నెల్లూరు, ఆగస్టు 9: టిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖరరావును ఐపిసి సెక్షన్ 302 ప్రకారం ఉరి తీయాలంటూ ప్రజాకోర్టులో తీర్పునిచ్చిన నాటకీయ వైనమిది. నెల్లూరు నగరంలోని విఆర్ కూడలి వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా టిఎన్‌ఎస్‌ఎఫ్ నేతృత్వంలో ప్రజాకోర్టు చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ ఓవైపున లాయర్, ప్రత్యేక తెలంగాణా కావాలంటూ మరో న్యాయవాది తమ వాదనలు పోటాపోటీగా వినిపించారు. పచ్చని రాష్ట్రంలో రాజకీయ, ధన స్వార్ధపూరిత కారణాలతో ఆగని చిచ్చు రేపి ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేసే కుయుక్తులకు పాల్పడుతున్న కెసిఆర్‌ను ఉరి తీయడమే సమంజసమని ఎట్టకేలకు న్యాయవాది తీర్పునిచ్చారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ ప్రజాకోర్టుతో ఎంతో బిజీగా రోడ్డున పోయే పాదచారులను, వాహనచోదకులను కొంతసేపు అక్కడే నిలబడి కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా ఆలకించారు. అదేవిధంగా ఎన్‌జిఓలు, విద్యార్థి సంఘాల నేతృత్వంలో రాష్ట్ర విభజన వద్దంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమం స్థానిక ఎన్‌జిఓ హోం నుంచి కెవిఆర్ పెట్రోల్ బంకు కూడలి వరకు కొనసాగింది. నెల్లూరుజిల్లా వ్యాప్తంగా గత తొమ్మిది రోజులుగా సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు ఉవ్వెత్తున కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ నిరసనలు చేపడుతుండటం గమనార్హం.
సోనియాకు ఇటలీ పయనం తప్పదు
టిడిపి నేత సోమిరెడ్డి ధ్వజం
వెంకటగిరి, ఆగస్టు 9: రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న యూపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఇటలీ వెళ్ళే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రాకు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై మండిపడ్డారు. నాడు గాంధీ మహాత్ముడు ఆగస్టు తొమ్మిదిన బ్రిటీష్‌వారిని క్విట్ ఇండియా అంటూ నినాదాలు చేశారని నేడు దేశంలో ప్రశాంతంగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టిన ఇటాలియన్ సానియాగాంధీ సీమాంధ్రుల ధాటికి తట్టుకోలేక ఇటలీకి వెళ్ళక తప్పదన్నారు. అందుకే క్విట్ ఇండియా సోనియా అంటూ నినాదాలు చేయాలంటూ పోస్టుకార్డు ద్వారా సీమాంధ్రుల సందేశం సోనియా ఇల్లు చుట్టుముట్టాలన్నారు. నిన్న మొన్నటి వరకు సీమాంద్రులను లెక్కచేయని సోనియా నేడు సీమాంద్రుల నిరసనల ధాటికి గడగడలాడుతున్నారని తెలిపారు. సీమాంధ్రలోని ప్రజల నీటి, ఉద్యోగ, నిధులు, సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్రాన్ని ముక్కులు చేసే మగాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా పుట్టలేదని ఉద్వేగంతో అన్నారు. ఆంధ్రుల హృదయాలను కత్తులతో పొడిచినట్లు వ్యవహరిస్తున్న దిగ్విజయ్‌సింగ్‌కు సీమాంధ్ర గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర మాట్లాడుతూ తొమ్మిది రోజుల నుండి సీమాంధ్రలో సమైక్యవాదంతో రగిలిపోతుంటే ఇంట్లో కుర్చొని పిడేలు వాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం రాత్రి మీడియాతో చిలకపలుకులు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు వస్తాయని నాటి నుంచి నేటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టిడిపిపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ ఎందరో మహాత్ములు సాధించిన రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఎడారిగా మార్చుతున్న కేంధ్ర, రాష్ట్ర పాలక మేధావులను ప్రజలే తరిమికొట్టే పరిస్థితి వారే తెచ్చుకున్నారన్నారు. రోజుకో కమిటీలంటూ సోనియా గాంధీ సీమాంద్రలును మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కల్లబొల్లి మాటలకు, కమిటీలకు ప్రజలు మోసపోయి వెనక్కితిరిగి రారని సమాంధ్రుల సత్తా ఏమిటో చూపిస్తారని