Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పెల్లుబికిన నిరసనలు

$
0
0

కడప, ఆగస్టు 7 : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 7వ రోజున ఎపి ఎంప్లారుూస్ యూనియన్ పిలుపు మేరకు కడప నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగ సంఘాల నాయకులు రంగంలోకి దిగడంతో బుధవారం ఆందోళన వేడెక్కింది. ఇటు సోనియా విభజన నిర్ణయం, అటు కేసీఆర్ వ్యాఖ్యలపై రగిలిపోతున్న ఆందోళనకారులు బుధవారం మరింత ఉధృతంగా వారిద్దరి దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి దగ్ధం చేశారు. కడపలో జరిగిన ఆందోళనలో నగరం నుండే కాకుండా నలుమూలల నుండి ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. వీరికి మద్దతుగా ఆటో యూనియన్ డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది, రిక్షా కార్మికులు, అంబులెన్స్ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిథులు భారీ ఎత్తున తరలివచ్చారు. కొంతమంది ట్రాక్టర్లలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను తీసుకుని వచ్చారు. దిష్టి బొమ్మలకు నిర్వహించిన శవయాత్రల్లో చేసిన నినాదాలతో నగరం దద్దరిల్లింది. కడప నగరపాలక సంస్థ ఉద్యోగులు రైల్వేస్టేషన్ రోడ్డులో వంటావార్పు చేశారు. ఉద్యోగస్తులు ట్రాఫిక్‌ను స్థంభింపచేసి రోడ్డుపై క్రికెట్ ఆడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సమైక్య సెగతో ఆర్టీసీ డిపోకు చెందిన 870 బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. విద్యార్థులు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. ఆందోళనకారులు రాజకీయ నాయకుల వేషాలు వేయించి వారి చర్యలకు నిరసనగా నినాదాలు చేయిస్తూ బ్యాండు మేళాలతో నృత్యాలతో ఆకట్టుకున్నారు. నగరంలో బుధవారం కూడా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకున్నారు. అయితే ఉద్యమం మొదలైనప్పటి నుండి దాదాపు వేల సంఖ్యలో సోనియా గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి దహనం చేశారు. ఎపి ఉద్యోగ సంఘాలు 7వ తేదీ సంపూర్ణ బంద్‌కు పిలుపునివ్వడంతో జిల్లాలో ఒక సారిగా మండల స్థాయి నుండి గ్రామ పంచాయతీ స్థాయి వరకు గ్రామాలకు సంబంధించిన మహిళలు, యువకులు, వృద్దులు రోడ్డుపై పడి సమైక్యాంధ్రకు అనుకూలంగా వాహనాలను అడ్డుకోవడమే కాకుండా నడిరోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. బద్వేలు, పోరుమామిళ్ల, గోపవరం, సిద్దవటం, రాజంపేట, రాయచోటి, కోడూరు, పుల్లంపేట, ఒంటిమిట్ట, భాకరాపేటలో ఆందోళన ఉధృతంగా కనిపించింది. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమానికి సారథ్యం వహించారు. నిరసనలు, రాస్తారోకోలు చేశారు. పులివెందుల, వేంపల్లె, తొండూరు, ముద్దనూరు, సింహాద్రిపురం మండలాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున ఉద్యోగ సంఘాలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నాలుగురోడ్ల కూడలిలో వాహనాలను నిలిపి సోనియా గాంధీ, కేసీ ఆర్‌కు, తెలంగాణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రొద్దుటూరు నియోజక వర్గంలో వైకాపా నేతలు రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో, టిడిపి ఎమ్మెల్యే లింగారెడ్డి ఆధ్వర్యంలో నగరంలో బంద్‌ను పాటించి దుకాణాలను మూయించారు. వాహనాలు సైతం తిరగకుండా కార్యకర్తలు పట్టణంలో తిరుగుతూ అడ్డుకున్నారు. పట్టణమంతా సమైక్యాంధ్ర ఉద్యమకారులతో నిండిపోయింది. దువ్వూరు, రాజుపాళెంలో కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమానికి మద్దతు ప్రకటించి రోడ్డుపై బైఠాయించారు. ఎపి ఉద్యోగ సంఘ నేతల పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. విద్యుత్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, పంచాయతీ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులకు సంబంధించిన కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో జిల్లాలో పరిపాలన స్తంభించి ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోవడంతో ప్రజలకు కొంత ఇబ్బంది కలిగింది. కాగా నగరంలోని ప్రజలు నిత్యావసర వస్తువులు, కూరగాయలు సరైన సమయానికి రైతులు వాటిని మార్కెట్‌లలోకి అందించకపోవడంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు కొంత ఇబ్బంది కలగక తప్పలేదు. కమలాపురం శాసన సభ్యుడు వీరశివారెడ్డి బుధవారం ఒక ప్రకటన చేస్తూ కమిటీల వల్ల ఒరిగింది ఏమి లేదని, ఇప్పటికైనా పార్లమెంట్‌లో ఉన్న సీమాంధ్ర ఎంపిలు, మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని, ఉద్యమానికి కాంగ్రెస్, తెలుగుదేశం, వైకాపాలేనని ఆయన మండిపడ్డారు. కడప జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం కేంద్రం నుంచి తెలంగాణను ఉప సంహకరించుకుంటామని ప్రకటన వచ్చినప్పుడే విరమిస్తామని జెఎసి నాయకులు, ఎపి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు.

కలత చెందిన మంత్రి
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఆగస్టు 7 : కడప నగరంలో రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన దీనిపై వచ్చిన మీడియా కథనాలపై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖామంత్రి అహ్మదుల్లా కలత చెందినట్లు తెలుస్తోంది. గత సోమవారం ఉపాధ్యాయ సంఘాలు, సమైక్య ఉద్యమకారులు మంత్రిని అవమానపరిచినందుకు నిరసనగా బుధవారం కడపలో బంద్ పాటిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. వాస్తవానికి మంత్రిగాని గానీ ఆయన అనుచరులు గానీ బంద్‌కు పిలుపునివ్వలేదు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగానే నగరంలోని విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. అయితే కాంగ్రెస్ నేతలు, ఆయన అనుచరులు బంద్ పాటిస్తున్నట్లు ప్రచారం జరగడంతో అసహనానికి గురైన మంత్రి అప్రమత్తమై ఉద్యమకార్యాచరణకు పూనుకున్నారు. ఇక నుండి తానే ముందుండి ఉద్యమాన్ని నడిపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన ఆందోళన కార్యక్రమాలకు మీడియాను దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం. దీని వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. గత సోమవారం కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టిన ఉపాధ్యాయ సంఘాల నేతలను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనకు చేదుఅనుభవం ఎదురయింది. ఆందోళనకారులు ఆయనను గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కొంతమంది ఆకతాయిలు ఆయనపై చెప్పులు విసిరారు. దీనిపై మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్ఠానం విభజన నిర్ణయం ప్రకటించిన మరుక్షణం ముఖ్యమంత్రికి తన రాజీనామా పత్రాన్ని అందజేశానని, వెంటనే బయలుదేరి కడపలో జరుగుతున్న సమైక్య ఉద్యమంలోకి దిగిన తనను కొంతమంది అవమానించడంపై తన అనుచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమయం దొరికినపుడల్లా ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికి పార్టీ అధిష్ఠానానికి తన వాదన వినిపిస్తూనే ఉన్నానని, ఈ విషయం తెలుసుకోకుండా సమైక్యవాదులు తనను గోబ్యాక్ అనడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అవసరమైతే అన్ని పదవులకు రాజీనామా చేసేందుకు కూడా ఆయన మానసికంగా సిద్ధమైనట్లు అనుచరులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడంతోపాటు జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

విధ్వంసానికి సిద్ధం!
