Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమైక్యరాగాన్ని ఆలపించిన ముస్లింలు

$
0
0

ఒంగోలు, ఆగస్టు 9: జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమానికి రోజురోజుకు అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. ముస్లింల పవిత్రమైన రంజాన్ పండగ రోజున కూడా ముస్లింలు శుక్రవారం సమైక్యరాగాన్ని అలపించారు. ఎన్‌జివో సంఘ నాయకుడు షేక్ అబ్దుల్ బషీర్, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు, తదితరులు ఈద్గా వద్ద మాట్లాడుతూ ముస్లింలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. నమాజు శక్తితో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. ఈద్గా బయట కొంతమంది ముస్లింలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఇదిలాఉండగా మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రం సమైక్యాంగానే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో నగరంలోని డాక్టర్లు, నర్సులు, మెడికల్ కాలేజీ విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించి అనంతరం చర్చి సెంటరు వద్ద మానవహారాన్ని నిర్వహించారు. అదేవిధంగా లాయర్ల రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటుతూనే ఉన్నాయి. ప్రధానంగా విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్న నేపధ్యంలో విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు. కాగా సమైక్యాంధ్ర ఆందోళన ప్రభావం ఆర్‌టిసిపై పెనుప్రభావం చూపనుంది. ఈపాటికే ఆర్‌టిసి పీకల్లోతు నష్టాల్లో ఉంది. ప్రైవేటు వాహనాల ధాటికి ఆర్‌టిసి నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండగా మరొకపక్క సమైక్యాంధ్రకు ఆర్‌టిసి ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఆర్‌టిసి ఉద్యోగులు ప్రకటించటతో సంస్థకు మరింత నష్టాలు రానున్నాయి. అదేవిధంగా ఆర్‌టిసి కార్మికుల సమ్మెతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. ప్రైవేటు వాహనాల యజమానులు మాత్రం ఈ సమ్మెను ఉపయోగించుకునేందుకు సిద్ధవౌతున్నట్లు సమాచారం. మొత్తంమీద రానున్న రోజుల్లో సమైక్యాంధ్ర ఉద్యమాలు మరింతంగా ఊపందుకోనున్నాయి.

జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు
ముస్లింల ప్రత్యేక ప్రార్ధనలు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఆగస్టు 9: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండగను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని అన్ని మసీదులు, ఈద్గాలు ముస్లింలతో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ముస్లింలను నినాదాలు చేశారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని కొణిజేడు బస్టాండు వద్ద ఈద్గా, పత్తివారిబజారులోని చినమసీదు, ట్రంకురోడ్డులోని పెద్దదర్గా, కొండమీద ఉన్న మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రార్ధనల్లో ముస్లింలు పాల్గొని అల్లాను వేడుకున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పలువురు జిల్లాకేంద్రమైన ఒంగోలులో హలీం సెంటర్లను ఏర్పాటుచేశారు. గతంలో హలీం కొనుగోలు చేయాలంటే హైదరాబాదుకు వెళ్లాల్సి వచ్చేది. కాని రెండు, మూడు సంవత్సరాల నుండి హలీం సెంటర్లను నిర్వాహకులు ఏర్పాటుచేసి హలీం రుచులను ప్రజలకు చూపిస్తున్నారు.
భక్తిశ్రద్ధలతో శ్రావణ శుక్రవారం
పూజలు
ఒంగోలు అర్బన్, ఆగస్టు 9: భక్తిశ్రద్ధలతో తొలి శ్రావణ శుక్రవారం వేడుకలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రావణమాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. శ్రావణ నక్షత్రాయుక్తంగా వచ్చే ఈ మాసం లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి పూజలు చేయడం వల్ల సకల సౌభగ్యాలు కలుగుతాయనే ఉద్దేశ్యంతో ఆరాధన చేస్తుంటారు. శ్రావణమాసం సందర్భంగా తొలి శ్రావణ శుక్రవారం జిల్లాలోని పలు దేవాలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో రాజ్యలక్ష్మీ అమ్మవారికి రంగారాయుడు చెరువు నుండి సహస్ర కలశాలతో తీర్ధాన్ని తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని మహిళలు కలశాల ఊరేగింపులో పెద్దఎత్తున పాల్గొన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలోని నాగలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు. రంగారాయుడు చెరువు వద్దగల కంచి కామాక్షమ్మ అమ్మవారి దేవాలయంలో, బాలాజీరావుపేటలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో, గంటాపాలెంలోని పార్వతీదేవి అమ్మవారి ఆలయంలో, కేశవస్వామిపేటలోని విజయదుర్గా అమ్మవారి దేవస్థానం, కన్యకాపరమేశ్వరి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరణలు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహిళలు ఉదయం నుండే అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పలు అమ్మవారి దేవాలయాలు విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానంగా వెలుగొందాయి.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే
సిఎం రాజీనామా చేయాలి
వైఎస్‌ఆర్‌సిపి చీఫ్ విప్ బాలినేని డిమాండ్
ఒంగోలు అర్బన్, ఆగస్టు 9: రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌విప్, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి సూర్య నారాయణ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్ర రాష్ట్ర సాధకులు పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఒంగోలు శాసససభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది రోజుల నుండి సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విధానానికి నిరసనగా తమ పార్టీ శాసనసభ్యులు రాష్ట్ర విభజనకు ముందే రాజీనామాలు చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర విభజనపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలుగువారిని విడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రపన్ని రాష్ట్ర విభజనకు పాల్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుయుక్తులను ఎండగట్టేందుకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచి రాష్ట్రాన్ని విడగొట్టకుండా చూడాలని కోరారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సర్వనాశనమై పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు సమన్వయకర్త అంగలకుర్తి రవి, నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, బిసి సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కె సుధాకర్, యువజన విభాగం జిల్లా కన్వీనర్ రమణారెడ్డి, విజయవాడ సిటీ ఇన్‌చార్జి వై వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు ముదివర్తి బాబూరావు, జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, నాయకులు బి కొండలు, వై రమేష్‌బాబు, ఎన్ భీమేష్, ఎ గురవయ్య దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, తోటపల్లి సోమశేఖర్, శింగరాజు వెంకట్రావు, గంగాడ సుజాత, ఇందిర, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు చేరిన సాగర్ జలాలు
వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్న రైతులు
మార్కాపురం, ఆగస్టు 9: నాగార్జునసాగర్ జలాలు ప్రకాశంజిల్లాకు రావడంతో ఆయకట్టు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు. గతఏడాది సాగర్‌నీరు లేక పంటలు పండక కరవులో చిక్కుకున్న రైతులు ఈఏడాది ఆగస్టు మొదటివారంలోనే జిల్లాకు సాగర్‌నీరు రావడంతో వరినారు పోసుకునేందుకు కొందరు, నాట్లు వేసుకునేందుకు మరికొందరు సిద్ధం అవుతున్నారు. సాగర్ జలాశయానికి నీరు చేరుతున్నాయని తెలుసుకున్న రైతులు ఆయిల్ ఇంజన్ల కింద నార్లు పెంచి నాట్లు వేసుకునేందుకు భూములను చదును చేస్తున్నారు. మరికొందరు రైతులు గుంటూరుజిల్లా నుంచి వరినారు కొనుగోలు చేసి నాట్లు వేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా మరికొందరు రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసేందుకు నంద్యాల, కర్నూల్ తదితర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మెట్ట్భూముల్లో పత్తి, మిర్చి పంటలను సాగు చేసేందుకు రైతులు మిర్చి నారు కొనుగోలు చేసేందుకు గుంటూరుజిల్లా సిరిగిరిపాడు ప్రాంతానికి తరలివెళ్తున్నారు. గతఏడాది కరవు కోరల్లో చిక్కుకున్న రైతులు ఈఏడాదైనా రెండుపంటలు సాగుచేసి కరువు నుంచి బయట పడాలనే ధ్యేయంతో ఎవరి పద్ధతిలో వారు పంటలు సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. సాగర్‌కు నీరు వచ్చి వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుసుకున్న వలసకూలీలు స్వగ్రామాలకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఏదిఏమైనా ఈఏడాది సాగర్ ఆయకట్టు పరిధిలో రైతులు ఆనందోత్సవాలతో ఉన్నారు.

