Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమైక్యాంధ్ర కోసం నిరసనల హోరు

$
0
0

విజయనగరం, ఆగస్టు 9: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకు ఉద్ధృతమవుతొంది. రాజకీయపార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజా సంఘాలు ఉద్యమంలో పాల్గొంటున్నాయి. శుక్రవారం 43వ జాతీయరహదారిపై బొండపల్లిలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలను నిర్వహించగా, 16వ జాతీయ రహదారిపై నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. దీంతో దాదాపు మూడు గంటలపాటు రెండు జాతీయ రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, చాంబర్ ఆఫ్ కామర్స్ బంద్ నిర్వహించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. రంజాన్ సందర్భంగా పట్టణంలోని ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం ఈద్గాకు వెళ్లిన ముస్లిం సోదరులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇక్కట్లు పడ్డారు. 16వ జాతీయ రహదారిపై కాంగ్రెస్ వంటావార్పు కార్యక్రమం నిర్వహించడంతో దాదాపు రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. బంద్ పిలుపులో భాగంగా అరుణా జూట్ మిల్లు కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ 2008లో తెలంగాణాకు అనుకూలంగా లెటర్ అందజేసిన టిడిపి పార్టీ నేతలు నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణాకు వ్యతిరేకంగా అందరూ సమైక్యంగా ఉద్యమించాలన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా తెలంగాణా ప్రకటన చేసిన వెంటనే ముందుగా తామే వ్యతిరేకించామన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డిల్లీ పెద్దలకు సీమాంధ్ర నిరసనలు తెలియజేయడానికే ఈ నిరసనలు చేపడుతున్నామన్నారు. ఈ ఉద్యమం మరింత బలపడాలంటే రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగస్తులు ముందుకు రావాలన్నారు. ఉద్యోగస్తులు పరిపాలన స్తంభింపజేయడం ద్వారా కేంద్రంపై వత్తిడి తీసుకురాగలమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నశ్రీను, యడ్ల రమణమూర్తి, రొంగలి పోతన్న పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర స్టిక్కర్లను వాహనాలకు అతికించారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్రాకు మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, ఐవిపి రాజు, డాక్టర్ వి.ఎస్.ప్రసాద్, కనకల మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. మరోపక్క విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎస్.కోటలలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. బోగాపురం, బొబ్బిలి, పార్వతీపురం, ఎస్.కోట, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలతో ఆయా పార్టీలు తమ నిరసనను వ్యక్తం చేశాయి.
మన్యసీమ రాష్ట్రం ఏర్పాటుచేయాల్సిందే
సాలూరు, ఆగస్టు 9: ప్రత్యేక మన్యసీమ కావాలని, మన్యసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని రాష్ట్ర ఎస్టీ శాసనసభా కమిటీ ఛైర్మన్ పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. శుక్రవారం సమైక్యాంధ్రాకు మద్ధతుగా నియోజకవర్గంలోని గిరిజనులతో ర్యాలీ చేశారు. ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా బోసుబొమ్మ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ మన్యసీమ రాష్ట్ర ప్రతిపాన గత 30 సంవత్సరాలుగా నలుగుతుందన్నారు. తెలంగాణా ఏర్పాటు జరిగితే ఒడిషా, ఆంధ్రాలోని గిరిజన ప్రాంతాలను కలిపి మన్య సీమ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర విభజన వలన గిరిజనులు నష్టపోతారన్నారు. రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన హక్కులు, ప్రయోజనాలను గిరిజనులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఆంటోని కమిటీ, కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌లు మన్యసీమ రాష్ట్ర ప్రతిపాదన గురించి పరిశీలించాలన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేదంటే మన్యసీమ ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. దేశం అధినేత చంద్రబాబు నాయుడు, వై. ఎస్సార్ సి.పి. విజయమ్మలకు చిత్తశుద్ధి ఉంటే సమైక్యాంధ్రాకు అనుకూలంగా తీర్మాణాలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంపార్టీ, వై.సి.పా. నాయకులు కార్యకర్తలు వారి అధినేతలను నిలదీయాలన్నారు.
22వ రోజుకు చేరిన 108 సమ్మె
విజయనగరం (కంటోనె్మంట్), ఆగస్టు 9: సమస్యల పరిష్కారం కోరుతూ 108 సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవార నాటికి 22 రోజులకు చేరుకుంది. జిల్లా కేంద్రాసుపత్రి వద్ద జరుగుతున్న ఈ సమ్మె సందర్భంగా సిబ్బంది చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసనలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎటువంటి శిక్షణ లేని సిబ్బందితో 108 వాహనాలను నడపడం వల్ల రోగుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకశాలు ఉన్నాయని అన్నారు. 108 పైలెట్లకి హెవీలైసెన్స్‌తోపాటు బేసిక్‌లఫ్ సపోర్టు అనే ప్రత్యేకమైన సర్ట్ఫికెట్‌లో శిక్షణ పొంది ఉన్నారని, అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్లకి, బేసిక్ లైప్‌సపోర్టు, రూరల్ లైప్‌సపోర్టు, అడ్వన్సుడ్ లైఫ్ సపోర్టు, మరియు ఇంటర్నేషనల్ ట్రోమా లైఫ్ సపోర్టు అనే సర్ట్ఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొంది ప్రజలకు విలువైన సేవలందించేవారని అన్నారు. ప్రస్తుతం శిక్షణలేని సిబ్బందితో పనిచేయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడ్డం సరికాదని 108 సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.బంగార్రాజు వాపోయారు.