* సమైక్య సారధుల వ్యూహం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఆగస్టు 7 : వారం రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా కేంద్రంలో స్పందన లేకపోవడంతోపాటు తూతూ మంత్రంగా బుధవారం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడంతో ఆందోళనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీల ఆస్తుల విధ్వంస కాండకు ఉద్యమకారులు వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు, పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ హైకమాండ్ మెడలు వంచే రీతిలో వత్తిడి తెచ్చే విధంగా వారిలో ఊపు తేవాలని ఉద్యమకారుల నిర్ణయించినట్లు తెలుస్తోం ది. ముఖ్యంగా అధికార పార్టీకి చెంది న ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడు లు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కళ్లు తెరిపించడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రమే తగి న రీతిలో స్పందించని నేపథ్యంలో త మ ఉద్యమాన్ని త్రిసభ్య కమిటీ నామమాత్రంగానే పరిగణలోకి తీసుకుంటుందని సమైక్యవాదులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలనే టార్గెట్ చేసుకొని వ్యూ హాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా నేతల ఆస్తులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్జీవోలు, మేధావులు, విద్యార్థులు, మహిళలతో కలిసి నాయకుల ఇళ్లను ముట్టడించడం వల్ల వారు పార్టీకి, పదవులకు రాజీనామాలతో సరిపెడుతున్నారని, ఆస్తుల విధ్వంసం సృష్టించినప్పుడే పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తారని ఉద్యమకారులు యోచిస్తున్నారు. ఇప్పటికే పోలీసు ఇంటలీజెన్సీ శాఖ ఉద్యమాలపై ఆరా తీస్తున్నారు. లక్షాన్ని సాధించడం కోసం అవసరమైతే ప్రాణాలైనా ఇవ్వడానికి తమతోపాటు సమైక్యవాదులంతా సిద్ధంగా ఉండాలని ఉద్యమసారథులు పిలుపునిస్తున్నారు.

ఎన్‌సిసి నగర్లకు వౌలిక వసతులు
* డిడిజి బాద్యాల్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఆగస్టు 7 : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌సిసి నగర్లలో వౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎన్‌సిసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ బాద్యాల్ పేర్కొన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన బుధవారం కడప నగరానికి వచ్చారు. స్థానిక ఎన్‌సిసి నగర్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఇసిహెచ్‌ఎస్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో విద్యార్థులు ఎన్‌సిసి- సి సర్ట్ఫికేట్ పొందాలంటే మూడు సంవత్సరాలు నిరీక్షించాల్సి వచ్చేదన్నారు. 2007వ సంవత్సరం తరువాత ఈ గడువును రెండు సంవత్సరాలు కుదించారన్నారు. ప్రస్తుతం ఆ గడువును మూడు సంవత్సరాలకు పెంచినట్లు వెల్లడించారు. ఈ ఏడాది నుంచి కొత్త సిలబస్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,29,550 మంది ఎన్‌సిసి విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఏడాదికి ఒకమారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరిపి ఎన్‌సిసి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అందుకోసం అవసరమైన నిధులు విడుదల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని చెప్పారు. కార్యక్రమంలో ఎన్‌సిసి అధికారులు పాల్గొన్నారు.

సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకుందాం
* కందుల సోదరుల ఆధ్వర్యంలో కడపలో ర్యాలీ
కడప (అర్బన్), ఆగస్టు 7 : సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకుందామని కాంగ్రెస్ నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి, కందుల శివాననందరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని హైదరాబాద్‌కు ఏ ఒక్కరికీ చెందినది కాదని, యాతవ్ రాష్ట్రానికి చెందిదన్న విషయాన్ని వేర్పాటువాదులు మరువరాదన్నారు. అనుహ్యంగా సీమాంధ్రకు సెగలు ఎగసిపడడంతో కేంద్ర ప్రభుత్వ విభజనపై పునరాలోచనలో పడినట్లు సంకేతాలు అందుతున్నాయన్నారు. కేవలం పదవుల కోసం కొంతమంది వేర్పాటువాదులు తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించి సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు గోవర్ధన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, విద్యార్థి సంఘం నాయకులు, నగరంలోని ఎస్టేట్ యాజమాన్యాలు, విద్యార్థులు పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో...
