Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అందరిదీ సమైక్యవాదం

$
0
0

అనంతపురం, ఆగస్టు 7 : జిల్లా వ్యాప్తంగా ఊరు, వాడ ఏకమైంది. ఇలా ఏకమైన జనం సమైక్యాంధ్ర కోసం పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. జిల్లాలో సమైక్యాంధ్ర కోసం నినదిస్తున్న జనం నిరసన ఘోష ఎనిమిదవ రోజుకు చేరుకుంది. ఎనిమిది రోజులుగా ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహిస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతి రోజూ ఒకరికి ఒకరు తోడై నిరసన ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. నిరసన ఉద్యమాల్లో ఎనిమిదవ రోజు కూడా ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొంటుండడం గమనార్హం. ప్రతి రోజూ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కూడా విధులకు గైర్హాజరై నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ప్రైవేటు బస్సు యజమానులు, సిబ్బంది బస్సులతో సహా ర్యాలీ నిర్వహించారు. వీరితోపాటు జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరపున గెజిటెడ్ అధికారులందరూ విధులకు హాజరుకాకుండా నిరసనల్లో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. వీరితోపాటు మహిళలు, చిన్నారులు, వికలాంగులు ర్యాలీ గా వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజన్సీల యజమానులు, సిబ్బంది, చౌక ధాన్యపు డీలర్ల సంఘం సమైక్యాంధ్ర కావాలంటూ ర్యాలీ నిర్వహించారు. నగరంలో ఉదయం నుంచీ ఎడ్లబళ్లతోర్యాలీలు కొనసాగాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ పాల వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఐకెపి, రాజీవ్ యువకిరణాలు, ట్రాన్స్ కో ఉద్యోగులు కూడా ర్యాలీలు నిర్వహించి తమ నిరసనను వ్యక్తపరిచారు. ఆర్టీసీ కార్మికులు ఆయా డిపోల వద్ద వంటా వార్పూ కార్యక్రమాన్ని కొనసాగించారు. వీరితోపాటు పలు కాలనీలు, అపార్టుమెంటు లకు చెందిన మహిళలు, చిన్నారులు స్వఛ్ఛందంగానే నిరసనలు కొనసాగించారు. ఇలా వీరికి తోడైన యువత, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన సిబ్బంది ద్విచక్ర వాహన ర్యాలీలు కొనసాగించి సమైక్యాంధ్ర కావాలంటూ నినదించారు.ఇక ఎస్‌కె యూనివర్శిటీలో విద్యార్థులు రాస్తారోకో, ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా ఎస్‌కె యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రామకృష్ణారెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాదులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. గుంతకల్లులో హిజ్రాలు ఊరేగింపుగా వచ్చి ర్యాలీలు నిర్వహించగా గుంతకల్లు పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన పలువురు ఎడ్ల బళ్ల తోనిరసన కార్యక్రమాలు కొనసాగించారు. ఉరవకొండలో గడచిన ఎనిమిది రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొంటున్న రంగప్ప అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. కదిరిలో రెవెన్యూ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ట్రాన్స్‌కో, పంచాయతీ రాజ్ ఉద్యోగులు దాదాపుగా మూడు కిలోమీటర్ల మేర వెనక్కి నడుస్తూవినూత్నంగా నిరసనలు కొనసాగించారు. దీంతోపాటు సమైక్యాంధ్ర జెఎసి నాయకులు అన్ని ప్రార్థనాలయాలకు వెళ్లి సమైక్యాంధ్రను కొనసాగించాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహించి అనంతరం అర్ధనగ్నంగా ర్యాలీలు నిర్వహించారు. ధర్మవరంలో సమైక్యాంధ్ర నిరసన కారులు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, చేనేతలు, మహిళలు, చిన్నారులు సమైక్యాంధ్ర కోసం ర్యాలీగా వచ్చి నిరసన కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఊరూ, వాడ ఏకమై సమైక్యాంధ్ర కోసం నినదిస్తున్నారు. ఈ ఉద్యమం పల్లె పల్లెకూ వ్యాపించడంతో అందరూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర కావాలంటూ ర్యాలీలు, శవయాత్రలు, ఊరేగింపులు, దిష్టిబొమ్మల దహనాల కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