హెచ్చరించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాశీపేట సెంటర్ వరకు తెలుగుతుమ్ముళ్ళ పచ్చజెండాలు, టోపీలలో మసుపుమయమైపోయింది. తెలుగు యువత ఆధ్వర్యంలో ర్యాలీలో ఏర్పాటుచేసిన ప్లెక్సీలు అందరిని ఆకుట్టుకున్నాయి. ర్యాలీలో కెసిఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి కాశీపేట సెంటర్‌లో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కెన్నబాబు, పట్టణంలోని సీనియర్ నాయకులు చెలికం శంకరరెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు చేవూరి విజయమోహన్‌రెడ్డి, నూనె మల్లికార్జునయాదవ్, సహదేవయ్య, బీరం రాజేశ్వరరావు, పులుకొల్లు రాజేశ్వరరావు, వెంకటరెడ్డి, కెవికె ప్రసాద్, ఎస్‌డి వి ప్రసాద్‌నాయుడు, నల్లబోతుల మురళీ, రామచంద్రనాయుడు, మేరిగ రామకృష్ణ, కె సుధాకర్, సిసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలోని బంగారు వ్యాపారులు, ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ వ్యాపారులు ఆర్టీసి డిపో వద్ద గంటపాటు రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు.
భర్త కోసం భార్య వౌనపోరాటం
కోవూరు, ఆగస్టు 9: ప్రేమించి వివాహం చేసుకున్న కొద్ది నెలలకే తనను ఇంట్లో నుండి తరిమేశారని బాధిత మహిళ డేగా కల్పన అన్నారు. మండలంలోని స్టౌబీడీ కాలనీలో భర్త కోసం భార్య భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి శుక్రవారం వౌనపోరాటం చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టౌబీడీ కాలనీకి చెందిన ఎస్‌కె అమీర్ తనను ప్రేమించి 2011 ఆగస్టులో కసుమూరులో ప్రేమవివాహం చేసుకున్నాడన్నారు. వివాహం జరిగిన కొద్ది నెలలకు రోజు మద్యం సేవించి చిత్ర హింసలకు గురిచేసేవాడని తెలిపింది. ఈ తరుణంలో నెల్లూరులోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో భర్తపై వేధింపుల కేసు పెట్టటంతో, ఈకేసు నడుస్తున్న క్రమంలో తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడన్నారు. ఈ విషయం తెలుసుకున్న తాను న్యాయం జరిగేంత వరకు భర్త ఇంటి ముందు వౌనపోరాటం సాగిస్తానన్నారు.
కెసిఆర్ తీరువల్లే
విద్యార్థుల బలిదానం
* జెఎసి ఆధ్వర్యంలో వినూత్న నిరసన
* కెసిఆర్‌ను ఉరితీస్తూ నాటక ప్రదర్శన
నెల్లూరు, ఆగస్టు 9: అన్యోన్యంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌ను రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా కెసిఆర్ వ్యాఖ్యలు చేయడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ శుక్రవారం విద్యార్థి జెఏసి ఆధ్వర్యంలో స్థానిక విఆర్‌సి సెంటర్‌లో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులను రెచ్చగొడుతున్న కెసిఆర్‌ను ప్రజాకోర్టులో విచారణ జరిపించి బహిరంగ ఉరితీసే విధంగా నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమలనాయుడు మాట్లాడుతూ విద్యార్థుల బలిదానానికి కెసిఆర్ కారణమని దుయ్యబట్టారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల పట్ల కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలు మానుకోకపోతే తెలంగాణ ప్రాంతంలో ప్రజలు బహిరంగంగా ఉరితీసే రోజు ఆసన్నమైందని హెచ్చరించారు. అదేవిధంగా సమైక్యాంధ్రం కోసం పెద్దఎత్తున ఆందోళనలు చేస్తుంటే అధికార కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రుల్లో చలనం లేదన్నారు. వారి రాజీనామాలను ఆమోదించే విధంగా స్పీకర్‌పై ఒత్తిడి తీసుకురావడం లేదని, ఇందుకు నిరసనగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులను జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. పరిపాలనను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం జిల్లా నాయకులు టి జయవర్థన్, శ్రావణ్, బిసిఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లీలాకృష్ణయాదవ్, జెఏసి నాయకులు ప్రమోద్, సాయిశివ, రవితేజ, హర్షచౌదరి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు.
