(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
రాష్ట్ర విభజన వేడి మరింత ఎక్కువైంది. ఉద్యమం సునామీలా మారింది. అన్నీ వర్గాల ప్రజలే కాదు..రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా, విద్యార్థి, కుల, కార్మిక, కర్షక సంఘాలు, ఉద్యోగులు..ఇలా ఎవరికివారు ఉద్యమాన్ని బలీయమైన శక్తిగా మార్చారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వారి ఇళ్లను కూడా ఆందోళనకారులు ముట్టడించారు. అయితే శుక్రవారం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), బొడ్డేపల్లి సత్యవతి (ఆమదాలవలస), జుత్తు జగన్నాయుకులు (పలాస), కొర్ల భారతి (టెక్కలి), మీసాల నీలకంఠంనాయుడు (ఎచ్చెర్ల), పీరుకట్ల విశ్వప్రసాద్ (ఎమ్మెల్సీ) సమైక్యాంధ్ర ఉద్యమంలో ‘మేము సైతం!’ అంటూ రాజీనామా చేసారు. ప్రజల మనోభాలను గౌరవిస్తూ రాజీనామాలు చేసిన వీరంతా ఉద్యమానికి మరింత సహకారం అందిస్తామంటూ వీరంతా శుక్రవారం సిఎంకు రాజీనామాలు అందజేశారు. దీంతో జిల్లాలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాను ఐదుగురు రాజీనామాలు సమర్పించడం విశేషం. రాష్ట్ర విభజనకు నిరసనగా గత పది రోజులుగా సీమాంధ్ర పౌరులంతా రోడ్డులెక్కి వినూత్న ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని ప్రధాన డిమాండ్‌తో సమైక్యవాదులు ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. జెండాలు పక్కనపెట్టి సమాక్యవాదమే అజెండాగా అన్ని రాజకీయ పక్షాల నేతలు తమదైన శైలిలో గళం వినిపిస్తున్నారు. దీంతో ఉద్యమానికి మరింత స్ఫూర్తినివ్వాలని భావించి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన బృందంతో రాజీనామాకు దిగి ఉత్తరాంధ్రలోనే సంచలనానికి తెరలేపారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తాను సమైక్యవాదినే అంటూ ప్రజలముందుకు వచ్చి 24 గంటలు గడవకముందే ధర్మాన బృందం కూడా రాజీనామా చేయడం విశేషం. విభజన నిర్ణయాన్ని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై నెట్టడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ధర్మాన రాజీనామాతో చెక్ చెప్పారనే చెప్పకతప్పదు. తనతో పాటు తన అనుచరులైన ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయించి వ్యూహరచన చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమకారులు మాజీ మంత్రి ధర్మాననే లక్ష్యంగా చేసుకోవడంతో తనతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో రాజీనామా అస్త్రాన్ని సంధించి ఉద్యమానికి మరింత ఊపు అందించారు.
సందిగ్ధంలో కిల్లి, కోండ్రు
జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ప్రస్తుతం(ఇచ్ఛాపురం, నరసన్నపేట మినహాయించి) మిగిలిన ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే. అయితే వీరిలో ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. మిగిలింది మంత్రులు కోండ్రు మురళీమోహన్ (రాజాం), శత్రుచర్ల విజయరామరాజు (పాతపట్నం)తో పాటు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు రాజీనామా చేయకుండా ఉన్నారు. వీరితోపాటు కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కూడా ధర్మాన బృందం రాజీనామాతో సందిగ్ధంలో పడినట్లయింది. తాము సమైక్యవాదులమేనంటూ పలు మార్లు పేర్కొన్న కేంద్రమంత్రి కృపారాణి, రాష్ట్ర మంత్రి కోండ్రు మురళీమోహన్, మరో మంత్రి శత్రుచర్ల కూడా వారివారి పదవులకు రాజీనామా చేసి జిల్లాకు వస్తారా? లేక అధిష్ఠానం వైఖరికి కట్టుబడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ఉద్యమకారులు హెచ్చరించడం ప్రస్తావించదగ్గది.
