తిరుపతి, ఆగస్టు 8: ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధనే లక్ష్యమని రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన తిరుపతి తుడా ఇందిరామైదానంలో రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ త్యాగాలకు, త్యాగధనులకు, కవులకు, ఖనిజాలకు పుట్టినిల్లు అన్నారు. అన్నమయ్య, త్యాగయ్య, పోతులూరి వీరబ్రహ్మంగారు, పుట్టపర్తి సాయిబాబా ఆధ్యాత్మిక గురువులు, మోక్షగుండం విశే్వశ్వరయ్య వంటి ఇంజినీర్లు పుట్టిన పుణ్యభూమి అన్నారు. పోరాడే తత్వం రాయలసీమ ప్రాంత ప్రజల నైజమన్నారు. ఇంటి దొంగలుగా ఉన్న సీమ నేతలే ఈ ప్రాంత వెనుకబాటుతనానికి కారణమన్నారు. శ్రీభాగ్ ఒడంబడికలోనే సీమకు తొలి అన్యాయం జరిగిందన్నారు. మన సీమ పెద్దలను ఏనుగు అంబారీలపై ఊరేగించి ఆ ఒడంబడికలో సంతకాలు చేయించుకుని సర్కార్ నేతలు మోసం చేశారన్నారు. ప్రతి పర్యాయం సీమ వాసులు నష్టపోతూనే ఉన్నారన్నారు. మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయే సమయంలో కర్నూలును రాజధాని చేశారని, అది ఎంతోకాలం నిలువలేదన్నారు. సీమ వాసులను మోసం చేస్తూ గద్దల్లా రాజధానిని హైదరాబాద్‌కు తన్నుకుపోయారన్నారు. నేడు తెలంగాణ వాసులు హైదరాబాద్‌ను లాక్కుంటే తిరిగి ఒంగోలు, గుంటూరులో సీమ వాసులు ఇబ్బందులు పడే పరిస్థితికి చేరుకున్నామన్నారు. సర్కార్‌లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజధాని ఒంగోలు, గుంటూరు అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. నేడు తెలంగాణ ప్రకటన జరిగిపోయిందని వారి మోచేతి నీళ్లు తాగేందుకు సీమ వాసులు సిద్ధంగా లేరన్నారు. శ్రీబాగ్ ఒడంబడికలో సీమనేతలు సంతకాలు చేసిన కారణంగానే మనకు బంగారాన్ని అందించే కోలార్, బళ్లారి జిల్లాలు, హంపినగరం, హోస్‌పేట వంటి తెలుగుమాట్లాడే ప్రాంతాలను రాయలసీమ వాసులు కోల్పోయామన్నారు. ఈ ప్రాంతాలన్నీ నేతల స్వార్థానికి కర్ణాటకలో కలిసి పోయాయన్నారు. దీంతో పాటు తుంగభద్ర ప్రాజెక్టు కూడా కర్ణాటకలోకి వెళ్లిపోయిందన్నారు. కృష్ణా జలాల్లో కూడా సర్కార్‌కు 80 శాతం పోతే మనకు వచ్చేది 20 శాతమన్నారు. రాయలసీమకు రావలసిన వాటా ప్రకారం ఎప్పుడూ నికర జలాలు ఇవ్వలేదన్నారు. మిగులు జలాలతోనే మన ప్రాంత రైతులు దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. కృష్ణాజలాల్లో 811 టిఎంసిల నీటిలో 377 టిఎంసిల నీటిని సర్కార్‌కు, 260 టిఎంసిలు తెలంగాణకు వెళితే కరువు జిల్లాలుగా ఉన్న సీమకు కేవలం 122 టిఎంసిలు మాత్రమే ఇచ్చి నయవంచనకు పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం జరిగితే సీమ వాసులు కోర్టుకు వెళితే రాష్ట్రం హద్దులు ఇచ్చిన తరువాత ఎవరి రాష్ట్రంలో వారు ఏమైనా చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ఎత్తును పెంచేందుకు తెలంగాణ వాళ్లు ఒప్పుకోలేదన్నారు. నీళ్లు అన్నీ సర్కార్‌వారు తీసుకువెళితే నీటి దొంగలని సీమ వాసులు తిట్లుతిన్నారన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి, కాల్పుల్లో సీమ వాసులు ప్రాణాలు కోల్పోతే ఈ ఫ్యాక్టరిలో సీమవాసులకు ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ సెక్రటరియేట్‌లో కనీసం 5 శాతం ఉద్యోగులు కూడా సీమ వాసులకు లేవన్నారు. రాష్ట్ర విభజన జరిగితే నష్టపోయేది సీమ వాళ్లేనన్నారు. రాయలసీమలో ఎంబిఏ చేసి పూలు అమ్ముకుంటున్నవారున్నారని, బిటెక్ చదివి బేల్దారు పనులకు పోతున్న నిరుద్యోగులు కుప్పలు తెప్పలుగా ఉన్నారన్నారు. నీళ్లు లేక రాయలసీమలో 40 శాతం భూములు ఏళ్లతరబడి బీళ్లుగా ఉంటే పట్టించుకోని పత్రికలు, పాలకులు సర్కార్‌లో ఒక పంట మాత్రమే 50 హెక్టార్ల భూమిలో క్రాప్ హాలిడే ప్రకటిస్తే పతాక శీర్షికన ప్రచురించారని, రాజకీయ పార్టీలు అన్యాయం జరిగిపోయిందని నెత్తి, నోరు బాదుకున్నారన్నారు. రాయలసీమ బీడు భూముల గురించి, కేవలం వర్షంపై ఆధారపడి జీవించే ఈ ప్రాంత రైతుల గురించి పట్టించుకున్ననాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన సీమ ధీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. ఆయన గురించి ఏమాత్రం పట్టించుకోరని, సర్కార్ ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజును మాత్రం ఆకాశానికి ఎత్తేశారన్నారు. ఇలా ప్రతి విషయానికి తెలంగాణ వారి కోసమైనా, సర్కార్ వారికోసమైనా ఉద్యమాలు చేసేది సీమవాసులేనన్నారు. చిప్పకూడు, చిన్నచూపు సీమవాసులకు మిగులుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లో రాయలసీమ వాసులను మోసం చేస్తున్న సర్కార్ ప్రాంతంతో తాము కలిసి ప్రయాణం చేసే ప్రసక్తే లేదన్నారు. కఠిన దారిద్య్రాన్ని అనుభవిస్తున్నా తిమ్మప్పమర్రిమానులా నిలిచివుండే మొండి ధైర్యం సీమ వాసులకు ఉందన్నారు. సీమ ప్రాంత నేతలకు మొదటి నుండి డబ్బు సంపాదన ఎలా చేయాలి, పదవులు ఎలా పొందాలి అన్న యావ తప్ప ప్రజల గురించి, ఈ ప్రాంతం అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అందుకే ఇలాంటి ఇంటి దొంగలను తరిమితరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకే సీమ ప్రాంతంలో మద్యనిషేధం జరిగేలా, రాయలసీమ సీమ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందన్నారు. సీమ వాసులు ఎప్పుడూ జొన్న సంగటి, రాగి సంగటి తినే వారని, కిలో రెండు రూపాయల బియ్యంతో ఇక్కడ ఆహారపు అలవాట్లను కూడా మార్చివేశారన్నారు. అందుకే రూపాయికే కిలో కొర్రలు, రాగులు, జొన్నలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ముస్లిం మైనార్టీలకు, దళితులకు ప్రత్యేక కళాశాలలు, హాస్టల్స్ ఉండాలని డిమాండ్ చేశారు. ఏ శుభకార్యం జరగాలన్నా అప్పులేనిదే సీమ ప్రాంతంలో ఏ ఒక్కరు అడుగు ముందుకు వెయ్యలేరన్నారు. అందుకే సీమవాసుల అప్పులను వెంటనే రద్దు చేయాలని, రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేసి దేశానికి రెండవ రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు, రైతుల అప్పులన్నింటిని రద్దు చేయాలన్నారు. పదవుల కోసం తమ పార్టీని స్థాపించలేదని, పాలకులను వళ్లు వంచి పనిచేయించేందుకేనని, రాజకీయ బ్రోకర్ల వ్యవస్థ లేకుండా ప్రభుత్వ సంక్షేమాన్ని నేరుగా అందేలా చేసేందుకేనన్నారు. ఈ సమావేశంలో రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ నాయకులు విజయ్‌రాజ్, వేణుగోపాల్‌రెడ్డి, మాబాషా, మహేశ్వర్‌రెడ్డి, నరసింహులు, పి శంకర్, మల్లికార్జున, విజయ్, కెపి నాయుడు, నరసింహులు, సుధాకర్‌మాదిగ, భాస్కర్‌నాయుడు తదితరులతో పాటు 5 వేలకుపైగా ప్రజలు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి
* మంత్రి గల్లా స్పష్టం
తిరుపతి, ఆగస్టు 8: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకోవడంలో తాను ముందుంటానని, తాను తొలి నుండి సమైక్యవాదినేనని మంత్రి గల్లా అరుణకుమారి స్పష్టం చేశారు. గురువారం వేదాంతపురంలో లారీ డ్రైవర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో మంత్రి తొలిసారిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచినప్పుడే ఢిల్లీలో తెలుగుప్రజల సత్తా ఏమిటో తెలుస్తుందని, విడిపోతే బలహీనపడతామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శుక్రవారం నుండి తాను ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటానన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీమాంధ్ర నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వేదాంతపురం నేతలు జనార్ధన్, ఇస్మాయిల్, కృష్ణ, బుల్లెట్ రమణ, నక్కలోళ్లు దొరస్వామి, లారీ ఓనర్స్ నాయకులు కృష్ణారెడ్డి, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రజాభీష్టం మేరకే టిడిపి నడుచుకుంటుంది
* ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పష్టం
* చిత్తూరులో చంద్రప్రకాష్ దీక్షకు ప్రజల మద్దతు
చిత్తూరు, ఆగస్టు 8: సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ చంద్రప్రకాష్ చిత్తూరులో చేపట్టిన 72గంటల దీక్షకు ప్రజల నుండి మద్దతు లభిస్తోంది. గురువారం దీక్ష చేస్తున్న చంద్రప్రకాష్‌కు, సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు రూరల్ మండలం, యాదమరి, పూతలపట్టు మండలాల నుండి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఇదిలా ఉండగా మాజీ కౌన్సిలర్ హెచ్ ఏకాంబరం దీక్షా శిబిరం ముందు వీరబ్రహ్మంగారి వేషం ధరించి కాలజ్ఞానం తెలిపారు. ఇందులో భాగంగా సోనియాగాంధీ తన కుమారుడ్ని ప్రధానిని చేయడానికే రాష్ట్రాన్ని విడగొట్టారని, రాష్ట్రానికి 14వ సిఎం చంద్రబాబు అవుతారని, తిరిగి రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని చెప్పారు. ఈ దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న టిడిఎల్‌పి ఉప నాయకులు, నగరి శాసన సభ్యులు గాలిముద్దుకృష్ణ మనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజాభీష్టానం మేరకు నడుచుకుంటుందన్నారు. ప్రజలు సమైక్యాంధ్ర కోరుకుంటున్న దృష్ట్యా తాము కూడా తమ పదవులకు రాజీనామాలు చేశామని, ప్రజలతో మమేకమై పోరుబాట పట్టినట్టు చెప్పారు. ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నారని, తమ పార్టీ అందుకు వ్యతిరేకం కాదని గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. అనంతరం 72 గంటల పాటు నిరవధిక దీక్ష చేస్తున్న ఎస్ చంద్రప్రకాష్‌కు సంఘీభావం తెలిపారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తెలుగువారందరూ కోరుకుంటున్నారని, ఇది కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి వారు చేసిన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గురువారం ఉదయం చర్చి పాస్టర్లు వచ్చి తెలుగుదేశం శిబిరం వద్ద దీక్ష చేస్తున్నవారి ఆరోగ్యం బాగుండాలని, సోనియాగాంధీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేందుకు ఆమె మనస్సు మార్చాలని కొంత సమయం దీక్షా శిబిరం వద్ద ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లె శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు, యువత అధ్యక్షులు శ్రీ్ధర్‌వర్మ, రాష్ట్ర నాయకులు బిఎన్ రాజసింహులు, వి హరిబాబు, పాచిగుంట మనోహర్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌గాంధీ, కాజూరు బాలాజీ, మోహన్‌రాజ్, ఎన్‌పి దుర్గారామకృష్ణ, వైవి రాజేశ్వరి, మూర్తి, చక్రి, విల్వనాధన్, డిష్ సురేష్‌తోపాటు నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా హోరెత్తిన సమైక్య నినాదం
* నక్కలోళ్లు నుండి న్యాయవాదుల వరకూ ఉద్యమం బాట
* వీధివీధినా చీమలదండును తలపించిన ర్యాలీలు
తిరుపతి, ఆగస్టు 8: నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమోగే తిరుపతి పుణ్యక్షేత్రం రాష్ట్ర విభజన నేపధ్యంలో సమైక్య నినాదాలతో హోరెత్తుతోంది. ఉద్యమం రోజురోజుకు ఉద్ధృతం అవుతోంది. అన్ని ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, కుల సంఘాలు రోడ్లపైకి వస్తున్నాయి. వీధివీధినా దీక్షా శిబిరాలు వేశారు. చీమలదండును తలపించేలా నగరంలో వాహనాల ర్యాలీలు జరుగుతున్నాయి. ఎటు చూసినా రాస్తారోకోలు, ధర్నాలు, శవయాత్రలు, దిష్టిబొమ్మల దగ్ధంతో తిరుపతి నగరం అష్టదిగ్బంధంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. రంజాన్ పండుగ జరుపుకునేందుకు ముస్లిం సోదరులు అసౌకర్యానికి గురి కాకుండా గురువారం కొన్ని దుకాణాలను తెరిచేందుకు ఉద్యమకారులు అనుమతి ఇచ్చారు. నక్కలోళ్ల నుండి న్యాయవాదుల వరకూ అన్ని జెఎసిలు, సామాన్యుడి నుండి సంపన్నుల వరకూ, ట్రాక్టర్ యజమానుల నుండి డాక్టర్ల వరకూ, పాడి రైతుల నుండి ఆడిటర్ల వరకూ చిన్నా, పెద్ద, ముసలి, ముతకా అని తేడా లేకుండా పెద్ద ఎత్తున ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చారు. ఎక్కడ చూసినా సమైక్యాంధ్ర నినాదంతో నగరం హోరెత్తింది. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిరాక్స్ మిషన్స్, ఇంటర్‌నెట్ సెంటర్లు, ఆటోమొబైల్స్, ఎద్దులబండ్లు, తోపుడు బండ్లు, పాల విక్రయదారులు, ఆటో కార్మికులు, వెటర్నరీ యూనివర్శిటి, ఎస్వీయూనివర్శిటి, శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటి విద్యార్థులు, అధ్యాపకుల జెఎసిలు ఉద్యమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు. వేదాంతపురం నాయకుడు జనార్ధన్ ఆధ్వర్యంలో నక్కలోళ్ల జెఎసి నేతలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేదాంతపురం వద్ద జరిపిన ర్యాలీలో మంత్రి గల్లా అరుణకుమారి పాల్గొన్నారు. తాను తొలి నుండి సమైక్యవాదినేనని, శుక్రవారం నుండి ప్రత్యక్షంగా సమైక్య ఉద్యమంలో పాల్గొంటానన్నారు. రుయా ఎదుట వున్న శ్రీపొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ఉద్యమంలో కొనసాగుతానన్నారు. సమైక్యప్రకటన చేసేంత వరకూ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కందాటి శంకర్‌రెడ్డి నేతృత్వంలో నగరంలో భారీ ఎత్తున మాజీ కౌన్సిలర్లు జేడబ్ల్యు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు.
