Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులపై ఔషధ కంపెనీల ప్రయోగాలు

$
0
0

ఖమ్మం, ఆగస్టు 9: ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజల అమాయకత్వాన్ని పలు ఔషధ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అమాయకుల జీవితాలతో ప్రయోగాలు చేస్తూ వారి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఇందుకు ఖమ్మం జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాలను ఆయా సంస్థలు ఎంచుకోవటం గమనార్హం. గత కొనే్నళ్ళుగా ఈ ప్రక్రియ జరుగుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కరవవటంతో గిరిజనుల జీవితాలు మరింత దుర్భరమవుతున్నాయి. గతంలో విఆర్ పురం మండలంలో గర్భస్థ క్యాన్సర్ నిరోధంపై ఔషధ ప్రయోగాలు చేసిన సంఘటనను ఆంధ్రభూమి వెలుగులోకి తీసుకరాగా, పార్లమెంట్‌లో సైతం ప్రతిపక్షాలు ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఆ క్రమంలోనే విఆర్ పురం మండలంలోని ఇద్దరు బాలికలు మరణించటంతో దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది. స్పందించిన ప్రభుత్వం మానవులపై ఔషధ ప్రయోగాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత చర్ల మండలంలోని వివిధ ప్రాంతాల్లో కూడా పలు ఔషధ కంపెనీలు ప్రయోగాలు జరిపాయి. ఇది వెలుగులోకి రావటంతో వెనక్కు తిరిగిన కంపెనీలు తాజాగా మణుగూరు మండలంపై దృష్టి సారించాయి. మణుగూరు మండలంలోని అశోక్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పాటు ముగ్గురు యువకులను ఔషధ ప్రయోగాలకై రక్త నమూనాలు సేకరించేందుకు హైదరాబాద్ తీసుకెళ్ళే ప్రయత్నంలో పోలీసులకు చిక్కారు. రక్త నమూనాలు సేకరించి వారిపై ప్రయోగం చేసినందుకు గాను ఒక్కొక్కరికి 10వేల రూపాయలు ఇచ్చేందుకు సదరు కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు బహిర్గతమైంది. కానీ గతంలో విఆర్ పురం, చర్ల మండలంలో ఈ తరహా ప్రయోగాలు చేసినప్పుడు అనేక మంది అమాయక గిరిజనులు అనారోగ్యంపాలైన విషయం బహిర్గతం కానివ్వకుండా సదరు కంపెనీలు గోదావరికి ఇవతల వడ్డున ఉన్న మణుగూరు ప్రాంతాన్ని ఇందుకోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో నివశించే కొద్ది మందిని ఎంపిక చేసుకొని వారికి డబ్బు ఆశ చూపుతూ గిరిజనుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గిరిజనులకు డబ్బుతో పాటు ప్రయోగాలు చేసినన్ని రోజులు భోజన, వసతి సౌకర్యాలు కూడా అందిస్తున్నారు. అనారోగ్యం పాలవుతామనే విషయం తెలియని గిరిజనులు డబ్బు ఆశతో ప్రయోగాలకు ఒప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గతంలో కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి పార్లమెంట్‌లో ప్రకటన కూడా చేశారు. మానవులపై ఔషధ ప్రయోగాలు చేసే కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేస్తామని కూడా ప్రకటించారు. కాని కంపెనీలు ప్రయోగాలను ఆపకపోగా, మరింత ముమ్మరం చేయటం విశేషం. ప్రస్తుతం మణుగూరులో జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ చర్యలు ఎంత వరకు తీసుకుంటారనేది ప్రశ్నార్థకమే. సదరు ఔషధ కంపెనీలకు ప్రభుత్వపెద్దలతో సంబంధాలు కలిగి ఉండటమే ఇందుకు కారణంగా భావించవచ్చు. అయితే ఔషధ కంపెనీల ప్రయోగాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ గిరిజన సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి. మరో వైపు ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావుఔషధ ప్రయోగాలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

