Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆథార్ నమోదులో రాష్ట్రంలో జిల్లా ప్రధమ స్థానం

$
0
0

కాకినాడ సిటీ, ఆగస్టు 7: ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ వివరాల సేకరణ ఆన్‌లైన్ నమోదు చేపట్టిన ఆధార్ ఫ్రెండ్లీ ఇన్పో కార్యక్రమం నందు రాష్ట్రంలోనే జిల్లా ప్రధమ స్థానం సాధించిందని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం రాజీవ్ విద్యామిషన్, విద్యాశాఖాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లో 7 లక్షల 54 వేల 519 మంది విద్యార్థులు చదువుతుండగా వీరిలో ఇప్పటి వరకు 5 లక్షల 6 వేల 820 మంది విద్యార్థుల ఆధార్ వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే 95 శాతం పూర్తి కాగా ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో 50 శాతం పూర్తయిందని ఈ ప్రక్రియను విద్యాశాఖాధికారులు వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు. ఈ ఆధార్ నమోదు అంశంలో ఆదిలాబాద్ జిల్లా 63 శాతంతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో జెసి ఆర్ ముత్యాలరాజు, ఎజెసి మార్కండేయులు, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పద్మావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వినూత్న
నిరసనలతో
అట్టుడుకుతున్న జిల్లా!
శవయాత్రలు, మానవ హారాలు, యజ్ఞయాగాలు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఆగస్టు 7: ఆంధ్రప్రదేశ్‌ను ఎట్టిపరిస్థితుల్లో విభజించరాదన్న డిమాండ్‌తో సమైక్యవాదుల చేపట్టిన నిరసనోద్యమం ఎనిమిదో రోజైన బుధవారం కూడా జిల్లాలో ఉవ్వెత్తున సాగింది... జిల్లాలోని పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శవయాత్రలు, మానవహారాలు, రాస్తారోకోలు, ధర్నాలతో జిల్లా యావత్తూ దద్దరిల్లింది... జిల్లా కేంద్రం కాకినాడలో బుధవారం ఎక్కడ చూసినా ఉద్రిక్త పరిస్థితులే కనిపించాయి. ముఖ్యంగా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన యజ్ఞయాగాదులు, హోమాలు, పిండ ప్రదానాలు అన్ని వర్గాల్లో తీవ్ర ఉత్సుకతను కలిగించాయి. మరోవైపు శవయాత్రలు జోరుగా సాగాయి. సోనియాగాంధీ, కెసి ఆర్‌ల దిష్టిబొమ్మలను పాడెపై కట్టి ఊరేగించి, డప్పులు, డోళ్ళతో ఊరేగిస్తూ బాణా సంచా వెలిగించిన వైనం దహన సంస్కారాలను తలపించింది... ఏ ప్రథాన కూడలి చూసినా దిష్టిబొమ్మల దహనంతో పొగలు కమ్మింది. ఉద్యోగ జెఎసి సహా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని దంటు వారి వీధిలో గల కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎం పళ్ళంరాజు నివాసాన్ని ముట్టడించారు. కేంద్రమంత్రి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో ప్రతిరోజు కేంద్రమంత్రి ఇంటి వద్ద ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించింది. బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని బాలాజీ చెరువు జంక్షన్ వద్ద ప్రత్యేక హోమం నిర్వహించి, సోనియా, కెసిఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సోనియా, కెసిఆర్ దిష్టిబొమ్మలకు వెల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాడె గట్టి శవయాత్ర