ఆర్టీసీ ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన
చిత్తూరు, ఆగస్టు 8: సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు పట్టణంలో ఆర్టీసీ ఉద్యోగులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అర్థనగ్నంగా నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం వలన తెలుగువారు అందరూ సోదర భావం కలిగి కలసి మెలసి పనిచేసేందుకు బాగుంటుందన్నారు. అలా కాకుండా తెలంగాణాను విడగొట్టడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కెపి శ్రీ్ధర్, ప్రకాష్‌తోపాటు ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు
చిత్తూరు నగర పాలక కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. వారు 96గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ సమయం పూర్తయినా కేంద్రప్రభుత్వం సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన చేయకపోవడంతో వారు రిలే దీక్షలను ప్రారంభించారు. మున్సిపల్ ఎంప్లారుూస్ నాయకులు మహేష్, విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు నగరపాలక కార్యాలయం ముందు వారు రిలేదీక్షలు చేపట్టారు.
న్యాయవాదుల రాస్తారోకో
జిల్లాలోని న్యాయవాదులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 16వ తేదీ వరకు విధులు బహిష్కరించాలని సమైక్యాంధ్ర న్యాయవాదుల సంఘం అధ్యక్షులు, చిత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి సురేంద్రకుమార్ అన్నారు. ఈమేరకు గురువారం జరిగిన సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని జిల్లావ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లకు తెలియజేసినట్లు ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 16వరకు గైర్హాజరై సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. అనంతరం కోర్టు ఎదుట రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి సురేంద్రకుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చీల్చుతున్నారన్నారు. మెజార్టీ ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుతున్నారని, వారి అభిప్రాయం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అమరనాధరెడ్డి, చంద్రశేఖర్, నల్లారి ద్వారకనాథరెడ్డి, సుగుణశేఖర్‌రెడ్డి, మోహనకుమారి, హిమబిందు, రాజేశ్వరి, పరిమళాదేవి, సరస్వతి, లీలావతి, శారద, నలినీ, బికె ఉమామహేశ్వరితోపాటు వందలాది మంది న్యాయవాదులు పాల్గొన్నారు.
రంజాన్ పండుగకు ముస్తాబైన మసీదులు
మదనపల్లె, ఆగస్టు 8: రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరుల ప్రార్థనల కోసం ఈద్‌గాలను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. మదనపల్లె బెంగళూరు రోడ్డులోని ఈద్‌గాను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. అలాగే ముస్లింల ఖబ్రస్తాన్‌ను కూడా ముస్తాబు చేస్తున్నారు. ఖబ్రస్తాన్ ప్రాంగణంలోని కంపచెట్లు తొలగించి విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. అలాగే ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు షామియానాలు ఏర్పాటుచేస్తున్నారు. కాగా, రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో ప్రత్యేక హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని అన్ని మసీదుల వద్ద ప్రార్ధనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈద్గాలో ఉదయం 10గంటలకు, జామియా మసీదులో ఉదయం 10.30గంటలకు రంజాన్ ప్రార్ధనలు నిర్వహిస్తున్నట్లు మదనపల్లె డివిజన్ సర్‌ఖాజీ షాకీరుల్లాసాహేబ్ తెలిపారు.
పలమనేరులో...
పలమనేరు: పలమనేరు పట్టణంలోని మర్కజ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే రంజాన్ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎంబిటి రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద, సుదర్శన్ రోడ్డులో ఉన్న ఈద్గా మైదానం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలమనేరులోని మసీదులను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
మదనపల్లె, ఆగస్టు 8: తల్లి మందలించిందని ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్సలు పొందుతూ గురువారం మృతిచెందింది. వివరాలు ఇలావున్నాయి. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ ఎల్లారుబైలుకు చెందిన చాకల రాజన్న కుమార్తె శిల్ప(17) మదనపల్లెలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం శిల్పను తల్లి సుజాత మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శిల్ప ఇంటిలో ఎవ్వరూలేని సమయంలో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తుండగా మృతిచెందింది. పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.