Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జిల్లాలో జాతీయ పతాకం ఎగిరేనా...!

$
0
0

అమలాపురం, ఆగస్టు 9: జిల్లాలో మహోగ్రంగా సాగుతున్న సమైక్య ఉద్యమ సెగలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తాకే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు ఈసారి ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో జాతీయ జండా ఆవిష్కరణలు ప్రశ్నార్ధకం కానున్నాయి. ఆగస్టు 15న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రంలో ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగిస్తారు. అయితే ప్రస్తుతం జిల్లాలో సమైక్య ఉద్యమం తీవ్రంగా సాగుతోంది. జిల్లాలో మంత్రి పదవికి రాజీనామా చేసిన పినిపే విశ్వరూప్ కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆగస్టు 15న జిల్లా సీనియర్ మంత్రిగా జాతీయ జెండా ఎగురవేయనని ప్రకటించి సంచలనం సృష్టించారు. జిల్లాకు చెందిన మరో మంత్రి తోట నరసింహం కూడా గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేయటంతో జిల్లాలో పతాకావిష్కరణ సందిగ్ధంలో పడింది. ఇలాంటి పరిస్థితులెదురైనపుడు సాధారణంగా జిల్లా కలెక్టర్లతో కార్యక్రమం కానివ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసే అవకాశముంది. అయితే ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుండి జెఎసి ఆధ్వర్యంలో ఎన్‌జిఒలు సమ్మెకు దిగుతుండటంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్తంభించనున్నాయి. పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేయాల్సిన ఉద్యోగులంతా సమ్మెలో ఉంటే కార్యక్రమం ముందుకు ఎలా నడుస్తుందనేది ప్రశ్నార్థకం. అలాగే సమ్మెలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు తదితరాలన్నీ మూతపడనుండటంతో అక్కడ కూడా పతాకావిష్కరణలు జరిగే అవకాశం సందేహమే.