మావోయిస్టు లొంగుబాటు
కొత్తగూడెం, ఆగస్టు 9: మావోయిస్టు దామోదర్ దళంలో పనిచేస్తున్న ముళ్ళ భూపాల్ అలియాస్ అరవింద్ (25) శుక్రవారం కొత్తగూడెం ఓఎస్‌డి తిరుపతి ఎదుట లొంగిపోయాడు. ఈసందర్భంగా ఓఎస్‌డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఓఎస్‌డి వివరాలను తెలిపారు. వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన భూపాల్ 2007లో అరవింద్ దేవాదుల ప్రాజెక్టు కంపెనీలో ఆర్‌ఎంపి డాక్టర్‌గా పనిచేశాడు. అదే సంవత్సరం ఆఊరిలో భూమితగాదాలు రావడంతో ఊరి పెద్దమనుషులు, పోలీసులను భూపాల్ ఆశ్రయించినప్పటికి న్యాయం జరగకపోవడంతో దేవాదుల వద్ద కెకెడబ్ల్యూ దామోదర్ దళాన్ని కలిసి దళంలో చేరాడు. 2010వరకు దళసభ్యునిగా పనిచేశారు. 2010లో కంకణాల రాజిరెడ్డిని హైద్రాబాద్‌లో వైద్యచికిత్స చేయించడానికి తీసుకువెళ్తూ మహారాష్ట్ర పోలీసులకు అంకిసా వద్ద రూ. 3లక్షలతో పాటు దొరికాడు. ఆ తరువాత తిరిగి ఇంటికి వెళ్ళి ఆర్‌ఎంపిగా క్లినిక్ పెట్టుకొని జీవనం సాగిస్తూ 2012సంవత్సరం మార్చిలో వివాహం చేసుకున్నాడు. కొన్నిరోజుల తరువాత భార్యతో గొడవల వలన భార్య తరుఫున బంధువులు భూపాల్‌ను తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో తిరిగి మళ్ళి దామోదర్ దళంలో చేరాడు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో దళంలో పనిచేయలేక ఖమ్మం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2009 ఛత్తీస్‌ఘడ్ పోలీసులతో మెట్టచెరువు వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో, 2010లో కపాలమడుగు వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో, నవంబర్ 11, 2012న కంబాలపేట వద్ద జరిగిన ఎదురుకాల్పులు, ఏప్రిల్ 16, 2013న పువర్తి వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో భూపాల్ పాల్గొన్నాడు. అదేవిధంగా మహారాష్టల్రోని సోమునూరు ఫారెస్ట్‌గార్డును కొట్టి రెండు ఎస్‌ఎల్‌ఆర్ తుపాకులు తీసుకుపోయిన సంఘటనలో కూడా పాల్గొన్నాడు. దళంలో సంగీతకు, కొమ్ముగూడెం కాల్పుల్లో గాయపడిన పుష్పక్కకు వైద్యం చేశాడు. దళంలో ఉపాధ్యాయునిగా కూడా పనిచేసిన భూపాల్ ప్రధానంగా మావోయిస్టు దళానికి వైద్యసేవలు అందించడంలో కీలకపాత్ర పోషించినట్లు ఓఎస్‌డి తిరుపతి వివరించారు. రివార్డు కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ప్రతిపాదన పంపిస్తామని తెలిపారు. అదేవిధంగా తాత్కాలిక సహాయాన్ని కూడా అందజేస్తామని చెప్పారు. కేసులేమైనా పెడతారా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ లొంగిపోయిన వారిపై కేసులు పెట్టమని స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో ఎస్‌ఐ రమేష్ పాల్గొన్నారు.

భవిష్యత్తు కాంగ్రెస్‌దే
* డెప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం, ఆగస్టు 9: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ఏ ఇతర ప్రభుత్వాలు చేయలేదని, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. నర్సింహాపురం, బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లోని పలు పార్టీలకు చెందిన సుమారు 100కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా కండువాలను కప్పి అందరిని పార్టీలోకి ఆహ్వానించారు. అయ్యవారిగూడెంలో వైఎస్‌ఆర్‌సిపి తరుపున సర్పంచ్‌గా గెలిచిన వేమిరెడ్డి చిలకమ్మ గ్రామస్థులతో కలిసి భట్టి సమక్షంలో కాంగ్రెస్‌లోచేరారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎర్రుపాలెం మండలంలో నిధులతో సిసి రోడ్లు, మామునూరులో మంచినీటి ప్రాజెక్టు, జమలాపురం చెరువును రిజర్వాయర్‌గా చేశామన్నారు. కట్టలేరు ఆధునీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేసి నిధులు మంజూరు చేయించిందన్నారు. నియోజకవర్గంలో త్వరలో వెయ్యి కోట్లతో ఇందిరమ్మ డైరిని ఏర్పాటుచేసి మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. మధిర నియోజకవర్గంలో గతంలో ఎన్నడు ఎవరు చేయని అభివృద్ధి గత నాలుగు నాలుగైదు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఇతర పార్టీల తీర్థం పుచ్చుకొని మళ్ళీ కాంగ్రెస్‌లో పార్టీలో చేరిన వారిని అభినందించారు. అందరికి ఆమోదయోగ్యమైన పద్దతిలో తెలంగాణ ఏర్పాటు జరుగుతుందన్నారు.రాష్ట్రంలో రాష్టప్రతి పాలన ఉండదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని తెలిపారు.

