విజయనగరం, మార్చి 2: ఇంటిగ్రెటెడ్ యాక్షన్ ప్లాన్ కింద నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తొలిదశలో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి మాసాంతం లోగా పూర్తి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం రాష్ట్రాల యంత్రాంగాన్ని ఆదేశించారు. తొలి దశ చేపట్టిన పనులు, వాటి ప్రస్తుత పరిస్థితులపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఆయా రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులు, నక్సల్స్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఆయన శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 67,390 పనులు చేపట్టగా ఇప్పటికి 41,820 పనులు పూర్తయినట్టు నివేదికలు అందాయని స్పష్టం చేశారు. ఇంటిగ్రెటెడ్ యాక్షన్ ప్లాన్ నిధులకు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన నిధులను జతచేసి అభివృద్ధి పనులను మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని ముఖ్యమైన ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భారీ స్థాయిలో ఖాళీలు ఉన్నాయని, వీటిని భర్తీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాత్కాలిక సిబ్బందితోనైనా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నియమించే తాత్కాలిక ఉద్యోగులు వారికి నిర్ధేశించిన ప్రాంతాల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా యువతను తీవ్రవాదం వైపు మొగ్గకుండా చూడాలని అన్నారు. అభివృద్ధి పనుల ద్వారా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గిరిజన ప్రజానీకాన్ని ఆకట్టుకునేందుకు వీటిని ప్రయోజన కరంగా అమలు చేయాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అహ్లూవాలియా సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, ముఖ్యప్రణాళికాధికారి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఏడుగురు ఉపాధ్యాయులకు మెమోలు
జామి, మార్చి 2: ఉపాధ్యాయులు పాఠశాల ప్రారంభ సమయంలోనిర్వహించే ప్రార్థనలకుసైతం హాజరు కావాలని, అలా చేయని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్. సుబ్బారావు హెచ్చరించడంతోపాటు శుక్రవారం ఉదయం జామి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న 7గురు ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేయడం విశేషం. శుక్రవారం ఉదయం జామి ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన ముందుగా ప్రార్థన సమయానికి అక్కడకు చేరుకుని పరిస్తితిని సమీక్షించారు. అయితే ఈ ప్రార్థనకు 780 మంది విద్యార్థులకు గాను కేవలం 80 మందివిద్యార్థులు హాజరుకావడంతపై ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈక్రమంలో ఉపాధ్యాయులు సైతం 30మందిగాను 7గురు ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు రాలేదన్న విషయాన్ని ఆయన గ్రహించారు. ఈ సమయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆ ఏడుగురు ఉపాధ్యాయులకు తక్షణమే మెమోలు జారీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులు పరిశీలించి ఉపాధ్యాయుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మధ్యాహ్న భోజన నిర్వాహకుల బోజనం వండుతున్న తీరుతదితర అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ సైతం ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తు పనితీరు మారకుండా ఎజెన్సీ నుంచి తొలగిస్తామని అన్నారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓ, ఎన్‌ఆర్‌కె. రత్నం, మండల ప్రత్యేక అధికారి అన్నపూర్ణలకు సైతం సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఇఓ పదవతరగతి విద్యార్థులకు సైన్స్, సోషల్, ఇంగ్లీష్ సబ్జెక్టులపై పలు ప్రశ్నలు అడిగి వారి సందేహాలను నివృత్తిచేయడంతోపాటు సులభ పద్దతిలో సమాదానాలు ఎలా గుర్తు పెట్టుకోవాలన్న విషయాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో సమయానికి హాజరు కాని ఉపాధ్యాయులపై కఠినంగా వ్యవహరిస్తామని, విద్యాప్రణాలు తగ్గితే సహించేది లేదని అన్నారు. అదేవిధంగా డిఇఓ వెంట వచ్చిన డిప్యూటి డిఇఓ నాగమణి సైతం ఉపాధ్యాయుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తు ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తిస్తే విద్యార్థులు ఏవిధంగా మంచి మార్గాలను ఆవలంబిస్తారని ప్రశ్నించారు. అలాగే మండల ప్రత్యేక అధికారి అన్నపూర్ణ మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయులపై తామంతా ఈ విధంగా అసంతృప్తి వ్యక్తంచేయాల్సి రావడం విచారకరమని, గురువులు తమ పై ఉన్న సదాభిప్రాయాన్ని నిలుపుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకరరావు, ఎంపిడిఓ ఎన్.ఆర్.కె. సూర్యం, తహశీల్థార్ ఎం.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.