సిక్కోల్‌ను వీడని ఆగస్టు సంక్షోభం
రాష్ట్రానికి శివారుగా ఉన్న సిక్కోల్ సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువన్న విషయం అందరికీ తెలిసిందే. అదే మాదిరిగా ఇక్కడ నేతలను కూడా ఆగస్టు సంక్షోభం వెన్నంటివెంటాడుతునే ఉంది. నాడు ఎన్టీఆర్ వెన్నుపోటు నుంచి నేడు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల వరకూ అంతా ఆగస్టు నెలలోనే జరిగాయి. గత రెండుమూడు దశాబ్ధాలుగా ఈ నెలతో రాజకీయ పార్టీలకు ఉన్న బంధాన్ని పరిశీలిస్తే పార్టీలను షేక్ చేసే సందర్భాలు ఇంకా వెంటాడుతునే ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం ఈ సంక్షోభం సమైక్య ఉద్యమం రూపంలో అధికార పార్టీ నేతలు పదవులు వదులుకోవల్సివచ్చింది. తొలుత తెలుగుదేశం పార్టీకే సెంటిమెంటుగా ఉన్న ఈ ఆగస్టు నెల గత ఏడాది నుంచి కాంగ్రెస్ పార్టీని కూడా సంక్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. అందులోభాగంగానే ఈ సారి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తమ పదవులకు సిఎంకు సమర్పించిన రాజీనామాలు.
ఉప్పెనలా ఉద్యమం
కొనసాగుతున్న నిరసనలు
పోస్టుకార్డు
ఉద్యమానికి శ్రీకారం
ముస్లిం సోదరుల ర్యాలీ
హాస్టల్ విద్యార్థినుల రాస్తారోకో
ఉద్యోగుల వంటా-వార్పు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఆగస్టు 9: రాష్ట్ర విభజనను నిరసిస్తూ పల్లెలన్నీ కదం తొక్కుతున్నాయి. పట్టణాల్లో సమైక్యఉద్యమం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఎక్కడ చూసినా వినూత్నంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, వంటావార్పులతో సమైక్యవాదులు ఉప్పెనలా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. . శుక్రవారం నాటికి సమైక్యాంధ్ర ఉద్యమం పదోరోజుకు చేరింది. జిల్లా కేంద్రంలో ముస్లింసోదరులు రంజాన్ వేడుకలను పక్కనపెట్టి మేము సైతమంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. కమిటీ ప్రతినిధులు హనుమంతుసాయిరాం, బుక్కూరు ఉమామహేశ్వరరావు, జామి భీమశంకర్రావు, మున్సిపల్ డి.ఇ సుగుణాకరరావు తదితరులు ఎన్జీఒ హోమ్‌లో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఆధ్వర్యంలో జై సమైక్యాంధ్ర నినాదాలతో పోస్టుకార్డులు తయారు చేసి యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి పంపించారు. అలాగే సమైక్యాంధ్ర కోసం ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించిన జర్నలిస్టులంతా ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని తీర్మానించారు. ఇందుకోసం జర్నలిస్టుల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. తెలుగువిద్యార్థి సమితి జిల్లా కార్యదర్శి ఆర్.ఎల్.ప్రసాద్ రాష్ట్ర విభజనకు నిరసనగా శిరోముండనం చేసుకున్నారు. కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులంతా అతిపెద్ద జాతీయ జెండాతో భారీ ర్యాలీని పట్టణవీధుల్లో నిర్వహించారు. విద్యుత్‌శాఖ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి కుశాలపురం కూడలి వద్ద జాతీయ రహదారిపై వంటావార్పు కొనసాగించారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహ విద్యార్థినులు ఏడురోడ్ల కూడలిలో విభజనను నిరసిస్తూ ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీ సాగించారు. సినీనటుడు మహేష్‌బాబు అభిమాన సంఘం నిరసన ర్యాలీ చేశారు. ఎన్జీఒ నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్ధిస్తూ సమైక్యాంధ్రకు జై కొడుతూ ర్యాలీ కొనసాగించారు. క్రిష్టియన్ సోదరులు