గిరిజన చట్టాలు సమగ్రంగా అమలు చేయాలి
* ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య
ఇల్లెందు, ఆగస్టు 9: ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ చట్టాలు సమగ్రంగా అమలు చేయని పక్షంలో గిరిజన కుటుంబాలు ఆర్థికాభివృద్ధిని సాధించలేరని ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య అన్నారు. శుక్రవారం పలు ఆదివాసీ గిరిజన సంఘాలు పట్టణంలో వేర్వేరుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానసెంటర్ల మీదుగా పలుసంఘాలు ప్రదర్శనలు నిర్వహించగా మరికొన్ని సంఘాలు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అబ్బయ్య మాట్లాడుతూ అనాదిగా ఆదివాసీ గిరిజన కుటుంబాలు సామాజిక, రాజకీయ చైతన్యాలకు దూరంగా ఉంటున్నాయని, అటువంటి వారికి సమాజంలో సముచిత స్థానం కల్పించడంతో పాటు ఆర్థికంగా వారిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఓట్ల కోసమే గిరిజన కుటుంబాలను వాడుకునే సంస్కృతి, సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ చిత్తశుద్ధితో ఆదివాసీ గిరిజనులను చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నించాలన్నారు. ఎస్‌టి, ఎస్‌సి సబ్‌ప్లాన్ పథకాన్ని నిర్ధిష్టంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అమలుచేసి గిరిపుత్రులు నివసిస్తున్న గ్రామాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ఏరియాల్లో 100శాతం ఉద్యోగాలను గిరిజనులకు ఇవ్వాలనే నిబంధనలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. సంఘటితంగా ఆదివాసీ సమస్యలు పరిష్కరించుకొని హక్కులను కాపాడుకోవాలని కోరారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల కోసం ఉపాధి అవకాశాలు కల్పించి గిరిజన చట్టాన్ని పటిష్ఠంగా అమలుచేయాలని కోరారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో రమణాల లక్ష్మయ్య, వీసం నర్సింహారావు, రమేష్, ప్రభాకర్, సమ్మయ్య పాల్గొన్నారు.

ఘనంగా సామూహిక వరలక్ష్మీవ్రతం
ఖమ్మం (ఖిల్లా), ఆగస్టు 9: స్థానిక 26వ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మివ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమూర్తి వీరభద్రప్రసాద్ మాట్లాడుతూ గత కొంత కాలంగా 26వ డివిజన్‌లో వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం మహిళలు సోదర భావంతో వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారని తెలిపారు. వరలక్ష్మి వ్రతం, రంజాన్ పండుగలు ఒకే రోజు రావడంతో ప్రజలు హిందు, ముస్లిం సోదరులు ఐకమత్యంగా ఈ రెండు పండుగలను ఆనందోత్సవాలతో జరుపుకున్నారన్నారు.

ఏజెన్సీలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం
చింతూరు, ఆగస్టు 9: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శుక్రవారం చింతూరు మండలంలో చింతూరు ఏజెన్సీలో గిరిజనులు కనులపండువగా జరుపుకున్నారు. మండలంలో వాడవాడలా గ్రామగ్రామానా ఆదివాసీ జెండా ఎగిరి రెపరెపలాడింది. ఒడిస్సా, చత్తీస్‌గఢ్, ఆంధ్ర ఆదివాసీల సంఘాల నేతలు కలిసి ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా చేసుకున్నారు. ఆదివాసీ సంఘాల నేతల ఆధ్వర్యంలో ముందుగా ఎర్రంపేట గ్రామం నుండి ఎపిఆర్ పాఠశాల, ఎజిఎస్‌ఎస్ పాఠశాల, కస్తూర్బా పాఠశాల విద్యార్థులతో చింతూరు సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ నుద్దేశించి ఆదివాసీ సంఘం నేతలు అంతల్ ప్రభాకర్, గుంజా శ్రీనివాస్, సోడే మురళి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు ఎన్నో హక్కులు, చట్టాలు కల్పించినప్పటికీ అవి నేటికీ అమలు కావటం లేదని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే రాజకీయ నేతలు ఉపయోగించు కుంటున్నారని దుయ్యబట్టారు. కనుక ఆదివాసీలందరూ ఐక్యతను చాటి స్వయం పాలన దిశగా వెళ్లాలని పిలుపునిచ్చారు. భద్రాచలం కేం ద్రంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం సెలవు దినంగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగుల వెంకటేశ్వర్లు, మానె రామకృష్ణ, ఎ. నవీన్, ఎస్ బజార్, జల్లి నరేష్, రవీందర్, సంగీత, అచ్చమ్మ, ఎమ్మార్వో తాతారావు, ఐటిడిఎ అధికారి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