10వ రోజూ సమైక్యోద్యమం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఆగస్టు 9: ఒకపక్క రంజాన్ పండుగ సందడి, మరోపక్క సమైక్యాంధ్ర ఉద్యమాలతో శుక్రవారం గోదావరి జిల్లాలు గత పది రోజుల వాతావరణానికి కాస్తంత భిన్నంగా కనిపించాయి. రాష్ట్ర విభజనకు అనుకూలంగా యుపిఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పటి నుండి తీవ్ర ఆగ్రహావేశాలతో సాగుతున్న ఉద్యమాలు రంజాన్ సందర్భంగా కాస్తంత తీవ్రతను తగ్గించాయి. ఒకపక్క ముస్లింలకు ఆందోళనకారులు శుభాకాంక్షలు చెబుతూనే సమైక్యాంధ్ర నినాదాలు చేసారు. అయితే ఆందోళన కార్యక్రమాలను మాత్రం ఆపకుండా రాజకీయపార్టీల నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, విద్యార్ధులు కొనసాగించారు. రాజకీయేతర జెఏసి ఆధ్వర్యంలో న్యాయస్థానాల ఆవరణ వద్ద రిలేదీక్షలు కొనసాగాయి. ఈ దీక్షల్లో సీనియర్ న్యాయవాది టివి సత్యనారాయణరెడ్డి, బార్‌కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. కోటగుమ్మం సెంటర్ వద్ద వైఎస్సార్ సిపి నాయకులు రిలే దీక్షలు కొనసాగించారు. ఈ దీక్షల్లో వైఎస్సార్ సిపి నాయకుడు జక్కంపూడి రాజా తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సెలవయినప్పటికీ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలను కొనసాగించారు. ట్రాన్స్‌కో ఇంజనీర్లు, ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు రిలేదీక్షలు చేపట్టారు. యువకులు మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. రానున్న రెండు రోజులూ సెలవయినప్పటికీ సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాలు, జెఏసి కమిటీలు ప్రకటించాయి. గత పది రోజులుగా మూతపడ్డ దుకాణాలు రంజాన్ సందర్భంగా తెరుచుకున్నాయి. 12నుండి మళ్లీ ఉద్యమం ఉద్ధృతమవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ రెండు రోజులూ వ్యాపారం చేసుకునేందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోని జెఏసి అంగీకరించింది.
సమైక్యాంధ్రా ఉద్యమంలో విద్యార్థులు
కాకినాడ సిటీ, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమ బాట పట్టనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే సమైక్యవాణిని వినిపిస్తున్న ప్రజలు చేపట్టిన ఆందోళనలు, ఉద్యమాలు మరింత పెరిగాయి. ఉద్యమాలను మరింత బలోపేతం చేసేందుకు సమైక్య వాదులు నిరవధిక రిలే నిరాహార దీక్షలతో పాటు రాష్ట్రాన్ని విభజిస్తే సహించేది లేదని తమ ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గత పది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు, న్యాయవాదులు, విద్యార్థులు, డాక్టర్లు స్వచ్ఛందంగా రిలే దీక్షలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన ప్రకటనను యుపిఎ ప్రభుత్వం ప్రకటించే వరకు సమైక్య వాదులు ఆందోళనలను విరమించే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లా కేంద్రం కాకినాడతో పాటు చారిత్రాత్మక నగరమైన రాజమండ్రి ఇతర ముఖ్య పట్టణాల్లో న్యాయవాదులు సమైక్య వాదానికి మద్దతుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సిబ్బంది రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. సమ్మెను మరింత ఉద్ధృతం చేసే యోచనలో ఉన్న ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉద్యోగులు, కార్మికులు టెంట్లు వేసి దీక్షా శిబిరాలను ఏర్పాటుచేసుకుని, విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. కాకినాడ నగరంలో చేపల వర్తకులు శుక్రవారం పూర్తిగా తమ వ్యాపారానికి స్వస్తి పలికి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కైట్ కళాశాలకు చెందిన విద్యార్థులు సుమారు 300 బస్సుల ద్వారా 3 వేల మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా రాష్ట్రం సమైక్యంగా ఉంటే ప్రజలకు జరిగే మేలు, విడిపోతే జరిగే నష్టంపై విస్తృతంగా ప్రచారం చేయడానికి నిర్ణయించారు. కాకినాడ నగరానికి చెందిన ఆర్యవైశ్య మహా సభ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అదే విదంగా కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు సైతం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని వారు ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు శనివారం నుండి శ్రీకారం చుట్టనున్న నేపధ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యమం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాణి వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటల్లో వాస్తవాలు ఉన్నాయని ఆయనకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని దొమ్మేటి ప్రజలకు పిలుపునిచ్చారు.

