Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఉప్పెనలా సమైక్య ఉద్యమం

$
0
0

నెల్లూరు, ఆగస్టు 8: రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో ప్రజలు రాజకీయ పార్టీల అండ లేకున్నా స్వచ్ఛందంగా సమైక్య ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. రాజకీయ నాయకులు ప్రకటనలతోనే పబ్బం గడుపుతుండగా సమైక్య ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుత ఉద్యమం సాధారణ పౌరుల చేతిలో ఉవ్వెత్తున లేస్తోంది. లక్షల కోట్లు హైదరాబాద్‌లో పెట్టుబడులుగా పెట్టి అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతానికి కట్టబెట్టాలని చూస్తున్న వైనాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది రాజకీయ భవిష్యత్ కోసం, పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీడలు ఆడుతోందని ఆరోపిస్తూ ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ ఉద్యమం రోజురోజుకి ఉద్ధృతం అవుతుందే తప్పా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఉద్యమంలో గ్రామస్థాయి వారు కూడా పాల్గొనడం గొప్ప విషయం. తెలంగాణలో జరిగిన ఉద్యమం కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాగా సమైక్యాంధ్ర ఉద్యమం గ్రామస్థాయి వరకు చొచ్చుకొని పోవడం సమైక్యాంధ్ర పట్ల ప్రజల్లో ఉన్న అభిమానానికి నిదర్శనం. టిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రెండురోజుల క్రితం చేసిన ప్రకటన ఉద్యమం మరింత ఉద్ధృతికి దారితీసింది. ప్రభుత్వ అధికారులను హైదరాబాద్ నుండి వెళ్లిపోవాలన్న కెసిఆర్ ప్రకటన పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకటన వచ్చిన వెంటనే ఇలాంటి మాటలు కెసిఆర్ అనడం రాబోయే పరిణామాలకు ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. చివరకు హైదరాబాద్‌కు వెళ్లాలన్న పాస్‌పోర్టులు తీసుకొని వెళ్లాలేమో అన్న సందేహాలు కూడా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కెసిఆర్ తన కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు తెలంగాణ ఉద్యమం అనే ఒక రాయిని చేతిలో పట్టుకొని పిచ్చివాడిలా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చివాడి చేతిలో రాయి, కెసిఆర్ మాటలు ఒకేలా ఉంటాయని పలువురు అంటున్నారు. సమైక్యాంధ్ర కోసం రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని తీవ్రతరం చేసిననాడే తెలుగు ప్రజల సత్తా ఢిల్లీ వరకు తెలుస్తోందని సమైక్యవాదులు నిలదీస్తున్నారు. కొన్ని పార్టీల నాయకులు పదవులను అంటిపెట్టుకొని ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా తమ రాజకీయాలను నడుపుతున్నారని ఆవేదనలో ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం రాజకీయ పార్టీల నాయకులకు ఊహకు అందని స్థితిలో ఉద్యమం జరుగుతుండటంతో నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఒక వర్గంవారే నాయకత్వం వహించగా సమైక్యాంధ్ర ఉద్యమం మాత్రం అందరి భాగస్వామ్యంమంతో సునామీలా ముందుకు సాగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కోరుకుంది చేయడం ప్రభుత్వాల పని. రాష్ట్ర విభజనను కేంద్ర ఉపసంహరించుకోకుంటే ఉద్యమం ఏ స్థాయికి దారితీస్తోందో వేచిచూడాలి.

సమైక్యాంధ్ర కోసం
కదంతొక్కిన ఆందోళనకారులు
నెల్లూరు, ఆగస్టు 8: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఆందోళనకారులు పార్టీలు, వర్గాలకు అతీతంగా తొమ్మిదవ రోజైన గురువారం కదంతొక్కారు. గురువారం ఉదయం ఏపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌లో ఉన్న అసోసియేషన్ కార్యాలయం నుంచి బయలుదేరి నగరంలోని ప్రధాన రహదార్లమీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. అదేవిధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలో స్థానిక పంచాయతీ బస్టాండ్ కూడలి వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతృత్వంలో వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చోటా సోనియాగాంధీ దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహిస్తున్నారు. సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తుతున్నాయి. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా నైతికంగా తమ మద్దతు ప్రకటించేలా ప్రతి కుటుంబం నుంచి భావాజాలం వ్యాప్తి చెందుతుంది.
‘సమైక్యాంధ్ర సాధనకు అందరూ కృషి చేయాలి’
నెల్లూరు కల్చరల్, ఆగస్టు 8: సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం బాలభవన్ ఆధ్వర్యంలో స్థానిక కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో వివిధ పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర నినాదాలతో, కెసిఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈసందర్భంగా బాలభవన్ డైరెక్టర్ గోవిందరాజుల సుభద్రాదేవి మాట్లాడుతూ తెలుగు వారి గుండె రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాలకు, కుతంత్రాలకు బద్ధలైందన్నారు. రాజకీయ నాయకులు ఇప్పటికైనా వారి నాటకాలు కట్టిపెట్టి ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని ప్రజలతో కలిసి సమైక్యాంధ్ర సాధనకు కృషి చేయాలని కోరారు. రాష్ట్రాన్ని విభజించడం ద్వారా తెలుగువారి అంతరంగం రెండుగా చీలిందని, సమైక్య చిత్రం రెండు ముక్కలైందన్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చడంలో ప్రముఖ పాత్ర పోషించిన కెసిఆర్‌ను ఉరితీసినా పాపం లేదన్నారు. విడిపోతే అందరూ నష్టపోతారని, ఇప్పటికైనా కేంద్రం స్పందించి రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సుభద్రాదేవి డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో లలిత, భాగ్యలక్ష్మి విద్యార్థులు, ఉపాధ్యాయులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఆర్టీసీకి రూ. 40 లక్షలు నష్టం
ఆర్‌ఎం రవికుమార్ వెల్లడి
సూళ్లూరుపేట, ఆగస్టు 8: జిల్లాలో జరుగుతున్న సమైక్యాంధ్ర బంద్‌తో ఆర్టీసీకి గత వారం రోజులుగా 40 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని నెల్లూరు రీజనల్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. 54 లక్షలతో సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండులో చేపట్టిన పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా జరుగుతున్న బంద్‌తో ఆర్టీసీ బస్సులు సుదూర ప్రాంతాలకు వెళ్లకపోవడంతో 40 లక్షల రూపాయలకు పైగా నష్టం వచ్చిందన్నారు. సోమవారం నుంచి జెఎసి సమ్మెకు పిలుపునివ్వడంతో నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. సూళ్లూరుపేటలో జరుగుతున్న బస్టాండు అభివృద్ధి పనులు రెండు నెలల్లో పూర్తిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ అపర్ణాదేవి తదితరులు ఉన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి
కోవూరు, ఆగస్టు 8: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మికాంతం అన్నారు. గురువారం పట్టణంలోని పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో నష్టపోకుండా ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది 135 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. ప్రస్తుత సీజన్‌కు అదే స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పిఎసిఎస్, ఐకెపి సహకారంతో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని నిర్ధేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుందన్నారు. క్వింటాకు కనీస మద్దతు ధర 1250 రూపాయలు, ఒక పుట్టికి 10625 రూపాయలు, గ్రేడు ఎ రకం క్వింటాకు 1280, ఒక పుట్టికి 10880 రూపాయలు అందజేయటం జరుగుతుందన్నారు. వరి ధాన్యంకు నిర్ధేశించిన నాణ్యతా ప్రమాణాలతో తేమ 11 శాతం, కల్తీ కేళీలు, ఇతర తక్కువ రకాల ధాన్యం 7 శాతం తదితర అనుమతించిన ప్రమాణాలతో ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో డిఎస్‌ఓ ఉమామహేశ్వరరావు, పిఎసిఎస్ సిఇఓ గోవర్ధనరెడ్డి, మండల వ్యవసాయాధికారి శ్రీనివాసులు, పిఎసిఎస్ అధ్యక్షులు రాజగోపాల్‌రెడ్డి, ఐకెపి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

పార్టీలకు అతీతంగా సమైక్యాంధ్రాను పరిరక్షించుకుందాం: బీద
కోవూరు, ఆగస్టు 8: పార్టీలకు అతీతంగా సమైక్యాంధ్రాలో పరిరక్షించుకుందామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర స్పష్టం చేసారు. గురువారం పట్టణంలోని ఎన్‌జివో భవనం ఆవరణలో కోవూరు జెఎసి నాయకులు చేపట్టిన రిలేనిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈదీక్షలకు కోవూరు మండలంలోని మహిళా సంఘం నాయకురాలు శిబిరానికి మద్దతు తెలిపి రిలేనిరాహారదీక్షలో కూర్చున్నారు. బీద దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నామంటూ కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రకటనకు నిరసనగా సీమాంధ్రలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై రాష్ట్ర విభజన ప్రకటన నిర్ణయం వెనక్కి తీసుకనేంత వరకు సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలను కొనసాగించాలన్నారు. అన్ని కులాలు, మతాలు, మేథావులు, పెద్దలు, సమైక్యాంధ్రా ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఏకవాక్యతీర్మానంతో రాష్ట్ర విభజన చేసిన తదనంతరం రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సంక్షోభానికి కారణం కాంగ్రెస్‌పార్టీయేనన్నారు. ఈకార్యక్రమంలో కోవూరు సమైక్యాంధ్రా జెఎసి నాయకులు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, గాదిరాజు అశోక్‌కుమార్, జె కృష్ణారెడ్డి, వెంకటరమణమ్మ, న్యాయవాదులు వంశీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వెంకటాచలంలో ఆగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
వెంకటాచలం, ఆగస్టు 8: వెంకటాచలంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గురువారం ఉదయం కొద్దిసేపు ఆగిపోయింది. గూడూరు నుండి నెల్లూరుకు వస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వెంకటాచలం సమీపంలో చైనులాగాడు. రైలు ఆగిన వెంటనే అతను దిగి వెళ్ళిపోయాడు. దీంతో తిరిగి రైలు బయలుదేరటానికి 15 నిమిషాల సమయం పట్టింది. ఈ విషయంలో పలుపుకార్లు వెల్లువెత్తాయి. గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాల జాయింట్ బోల్టులు తొలగించటం వల్ల ఆగిపోయిందని, ఈ పని సమైక్యాంధ్రుల వల్ల జరిగిందని పలువురు పలు వదంతులు పలికారు. అయితే రైల్వే అధికారులు మాత్రం చైనులాగటం వల్లనే రైలు ఆగిపోయినట్టు నిర్ధారించారు.
సోనియాపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
గూడూరు, ఆగస్టు 8: సమైక్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చేయటానికి యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కేంద్ర, రాష్ట్ర మంత్రులపై గురువారం స్థానిక 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సమైక్యాంధ్రా జెఎసి నాయకులు ఫిర్యాదు చేసారు. సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టేందుకు విదేశీయురాలైన సోనియాగాంధీ ఆంధ్ర రాష్ట్రంలో చిచ్చుపెట్టేందుకు తీసుకున్న చర్యను నిరసిస్తూ ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో సమైక్యాంధ్రా జెఎసి నాయకులు పాశం సునీల్‌కుమార్, నాసిన నాగులు, ఎం విజయకుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

రూ 25 లక్షల ఎర్రచందనం దుంగలు పట్టివేత
పొదలకూరు, ఆగస్టు 8: అటవీశాఖ గుంటూరు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించి 25 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను, మూడు వాహనాలను పట్టుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్‌ఓ ఎస్‌ఎం హుస్సేన్ రఫీ ఆధ్వర్యంలో అటవీశాఖాధికారులు దాడులు జరిపి పొదలకూరు, చేజర్ల, కలువాయి మండలాలోని పులికల్లు, చిత్తలూరు, దాసరిపల్లి వద్ద మూడు వాహనాలలో అక్రమంగా తరలిస్త్నున 75 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దుంగలను ఆదూరుపల్లి గోడవున్‌కు తరలించారు. ఈ సందర్భంగా డిఎఫ్‌ఓ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా పెంచామన్నారు. అక్రమరవాణాకు సంబంధించి సమాచారం అందించే వారికి పారితోషకం అందిస్తామన్నారు. ఫారెస్ట్ రేంజర్ శ్రీకాంత్‌రెడ్డి, ఫారెస్ట్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు, వసంతరావు, బి నాయక్, రమణ, నరసింహా తదితరులు ఈదాడులలో పాల్గొన్నారు.
2 లక్షల ఎర్రచందనం స్వాధీనం
రాపూరు, ఆగస్టు 8: అక్రమ రవాణాకు సిద్ధం చేసి నిల్వ వుంచిన 35 ఎర్రచందనం దుంగలను జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతోపాటు స్థానిక అధికారులు పట్టుకున్నారు. గోనుపల్లి డిప్యూటీ రేంజ్ అధికారి పి రమణయ్య కథనం మేరకు గోనుపల్లి గ్రామసమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఎర్రచందనం దుంగలు నిల్వ ఉన్నాయన్న సమాచారం అందటంతో తాము, సిబ్బంది తనిఖీలు చేపట్టామన్నారు. ఈతనిఖీల్లో భాగంగా పొదలచాటును నిల్వవుంచిన 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈసంఘటనలో వ్యవసాయ క్షేత్ర యజమాని వీరపరెట్టి అక్కిరెడ్డిపై కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. సమాచారం అందుకున్న క్షణంలోనే అతని కోసం గాలించగా అప్పటికే పరారయ్యాడని తెలిపారు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మహబూబ్‌బాషా ఆదేశాల మేరకు ఈదాడులు నిర్వహించామని, ఈదాడుల తనిఖీలో తమతోపాటు జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ సెక్షన్ అధికారులు ఎ వేదయ్య, మురళి, పివి కృష్ణయ్య తదితరులు ఉన్నారన్నారు.