ఘనంగా రంజాన్ వేడుకలు
నెల్లూరు కల్చరల్, ఆగస్టు 9: మానవాళికి మార్గదర్శకమైన ఖురాన్ ఆవిర్భవించిన పవిత్రమైన మాసంలో చివరిరోజు నిర్వహించే రంజాన్ (ఈదుల్ ఫితర్) పర్వదిన వేడుకలను నగరంలో ముస్లిం సోదరులు శుక్రవారం కోలాహలంగా జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాల్లో వేలాదిగా భక్తులు నమాజ్ చేశారు. ఈసందర్భంగా నగరంలోని ఈద్గాలు, మసీదులను రంగురంగుల విద్యుత్ దీపాలతోముస్తాబుచేశారు. స్థానిక నెల్లూరు చెరువు వద్ద బారాషాహిద్ దర్గా ఈద్గా మైదానంలో వేలాదిగా ముస్లింలు సామూహికంగా నమాజ్ చేశారు. ఈద్గా ఖతీబ్ ఇమామ్ సయ్యద్ అబూబకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. నూతన దుస్తులు ధరించి నమాజ్ చేసిన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక షామ్యానాలు, మంచినీరు, విద్యుత్ దీపాలు ఏర్పాటుచేశారు. ఈకార్యక్రమాల్లో నగర, రూరల్ శాసనసభ్యులు ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డితోపాటు పలువురు నగర ప్రముఖులు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా సంతపేట, కోటమిట్ట, జెండావీధి,కోటమిట్ట, ఖుద్దూస్ నగర్, ఈద్గామిట్ట, జనార్థన్‌రెడ్డి కాలనీ, పెద్దబజారులోని బాషా మసీదు, మూలపేట మద్రసా మసీదు, ఫత్తేఖాన్‌పేట కలాన్ మసీద్, మద్రాసుబస్టాండ్ వద్ద ఆల్ ఖుద్దూస్ మసీదు, బర్మాషెల్ గుంట, నజీర్‌తోట,పెద్దబజారు, గిడ్డంగివారివీధి, రంగనాయకులపేట, టెక్కేమిట్ట, నేతాజీనగర్ ప్రాంతాల్లో భక్తులు నమాజ్ చేశారు. ఇళ్లలో షీర్ కుర్మాతోవిందుభోజనాలు ఏర్పాటుచేశారు. కుటుంబసభ్యులు మిత్రులతో కలిసి విందుభోజనాలు చేశారు. పేదలకు దానధర్మాలు, వస్త్ర, అన్నదానాలు చేశారు. గత నెలరోజులుగా నిర్వహిస్తున్న దీక్షలను ముగించారు. రంజాన్ సందర్భంగా నగరంలోని మార్కెట్లు కిక్కిరిసాయి. పెద్దబజారు,చిన్నబజారు, సండే మార్కెట్, కూరగాయల మార్కెట్, విఆర్‌సి తదితర సెంటర్లలో సందడి నెలకొంది. ఈసందర్భంగా పండ్లు, కూరగాయలు, మాంసం దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసాయి. రంజాన్, శ్రావణ శుక్రవారం సందర్భంగా మసీదులు, ఈద్గాలకు, ఆలయాలకు వెళ్లివచ్చే భక్తులతో నగరంలో సందడి నెలకొంది.