రైల్వేకోడూరు : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు పల్లెప్రజలను కూడా భాగస్వాములు చేయాలన్నారు. తమకు పదవుల కన్నా సీమాంధ్ర ప్రజల బాగోగులే ముఖ్యమన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ పదవులకు రాజీనామాలు చేయడం జరిగిందన్నారు. ఆనాదిగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. సమైక్యాంధ్ర వాదనను పెద్దలకు తాము వివరించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు తమకు తృణప్రాయమని, పదవుల కోసం వేలాడడం తమకు ఇష్టం లేకనే ప్రజల మధ్యకు వచ్చామన్నారు. సీమాంధ్ర ఉద్యమాన్ని పట్టణాల నుండి గ్రామాలకు తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ప్రజాప్రతినిధి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని సీమాంధ్ర సాధించేంత వరకు నిద్రపోకూడదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఏకైక ఆశయంతో ఉద్యమానికి తాము సంఘీభావం తెలిపామన్నారు. ప్రజలిచ్చినా ఈ పదవులు అక్కర్లేదని, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే సరియైన గాంధేయవాదమన్నారు. 8 రోజులుగా ఉద్యమానికి ఊపిరి పోసిన వారందరికీ కృతజ్ఞతలను తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జయప్రకాష్ నారాయణ, కె.ఈశ్వరయ్య, కృష్ణయ్య, హేమరాజ్, పొన్నురంగం, ఆనంద్, వైకాపా నాయకులు మస్తాన్, ఆన్వర్‌బాషా, హేమనవర్మ, నారాయణరెడ్డి, ఎన్.బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
గాడిదలతో నిరసన
గాలివీడు : సమైక్య రాష్ట్రం కోసం మండల కేంద్రంలో బుధవారం రజకులు గాడిదలకు మాస్క్‌లు తొడిగి నిరసన తెలిపారు. రజకులు, స్వయం సహాయక సంఘాల గ్రూపుల మహిళలు, మాలమహానాడు నేతలు కలిసి చౌరస్తా గేటు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాలమహానాడు జిల్లా అధ్యక్షులు శరత్‌బాబు మాట్లాడుతూ కెసిఆర్ లాంటి స్వార్థపూరిత రాజకీయ నాయకుల కుటిల యత్నాలకు రాష్ట్రం విభజించడం అన్యాయమన్నారు. అమరజీవి పొట్టిశ్రీరాములు లాంటి మహానుభావుల త్యాగ నిరతి వల్ల తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. అలాంటి రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు చండ్రాయుడు, లోకయ్య, మాలమహానాడు నాయకుడు హరి, ఎస్‌హెచ్‌జి మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే గురువారం మండలంలో వడ్డెర, మాదిగ (ఎంమ్మార్పీ) కులస్థులు ర్యాలీ, నిరసన చేపట్టనున్నట్లు ఎమ్మార్పీ ఎస్ నాయకులు రామక్రిష్ణ, శివలు పేర్కొన్నారు.
ఎర్రగుంట్లలో...
ఎర్రగుంట్ల : గత వారం రోజులుగా సమైక్యాంధ్ర కోరుతూ ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమంలో భాగంగా బుధవారం ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో ఉపాధ్యాయ, కార్మిక, మహిళ, కళాకారులు కదం తొక్కారు. జువారి సిమెంట్ కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు స్థానిక నాలుగు రోడ్లకూడలిలో వంటావార్పు నిర్వహించి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు చెక్క భజనలు, కోలాటలు, జానపద పాటలు పాడుతూ సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. మరోవైపు రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేరత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. అనంతరం యూపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పట్టణంలోని దుకాణాలను ప్రజలు స్వచ్ఛందంగా నిలిపి వేశారు.