పారదర్శక పాలన అందించాలి
ఖమ్మం రూరల్, ఆగస్టు 9: గ్రామపంచాయతీ పాలకవర్గం పారదర్శకవంతమైన పాలన అందించి ప్రజల మన్ననలు అందుకోవాలని సిపిఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఏదులాపురం, ఆరెంపుల గ్రామపంచాయతీల పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేశారు. ఏదులాపురంలో పువ్వాడ, ఎంపిడిఓ ఏలూరి శ్రీనివాసరావు, గ్రామపెద్దలు దండి సురేష్, గ్రామపంచాయితీ సెక్రటరీ వీరస్వామి సమక్షంలో గ్రామసర్పంచ్ దారావత్ సుభద్ర, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో పువ్వాడ గ్రామపంచాయితీ నూతన పాలకవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేవిధంగా చూడాలి. నిధులు సద్వినియోగం చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా సేవలు అందించడం ద్వారా ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని సూచించారు. పలువురు లబ్ధిదారులకు గ్యాస్ పొయ్యి, పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంపటి సురేందర్, నాయకులు చెరుకుపల్లి భాస్కర్, వెన్నం భాస్కర్, షాబాదు నారాయణరెడ్డి, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆరెంపులలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతమళ్ల రవికుమార్, వల్లూరి పట్ట్భా, వల్లూరి లక్ష్మారెడ్డి, వల్లూరి వెంకటరెడ్డి, కిలారు రమణారెడ్డి, మోత్కూరి కృష్ణ, కనే్నటి వెంకన్న, మద్ది వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన అభినందన సభలో సర్పంచ్ బండి జగదీష్, ఉపసర్పంచ్ తాటికొండ లక్ష్మిలతో సహా ఇతర పాలకవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా గ్రామసర్పంచ్ బండి జగదీష్ మాట్లాడుతూ ఆరెంపుల గ్రామపంచాయితీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు.

నీటితొట్టెలో పడి బాలిక దుర్మరణం
టేకులపల్లి, ఆగస్టు 9: ప్రమాదవశాత్తూ నీటితొట్టెలో పడి 8 సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండల పరిధిలోని మంగలి తండాకు చెందిన రమేష్, మణి దంపతుల కుమార్తె బి. శ్రావణి (8) మతిస్థిమితం లేకపోవటంతోపాటు మాటలు కూడా రావు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటి ఆవరణలోనే నీటి నిలువ కోసం ఏర్పాటుచేసిన సంపులో ప్రమాదవశాత్తు పడి ఊపిరి ఆడక మరణించింది. బాలిక మృతదేహాన్ని సాయంత్రం పొలం నుండి వచ్చిన తరువాత తల్లిదండ్రులు చూసి గుండెలవిసేలా రోదించారు. టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘనంగా ముగిసిన ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు
భద్రాచలం, ఆగస్టు 9: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆండాళమ్మ తిరు నక్షత్రోత్సవం ముగింపు సందర్భంగా ఉప ఆలయంలో వేంచేసియున్న ఆండాళ్ అమ్మవారికి అభిషేకం జరిగింది. అదే విధంగా బేడా మంటపంలో శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు ఉత్సవమూర్తులు, యంత్రలక్ష్మి, వెండి లక్ష్మీ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. భద్రుని మంటపంలో శ్రీరామ పాదుకలకు నిత్యాభిషేకం చేశారు. శ్రావణ తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి 108 లీటర్ల పాలు, 50 లీటర్ల పెరుగు, 25 లీటర్ల తేనె, 11 లీటర్ల నెయ్యి, ఐదున్నర కేజీల పంచదార, నాళికేళ దళాలచే సహస్ర సమస్త నదీ జలాలు, హందీ చూర్ణం, గంధోదకములచే, సహస్రధారలచే అభిషేకం అనంతరం తులసి మాలలతో కుంభ, ద్విభ అష్ట హారతులతో వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఇఓ ఎం రఘునాధ్, ఏఇఓ ప్రభాకర్, ప్రధానార్చకుడు పొడిచేటి హరిజగన్నాధాచార్యులు, స్థానాచార్యుడు కెఇ స్థలశాయి, వేదపండితులు మురళీ కృష్ణమాచార్యులు, ఎస్టీజి శ్రీమన్నారాయణ చార్యులు, ప్రధాన పురోహిత్ వెంకటేశ్వర అవధాని, రామానుజం, మదన్‌మోహన్, ఎస్టీజి కృష్ణమాచార్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తొలి శ్రావణ శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

