హైదరాబాద్, ఆగస్టు 8: ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల పరిష్కారానికి ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలన్నింటినీ వేగవంతం చేస్తామని, ఇందుకు కమిటీని నియమించనున్నట్టు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఈ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. సైబరాబాదు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ కేసులు ఎక్కువ నమోదు అయినప్పటికీ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బి. శ్రీ్ధర్ మాట్లాడుతూ ఈ సమావేశంలో చర్చించిన ప్రతి అంశంపై వచ్చే సమావేశంలో పురోగతి సాధిస్తామన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులు జనవరి నాటికి 292 నమోదు కాగా వాటిలో 112 పరిష్కారం అయినట్లు తెలిపారు. చట్టంలో నిర్దేశించిన లక్ష్యసాధనను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సభ్యుల సూచనల మేరకు ధ్రువీకరణ సర్ట్ఫికెట్లు, కేసుల పెండింగ్‌లకు గల కారణాలను వెలికితీసేందుకు కమిటీలో ఒక అధికారిని నియమిస్తామన్నారు. బాధితులకు పరిహారం చెల్లించడంలో జిల్లా యంత్రాంగం ముందుండాలన్నారు. రాష్ట్ర ఎస్సి, ఎస్టీ కమిషన్ సెక్రెటరీ సుబ్బారావు మాట్లాడుతూ జస్టిస్ పున్నయ్య కమిటీ సూచనల మేరకు వారానికి ఒకసారి జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజలకు కౌన్సిలింగ్ నిర్వహించి సహృదయ వాతావరణం ఏర్పాటు చేయాలన్నారు. అత్యాచార బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని ధ్యైర్యంగా చెప్పుకునేలా అధికారులు నమ్మకాన్ని కల్గించాలన్నారు. పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ చట్టం కింద నమోదైన కొన్ని కేసులను భూతగాదాల్లో దుర్వినియోగం చేస్తున్నారని, వీటిని పరిష్కరించాలన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే కిచన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సంవత్సరాల తరబడి అత్యచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంవి రెడ్డి, సబ్‌కలెక్టర్ అమ్రపాలి, డిఆర్‌ఓ రాములు, వికారాబాద్ ఎస్పీ రాజకుమారి, క్రైమ్ డిసిపి రంగారెడ్డి, డి ఆర్ ఓలు సూర్యారావు, నాగేందర్, ఎసిపిలు ముత్యంరెడ్డి, మల్లారెడ్డి, ఆనంద్‌భాస్కర్ ఉన్నారు.
ప్రజల కోరిక మేరకే రాజీనామా: కూన
జీడిమెట్ల, ఆగస్టు 8: తెలంగాణ ప్రజల కోరిక మేరకే వైకాపాకు రాజీనామా చేశానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని షాపూర్‌నగర్‌లో నియోజకవర్గం జెఎసీ ముఖ్య నేతలు శ్రీశైలంగౌడ్ వైకాపాకు రాజీనామా చేసినందున పుష్పగుచ్ఛాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన మాట్లాడుతూ తెలంగాణ పట్ల యు టర్న్ తీసుకున్నందునే పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకే ఏ పార్టీలో చేరుతాననేది నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెఎసి నియోజకవర్గం చైర్మన్ మారుతీసాగర్, నాయకులు నర్సింహాగౌడ్, విజయ్‌కుమార్, రవిందర్‌గుప్త, ప్రభు పాల్గొన్నారు.