సమైక్యాంధ్ర బలిదానాలు
ఉరవకొండ, ఆగస్టు 7: సమైక్యాంధ్ర కోసం జిల్లాలో ఆత్మబలి దానాలు కొనసాగుతూనే ఉన్నా యి. ఉరవకొండలో రంగప్ప గుండెపోటుతో మృతి చెందగా, రాయదుర్గం మండలం జుంజురాంపల్లిలో అచ్చల్లి మాబు పురు గుల మందుతాగి ఆత్మహత్య చేసు కున్నాడు. గుత్తిలో కిషోర్ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉరవకొండ పట్టణంలోని జోగప్పబావి 5వ వార్డులో నివాసం ఉంటున్న కూర గాయలు అమ్ముకునే రంగప్ప (54) రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. బుధవారం నాటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్లిన రంగప్పకు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. రెండు రోజుల క్రితం కవితా హోటల్ సర్కిల్ ప్రాంగణంలో వంటావార్పు కార్యక్రమానికి రంగప్ప కాయగూరలు అందించినట్లు జెఎసి నేతలు తెలిపారు. రంగప్పకు భార్య రామాంజినమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు వున్నారు. రంగప్ప మృతికి జెఎసి నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు హనుమప్ప, నారాయణస్వామి, రంగప్రసాద్, తంబన్న తదితరులు పాల్గొన్నారు.
పురుగుల మందుతాగి..
రాయదుర్గం రూరల్: మండలంలోని జుంజురాంపల్లి గ్రామానికి చెందిన అచ్చల్లి మాబు(35) సమైక్యాంధ్ర కోసం బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మాబు రాయదుర్గంలో నిర్వహించిన సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. బుధవారం ఆందోళన అనంతరం ఇంటికి వెళ్లి టివి లో వార్తలు చూస్తూ ఉద్వేగానికి లోనై పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మాబును ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
బ్లేడుతో గొంతు కోసుకుని..
గుత్తి : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గుత్తిలో కిషోర్(32) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పట్టణంలో చెర్లోపల్లి కాలనీకి చెందిన కిషోర్ గత ఐదు రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. ప్రజల ఆందోళనకు ప్రభుత్వం నుండి సానుకూలమైన స్పందన రాకపోవడంతో బుధవారం బ్లేడుతో మెడ, గొంతు, ఉదరం, చేతులు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హంద్రీనీవా కింద
ఆరుతడి పంటలకు ప్రాధాన్యత
* మంత్రి రఘువీరారెడ్డి
అనంతపురం కల్చరల్, ఆగస్టు 7: హంద్రీనీవా కింద ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలు పండించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు హైదరాబాద్ నుండి బుధవారం ప్రకటన విడుదల చేశారు. బుధవారం హంద్రీనీవాకు నీరు విడుదల చేయడంపై సంబంధిత అధికారులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. నీటి విడుదల విషయమై కర్నూలు, అనంతపురం జిల్లాల కలెక్టర్‌లతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. సాధ్యమైనంత మేరకు ృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్లకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్గమధ్యంలో అవకాశమున్న చోట్ల పొలాలకు నీరందించవలసిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయకట్టు రైతులతో వ్యవసాయ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల సిబ్బంది సమావేశాలు నిర్వహించి, ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. లభ్యమయ్యే కొంచెం నీటితో ఎక్కువ ప్రయోజనం కలిగేలా చూడాలని మంత్రి రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా హెచ్చెల్సీ కాల్వకు కూడా ఈసారి ఎక్కువ మొత్తంలో నీరు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ముఖ్య ఇంజనీర్ మురళీధర్‌కు మంత్రి సూచించారు.
అంతటా సమైక్య నినాదమే
* ఊపు తగ్గని ఉద్యమం
* వినూత్న నిరసనలు, రిలే నిరాహార దీక్షలు
హిందూపురం టౌన్, ఆగస్టు 7: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జరుగుతున్న నిరసనలు హిందూపురంలో బుధవారం నాటికి ఏడో రోజుకు చేరుకున్నాయి. వారం రోజులుగా నిరసనలు చేపడుతుండగా ఉద్యమం రోజురోజుకు ఊపందుకొంటోంది. రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతోపాటు ప్రజా సంఘాలు, కుల సంఘాలు తదితర అసోసియేషన్‌లు స్వచ్ఛందంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రైవేటు విద్యాసంస్థల జెఏసి ఆధ్వర్యంలో విభజన వల్ల జరిగే నష్టాలను ఫ్లెక్సీల ద్వారా వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. వాసవీ ధర్మశాల నుండి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా కొనసాగింది. కార్యక్రమంలో జెఎసి చైర్మన్ ఈశ్వర్‌రెడ్డి, కో చైర్లన్లు బలరామిరెడ్డి, వీరభద్రప్పతోపాటు ఆయా విద్యాసంస్థల అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని విడగొట్టవద్దంటూ ఉద్యమకారులు చెవిలో పువ్వులు పెట్టుకొని దున్నపోతులకు చంద్రబాబు, సోనియా, దిగ్విజయ్‌సింగ్, కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణల పోస్టర్లను అతికించి స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుండి పురవీధుల గుండా వినూత్నంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు బండి ఆనందరాజు, నరసింహులు, సిద్ధగిరి శ్రీనివాసులు, భాస్కర్ రాయల్, ఇందాద్, జమీల్, బద్రీనాథ్, విజయానంద్, లైఫ్ వరల్డ్ చారిటబుల్ ట్రస్టు కన్వీనర్ ఉదయ్‌కుమార్, ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించి వంటావార్పు నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఉపాధ్యాయులు బైఠాయించారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. హిందూపురం పట్టణ, పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల పట్టణ పురవీధుల గుండా సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పామిశెట్టి రంగనాయకులు, టిడిపి నాయకులు తిమ్మారెడ్డి, అల్త్ఫా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పలు ర్యాలీలు, శిబిరాల్లో స్థానిక ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీ పాల్గొని సంఘీభావం తెలియచేశారు. కొల్లకుంట ఇందిరమ్మ కాలనీ వాసులు పలువురు శిరోముండనం చేయించుకొని కెసిఆర్, సోనియాగాంధీల శవయాత్ర నిర్వహించి రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. చేనేత కార్మిక సంఘం నాయకులు సాంబశివ, పుల్లారెడ్డి, వీరన్న, వెంకటేష్, రంగప్ప, సునీల్ తదితరులు పాల్గొన్నారు. వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో ఓ బాలిక తెలుగుతల్లి వేషధారణలో పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. ప్రింటింగ్ ప్రెస్‌ల నిర్వాహకులు, శ్రీకంఠాపురం యువకులు, మహిళలు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, వికలాంగుల సంఘాలు, డివిజన్ ప్రధానోపాధ్యాయుల సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. లేపాక్షి, హిందూపురం రూరల్ మండలాలకు చెందిన పలు గ్రామాల యువకులు, మహిళలు ప్రత్యేక వాహనాల్లో హిందూపురం చేరుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా సంఘీభావం తెలియచేస్తూ ర్యాలీలు జరిపారు.