‘్భద్రాచలం తెలంగాణలో భాగమే’
భద్రాచలం, ఆగస్టు 9: భద్రాచలం ఏజెన్సీ డివిజన్ తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమని టిఆర్‌ఎస్ నేతలు తిప్పన సిద్ధులు, గోపగాని శంకర్రావు అన్నారు. శుక్రవారం స్థానిక శుభం ఫంక్షన్ హాల్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. భద్రాచలం తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ముఖద్వారమని, సీమాంధ్రులు, సమైక్యవాదులు కృత్రిమ ఉద్యమం జరుపుతున్నారని వాటిని తిప్పికొట్టాలని కోరారు. భద్రాచలం విషయంలో ఆదివాసులు తెలంగాణకే మద్దతు పలకాలని, ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయని అందరం కలిసి భద్రాచలం బచావ్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అనంతరం సీమాంధ్రులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నదానికి నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాళ్ల రవి, నలజాల శ్రీను, పడిసిరి శ్రీను, మామిడి పుల్లారావు, అలవాల రాజా, రాజా, చారి, సాయి, జనార్ధన్, రాజు, రవి, వీరాస్వామి, సమ్మయ్య అప్పారావు, రఫీ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన ప్రాంతాలకు స్వయం పరిపాలన ప్రకటించాలి
కొత్తగూడెం, ఆగస్టు 9: ఆదిలాబాద్ జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న గిరిజన ప్రాంతాలకు స్వయం పరిపాలనను వెంటనే ప్రకటించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా అధ్యక్షుడు వాసం రామకృష్ణదొర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని లక్ష్మిదేవిపల్లి పంచాయతీలోని కొమరంభీం ప్రాంగణంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో పతకావిష్కరణ నిర్వహించారు. మొదట ఆదివాసీ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ డివిజన్ నాయకుడు కుంజా సమ్మయ్య పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణదొర మాట్లాడుతూ ఆదివాసీలకు కల్పించిన రాజ్యాంగపు హక్కులు, చట్టాలను వలసవాదులు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆదివాసీలను బిచ్చగాళ్ళుగా మారుస్తున్నాయని దుయ్యబట్టారు. 1976లో లంబాడీలను గిరిజనులుగా ఆదివాసీల మనోభిప్రాయాలను తెలుసుకోకుండా నిర్ణయించారని అన్నారు. 2014ఎన్నికల్లో అధికార దాహం కోసం రాష్ట్ర విభజన పేరిట ఆదివాసీ ప్రాంతాలను రెండు ముక్కలుగా చేస్తున్నారని అన్నారు. ఈ విధానాన్ని సహించేది లేదని రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేసినా ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు ఉన్న గిరిజన ప్రాంతాలను రాజ్యాగాన్ని అనుసరించి ప్రత్యేక స్వయం పరిపాలనగా ప్రకటించాలని, దీనికోసం ఆదివాసీలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మడకం వీరరాజు, మోకాళ్ళ రాంబాబు, ఉపాధ్యక్షుడు తాటి చందర్‌రావు, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిజ్జా శ్రీను, విద్యార్థి సంఘం నాయకులు సనపా కోటేశ్వరరావు, బాసబోయిన జంభు, కోరెం కృష్ణ, వంకా పిడుగురాజు, రేసు నాగమణి, సున్నం వెంకటేశ్వర్లు, కె ప్రవీణ్, టి తిరుమలేష్, సిహెచ్ వెంకటేశ్వర్లు, పి శ్రీనివాస్, టి బాలకృష్ణ, జె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండిలను కలిసిన టిఇఇయు నాయకులు
పాల్వంచ, ఆగస్టు 9: నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ ఎలక్ట్రిసిటి హెచ్ 142 రాష్ట్ర నాయకులు గురువారం హైద్రాబాద్‌లోని జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండిలను కలిసి నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులను వారికి పరిచయం చేసి వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎండి ఖజామోహినుద్దీన్, జె వెంకటేషం మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులందరికీ ఎల్లవేళల అందుబాటులో ఉంటూ కార్మిక హక్కుల సాధన కోసం కృషి చేస్తామన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను జెన్‌కో ఎండి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో పలువురు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.

ప్రపంచానికి మార్గదర్శకుడు మహ్మద్ ప్రవక్త
కొత్తగూడెం, ఆగస్టు 9: ప్రపంచానికి మార్గదర్శకుడు మహ్మద్‌ప్రవక్త అని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శుక్రవారం కొత్తగూడెంలోని ఈద్గా వద్ద ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రవక్త సూక్తులను పాటిస్తూ అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయన కోరారు. కఠోర ఉపవాస దీక్షలను చేసిన ముస్లింలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎ రజాక్, నాయకులు కాసుల వెంకట్, బెటాలియన్ శ్రీను, మాజీ కౌన్సిలర్ కె ధర్మరాజు, ఆకుల సుధాకర్, తంగెళ్ళ లక్ష్మణ్, నాయకులు మహేష్, ఫిరోజ్, ఎస్‌కె నిషార్, ఈసూబ్, బాలప్రసాద్‌పాసి పాల్గొన్నారు.
..................

