హైదరాబాద్, ఆగస్టు 8: రంగారెడ్డి జిల్లాలో ఆరోగ్య పరిరక్షణపై గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, గ్రామ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యు ఎస్ ఇలు మహిళా సభ్యులతో సమన్యయ కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవి రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ఈనెల 13నుండి 18వరకు గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. గురువారం ఆయన వైద్య అధికారులు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో పారిశుద్ధ్యంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధులపట్ల అవగాహన కల్పించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో వైద్యఅధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాలలో పెంటకుప్పలు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా, మంచినీటి క్లోరినేషన్ చేసేలా పంచాయతీశాఖ యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ డి ఎంహెచ్ ఓ సుభాష్‌చంద్రబోస్, ఆర్‌డబ్ల్యు ఎస్ అధికారి వెంకటరమణ, డిపిఓ మున్వర్ పాల్గొన్నారు.
ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్‌ల శిక్షణకు అత్యాధునిక సౌకర్యాలు
జీడిమెట్ల, ఆగస్టు 8: రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీలో ఫారెస్ట్ రేంజర్‌ల శిక్షణ కోసం అత్యాధునికి సౌకర్యాలను కల్పిస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖామాత్యులు శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని దూలపల్లిలో గల రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీలో 3.5 కోట్లతో నిర్మించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ట్రైనీస్ హాస్టల్ భవనాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. అనంతరం మాట్లాడుతూ నేషనల్ అకాడమీకి ఏమాత్రం తీసిపోకుండా రాష్ట్రంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ల కోసం అత్యాధునిక సౌకర్యాలతో హాస్టల్‌ను నిర్మించడం అభినందనీయమన్నారు. గతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ల శిక్షణ కోసం కోయంబత్తూర్, అస్సాంలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండేదని, కాని రాష్ట్రంలో ఆధునిక సదుపాయాలతో శిక్షణ కోసం ఇక్కడ అకాడమీని నిర్మించినట్టు చెప్పారు. 32 గదులతో 64 మందికి వసతులను మెరుగుపర్చడం, సమర్థవంతమైన శిక్షణ ఇవ్వడానికే దూలపల్లిలో హాస్టల్‌ను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ బి.సోమశేఖర్ రెడ్డి, అకాడమీ డైరెక్టర్ రఘువీర్, ఫారెస్ట్ అధికారులు ఎవి జోసెఫ్, రాజేశ్ మిట్టల్, సిబ్బంది పాల్గొన్నారు.