రాజ్యలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు
ఒంగోలు అర్బన్, ఆగస్టు 9: ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయం 8 గంటలకు శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర శత కలశస్నపన అభిషేకం జరిగింది. దేవాలయం వద్ద నుండి 108 మంది మహిళలతో 108 కలశాలు, మేళతాళాలతో బయలుదేరి రంగారాయుడు చెరువు వద్ద నుండి బిందె తీర్ధం తీసుకొని వచ్చి అమ్మవారికి పంచామృత శతకలశ స్నపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం రాజ్యలక్ష్మీ అమ్మవారికి విశేష అలంకారం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు పల్లకీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస్‌రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ పసుపులేటి శ్రీనివాసరావు, ధర్మకర్తలు కరేటి శ్రీనివాసులు, నల్లమల్లి ధనలక్ష్మి, గుర్రం బదరీనారాయణ, దేవస్థాన అర్చక స్వాములు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని , అమ్మవార్లను దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ధర్మకర్తల మండలి చైర్మన్ పసుపులేటి శ్రీనివాసరావును ఆలయ సిబ్బంది సత్కరించారు.
ఘనంగా యువజన కాంగ్రెస్ దినోత్సవం
ఒంగోలు అర్బన్, ఆగస్టు 9: ఒంగోలు పార్లమెంట్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన బాధ్యత కూడా యువతపైనే ఉందని తెలిపారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో 1970వ సంవత్సరంలో యువజన కాంగ్రెస్ ఏర్పాటు చేశారన్నారు. యువజన కాంగ్రెస్ ద్వారానే దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు పుట్టారని, అలాంటి యువజన కాంగ్రెస్‌ను పటిష్ఠపరిచే దిశగా కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ఆయూబ్, పి దీపక్‌రెడ్డి, ఒంగోలు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు షేక్ నూరు, షేక్ షరీఫా, కరీం, షేక్ మదీన్, షర్ఫానీ, పసుపులేటి మనోజ్, చరణ్, అనీల్, కొమ్మునవీన్, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా యువజన కాంగ్రెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీముల్లా కేక్ కట్ చేసి పార్టీశ్రేణులకు స్వీట్లు పంచిపెట్టారు.
‘వామపక్షశ్రేణులపై ప్రభుత్వ దాడులు నశించాలి’
ఒంగోలు అర్బన్, ఆగస్టు 9: వామపక్ష శ్రేణులపై పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న హింసాకాండాను నిరసిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను పునరిద్దించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. సిపిఎం కార్యకర్తలు సుందరయ్యభవన్ నుండి బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ దిష్టిబొమ్మను ఊరేగిస్తూ ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు రోడ్డు, సాగర్ సెంటర్ మీదుగా అద్దంకి బస్టాండు సెంటరులోని ఎన్‌టిఆర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మమతాబెనర్జీ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈసందర్భంగా సిపిఎం ఒంగోలు నగర కార్యదర్శి జివి కొండారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తృణమూల్ ప్రభుత్వం 6400 పంచాయితీల వామపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని ఏకగ్రీవం చేసుకుందని విమర్శించారు. 4400బూత్‌ల్లో రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. 24మంది వామపక్ష కార్యకర్తలను హత్యచేశారన్నారు. ఈదుర్మార్గ హింసను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దోపిడి శక్తికి ఊడిగం చేస్తూ శ్రామిక వర్గాన్ని అణిచివేసే మమత సర్కారు చర్యలను ప్రజలు నిరసించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు జి రమేష్,వీరాస్వామి, దామా శ్రీనివాసులు, పి వెంకట్రావు, రాపూరి శ్రీనివాసరావు, కె రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

శభాష్..సిఎం కిరణ్
* సిఎంను అభినందిస్తున్న జెఎసి నేతలు
మార్కాపురం, ఆగస్టు 9: రాష్ట్ర విభజనకు సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందనపై జెఎసి నేతలు, ప్రజలు అభినందిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలతోపాటు తెలంగాణకు జరగబోయే నష్టాలను, కష్టాలను కంటికి కనిపించేలా మాట్లాడటం ఆయన హుందా తనానికి నిదర్శనమని పలువురు అభినందిస్తున్నారు. విభజన జరిగితే రెండు ప్రాంతాలకు రాబోయే కష్టాలను లెక్కలతోసహా చెప్పడం పట్ల పార్టీలకు అతీతంగా సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విభజన ప్రకటన వచ్చిన తొమ్మిదవ రోజుల వరకు ఎలాంటి ప్రకటనలు చేయని ముఖ్యమంత్రి కిరణ్ గురువారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తనన మనస్సులో మాట నిర్భయంగా ప్రకటించడంపై పలువురు అభినందిస్తున్నారు. ప్రత్యేకంగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తున్న వారు ఈ ప్రకటనతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారని జెఎసి నేతలు అంటున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా రాష్ట్ర విభజనపై ఇదే విధంగా స్పందించి సీమాంధ్రప్రజలకు మనోధైర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ర్యాలీలు, దిష్టిబొమ్మల దగ్ధం
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>