చేశారు. న్యాయవాదులు, వైద్యులు, పాత్రికేయులు, లారీ ఓనర్లు, ఎలక్ట్రానిక్స్, మోటార్ మెకానిక్ షెడ్లు, ఆటో యూనియన్లు, టూ వీలర్ షోరూమ్స్ ఉద్యోగులు, పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు వేలాదిగా శవయాత్రలు, మానవహారాలు, రాస్తారోకోలు, ధర్నా కార్యక్రమాలు, వంటావార్పు, ఉద్యోగుల పెన్‌డౌన్ సమ్మెలతో నగరాన్ని దద్దరిల్లేలా చేశారు. ఎక్కడపడితే అక్కడ కెసిఆర్, సోనియాగాంధీ తదితరుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, తోట నరసింహం తదితరుల చిత్ర పటాలను కూడా ఊరేగిస్తూ రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. ఆయా ఆందోళన కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పంతం నానాజీ, కురసాల కన్నబాబు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, కంపర రమేష్, తెలుగుదేశం నుండి మాజీ మంత్రులు చిక్కాల రామ్‌చంద్రరావు, ముత్తా గోపాలకృష్ణ, వనమాడి వెంకటేశ్వరరావు, పోతుల విశ్వం, నున్న దొరబాబు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుండి చలమలశెట్టి సునీల్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఉద్యోగ జెఎసి నుండి పితాని త్రినాథరావు, ఆచంట రామారాయుడు, బూరిగ ఆశీర్వాదం, సంసాని శ్రీనివాసరావు, పాత్రికేయ సంఘాల నుండి టి మధుసూదనరావు, కె స్వాతిప్రసాద్, సత్యంబాబు, వి సాయిబాబా, మోజేష్‌బాబు, ఫణీంద్ర, జి శ్రీనివాసరావు, చేతన, బ్రాహ్మణ సంఘాల నుండి మధ్వ కమిటీ అధ్యక్షుడు రాచూరి రాఘవేంద్రస్వామి, చెరుకుపల్లి లక్ష్మీనృసింహశర్మ, యాతగిరి పరశురాం, ఆకెళ్ళ మురళీకృష్ణశర్మ, చీమలకొండ కృష్ణమూర్తి, ఉడిపి సంఘం నుండి వై వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా పాత్రికేయుల నిరసన ప్రదర్శన సందర్భంగా వి సాయిపెరుమాళ్ళు అనే విలేఖరి ఒంటిపై కిరోసిన్ పోసుకుని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఏర్పాటు
21 మందితో కార్యవర్గం - ఆందోళనకు కార్యాచరణ
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఆగస్టు 7: రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైనట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రక్రియను అడ్డుకునేందుకై జిల్లాలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఏర్పాటైంది. ఈమేరకు 21 మందితో కూడిన కార్యవర్గాన్ని ఉద్యోగ, కార్మిక జెఎసి బుధవారం ప్రకటించింది. అత్యవసర సేవలకు విఘాతం కలుగకుండా ఆయా వర్గాల ఆధ్వర్యంలో జెఎసి నాయకత్వంలోనే ఉద్యమాలను ఉమ్మడిగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ వేదిక ఛైర్మన్‌గా ఎపిఎన్‌జిఒ సంఘం జిల్లా ఛైర్మన్‌గా బి ఆశీర్వాదం, కో-్ఛర్మన్లుగా మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, ఎల్ కిశోర్‌కుమార్, ఆచంట రామారాయుడు ఎంపికయ్యారు. వైస్ ఛైర్మన్లుగా ఎండి జవహర్ ఆలీ, గ్రంథి బాబ్జీ, దంటు సూర్యారావు, కె స్వాతిప్రసాద్, ఎండిఎ ఖాన్, బి నరసింహరావు, పి రవికుమార్, జగడం రవితేజ, పి రవితేజ, అలాగే కన్వీనర్‌గా పితాని త్రినాథరావు, జాయింట్ కన్వీనర్లుగా కెవివి సత్యనారాయణ, ఎ మురళీకృష్ణ, వై సత్యనారాయణమూర్తి, చిన పాపారావు, కోశాధికారిగా సిహెచ్ సూర్యనారాయణ ఎంపికయ్యారు.
