమావేశంలో టిటిడి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఇఓ భాస్కర్‌రెడ్డి, ఎఇఓ శివారెడ్డి, డిపిపి ప్రత్యేకాధికారి రఘునాథ్ పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు విద్యాపరంగా తీరని నష్టం
* శాప్స్ ఆధ్వర్యంలో ప్రైవేటు ఇంగ్లీషుమీడియం స్కూల్స్ దీక్షలు
తిరుపతి, ఆగస్టు 7: రాష్ట్ర విభజన జరిగితే జీవితాతం తెలుగువారి మధ్య చిచ్చుపెట్టినట్లేనని తిరుపతి న్యాయవాద సంఘం నేతలు అన్నారు. శాప్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న దీక్షాశిబిరంలో బుధవారం తిరుపతిలోని ప్రైవేటు ఇంగ్లీషుమీడియం స్కూల్స్ యజమానులు దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రమ్సా జెఎసి నేతలు విశ్వనాధరెడ్డి, వాసు, శర్మ, రాజేంద్ర ప్రసాద్, రఘునారాయణరావులు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే విద్యాపరంగా తీవ్రంగా నష్టపోవలసి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోనే సెంట్రల్ వర్శిటిలు, ఐఐటిలు, పారిశ్రమలు, విద్యా, వైద్య శిక్షణా సంస్థలున్నాయన్నారు. రాష్ట్ర రాజధాని కావడంతో హైదరాబాద్‌లోనే అన్ని విద్యా సంస్థలను ఏర్పాటు చేశారన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని డిమాండ్ చేశారు.
నరసింహయాదవ్ ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ
సమైక్యాంధ్రను కోరుతూ టిడిపి రాష్ట్ర కార్యదర్శి జి నరసింహయాదవ్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేశారు. సుమారు 200 మంది తెలుగుయువత నాయకులతో కలిసి స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మోతతో నగరం మారుమోగింది. ఈ కార్యక్రమంలో కృష్ణయాదవ్, మహేష్ యాదవ్, చంటి, చిన్న, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కుప్పంలో టిడిపి మహాధర్నా
కుప్పం: సమైక్యాంధ్ర సాధన కోసం కుప్పంలో బుధవారం టిడిపి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలను పట్టణంలో ఊరేగిస్తూ చెప్పులు, చీపురులతో కొడుతూ నినాదాలు చేశారు. సుమారు 2వేల మంది తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు కొత్తపేట, రైల్వేగేటు, రిజిస్ట్రారు, తహశీల్దారు, సిఐ కార్యాలయాలు, బాలికల ఉన్నతపాఠశాల, గాంధీ విగ్రహం, బాలుర ఉన్నతపాఠశాల, పొట్టి శ్రీరాములు విగ్రహం, గ్రంథాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయ క్యాంపు కార్యాలయం, పంచాయతీ బస్టాండు, పోలీసుస్టేషను, రవి స్టూడియో, తిరుపతి గంగమ్మదేవాలయం, పెద్దవారాది, చెరువు కట్ట వరకు ర్యాలీ కొనసాగించారు. బుధవారం ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పి. ఎస్.మునిరత్నం, గోపినాధ్, సత్యేంద్ర, సాగర్, ఆర్.శ్రీనివాసులు నాను తదితరులు భారీర్యాలీ నిర్వహించారు.
రాహుల్‌ను ప్రధానిగా చేసేందుకే రాష్ట్ర విభజన
* విశాలాంధ్ర సమైక్యయాత్ర మహాసభ అధ్యక్షులు పరకాల ప్రభాకర్
మదనపల్లె, ఆగస్టు 7: రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికే రాష్ట్ర విభజన చేశారని విశాలాంధ్ర సమైక్యయాత్ర మహాసభ అధ్యక్షులు పరకాల ప్రభాకర్ దూషించారు. సమైక్యయాత్రలో భాగంగా బుధవారం మదనపల్లెకు చేరుకున్న ఆయన స్థానిక ఎన్జీఓ హోమ్‌లో సమావేశం నిర్వహించి అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. విభజన జరిగిపోయిందని ప్రచారం అవాస్తవమన్నారు. దుర్మార్గపు ఆలోచనలు కాకుండా సమైక్య నినాదంతో ముందుకెళ్ళాలని, ఉద్యమం నిష్టత, నిష్పక్షపాతంగా చేసేందుకు సామాన్యులు ముందుకు రావాలని, రాజకీయనాయకులు లేకుండా ఉద్యమం నిర్వహించాలని, ఉద్యమం రెండురోజులు కాకుండా రాష్ట్రం ముక్కలు చేస్తే పరిణామాలు ఎలావుంటాయో తెలియజేసే విధంగా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ విలేఖరుల సమావేశంలో మిట్స్ కళాశాల కరస్పాండెంట్ విజయభాస్కర్‌చౌదరి, విశాలాంధ్ర సమైక్యయాత్ర నాయకులు మహబూబ్‌నగర్ జిల్లా రవితేజ, కరీంనగర్ జిల్లా శ్రీనివాసులురెడ్డి, శాప్స్ రాష్ట్ర అధ్యక్షులు కోడూరి బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి, ఎస్టీయు జిల్లా అధ్యక్షులు మధుసూదన్, యుటిఎప్ రవిప్రకాష్, జెఎసి నాయకులు ఉన్నారు.
సమపాలన పాటించని వైద్యులకు మెమోలు ఇవ్వండి
* రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సుబ్బరామ్ ఆదేశం
మదనపల్లె, ఆగస్టు 7: సమయపాలన పాటించని వైద్యులకు మెమోలు ఇవ్వాలని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సుబ్బరామ్ ఆర్‌ఎంఓ డాక్టర్ గురుస్వామినాయక్‌ను ఆదేశించారు. బుధవారం మదనపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ స్వయంగా వార్డుల్లోని రోగులను పలకరిస్తూ, సేవలపై ఆరా తీశారు. డాక్టర్లు సకాలంలో రావడం లేదని, వైద్యం అందడం లేదని ఆపరేషన్ చేసి వారంరోజులైనా డాక్టర్లు అందుబాటులోకి రావడం లేదని రోగులు కమిషనర్‌కు విన్నవించారు. దీంతో ఆగ్రహించిన కమిషనర్ సకాలంలో విధులకు హాజరై వార్డుల్లో రోగులను పరీక్షించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులపై మెమోలు జారీచేయాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని ప్రసూతివార్డు, మహిళావార్డు, ఆరోగ్యశ్రీ వార్డు, పురుషుల వార్డు, పేయింగ్‌వార్డు, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో రోగుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వాసుపత్రిని 150పడకల స్థాయికి పెంచేందుకు ఆసుపత్రి అడ్వయిజర్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యేతో మాట్లాడి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మదనపల్లెలో బయోమెట్రిక్ విధానం అమలుచేసినట్లు తెలిపారు. వీరి వెంట ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పాల్వ్రికుమార్, ఆర్‌ఎంఓ, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు.