Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జిల్లాలో ఉప్పెనలా సమైక్య ఉద్యమం

$
0
0

ఒంగోలు, ఆగస్టు 8: జిల్లాలో రోజురోజుకు సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా ముందుకు దూసుకుపోతోంది. సమైక్యాంధ్ర నినాదాలతో జిల్లా దద్దరిల్లుతోంది. అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొని సమైక్యాంధ్రకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని చర్చి సెంటర్, ప్రకాశం భవనం సెంటర్లు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తుతున్నాయి. జిల్లాలోని పలుచోట్ల విద్యార్థులు, వివిధ పార్టీలకు చెందిన ఆందోళనకారులు ర్యాలీలు, మానవహారాలు, రాస్తారాకోలు చేపడుతున్నారు. ఒంగోలులో ఎయిడెడ్ విద్యాసంస్థలు, ఇందిరాక్రాంతిపథం, అంగన్‌వాడీలు, ఎన్‌జివోలు, మునిసిపల్ ఉద్యోగులు, ఆర్‌టిసి ఉద్యోగులు, విద్యార్థి జెఎసి నాయకులు గురువారం ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలోని ఆర్‌టిసి కార్మికులు, ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. ఈనెల 12 నుంచి జిల్లావ్యాప్తంగా బస్సు రవాణా స్తంభించనుంది. అదేవిధంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించిన లాయర్లు కోర్టు ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. ఇందిరాక్రాంతిపథం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం జరిగింది. ఒంగోలు నగరంలోని ఎయిడెడ్ కాలేజీలు, పాఠశాలలు, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో నగరంలో భారీర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర నినాదాలతో విద్యార్థులు హోరెత్తించారు. జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఒంగోలులో బైక్ ర్యాలీ జరిగింది. ఈర్యాలీ స్థానిక ప్రకాశం భవనం నుంచి బయలుదేరి కోర్టుసెంటరు, విఐపి రోడ్డు, కర్నూలు రోడ్డు బైపాస్ జంక్షన్, అద్దంకి బస్టాండు సెంటరు మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం చర్చి సెంటర్‌లో మానవహారాన్ని నిర్వహించారు. కాగా చర్చిసెంటరు వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో హిజ్రాలు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు అందరినీ అకట్టుకున్నాయి. మేళతాళాలతో సాంస్కృతిక కార్యక్రమాలను జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించింది. పశుసంవర్ధక శాఖకు చెందిన సిబ్బంది చర్చిసెంటరు వద్ద మానవహారాన్ని ఏర్పాటుచేశారు. కెసిఆర్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ దిష్టిబొమ్మలను సమైక్యవాదులు పలుప్రాంతాల్లో దగ్ధం చేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాపోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తం మీద రోజురోజుకు సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. ఉద్యమంలో ఎన్‌జివో సంఘ చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రను అగ్నిగుండంలా కేంద్ర ప్రభుత్వం మార్చిందని ధ్వజమెత్తారు. సోనియాను ఇటలీకి పంపించే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విభజించటం వల్ల ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, సమైక్యాంధ్ర సాధించుకునేంత వరకు పోరాటం ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు
ఒంగోలు, ఆగస్టు 8: సమైకాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్‌పార్టీ ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంత్రి శ్రీను, డిసిసిబి చైర్మన్ ఈదర మోహన్ మఖ్యఅతిధులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీను, ఈదర మోహన్ మట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడం ద్వారానే అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌పై అందరికి ఆమోదయోగ్యమైన ప్రకటన చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర కమిటీ అధ్యక్షులు జడా బాలనాగేంద్రం మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా వుంచాలని తాము కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం బిజెపి, తెలుగుదేశం, సిపిఐ పార్టీలేనని అన్నారు. బిజెపి తాము చిన్న రాష్ట్రాలకు అనుకూలమని, ప్రత్యేక తెలంగాణా చేయాలని ప్రకటించగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సిపిఐ లాంటి కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా లేఖలు ఇవ్వటం వల్లే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయాల్సి వచ్చిందే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా చేసిన నిర్ణం కాదని ఆయన పేర్కొన్నారు. అయితే రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్రలో ప్రజా ఉద్యమం వెల్లువెత్తుతోందని దీనిని దృష్టిలో పెట్టుకొని సమైకాంధ్రకు అనుకూలంగా తిరిగి నిర్ణం తీసుకోవాలని ఆయన కోరారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపిలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి తెచ్చినందువల్లే హైపవర్ కమిటీని వేశారని ఇది సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల విజయంగా ఆయన పేర్కొన్నారు. ఈ రిలే నిరాహారదీక్షల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలనాగేంద్రంతోపాటు మహిళా కాంగ్రెస్ నాయకురాలు అనీల్‌కుమారి, కాంగ్రెస్ నాయుకులు కోటయ్య, కృష్ణ, శ్రీను, ఎన్‌ఎస్‌యుఐ నాయకుడు దీపక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రకటనతో
దేశంలో చెలరేగిన అశాంతి
ఎమ్మెల్సీ నన్నపనేని ఆవేదన
అద్దంకి, ఆగస్టు 8: కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ప్రకటించడంతో దేశంలో ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఆందోళనలు తీవ్రమయ్యాయని తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అన్నారు. అద్దంకి పట్టణంలో గత మూడు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న న్యాయవాదుల దీక్షాశిబిరానికి గురువారం ఆమె విచ్చేసి వారికి మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా నన్నపనేని మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ఇద్దరు తెలంగాణ మంత్రులు రాజీనామా చేయగానే ఆందోళన చెందిన కాంగ్రెస్‌పార్టీ రాత్రికి రాత్రే తెలంగాణ ప్రకటించిందని, సీమాంధ్ర ఎంపిలు 16 మంది రాజీనామా చేసినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీమాంధ్రులందరూ కలసి హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని, తెలంగాణ రాకముందే కెసిఆర్ సీమాంధ్ర ఉద్యోగులను హైదరాబాద్ వదిలి వెళ్లిపొమ్మనడం దారుణమన్నారు. హైదరాబాద్ కెసిఆర్ సొత్తుకాదన్నారు. హైదరాబాద్‌ను వదిలేది లేదని, ఉద్యోగులు పదవీవిరమణ అనంతరం కూడా అక్కడే ఉంటారన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలందరూ కలసి సోదరభావంతో హైదరాబాద్‌లో ఉంటుంటే, సీమాంధ్రులను వెళ్ళమనడానికి వాళ్ళెవరని ఆమె ప్రశ్నించారు. తెలంగాణా ప్రకటనతో రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయని, అదేవిధంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమాలు సాగుతున్నాయన్నారు. దీనిని ఆసరాగా తీసుకోని పాకిస్తాన్ చొరబాటు యత్నాలు సాగిస్తోందని, మరోపక్క చైనా కాలుదువ్వుతోందన్నారు. దేశంలో అశాంతిని నెలకొల్పి పక్క దేశాల నుండి వస్తున్న ముప్పును కూడా పట్టించకుకోని ప్రభుత్వంలో ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలంటే తెలంగాణ ప్రకటనను విరమించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ర్యాలీ
ఆర్‌టిసి అద్దంకి డిపో ఎంప్లారుూస్ యూనియన్ వారు చేపట్టిన సమైక్యాంధ్ర ర్యాలీలో గురువారం ఎమ్మెల్సీ నన్నపునేని రాజకుమారి పాల్గొన్నారు. బంగ్లారోడ్డు నుండి పాతబస్టాండ్ సెంటరు వరకు ర్యాలీ చేశారు. అనంతరం పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

గ్రామాభివృద్ధికి సహకరిస్తా: ఎమ్మెల్యే ఆమంచి
వేటపాలెం, ఆగస్టు 8: గ్రామాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. గురువారం మండల పరిధిలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైనందున పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి గ్రామపెద్దలు ఐక్యంగా కృషి చేయాలని అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. గతంలో ఏకగ్రీవంగా ఎన్నికై ప్రభుత్వం నుంచి 5లక్షల ప్రోత్సాహకాన్ని అందుకోగా, నేడు ప్రభుత్వం 7లక్షల రూపాయలకు పెంచినందున ఆ నిధులతో గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించారు. ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 900మంది విద్యార్థులకు ఒకచోట నుంచి పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం, రక్షిత మంచినీరు ఏర్పాటు చేస్తానని, 7లక్షల రూపాయలు గ్రామాభివృద్ధి నుంచి కేటాయిస్తే మిగిలిన వ్యయాన్ని దాతల సహకారంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ తుపాకుల నాగమ్మ, ఉప సర్పంచ్ యల్లంగారి సుబ్రహ్మణ్యం, గ్రామ కార్యదర్శి కేశవరావు, మాజీ ఉపసర్పంచ్ గడ్డం కృష్ణారావు, మాజీ ఎంపిటిసిలు ఆతిన వెంకటరావు, కొండూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం తగదు: జిల్లా కలెక్టర్
ఒంగోలు, ఆగస్టు 8: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లాకలెక్టర్ జిఎస్ ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ అధికారులను హెచ్చరించారు. గురువారం స్థానిక సిపివో సమావేశ మందిరంలో అసెంబ్లీ నియోజక వర్గ కో ఆర్డినేషన్ అధికారులతో సంక్షేమ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ జిల్లాలో మహిళల ఆత్మ గౌరవం నిలపడానికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పథకాలు అమలు చేస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి పథకం అమలులో లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు చెప్పిన సమాధానాలకు ఇచ్చిన నివేదికలకు పొంతన లేకుండా ఉన్నాయన్నారు. డిఆర్‌డిఏ అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు డ్వామా ఎపిడిలు దొంగ రిపోర్టులు ఇవ్వడం లో అరితేరారన్నారు. క్రింది స్థాయి అధికారులు చెప్పిన సమాధానాలు విని చెప్పవద్దన్నారు. క్షేత్ర స్థాయిలో ఎపిడి, ఎపివోలు ఇచ్చిన నివేదికలు క్షేత్ర స్థాయిలో పరిశీలించుకోవాలన్నారు. పోస్టుమేన్ ఉద్యోగం చేయడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, మరుగుదొడ్లు, బాత్‌రూములు మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని సాంఘీక సంక్షేమ శాఖ, బిసి సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల్లో ప్రభుత్వం కేటాయించి సీట్లను విద్యార్థులతో భర్తీ చేయాలన్నారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు అయినప్పటికీ కొంతమంది అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులు హాస్టల్ సీట్లు భర్తీ ఏర్పాట్ల పై చర్యలు తీసుకోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు యూనిఫారం , పుస్తకాలు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అసెంబ్లీ నియోజక వర్గ కో ఆర్డినేషన్ అధికారులు తనిఖీలు చేయాలన్నారు. రాబోయే సీజన్‌లో వ్యాధులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో , ప్రైవేట్ వైద్యశాలల్లో మాత్రమే ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గుతాయన్నారు. జిల్లాలో 8లక్షల 31వేల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయుట లక్ష్యంగా ఉందన్నారు. ఇప్పటికి 1లక్షా 3వేల మంది అక్షరాస్యులుగా తీర్చి దిద్దడం జరిగిందన్నారు. రెండు లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించి నమోదు