ఎనిమిది రోజులుగా రోడ్డెక్కని బస్సులు!
* ‘పురం’ డిపోకు రూ.కోటి నష్టం
హిందూపురం టౌన్, ఆగస్టు 7: సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో హిందూపురం ఆర్టీసీ డిపో పరిధిలోని హిందూపురం, మడకశిరల నుండి ఒక్క సర్వీసు కూడా తిరగడం లేదు. దీంతో ఇటు ప్రయాణికులు ఇబ్బందులకు గురి కావడంతోపాటు అటు ఆర్టీసీ సంస్థకు దాదాపు రూ. కోటి దాకా నష్టం వాటిల్లింది. జిల్లాలో రెండు డిపోలు మినహా మిగిలిన అన్ని డిపోలు నష్టాలో బాటలో ఉండగా సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది ఆర్టీసీ పరిస్థితి. హిందూపురం డిపో పరిధిలో హైయ్యర్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు తదితర సర్వీసులు కలిపి 106 సర్వీసులు ఉండగా రోజూ దాదాపు రూ.10 లక్షల ఆదాయం వచ్చేది. అయి తే గత నెల 30వ తేదీన యుపిఎ ప్రభుత్వం రాష్ట్ర విభజనపై ప్రకటన చేయడంతో 31వ తేదీ నుండి డిపో పరిధిలోని ఏ ఒక్క సర్వీసు కూడా బయటకు రాలేదు. దీంతో ఎనిమిది రోజులుగా ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో దాదాపు రూ.80 లక్షల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మడకశిర ఆర్టీసీ డిపోలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మడకశిర డిపో పరిధిలో అన్ని సర్వీసులు కలిపి 30 ఉండగా డిపో నుండి రూ.25 లక్షల ఆదాయాన్ని కోల్పోయామని చెబుతున్నారు. ఆర్టీసీలోని నేషనల్ మజ్దూర్, ఎంప్లాయిస్ యూనియన్లతోపాటు కార్మికులు, ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటుండటంతో సర్వీసులు తిరగడం లేదు. జిల్లాలో మిగిలిన డిపోలతో కలిపి కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆ సంస్థ కోల్పోయింది.

జిల్లా వ్యాప్తంగా ఊరు, వాడ ఏకమైంది. ఇలా ఏకమైన జనం
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>