కూడా సమైక్యాంధ్రకు జై కొడుతూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అంబేద్కర్ వర్శిటీ విద్యార్థులంతా దీక్షలు కొనసాగించడమే కాకుండా క్యాంపస్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి భిక్షాటన, అర్ధనగ్నప్రదర్శన నిర్వహించారు. పల్లెల్లో సమైక్య ఉద్యమాన్ని హోరెత్తించేలా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆటోపై ప్రచారం నిర్వహించారు. నరసన్నపేట పట్టణంలో విద్యార్థులు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద దహనం చేశారు. ఆమదాలవలసలో సమైక్యాంధ్ర సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, టిడిపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రొఫెసర్ తులసీరావులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం, పలాసలలో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వంటావార్పు, ఆటాపాటలతో నిరసనగళం వినిపించారు. టెక్కలి, సోంపేట, పాలకొండ, కొత్తూరు, పాతపట్నం, రాజాం, పొందూరు, రణస్థలం కేంద్రాల్లో నిరసనలు మిన్నంటాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతోపాటు స్వయం సహాయక సంఘాలు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావడంతో పల్లెపల్లెకు ఉద్యమసెగ సోకి మరింత ఉధృతంగా మారింది.
వేడుకగా ఈద్-ముబారక్
* కిక్కిరిసిన మసీదులు * ముస్లింల సామూహిక ప్రార్ధనలు
శ్రీకాకుళం(కల్చరల్), ఆగస్టు 9: పవిత్ర రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులంతా శుక్రవారం ఆనందోత్సవాలతో గడిపారు. నెలరోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టి శుక్రవారం జిల్లాలో ముస్లింలంతా సమీప ప్రార్ధనామందిరాల వద్దకు చేరుకొని రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తబట్టలు ధరించి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. పట్టణంలో జి.టి.రోడ్ దరి జామియా మసీదు వద్దకు ఉదయానే్న ముస్లిలంతా చేరుకుని రంజాన్ శుభాకాంక్షలను తెలుపుకుంటూ ప్రార్ధనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులు నమాజ్ చేస్తూ ప్రార్ధన చేస్తునప్పుడు మసీద్ ఇమామ్ మహ్మద్ ముషారఫ్‌హుస్సేన్ బాహీ రంజాన్‌మాస విశిష్టతను తెలిపారు. ఏడాది పొడుగునా కఠోర నియమాలను ఆచరిస్తూ దేశ సౌభాగ్యానికి, సామరస్యానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఖురాన్ బోధనలు మానవాళికి ఆచరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీదు అధ్యక్షులు ఎం.ఏ.రఫీ, బేగ్, షాన్‌అహ్మద్, అబ్దుల్‌షాజహాన్, మీర్‌మహ్మద్ తదితర ముస్లిం సోదరులు, చిన్నారులు ఆసక్తిగా పాల్గొన్నారు. అనంతరం దానధర్మాలు చేయడం, మిఠాయిలు స్వీకరించారు. ఇళ్ల వద్దకు వెళ్లి రంజాన్ విందు ఆరగించారు. నేతి సేమ్యాతో తయారైన పాయసాన్ని స్వీకరించారు. అదేవిధంగా వైఎస్సార్ కల్యాణ మండపంలో మసీదు అధ్యక్షుడు షాన్‌నవాజ్ ఆధ్వర్యంలో రంజాన్ ప్రార్ధనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫిర్‌జోద్, మస్క్, హర్షద్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకల్లో ప్రముఖులు
రంజాన్ పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, స్థానిక జామియా మసీదు వద్దకు చేరుకొని రంజాన్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ముస్లిం సోదరులు లోపలకు ఆహ్వానం పలికారు. డిఆర్వో నూర్‌భాషాఖాసీం, మసీదు జిల్లా అధ్యక్షుడు రఫీలతోపాటు ఇతర మతపెద్దలకు, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
....