కంచే చేను మేసింది...
* విజిలెన్స్ అమ్ముడుపోయింది!
* పట్టుకుంది 72బస్తాల గుట్కాలు... చూపింది 5బస్తాలు
* ‘పేట’లో ఆగని అరాచకాలు...
* నిరాటంకంగా మూగజీవాల తరలింపు
* రిక్రియేషన్‌పేరుతో పేకాటకు అనుమతి... లక్షల్లో వసూళ్లు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఆగస్టు 9: అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన వారు అడ్డగోలు మేతకు అలవాటుపడితే... చట్టాన్ని రక్షించాల్సిన వారు భక్షించడం మొదలుపెడితే ఏం జరుగుతుంది? కంచే చేనుమేస్తే సమాజంలో అన్యాయం రాజ్యమేలుతుంది, అవినీతి అందలమెక్కుతుంది, అరాచకం వికటాట్టహాసం చేస్తుంది... సరిగ్గా చిలకలూరిపేటలో ఇదే జరిగింది. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌పోర్స్‌మెంట్ విభాగంలో ఓ అధికారి నిర్వాకం ఆశాఖలో గూడుకట్టుకుపోయిన అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ‘అరాచకాలకు అడ్డాగా మారిన చిలకలూరిపేట’ శీర్షికన ఇటీవల ఆంధ్రభూమిలో వార్త ప్రచురితమైంది. పత్రికలో వార్త ప్రచురితమైందే తడవుగా విజిలెన్స్ విభాగంలోని ఓ సిఐ స్థాయి అధికారి చిలకలూరిపేట వెళ్లి ఓ గుట్కారాకెట్‌పై దాడిచేశారు. ఆ తర్వాత పత్రికలవారిని పిలచి తాము 25వేల రూపాయల విలువచేసే గుట్కాప్యాకెట్లు పట్టుకున్నామని గొప్పగా సెలవిచ్చారు. అయితే వాస్తవానికి అక్కడ జరిగింది వేరు. చిలకలూరిపేటలో విజిలెన్స్ అధికారి పట్టుకున్నది అక్షరాలా 72బస్తాల గుట్కా ప్యాకెట్లు. వీటివిలువ సుమారు 5లక్షల రూపాయల పైమాటే. పత్రికలో వార్తవచ్చింది కనుక దాడి తప్పడం లేదని సంబంధిత గుట్కారాకెట్ దారుడికి చెప్పి కేవలం 5బస్తాల ప్యాకెట్లు చూపి నామమాత్రపు కేసురాసి సర్దుకున్నారు సదరు అధికారి. ఇందుకు సంబంధిత గుట్కారాకెట్ దారుడు విజిలెన్స్, స్థానిక పోలీసు అధికారులకు పెద్దమొత్తంలో మామూళ్లు సమర్పించుకోడంతో ‘పని’ పూర్తయ్యాక తాపీగా విలేఖరులను పిలిచి 25వేల రూపాయల విలువచేసే గుట్కాలు పట్టుకున్నామని తాపీగా సెలవిచ్చారు.
రిక్రియేషన్ పేరుతో పేకాట... లక్షల్లో మామూళ్లు
చిలకలూరిపేటలో మరో అరాచకానికి సైతం అక్కడి పోలీసులు తెరలేపారు. ఇక్కడ రిక్రియేషన్ పేరుతో ఏర్పాటైన ఓ పేకాట క్లబ్‌లో ప్రతిరోజూ జూదరులు పేకాడుతూ లక్షల రూపాయలు చేతులు మారుస్తున్నా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదు. అదేమంటే సంబంధిత క్లబ్‌కు అనుమతి ఉందంటూ బుకాయిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో ఏ క్లబ్బుకు డబ్బులు పెట్టి పేకాట ఆడించే అనుమతి లేదు. 13ముక్కల రమీ అని ఇచ్చిన అనుమతిని దుర్వినియోగం చేస్తూ చిలకలూరిపేటలోని క్లబ్ పెద్దఎత్తున పేకాట సాగిస్తోంది. అటు మద్రాసునుంచి, ఇటు తూర్పుగోదావరి, విశాఖపట్నం నుంచి కూడా పేకాట రాయుళ్లు ఇక్కడకు వస్తున్నారంటే పేకాట ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ యథేచ్చగా పేకాట ఆడనిస్తున్నందుకు గాను స్థానిక పోలీసులకు ప్రతినెలా లక్షల్లో మామూళ్లు అందుతున్నాయన్నది చేదునిజం. గుంటూరులోని ఎల్‌విఆర్ క్లబ్, గుంటూరుక్లబ్‌లలో కూడా భారీఎత్తున పేకాట సాగుతోంది. రిక్రియేషన్ క్లబ్ అనుమతి నిబంధనల్లోని ఒకేఒక నిబంధనను అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా పేకాట సాగిస్తున్నారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి డబ్బుతో పేకాట నిర్వహించే క్లబ్‌ల లైసెన్సును సస్పెండ్ చేసే అధికారం పోలీసుశాఖకు ఉంది. ఇవన్నీ తెలిసినా పోలీసులు మాత్రం ఆ క్లబ్‌లకు అనుమతి ఉందని బుకాయిస్తూ చోద్యం చూస్తున్నారు.
ఆగని మూగజీవాలబలి... అనధికార సంత నేడు
ఇదిలావుండగా చిలకలూరిపేటలోని ఎన్‌ఆర్‌టి రోడ్డులో అనధికారికంగా కొనసాగుతున్న మూగజీవాల సంత యథేచ్ఛగా కొనసాగుతోంది. దీనివెనుక ఓ జిల్లామంత్రి అండదండలు ఉండటంతో జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం కళ్లుండీ చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారు. ప్రతి శనివారం ఇక్కడ నుంచి వేలల్లో మూగజీవాలు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కోతకు తరలివెళ్తున్నాయి. ఈ శనివారం కూడా పెద్దఎత్తున సంత నిర్వహించేందుకు సంబంధిత యాజమాన్యం ఏర్పాట్లు చేసుకొంది. కేవలం జిల్లామంత్రి అండదండలతోపాటు ఈ సంత యాజమాన్యం లక్షల్లో మామూళ్లు అందజేస్తుండటంతో చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి చిలకలూరిపేటలో కొనసాగుతున్న అసాంఘిక రాకెట్లను పోలీసు ఉన్నతాధికారులు అడ్డుకోకపోతే ఆ తర్వాత జరిగే అవాంఛనీయ పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