తిలాపాపం తలా పిడికెడు
* ఎమ్మెల్యే ఆది
రాష్ట్ర విభజనలో అన్ని రాజకీయ పార్టీ ప్రమేయం ఉందని జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి అన్నారు. ఆందోళనలు చేపట్టిన ఉద్యమకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ వీడిపోయేందుకు అన్ని రాజకీయ పార్టీలు కారణమన్నారు. జరిగిన అన్యాయాన్ని తెలుగువారు ఎన్నటికీ మరువలేరన్నారు. మనందరం సమైక్యంగా ఉండి న్యాయం కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇకపోతే పారిశ్రామిక ప్రాంతమైన చిలంకూరులో వికలాంగులు బుధవారం రోడ్డుపై బైఠాయించి సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేశారు. యూపిఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ సోనియా, కెసిఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి
* బొత్స, బాబు సహకరించాలి
* ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
జమ్మలమడుగు, ఆగస్టు 7: సువిశాల సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు, పిసిసి అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పాతబస్టాండు కూడలిలో చేపట్టిన రిలేనిరాహార దీక్షలో పాల్గొన్న వైద్యసిబ్బంది బృందాన్ని పరామర్శి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం రాజకీయాలకు అతీతంగా జేఏసి ఆధ్యర్యంలో గత ఏడు రోజులుగా ఉద్యమాలు మిన్నంటి జరుగుతున్నాయన్నారు. ఆంధ్రరాష్ట్రాన్ని విడగొడుతూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం చాలాబాధాకరమన్నారు. ప్రజల మనోభావాల మేరకు రాజకీయనాయకులు సమైక్యంకోసం ఉద్యమంలోకి రావాలన్నారు. రాయలతెలంగాణాకోసం కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు సోనియావద్దకు వెళ్లడం బాధాకరమన్నారు. సోనియావద్దకు వెళితే హైపవర్‌కమిటికీ చెప్పుకోమనడం దారుణమన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ పాలనలో ఆంధ్రరాష్ట్రం సమైక్యం కోరితే సోనియా విభజన చేయడం దురదృష్టకరమన్నారు. తెలుగుజాతి ఒక్కటిగా వుండాలన్న ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్వర్గీయ రామారావు స్థాపిస్తే, చంద్రబాబు మాత్రం విభజనలో తనవంతు పాత్రను శక్తివంచన లేకుండా పోషించాడని ఎద్దేవా చేశారు. వైయస్‌ఆర్‌సిపి కూడా తప్పు చేసిందనీ, అదే రీతిలో విశాలాంధ్ర పత్రిక నడుపుతున్న సిపిఐ రాష్ట్ర విభజనకు సహకరిచండం దారుణమన్నారు. అధిష్ఠానం వేసిన హైపవర్ కమిటీ వల్ల ప్రయోజనం శూన్యమన్నారు. 1885లో స్వాతంత్య్రం ఉద్యమం కోసం శ్రమిస్తే 1947లో స్వాతంత్య్రం వచ్చిన విషయాన్ని మరువరాదన్నారు. అలాగే సమైక్యం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వుందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు.

ఎమ్మెల్సీ సతీష్‌కుమార్ రాజీనామా
వేంపల్లె, ఆగస్టు 7 : సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ సతీష్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం తన స్వగృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం తాను పదవితో పాటు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే అని ప్రకటించారు. అంతేగాకుండా ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు తదితరులు ఉన్నారు.

* రోడ్డెక్కిన ఉద్యోగులు * బ్యాండుమేళాలతో కదిలిన యువకులు, విద్యార్థులు * జాతీయ రహదారులపై వంటావార్పు * భారీగా నిలిచిపోయిన వాహనాలు
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>