గిరిజన చట్టాలు అమలు చేయాల్సిందే
ప్రపంచ ఆదివాసీల దినోత్సవంలో ఎమ్మెల్యే సుగ్రీవులు
సీతంపేట, ఆగస్టు 9: గిరిజనుల కోసం రూపొందించిన చట్టాలు, హక్కులు పక్కాగా అమలుజరగాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మకసుగ్రీవులు అన్నారు.శుక్రవారం ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఆదివాసీ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో సీతంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు.స్థానిక పిఎంఆర్‌సి కేంద్రం నుండి దోనుబాయి జంక్షన్ వరకు డప్పులు,వాద్యాలు,గిరిజన నృత్యాలతో ర్యాలీ చేపట్టారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సుగ్రీవులు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ఆర్‌ఓఎఫ్‌ఆర్,జీఓ నెం.3,1/70యాక్ట్ అమలుజరగాలన్నారు. గిరిజన చట్టాలకు భంగం కలగకూడదని,నకిలీ సర్ట్ఫికేట్లతో గిరిజనేతరులేవరైనా ఉద్యోగాలు పొందితే తన దృష్టికి తీసుకురావాలన్నారు.నాన్‌షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న పంచాయతీలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చేందుకు తనవంతు కృషిచేస్తున్నానని చెప్పారు. అటవీహక్కు చట్టంలో భాగంగా గిరిజనులకు ఇచ్చిన పట్టాల పై రీసర్వే చేయించేందుకు ప్రిన్సిపాల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. విద్యతోనే గిరిజనాభివృద్ధి ముడిపడి ఉందని,గిరిజనులు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి,గిరిజనుల కోసం కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో వారి అభివృద్ధికే ఖర్చుఅయ్యేలా చట్టం చేయడం జరిగిందన్నారు. ఐటిడిఎ పీవో కె సునీల్‌రాజ్‌కుమార్ మాట్లాడుతూ గిరిజనుల్లో ప్రశ్నించేతత్వం రావాలన్నారు. ఇప్పటికి గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు నిరక్షరాస్యులు ఉన్నారని,దీనిని అధిగమించేందుకు ఉపాధ్యాయులు,గిరిజన సంఘాలు కృషిచేయాలన్నారు. తొలుత ఆదివాసీ తల్లి చిత్రపటం ఎదుట ఎమ్మెల్యే,పీవో జ్యోతిప్రజ్వలన చేసి కాఠ్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్‌లకు పీసాయాక్ట్,పంచాయతీ హక్కులతో కూడిన బుక్‌లెట్‌ను ఎమ్మెల్యే పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ ఏపిడి ధర్మారావు,ఏపిఓ నాగోరావు, లావేరు ఎంపిడిఓ కిరణ్, తహశీల్దార్ మంగు, మాజీ ఎంపిపి సరస్వతి, సర్పంచ్ ఆరిక భారతి, ఆదివాసీ వికాష పరిషత్ నాయకులు మన్మధరావు, కె కాంతారావు, ఆరిక భాస్కరరావు, సుబ్బారావు, తేజేశ్వరరావు, ఓఎస్‌డి చంద్రరావు, భూదేవి, ఆర్ట్స్ సంస్థ డైరెక్టర్ నూక సన్యాసిరావు,గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సిఎం వ్యాఖ్యలు
సమర్థనీయం
* సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక
శ్రీకాకుళం (టౌన్), ఆగస్టు 9: రాష్ట్ర విభజనపై సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి అభిప్రాయాలను జిల్లా ఎన్జీవో సంఘం సమర్థ్ధించింది. శుక్రవారం స్థానిక ఎన్జీవో హోంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యుల ఐక్యకార్యాచరణ కమిటీ సమావేశంలో హనుమంతు సాయిరాం మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఉద్యమం వచ్చినప్పటి నుండి జెఎసి తరుపున తాము సిఎం చెప్పిన విషయాలనే యుపిఎ నాయకులతో పాటు విభజన కోరుకుంటున్న నేతలకు వివరించామన్నారు. నదీజలాలు, ఆదాయ వ్యయాలు శాస్ర్తియ దృక్పథం లేకుండా విభజన చేపట్టడం హేతుబద్ధంగా ఉండదని పేర్కొన్నారు. తెలంగాణ నాయకులు ఇచ్చిన తప్పుడు నివేదికల ఆధారంగా అమాయక తెలంగాణా ప్రజలను మభ్యపెట్టి కెసిఆర్ చేసిన ఉద్యమాలకు యుపిఎ తలొగ్గి విభజన ప్రక్రియ చేపట్టడం రాజకీయ లబ్ధి కోసమేనన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్కూరు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సిఎం వాస్తవాలను బయటపెడితే ఆయనపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఆర్ధిక శాఖ నుండి ఆదాయ వ్యయాల గణాంకాలు బయట పెట్టవద్దని యుపిఎ ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేయడం అన్యాయమని, సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత దాపరికాన్ని తావులేదని విమర్శించారు. జెఎసి నాయకులు జామి భీమశంకరరావు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు.
సమాధానంగా చెప్పారు. మున్సిపల్ ఎంప్లారుూస్ జెఎసి నాయకులు సుగుణాకరరావు మాట్లాడుతూ నేటి సమైక్యాంధ్ర ఉధ్యమంలో తోపుడుబల్లు వర్తకులు, చిన్నపిల్లలు కూడా పాల్గొనడం హర్షనీయమని, వీరంతా స్వచ్ఛందంగా పాల్గొంటుంటే మన ప్రజాప్రతినిధులు తాత్సారం చేస్తుండటం వీరికా మనం ఓటువేసి గెలిపించామనిపిస్తుందన్నారు. ఈ ఉధ్యమం కొత్త రాజకీయ సంస్కృతికి నాంది కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రొఫెషర్ డి.విష్ణుమూర్తి, వై. ఉమామహేశ్వరరావు, యంఆర్‌కె దాస్, బరాటం లక్ష్మణరావు, కోరాడ రమేష్, పొట్నూరు వెంకటరావు, గుమ్మా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా వరలక్ష్మి పూజలు
శ్రీకాకుళం(కల్చరల్), ఆగస్టు 9: సిరులు కురిపించే శ్రావణ శుక్రవారం పర్వదినం పురస్కరించుకుని లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు జరిగాయి. పట్టణంలోని కలెక్టర్ బంగ్లా దరి సత్యసాయి మందిరంలో మహిళలు కుంకుమపూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు ఆర్.కమలత్రివేణి, వరలక్ష్మీ, శోభా, జగదీశ్వరి, శ్రీలక్ష్మీ, విజయలక్ష్మీ తదితరులు లక్ష్మీదేవి చిత్రపటానికి ప్రత్యేక అలంకరణ చేసి కుంకుమపూజలుచేశారు. లలితాసహస్తన్రామావళి పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్.జె.వి.గోపాలరావు, రాజ్‌కుమార్, స్వామి, ఎన్.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గుడివీధి కోటేశ్వరాలయంలో కొలువుతీరిన రాజరాజేశ్వరి అమ్మవారికి దేవి మహిళా మండలి సభ్యులు కుంకుమపూజలు, దేవిస్త్రోతలు, పారాయణాలు పఠించారు. పట్టణంలోని గాజులవీధి, కత్తెరవీధి, విశాఖ-ఏ కాలనీ, ప్రకాష్‌నగర్‌కాలనీ, గుజరాతిపేటలలోని దేవీ ఆలయాల్లో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు జరిపారు.