అంతా అయిపోయాక
మేల్కొన్న కిరణ్
* టిడిపి నేత కోడెల
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఆగస్టు 9: తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు దొంగలు పడిన ఆర్నెల్లకు కుక్కలు మొరిగిన చందంగా ఉన్నాయని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాద్ దుయ్యబట్టారు. గుంటూ రు జిల్లా టిడిపి కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకోక ముందు స్పందించని ముఖ్యమంత్రి ఇప్పుడు వ్యాఖ్యలు చేసి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. జల వనరులు, విద్యుత్, ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ వాస్తవాలేనని కోడెల సమర్థించారు. దేశంలో ఎప్పుడూ కూడా రాష్ట్రాలను విభజించేటప్పుడు అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే విభజన జరిగేదని, అందుకు విరుద్ధంగా ప్రకటన చేసేసి, మళ్లీ వాదనలు వింటామని కొత్త భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీమాంధ్రలో 90 శాతం, తెలంగాణలో 45 శాతం ప్రజలు రాష్ట్ర సమైక్యతనే కాంక్షిస్తున్నారన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పొందుపర్చిన అంశాలను అసలు పరిశీలించకుండానే నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కూడా తన గళాన్ని వినిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఉత్తరమిస్తే తెలంగాణ విభజన ఆగిపోతుందంటే తాము బాబు చేత లేఖ ఇప్పించేందుకు సిద్ధమన్నారు. ప్రత్యేక తెలంగాణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బీజం వేయగా, విభజన పాపం ప్రస్తుత పాలకులదేనని కోడెల దుయ్యబట్టారు. సోనియాకు సెంటిమెంట్‌లు తెలియవని, ఆమె రాష్ట్రాన్ని విభజించి తన కొడుకుకి ప్రధాని పట్టంకట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంటోని కమిటీ రాజకీయ కమిటీయే తప్ప ప్రభుత్వం వేసిన కమిటీ కాదని స్పష్టం చేశారు. కృష్ణా జలాలను కర్నాటక చెరబట్టడానికి కారకుడైన మొయిలీతో కమిటీ వేయడం వలన ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. ఎంపిలు, కేంద్రమంత్రులు ఇప్పటికైనా స్వచ్చందంగా తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కేంద్రప్రభుత్వం సీమాంధ్ర ప్రజల నిరసన, ఆవేశాన్ని సరిగా అంచనా వేయడం లేదని, 2009 డిసెంబర్ 9 ప్రకటనను ఉపసంహరించుకున్న మాదిరిగానే ఇప్పుడు కూడా ప్రజా ఉద్యమాల తాకిడికి విభజన ప్రక్రియ నిలిచిపోతుందని కోడెల జోస్యం చెప్పారు.