గుండెపోటుతో సమైక్య ఉద్యమకారుడు మృతి
రావులపాలెం, ఆగస్టు 9: సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఒక ఉద్యమకారుడు శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం పొందాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. మండల పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన తవిటిక శ్రీనుబాబు (43) రోజుకూలీగా జీవనోపాధి పొందుతున్నాడు. అయితే తెలంగాణా ప్రకటన తరువాత గ్రామంలో చేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో గత కొద్ది రోజులుగా చురుగ్గా పాల్గొంటున్నాడు. శుక్రవారం కూడా గ్రామంలోని నాయకులతో సమైక్యాంధ్ర ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చలు జరిపాడు. అనంతరం ఇంటికి చేరుకున్న శ్రీనుబాబు తీవ్రమైన గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్థానిక వైద్యులు వచ్చి పరీక్షించి అతను మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడు శ్రీనుబాబుకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనుబాబు మృతితో ఆ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యంలో శ్రీనుబాబు మృతి చెందాడని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణా విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఘనంగా రంజాన్ వేడుకలు
రాజమండ్రి, ఆగస్టు 9: ముస్లింలకు అతిపెద్దపండుగ రంజాన్‌ను శుక్రవారం నగరంలోని ముస్లింలు ఘనంగా నిర్వహించారు. రంజాన్‌ను పురస్కరించుకుని నెహ్రూనగర్‌లోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈద్గా మైదానం గౌరవాధ్యక్షుడు ఎండి కరీంఖాన్, అధ్యక్షుడు హాజీ ఎండి అమానుల్లా ఆధ్వర్యంలో రాయల్‌మసీదు ఇమాం పర్యవేక్షణలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పెద్దసంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సమైక్యంగా సోదరభావంతో కలిసి ఉండాలని ప్రార్థనలు జరిపారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, బొమ్మన రాజ్‌కుమార్, టికె విశే్వశ్వరరెడ్డి, నక్కా శ్రీనగేష్ తదితరులు ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రౌతు మాట్లాడుతూ ముస్లింలు సర్వమతాలను గౌరవించాలన్నారు. ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లింలు దేశ సౌభగ్యాన్ని కోరుకున్నారని అభినందించారు. ఖురాన్ సందేశాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలన్నారు. ఈసందర్భంగా ముస్లింల అభివృద్ధికి తన నిధుల నుంచి ఆదిరెడ్డి అప్పారావు రూ. 10లక్షలు ప్రకటించారు.
నిలిచిపోయిన పన్నుల వసూళ్లు
* కళతప్పిన పర్యాటక కేంద్రాలు * సమైక్య ఆందోళనల ప్రభావం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఆగస్టు 9: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గత పది రోజులుగా కొనసాగుతున్న ఉద్యమాల కారణంగా పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. జూలై 31 నుండి ఎన్‌జిఓలు విధులకు గైర్హాజరవటం, 72గంటల పాటు సమ్మె చేయాలన్న నిర్ణయంతో ఆందోళనకు దిగిన మున్సిపల్ ఉద్యోగులు తమ ఆందోళనను కొనసాగించటం తదితర కారణాలతో రాష్ట్రప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చిపెట్టే వివిధ శాఖల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. దాంతో జిల్లాలో పన్నుల వసూళ్లు, ప్రభుత్వ రాబడి నిలిచిపోయాయి. గత మార్చి నెలాఖరు నాటికి చెల్లించాల్సిన ఆస్తి పన్ను, తాగునీటి పన్నులకు సంబంధించిన నోటీసులను పన్ను చెల్లింపుదార్లుకు మున్సిపాలిటీలు ఆలస్యంగా ఇవ్వటంతో జూలై నెలాఖరు వరకు గడువు ఉంది. అయితే సరిగ్గా అదే రోజున ఆందోళనలు ప్రారంభంకావటంతో చివరి రోజు పన్నులు చెల్లించాలని భావించే వారు చెల్లించలేకపోయారు. ఆస్తి పన్ను చెల్లించే వారు గడువు ముగియటానికి చివరి రెండు మూడు రోజుల్లోనే పన్నులు చెల్లిస్తుంటారు. సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా అది సాధ్యంకాలేదు. మున్సిపల్ ఉద్యోగులు కూడా నిరవధికంగా సమ్మెకు దిగటంతో ఇక ఆస్తి పన్నుతో పాటు మరే ఇతర వసూళ్లకు అవకాశం లేకుండా పోయింది. దాంతో గత వారం రోజులుగా మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రావటం లేదు. ఎలాగూ సిబ్బంది సమ్మెలో ఉన్నారు కాబట్టి, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టే వారు, ఇదే మంచి సమయంగా భావించి అనధికారిక నిర్మాణాలను వేగంగా చేసుకుపోతున్నారు.

*పంద్రాగస్టుకు ఉద్యమ గండం*పతాకావిష్కరణకు మంత్రులు విముఖం*13 నుండి అందుబాటులో ఉండని ఉద్యోగులు
english title: 
j

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles