ఖైరతాబాద్, ఆగస్టు 8: హైదరాబాద్ నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని అన్నివర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేద్దామని తెలంగాణ జర్నలిస్టు ఫోరం తెలంగాణ ప్రజలకు పిలుపు నిచ్చింది. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ అనివార్యం - మాకు శాంతి కావాలి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, టిపిఎఫ్ నేత వేదకుమార్, విద్యార్థి సంఘం నాయకులు బల్కసుమన్, పిడమర్తి రవి, మర్రి అనిల్, కిషోర్, డైరెక్టర్ శంకర్‌తో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ ఏర్పాటని అన్నారు. కేంద్రం తెలంగాణ ఏర్పాటు విషయంలో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించిన అనంతరమే సిడబ్ల్యుసి సమావేశం అనంతరం తెలంగాణ ఏర్పాటుకు సిద్ధపడితే అప్పటి వరకూ మాట్లాడని ఎన్‌జివోలు అనంతరం తమ భద్రత అంటూ గగ్గోలు పెట్టడం విచిత్రంగా ఉందని అన్నారు. సీమాంధ్ర ఉద్యమాన్ని ప్రభుత్వమే నడుపుతుందని విమర్శించారు.
కూకట్‌పల్లిలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు
కెపిహెచ్‌బి కాలనీ, ఆగస్టు 8: తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని తెలుగుదేశం నాయకుడు మాధవరం కృష్ణారావు సద్భావన సదస్సు పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసి కూకట్‌పల్లి ప్రాంతంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తగదని గ్రేటర్ హైదరాబాద్ టిఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు జి.విజయ్‌కుమార్ అన్నారు. గురువారం కూకట్‌పల్లి భాగ్యనగర్‌కాలనీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటమని, ఉద్యమ సమయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు సైతం హైదరాబాదీయులే అన్న సిద్ధాంతంతో టిఆర్‌ఎస్ పనిచేస్తోందని, అన్నిప్రాంతాల వారితో సోదరభావంతోనే కలిసి మెలిసి ఉంటూ వచ్చామని, ఇక ముందు కూడా వారికి అండగానే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెదేపా ఈ ప్రాంతంలో మనుగడ కోల్పోయే పరిస్థితి దాపురించడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో నాయకులు సద్భావన కార్యక్రమం పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసి పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ వాదినని చెప్పుకునే కృష్ణారావు ఉద్యమ సమయంలో విషం కక్కుతూ రెండుకళ్ల సిద్ధాంతంతో కాలయాపన చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సునీల్‌రెడ్డి, కర్క రవీందర్, బిక్షపతి, షేక్‌గౌస్, బాశెట్టి నర్సింగరావు, రాజేశ్వరి, ఉమావతిగౌడ్, శారద పాల్గొన్నారు.
హత్య కేసులో ఇద్దరి అరెస్టు
నేరేడ్‌మెట్, ఆగస్టు 8: మహిళ హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మల్కాజిగిరి డిఐ ఎస్.ఆశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రసూల్‌పూర కృష్ణానగర్‌లో నివసించే రాజు(35) లావణ్య(30) భార్యాభర్తలు. రాజు కరీంనగర్‌లో ఉండే తన మరదలు శ్రీవిద్యని ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని మల్కాజిగిరిలో ఉంటున్నాడు. రాజు గతంలో ఓ కేసులో జైలు పాలనపుడు అక్కడ సతీష్, ఖలీల్‌తో పరిచయం ఏర్పడింది. వారిని తనవద్దే పనిలో పెట్టుకున్నాడు. శ్రీవిద్యను పెళ్లి చేసుకున్న తరువాత తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని కక్ష కట్టిన లావణ్య.. రాజు వద్ద పనిచేస్తున్న సతీష్‌తో కలసి శ్రీవిద్యను చంపేందుకు పథకం వేసింది. 2009 సెప్టెంబర్ 5న లావణ్య, సతీష్, అతడి స్నేహితుడు గడ్డం మల్లేష్ (30) శ్రీవిద్యను పని ఉందంటూ తీసుకెళ్లి వంపుగూడ ప్రాంతంలో తాడుతో గొంతు నులిమి చంపేశారు. ఆమె కడుపునొప్పితో మృతి చెందిందని నమ్మించి దహన సంస్కారాలు చేయించారు. శ్రీవిద్య మరణంపై అనుమానంతో ఆమె తల్లిదండ్రులు ఆగస్టు 2012లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న సతీష్ అనుమానాస్పదంగా మల్కాజిగిరిలో తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకుని విచారించగా తాము శ్రీవిద్యను హత్య చేసినట్టు చెప్పారు. లావణ్య, గడ్డం మల్లేష్‌ను అరెస్టు చేసినట్టు ఆశోక్‌కుమార్ తెలిపారు.