చేశామన్నారు. ఆగస్టులో జరిగే పరీక్షలకు వీరు పరీక్షలు రాసి అక్షరాస్యులుగా నమోదు అవ్వనున్నారని అన్నారు. మిగిలిన 4 లక్షల 70 వేల మంది నిరక్షరాస్యులను మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుని పూర్తిగా అక్షరాస్యత జిల్లాగా డిక్లేర్ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కెటి వెంకయ్య, డిఆర్‌డి ప్రాజెక్టు డైరెక్టర్ ఎ పద్మజ, డ్వామా పిడికె పోలప్ప, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంరాజు, సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె సరస్వతి, రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి రామశేషు, జిల్లా విద్యాశాఖాధికారి ఎ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

12 నుండి గ్యాస్ ఏజన్సీ కేంద్రాల్లో
ఆధార్ నెంబర్ నమోదు చేసుకోవాలి
జాయింట్ కలెక్టర్ సూచన
ఒంగోలు అర్బన్, ఆగస్టు 8: గ్యాస్ వినియోగదారులు ఈనెల 12వ తేదీ నుండి గ్యాస్ ఏజన్సీ కేంద్రాల్లో ఆధార్ నెంబర్‌లు నమోదు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె యాకూబ్ నాయక్ వినియోగదారులను కోరారు. గురువారం ఆయన ఛాంబర్‌లో గ్యాస్‌కు నగదు బదిలీ పథకం వర్తింపు చేసేందుకు గ్యాస్ ఏజన్సీ డీలర్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నగదు బదిలీ పథకాన్ని రెండో దశలో ప్రభుత్వం అమలు చేయడానికి చర్యలు తీసుకుందన్నారు. దీనిలో భాగంగా ఈనెల 12వ తేదీ నుండి గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డీలర్లను సంయుక్త కలెక్టర్ ఆదేశించారు. గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద కెవై సీట్లు అందుబాటులో ఉంటాయన్నారు. గ్యాస్ వినియోగదారుల సౌకర్యం కోసం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు కౌంటర్లు తీసి ఉంటాయన్నారు. వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాకు సంబంధించిన పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు నెంబర్లు కనబడే జెరాక్స్ కాపీ, గ్యాస్ బాండ్ పేపర్ జెరాక్స్ ఏజెన్సీ ఏర్పాటుచేసిన కేంద్రాల్లో ఇచ్చి నమోదు చేసుకోవాలన్నారు. లేనట్లయితే గ్యాస్‌కు నగదు బదిలీ పథకం రాబోయే రోజుల్లో వర్తించదన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కె రంగాకుమారి, లీడ్ జిల్లా మేనేజర్ జెవిఎస్ ప్రసాద్, జిల్లాలోని గ్యాస్ ఏజన్సీ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
గిద్దలూరు, ఆగస్టు 8: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గిద్దలూరు ఆర్టీసీ డిపోలోని నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనను నిర్వహించి ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ఎన్‌ఎంయు పిలుపు మేరకు గురువారం ఈ ధర్నాను నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతు పలికారు. ఈసందర్భంగా ఎన్‌ఎంయు రాష్ట్ర కార్యదర్శి విఆర్‌సి గౌడ్ మాట్లాడుతూ ఎంతోకాలంగా సమైక్యంగా ఉన్న ఆంధ్రరాష్ట్రాన్ని సోనియాగాంధీ ఒక్కమాటలో విభజించి తెలుగుజాతిని వేరు చేసిందని విమర్శించారు. సీమాంధ్ర నాయకులను మభ్యపెట్టేందుకు హైపవర్ కమిటీ పేరుతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందని, సోనియా చేతిలో కీలుబొమ్మలైన కోస్తాంధ్ర నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 11వతేదీన వౌన ప్రదర్శన నిర్వహిస్తామని, 12న ఎన్‌ఎంయు పూర్తి సమ్మెకు దిగుతామని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని హామీ ఇచ్చేవరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రీజియన్ నాయకులు ఎస్‌ఎ జిలానీ, డిపో కార్యదర్శి వైఎం రెడ్డి, పుల్లయ్య, ఆర్‌ఎస్‌ఎం రెడ్డి, జెవి కృష్ణ పాల్గొన్నారు.

* వంటా వార్పు చేపట్టిన లాయర్లు * జర్నలిస్టుల మోటార్‌సైకిళ్ల ర్యాలీ
english title: 
rally

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>