డ్యూటీ చార్ట్ మార్పులకు నిరసనగా
మహిళా కండక్టర్ల ఆత్మహత్యాయత్నం

* ఆర్టీసీ గేటువద్ద బైఠాయించిన కార్మికులు * సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన డిఎం
వినుకొండ, ఆగస్టు 9: డ్యూటీ ఛార్టులో మార్పులతో మనస్తాపానికి గురైన ఐదుగురు మహిళా కండక్టర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది. వినుకొండ ఆర్టీసీ డిపోలో మహిళా కండక్టర్లుగా పనిచేస్తున్న అంజలి, మాధవి, పద్మ, హైమా, గురులక్ష్మి అనే మహిళ కండక్టర్లు ఆర్టీసీ డిపో రెస్ట్‌రూమ్‌లోకి పెట్రోల్ బాటిల్స్‌తో వెళ్ళి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు. ఆర్టీసీ కార్మికులు రెస్ట్‌రూమ్ వద్దకు చేరుకుని మహిళా కండక్టర్లకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు నిరాకరించడంతో పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనాప్రదేశానికి చేరుకున్నారు. మహిళా కండక్టర్లకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు మెయిన్‌గేటు వద్ద బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం కార్మికనాయకులతో పట్టణ సిఐ సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం, ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి మహిళాకండక్టర్లకు డ్యూటీ చార్ట్‌కు సంబంధించి తగున్యాయం చేస్తామని డిపోమేనేజర్ పూర్ణచంద్రరావుహామీ ఇచ్చారు. దీంతో మహిళా కండక్టర్లు రెస్ట్‌రూమ్ నుండి బయటకురావడంతో సమస్య సద్దుమణిగింది.

పాల ఉత్పత్తిదారులకు 2.46 లక్షల బోనస్ పంపిణీ
అచ్చంపేట, ఆగస్టు 9: మండలంలోని పెదపాలెం గ్రామ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఖాతాదారులకు 2.46 లక్షల రూపాయల బోనస్‌ను అందజేశామని సంఘ కార్యదర్శి చిరుమామిళ్ల నరసింహారావు శుక్రవారం విలేఖర్లకు తెలిపారు. 2012-13 సంవత్సరాలకు గాను 41 లక్షల రూపాయల మేర పాల ఉత్పత్తుల వ్యాపారం జరిగిందన్నారు. సంఘంలోని 200 మంది రైతులకు నూటికి 6 రూపాయల చొప్పున బోనస్‌ను అందించామన్నారు. ఈ సందర్భంలోనే అత్యధికంగా 1,03,500 లీటర్ల పాల ఉత్పత్తులను అందించిన వట్టికొండ రుక్మిణి 8,300 రూపాయల బోనస్, లక్షా 500 లీటర్ల పాలనందించిన నల్లమోతు వెంకటేశ్వర్లుకు 6,500 రూపాయల బోనస్‌ను సంఘ అధ్యక్షుడు అందించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట చీలింగ్ సింగారావు, రెంటపాళ్ల మేనేజర్ కిషోర్, సభ్యులు గణపతి, ఎన్ సుబ్బారావు, పాలకవర్గ సభ్యులు, ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.
వర్సిటీలో ఇద్దరు విద్యార్థుల ఘర్షణ
* ఒకరికి తీవ్రగాయాలు
నాగార్జున యూనివర్సిటీ, ఆగస్టు 9: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు మధ్య జరిగిన ఘర్షణ వర్సిటీలో సంచలనం కలిగించింది. ఒకే విభాగానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మధ్య ఘర్షణ నెలకొంది, ఘర్షణ నేపథ్యంలో ఒక విద్యార్థి ఇనుపరాడ్‌తో మరొక విద్యార్థిపై దాడి చేయటంతో తలపైన గాయమై తీవ్ర రక్తస్రావమైందని వర్సిటీ హాస్టల్స్ ఛీప్‌వార్డెన్ డాక్టర్ పి జాన్సన్ తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదని, మంగళగిరి పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి దాడి చేసిన విద్యార్థులను విచారించారని ఆయన తెలిపారు. గాయపడిన విద్యార్థికి చినకాకాని ఎన్నారై హాస్పిటల్‌లో తగిన వైద్యసేవలందిచామని, ఘర్షణకు గల కారణాలపై విచారణ జరిపి విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సైన్సు కళాశాల వార్డెన్ డాక్టర్ జగదీష్‌నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల ఘర్షణకు సంబంధించిన సంఘటనపై విచారణ చేస్తున్నామని, విద్యార్థులు ఇరువురు దాడికి కారణాలను వెల్లడించటంలేదని తెలిపారు. దీనిపై సమగ్రమైన విచారణ జరిపి వర్సిటీ వీసీ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని తెలిపార

* అడ్డుకునే ప్రయత్నం చేయని ప్రభుత్వం
english title: 
j

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>