భక్తిశ్రద్ధలతో శ్రావణ శుక్రవారం
భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
నెల్లూరు కల్చరల్, ఆగస్టు 9: సకల శుభాలు చేకూర్చే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం సందర్భంగా నగరంలోని వివిధ ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి. ఆలయాల్లో ఈసందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు, అష్టోత్తర, సహస్రనామ పూజలు నిర్వహించారు. పలువురు మహిళలు ఇళ్లలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. నగరంలోని దర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన చేశారు. అదేవిధంగా స్టోన్‌హౌస్‌పేట కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం, శబరి శ్రీరామ క్షేత్రంతోపాటు పలు శివాలయాలు, వైష్ణవ ఆలయాలు, మహాలక్ష్మి ఆలయాల్లో వందలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్
నిర్మాణ పనులు పూర్తిచేయండి
* అఖిలపక్ష సమావేశంలో సోమిరెడ్డి డిమాండ్
నెల్లూరు, ఆగస్టు 9: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో కలిసి విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి నీటి నిల్వ చేయాలన్నారు. అలాగే ఎస్‌కెపి కెనాల్ కాల్వ పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రోజుకు 33 టిఎంసిల సముద్ర నీళ్లు వృథా అవుతున్నాయన్నారు. సోమశిలలో 78 టిఎంసిలు, కండలేరు డ్యామ్‌లో 8 టిఎంసిలు ఉన్నాయని, అవన్నీ డెడ్‌స్టోరేజ్‌లలో ఉన్నాయన్నారు. చిల్లకూరు, మనుబోలు మండలాల మీదుగా నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి టవర్ల నిర్మాణాలకు రైతులకు పరిహారాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం టవర్‌కు రూ.3.50లక్షలు ఇస్తున్నారన్నారు. తమ పార్టీ పోరాట ఫలితంగానే నేడు రైతులకు ఇంత పెద్దమొత్తం వస్తోందన్నారు. టవర్లకు సంబంధించి రైతులకు ఇస్తున్న రేట్లపై ఈనెల 3వ తేదిన జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ నోట్‌ను విడుదల చేశారని, ఈ సందర్భంగా సోమిరెడ్డి కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం రెండులైన్లకు మాత్రమే నగదు ఇస్తున్నారని, మనుబోలు మండలంలో ఆరులైన్లు కూడా ఉన్నాయని, వీటికి కూడా పరిహారం ఇవ్వాలన్నారు. సీమాంధ్ర ప్రజల గొంతు కోయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు కోటిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామరాజు, తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు అంచల వాణి తదితరులు పాల్గొన్నారు.
పదవులు ముఖ్యం కాదు...
ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి
ప్రజా ప్రతినిధులకు ఉద్యమకారుల పిలుపు
గూడూరు, ఆగస్టు 9: రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పదవులను అడ్డం పెట్టుకొని ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించడం తగదని, ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం త్యజించి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని ఆంధ్రరాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా రైతుబజార్ కూరగాయల వ్యాపారులు యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, టిఆర్‌ఎస్ నాయకుడు కెసిఆర్ దిష్టిబొమ్మలను వ్యానులో ఉంచి తప్పెట్లు తాళాలతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్‌లో ఆ దిష్టిబొమ్మలతో రోడ్డుపై బైఠాయించి కేంద్ర ఫ్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సోనియా, కెసిఆర్ దిష్టిబొమ్మలను కాళ్లతో తొక్కుతూ దగ్ధం చేశారు. అనంతరం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు టవర్‌క్లాక్ సెంటర్‌లో బంతాట ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేదిక సభ్యులు కెఆర్ రెడ్డి, నాసిన నాగులు, రాజేంద్రప్రసాద్, మస్తానయ్యలతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బాలచెన్నయ్య, గోనుశివకుమార్, పిఆర్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జక్కంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు మాట్లాడుతూ అందరం కలిసివున్నట్టయితే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లే అవకాశం ఉందన్నారు. ఏ ఒక్కరి కోసమో రాష్ట్రాన్ని ముక్కలు చేసే ఆలోచన మానుకొని రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు కేంద్రంపై తమవంతు వత్తిడి తీసుకొచ్చి రాష్ట్రం విడిపోకుండా చూడాలని కోరారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసే ప్రతిపాదనను విరమించుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు సూచించారు.