తార్నాక, ఆగస్టు 8: ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ నగర నాయకులు పేర్కొన్నారు. గురువారం నగర పార్టీ కార్యాలయంలో నగర ప్రదాన కార్యదర్శి ఎం.ఎన్.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జి.పవన్‌కుమార్‌గౌడ్, అధికార ప్రతినిధి సి.బద్రీనాథ్‌యాదవ్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే మోయలేని భారాన్ని మోస్తూ జీవితాలను బలవంతంగా ఈడ్చుకు వస్తున్న వాహనదారులపై ట్రాఫిక్‌పోలీసులు 200 రూపాయలు వేసే చలానాను వెయ్యి రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహకరించుకోకపోతే ఈనెల 13న నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటో, ట్రాలీ డ్రైవర్‌లు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చలాన్లరూపంలో దోచుకోవడానికి ఎత్తుగడలు వేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ధరలను పెంచడం అవినీతిని పెంచడం, అశాంతిని పెంచడం తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించిన పాపానపోలేదని అన్నారు. నగరంలో మోకాటిలోతు గుంతల రోడ్లు, సిగ్నల్స్‌లేని చౌరస్తాలు నిత్యం ట్రాఫిక్‌జామ్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోని ప్రభుత్వం, ఈ పోలీసులు చలాన్లను పెంచుతున్నామని ప్రకటించడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే టిడిపి ఆధ్వర్యంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని, ఈ నెల 13న సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుంకరి రవీందర్, శైలేందర్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుందని
english title:
traffic challans
Date:
Friday, August 9, 2013