వేగంగా తగ్గుతున్న ప్రవాహం
*మొదటి హెచ్చరిక స్థాయికి గోదావరి
* తేరుకున్న ఏజన్సీ గ్రామాలు
* లంక గ్రామాలను వీడని ముంపు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఆగస్టు 7: గోదావరి వరద ప్రవాహం బుధవారం రాత్రికి మొదటి హెచ్చరిక స్థాయికి చేరుకుంది. సాయంత్రం 6గంటలకు ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.70అడుగులకు చేరుకోవటంతో గోదావరి హెడ్‌వర్క్స్ అధికారులు రెండో వరద హెచ్చరికను ఉపసంహరించారు. రాత్రి 8గంటలకు వరద ప్రవాహం 13లక్షల క్యూసెక్కుల దిగువకు చేరుకుంది. వరద ఉద్ధృతి సాయంత్రం నుండి కాస్తంత వేగంగానే తగ్గుతుండటంతో గురువారం మధ్యాహ్నానానికి మొదటి హెచ్చరికను కూడా ఉపసంహరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం మొదటి హెచ్చరిక స్థాయి కన్నా దిగువకు చేరుకున్న తరువాత కూడా రెండు రోజుల పాటు కోనసీమ లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కోనసీమ లంక గ్రామాల్లో వరద నీరు తగ్గుతున్నప్పటికీ, సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే మరో నాలుగైదు రోజులు పట్టేలా ఉంది. ఏజన్సీలోని దేవీపట్నం తదితర 33గ్రామాలు ఇప్పుడిప్పుడే జలదిగ్బంధం నుండి బయటపడుతున్నాయి. ఈ గ్రామాలకు సాయంత్రం నుండి రాకపోకలు మొదలయ్యాయి. గురువారం ఉదయానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. జలదిగ్బంధం నుండి బయటపడినప్పటికీ వరద కారణంగా చాలా రోజుల పాటు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని లంక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. లంక గ్రామాల్లోని చాలా మంది పేద వర్గాలకు చెందిన ప్రజలు ఇప్పటికీ వంట చెరుకునే వినియోగిస్తున్నారు. అలాంటి వారికి వంట చెరుకు లభించే పరిస్థితి ఉండదు. అందువల్ల ముంపు నుండి బయటపడిన తరువాత కూడా మరికొద్ది రోజుల పాటు వంటా వార్పునకు ఇబ్బందులు తప్పవని లంక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. పాము కాట్లకు లంక గ్రామాల్లోని ప్రజలు గురవుతున్నారు. దాణా లేక పాడి పశువులు పాలిచ్చే పరిస్థితి కనిపించటం లేదు.
అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు
గోదావరి వేగంగా తగ్గుతుండటంతో ఇరిగేషన్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. దాదాపు 17రోజులుగా వరద తాకిడికి గురయిన వరద గట్లు వేగంగా తగ్గుతున్న వరద ప్రవాహానికి దెబ్బతింటాయేమోనన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సహజంగా గోదావరి పెరుగుతున్నప్పటి కన్నా, తగ్గుతున్నపుడు గట్లు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది.

సముద్రంలో కలిసిన 3వేల టిఎంసిలు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఆగస్టు 7: ధవళేశ్వరంలోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి ద్వారా గత రెండు నెలల్లో 3వేల టిఎంసిల గోదావరి జలాలు సముద్రంలోకి ప్రవహించాయి. గత జూన్ నుండి గోదావరిలోకి భారీగానే వరద నీరు చేరుతున్న సంగతి విదితమే. జూలై 19 నుండి గోదావరి వరద ఉద్ధృతి మరింత పెరిగి, వరద హెచ్చరికల స్థాయికి చేరుకున్న సంగతి విదితమే. అప్పటి నుండి గోదావరి జిల్లాలను వరద వెంటాడుతూనే ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మూడు సార్లు ప్రమాద స్థాయి వరకు గోదావరి ఉద్ధృతి పెరిగింది. పైపెచ్చు వరద ప్రవాహ వేగం గతంలో సంభవించిన వరదల కన్నా అత్యంత తీవ్రస్థాయిలో ఉంది. దాంతో గరిష్ఠస్థాయిలోనే గోదావరి జలాలు సముద్రంలో కలిసాయి. ఈఏడాది గత జూన్ నుండి ఆగస్టు 5వరకు కాటన్ బ్యారేజి ద్వారా సముద్రంలోకి ప్రవహించిన గోదావరి జలాలను ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారులు లెక్కిస్తే 3వేల టిఎంసిలుగా లెక్క తేలింది. గత ఏడాది అంటే 2012లో జూన్ నుండి డిసెంబరు వరకు బ్యారేజి ద్వారా సముద్రంలోకి ప్రవహించిన గోదావరి జలాలు 3వేల 40టిఎంసిలు. అంటే దాదాపు 6నెలల పాటు సముద్రంలో కలిసిన గోదావరి జలాలు, ఈ ఏడాది కేవలం రెండు నెలల్లోనే ఇంత భారీ పరిమాణంలో మిగులు జలాలు సముద్రంలో కలిసాయన్న మాట. 3వేల టిఎంసిల్లో కూడా గత జూలై 19 నుండి ఆగస్టు 5వరకు కలిసిన గోదావరి జలాలే ఎక్కువ. అంతకు ముందు సుమారు 200టిఎంసిల మాత్రమే సముద్రంలో కలిసాయని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. సహజంగా డిసెంబరు వరకు మిగులు జలాలు సముద్రంలో కలుస్తుంటాయి. ఈ ఏడాది కనిపిస్తున్న పరిస్థితులకు అనుగుణంగా చూస్తే జనవరి నెలాఖరు వరకు కూడా మిగులు జలాలు సముద్రంలో కలుస్తాయని, ఈ లెక్కన చూస్తే సముద్రంలో కలిసే మిగులు జలాలు ఈఏడాది 4వేల 500టిఎంసిలకు పైనే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

విలపిస్తున్న తెలుగుతల్లి
రాయవరం, ఆగస్టు 7: ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేయడంతో తెలుగుతల్లి విలపిస్తోందన్న భావనతో ఒక చిత్రకారుడు గీసిన చిత్రం పలువురిని ఆకట్టుకుంది. మండలంలోని చెల్లూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి సత్తిబాబు రాష్ట్రాన్ని విభజిస్తే చార్మినార్ స్తంభాలు కదిలిపోతాయని, సీమాంధ్ర సమైక్యత కోసం పిడికిలి బిగిస్తుందని తెలుపుతూ గీసిన చిత్రం అందర్నీ ఆలోచింప చేసింది.
