గచ్చిబౌలి, ఆగస్టు 8: శిల్పారామంలో సందర్శకుల కోసం బోటు రెస్టారెంటు అందుబాటులోకి రానుంది. మాంసాహారం, సీపూడ్స్ ఏదైనా ఫెస్టివల్‌లోనే తప్ప మిగిలిన రోజుల్లో దొరికేవి కావు. శిల్పారామం సందర్శకులకు బోటు ఆకారంలో రెస్టారెంట్‌ను రూపొందిస్తున్నారు. లోపల ఆరు బోట్లను సిద్ధం చేశారు. బోటులోనే విందు ఆరగిస్తున్నట్లు అనుభూతి కలిగేలా ఒకవైపు జాలరు లాంతరు వెలుగులో సముద్ర అందాలను వీక్షిస్తున్న ప్రతిమ, మరోవైపు లంగరు వేస్తున్న వ్యక్తిని పెట్టారు. చూడటానికి మనుష్యుల్లా కనబడుతున్నా దగ్గరకు వెళ్లి చూస్తేగాని ప్రతిమలని తెలియవు. రెస్టారెంట్ త్వరలో అందుబాటులోకి వస్తుందని శిల్పారామం స్పెషలాఫీసర్ జిఎస్ రావు తెలిపారు.
ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్
ప్రపంచ ఛాయచిత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 15 నుంచి 19 వరకు ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు స్పెషలాఫీర్ జిఎస్‌రావు తెలిపారు. శిల్పారామంలోని ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేస్తున్న ప్రదర్శనను శిల్పారామం, ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 19న శిల్పారామంలో ఫొటోగ్రాఫర్స్‌కు పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు. ఔత్సాహికులు 9246348164, 9490753458 నెంబర్లకు చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
కూచిపూడి నృత్యోత్సవాలు
శిల్పారంలో ఈనెల 16, 17, 18 తేదీల్లో కూచిపూడి నృత్యోత్సవాలను ఏర్పాటు చేశామని జిఎస్‌రావు పేర్కొన్నారు. శిల్పారామంలోని ఆర్ట్ గ్యాలరీలో సందర్శకుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నామని, దీనిలో మూడు వేల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆది కవి నన్నయ్య నుంచి శ్రీశ్రీ వరకు కవితా పితామహుల ఛాయచిత్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోటి 80 లక్షల రూపాయలతో శిల్పాలయం ఏర్పాటు చేస్తున్నామని, దీనిలో ఐదు రకాల గ్యాలరీలు ఉంటాయని చెప్పారు. శివ, వైష్ణవ, శక్తి, బుద్ధ, జైన్ గ్యాలరీలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర పురావస్తు శాఖ శిల్పాలను అందిస్తుందని ప్రత్యేక అధికారి జిఎస్ రావు తెలిపారు.
శిల్పారామంలో సందర్శకుల కోసం బోటు రెస్టారెంటు అందుబాటులోకి
english title:
boat
Date:
Friday, August 9, 2013