వేగంగా జిఎస్‌ఎల్‌వి-డి 5 రాకెట్ పనులు
షార్‌లో శాస్తవ్రేత్తలు బిజీబిజీ
సూళ్లూరుపేట, ఆగస్టు 8: సూళ్లూరుపేటలోని భారత అంతరిక్ష ప్రయోగం కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో జిఎస్‌ఎల్‌వి పనులు వేగంగా జరుగుతున్నాయి. రాకెట్ అనుసంధాన పనులు, ఉపగ్రహ అమరిక క్రయొజనిక్ దశలో తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని శాస్తవ్రేత్తలు రాకెట్‌లోని ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు ఇస్రోకు సవాల్‌గా నిలవడంతో రెండు సంవత్సరాల విరామం అనంతరం సన్నద్ధం అవ్వడంతో ఈ ప్రయోగాన్ని సవాల్‌గా తీసుకొని శాస్తవ్రేత్తలు పని చేస్తున్నారు. శ్రీహరికోటలోని (షార్) రెండో ప్రయోగ వేదిక నుండి ఈనెల 19వ తేదీ సాయంత్రం 4-50 గంటలకు జిఎస్‌ఎల్‌వి-డి 5 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన జీశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 6న ప్రయోగానికి సంబంధించి డాక్టర్ సురేష్ అధ్యక్షతన జరిగిన మిషన్ రెడినెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్)లో ప్రయోగానికి శాస్తవ్రేత్తలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రాకెట్ భూమి నుండి నింగిలోకి వేగంగా దూసుకెళ్లేందుకు మొదటి దశలో నాలుగు స్ట్ఫ్రాన్ బూస్టర్ మోటార్లను కూడా అమర్చారు. ఇప్పటికే ఇస్రో రాధాకృష్ణన్ ప్రయోగ వేదిక వద్దకు పలుసార్లు వెళ్లి రాకెట్‌ను పరిశీలించి ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రంలో రూపొందించారు. 2010 షార్ నుండి ప్రయోగించిన రెండు జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు విఫలం కావడంతో దీనిని విజయవంతం చేసేందుకు శాస్తవ్రేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు శ్రీహరికోట నుండి 7 జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు ప్రయోగించగా మూడు మాత్రమే విజయవంతమయ్యాయి.

కుటుంబ కలహాలతో
తల్లీకూతుళ్ల ఆత్మహత్య
వరికుంటపాడు, ఆగస్టు 8 : కుటుంబ కలహాల కారణంగా తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని రామాపురంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రామాపురం గ్రామానికి చెందిన ఉటపాటి రాజేంద్రకు, సుప్రియకు 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇరువురు సంతానం ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి వరకు సజావుగా సాగిన సంసారంలో కుటుంబ కలహాలు మొదలైనట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గురువారం ఉదయం నుంచి సుప్రియ, కుమార్తె తనూష కనిపించకపోవడంతో గ్రామస్థులు సమీప ప్రాంతాలలో వెతికారు. ఓ పంట పొలం వద్ద చెప్పులు కనిపించడంతో గ్రామస్థులు అనుమానంతో బావిలోకి దిగి వెతకడంతో సుప్రియ(28), తనూష (5) విగతజీవులై కనిపించారు. అనంతరం మృతదేహాలను గ్రామంలోకి తరలించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలాన్ని ఉదయగిరి సిఐ కల్యాణరాజు సందర్శించారు. ఈ ఆత్మహత్యలపై స్థానిక ఎస్సై శ్రీనివాసరావును వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు.

* ఆందోళనలతో స్తంభించిన జనజీవనం
english title: 
uppena

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>