ముంపులోనే లంక గ్రామాలు
రావులపాలెం, ఆగస్టు 7: గోదావరికి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ మండలంలోని ఊబలంక శివారు లక్ష్మీతోకలంక బుధవారం నాటికి జల దిగ్బంధంలో చిక్కుకుంది. పరిధి ప్రకారం ఊబలంక పంచాయతీలో వున్నప్పటికీ ఈ లంక గ్రామం నుండి ప్రజల రాకపోకలన్నీ ఆలమూరు మండలం మూలస్తానం మీదుగా సాగిస్తుంటారు. ఈ నేపధ్యంలో గత రెండు వారాలుగా ఈ లంక గ్రామం వరద నీటిలో చిక్కుకుని వుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సుమారు 200 కుటుంబాలు జీవించే ఈ ప్రాంతంలో కూరగాయలు, అరటి, వాణిజ్య పంటలతో పాటు బొప్పాయి, జామ పండ్ల తోటలు సాగుచేస్తుంటారు. ప్రస్తుత వరదలో ఈ పంటలన్నీ నీట మునిగి కుళ్లిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం నుండి అధికారులు గ్రామంలో సహాయక చర్యలు ప్రారంభించారు. వైద్య ఆరోగ్య, పశువైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు.
ముమ్మిడివరం: గోదావరి వరద ఉద్ధృతి తగ్గినా నేటికీ లంక గ్రామాలు ముంపులోనే కొనసాగుతున్నాయి. ముమ్మిడివరం మండలంలోని లంకాఫ్ ఠాణేలంక, కూనాలంక, గురజాపులంక, సలాదివారిపాలెం, చింతపల్లిలంక, లంకాఫ్ గేదెల్లంక గ్రామాల ప్రజలు ముంపులోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం చాలీచాలని భోజనాన్ని ఒక పూట మాత్రమే అందిస్తోందని లంకవాసులు ఆరోపిస్తున్నారు. చేపల వేట, కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లంకవాసులకు వరదల కారణంగా 20 రోజుల నుండి వరద ముంపు వెంటాడుతుండటంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. వంట చేసుకుందామంటే నిత్యావసర సరుకులు నిండుకున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన 20 కేజీలు బియ్యం అయిపోవడంతో లంకవాసులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ప్రక్క సమైక్యాంధ్రా ఉద్యమం ఉద్ధృతంగా సాగుతుండటంతో లంకవాసులకు సాయం చేసే నాథుడే కరువయ్యారు.
ప్రజల హృదయ స్పందన ఢిల్లీ వినిపించాలి : మంత్రి విశ్వరూప్
ముమ్మిడివరం, ఆగస్టు 7: సమైక్యాంధ్రా కోసం ఉద్యమిస్తున్న ఐదు కోట్ల ప్రజల హృదయ స్పందన దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు వినిపించేలా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముమ్మిడివరంలో చేపట్టిన నిరసన దీక్షలు, రాస్తారోకో, ర్యాలీల్లో బుధవారం విశ్వరూప్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన పాపంలో అన్ని పార్టీల పాపం ఉందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాను పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటున్నట్టు చెప్పారు. అలాగే మిగిలిన వారు కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ముందుకు రావాలని విశ్వరూప్ కోరారు.

కలెక్టర్ నీతూప్రసాద్
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>