వికారాబాద్, ఆగస్టు 8: టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వికారాబాద్ మండలం సిద్దులూర్ గ్రామ సర్పంచ్ ఎండి గౌసొద్దీన్, మద్గుల్‌చిట్టంపల్లి, మోమిన్‌పేట మండలం కేసారం, చక్రంపల్లి గ్రామాలకు చెందిన స్వతంత్య్ర సర్పంచ్‌లు గడ్డమీది శమంత, మంజుల, శశికళతో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులు గురువారం నగరంలోని రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌లు డి.మాణయ్య, శ్రీనివాస్, గాండ్ల మహాదేవి, కృష్ణ, వార్డు సభ్యులు, నాయకులు లక్ష్మి, రామస్వామి, నాగయ్య, వెంకటయ్య, ఫరీద్‌మియా, జానిమియా, నర్సింహరెడ్డి, రఫీ, అనంతయ్య పాల్గొన్నారు.
అతిసార సోకి పలువురికి అస్వస్థత
పరిగి, ఆగస్టు 8: అతిసార వ్యాధి సోకి పరిగి మండల పరిధిలోని మిట్టకోడూర్ గ్రామంలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. మండల పరిధిలోని చిగురాల్‌పల్లి, గోవిందపూర్ గ్రామాలలో గత వారం రోజులుగా అతిసార వ్యాధి గ్రామంలో విస్తరించి అయిదుగురిని పొట్టనపెట్టుకుంది. ఆ తరవాత శాంతించిదని మండల అధికారులు, వైద్యసిబ్బంది ఊపిరి పీల్చుకున్న తరుణంలో మిట్టకోడూర్‌లో అతిసార వ్యాధిసోకి ఒకేసారి 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతలోనే గ్రామంలో మరో10 మందికి అతిసార వ్యాధి సోకింది. విషయం తెలుసుకున్న ఎంపిడిఓ విజయప్ప, తహశీల్దార్ బాల్‌రాజ్ మిట్టకోడూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో అతిసార వ్యాధి రోజురోజుకు ప్రబలడానికి గల కారణాలను తెలుసుకున్నారు. గ్రామంలోని తాగునీటి పైపులను వాటర్‌ట్యాంక్‌ను పరిశీలించారు. పారిశుద్ధ్యం లోపించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లి పాలే శిశువుకు ఆరోగ్యకరం
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 8: యాచారం మండల కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను జరిపారు. స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త అంజమ్మ, ఏఎన్‌ఎం భారతి గర్భిణీలు, బాలింతలతో సమావేశమై తల్లిపాల గొప్పదనం గూర్చి వివరించారు. చనుపాలు ఇవ్వడం ద్వారా తల్లులు, శిశువులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని, పుట్టిన అరగంటలోపు తల్లిపాలు కచ్చితంగా పట్టించాలని సూచించారు. తాగించే విధానాన్ని బట్టి తల్లిపాల ఉత్పత్తి అధికవౌతుందని వివరించారు. ముఖ్యంగా గర్భిణీలు తల్లిపాలను గూర్చి బాగా తెలుసుకోవాలని, మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు సువర్ణ, బాలమణి పాల్గొన్నారు.