ఘనంగా రంజాన్ వేడుకలు
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 9: పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉథృతంగా సాగుతోంది. పలు రాజకీయపార్టీలు, పలు సంఘాలు ఊరేంగిపులు, రాస్తారోకోలు , ధర్నాలు నిర్వహించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపడుతున్న రిలేనిరాహారదీక్షలు శుక్రవారం నాటికీ ఆరోరోజుకు చేరుకున్నాయి. అలాగే పట్టణంలో గాజులరేగ ప్రాంతానికి కాంగ్రెస్ కార్యకర్తలు సమైక్యాంధ్రకు మద్ధతుగా పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కెసిఆర్ దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహిస్తూ కెసిఆర్ డౌన్..డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, కాంగ్రెస్‌పాలకుల తీరుతెన్నులను ఎండగట్టారు. జై సమైక్యాంధ్ర స్టిక్కర్లను వాహనాలకు అట్టించారు. ఈ సందర్భంగా తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యుడు, ఎమ్మెల్యే పి.అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌పాలకుల అస్తవ్యస్త నిర్ణయం వల్ల రాష్ట్రం రావణకాష్టంలా మారిందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, తెలుగుదేశంపార్టీ ఆరోగ్యవిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్.ప్రసాద్, మాజీ ఎం.పి.డాక్టర్ డివిజి శంకరరావు, పార్టీ నాయకులు మైలపిల్లి పైడిరాజు, పసగాడ రామకృష్ణ, మద్దాల ముత్యాలరావుతదితరులు పాల్గొన్నారు.
గజపతినగరం, ఆగస్టు 9 : స్థానిక సంతతోటలోని మదీనా మసీదులో శుక్రవారం భక్తి శ్రద్దలతో రంజాన్ వేడుకలు జరిగాయి. ప్రత్యేక దైవ ప్రార్ధనలు నిర్వహించుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మదీనా మసీదు హిమామ్ ఎండిగుల్ రజా మాట్లాడుతూ ప్రతీ మానవుడు అల్లా దృష్టిలో సమానమని ఇతర మతస్తులపై సోదరభావం కలిగి ఉండాలని సూచించారు. అందరికీ మంచి జరగాలని అల్లాను ప్రార్ధించాలన్నారు. ముస్లిం సంఘ కార్యదర్శి ఎస్.ఎ షరీఫ్ మాట్లాడుతూ ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో మెలగాలని ఆకాంక్షించారు. మత ప్రమేయడం లేకుండా గజపతినగరం ప్రధాన వీధుల్లో తిరుగుతూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు ఎస్.బాబామీయా, ఎస్‌ఎ షరీఫ్, ఎస్ బాబులాల్, ఎం.రహీమ్‌తుల్లా ఎస్‌ఎస్ జానీ పాల్గొన్నారు.
చీపురుపల్లిలో...
చీపురుపల్లి: స్థానిక జామియా మసీదులో పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ అత్యంత వైభవంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు, ప్రముఖులు మాట్లాడుతూ సమైక్యవాదానికి తమ వంతు మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంతో ఆంధ్ర ప్రాంత ప్రజలు తీవ్ర నష్టానికి గురవుతారని అన్నారు.
ముస్లింల మానవహారం
సాలూరు: సమైక్యాంధ్రాకు మద్ధతుగా పట్టణంలోని ముస్లిం సోదరులందరూ శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకుబోసుబొమ్మ జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు. ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇషాక్, కార్యదర్శి నజీర్ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నదొర, దేశంపార్టీ ఇన్‌చార్జి జి.సంధ్యారాణి, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక అర్భన్‌బ్యాంకు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు బోసుబొమ్మ జంక్షన్‌లో నిర్వహించారు. ఈ దీక్షలో కార్యదర్శి బి.వేణుగోపాలరావు, ఉద్యోగులు తాడ్డి రాము, టి.వాసు, డైరెక్టర్లు ఏ.హరిగోపాల్, ఇ.వెంకటరావు, కోడూరు సాయిశ్రీనివాసరావు, ఏ.గణపతిరావులు పాల్గొన్నారు. దీక్షలో ఉన్న వారిని అర్భన్ బ్యాంకు అధ్యక్షులు పి.నాగేశ్వరరావు, మాజీ డైరెక్టర్ సిగిరెడ్డి అప్పారావు, మాజీ ఉపాధ్యక్షులు యువరాజులు అభినందించారు.
‘గిరిజనేతరులకు న్యాయం చేయాలి’
గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 9: ప్రభుత్వం అర్హులైన గిరిజనేతర లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం ఇళ్లు కట్టుకునేందుకు పొజిషన్ సర్ట్ఫికేట్లు(నివాస స్థల దృవీకరణ పత్రం) ఇవ్వడం లేదు. ఈ కారణంగా ఇందిరమ్మ బిల్లులు నిలిచిపోయాయి. రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన వినతుల ఆధారంగా అధికారులు అర్హులైన వందమంది గిరిజనేతరులకు ఇళ్లు మంజూరు చేశారు. దీంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు పునాదులు వేశారు. బిల్లు మంజూరుకావాలంటే ఫొజిషన్ సర్ట్ఫికేట్ తీసుకురావాలని హౌసింగ్ అధికారులు లబ్ధిదారులకు చెప్పడంతో లబ్ధిదారులు ఫొజిషన్ సర్ట్ఫికేట్ కోసం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లగా మండలంలో 1/70 చట్టం అమలులో ఉన్నందున గిరిజనేతరులకు ఫొజిషన్ సర్ట్ఫికేట్లు ఇవ్వడం కుదరదని రెవెన్యూ అధికారులు తెలిపారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైందని ఎంతో సంతోపడి అప్పులు చేసి పునాదులు వేశామని లబ్ధిదారులు చెబుతున్నారు. కావున తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఆహార పదార్థాల పంపిణీకి
టెండర్లు ఖరారు
పార్వతీపురం, ఆగస్టు 9: పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు కార్యాలయం పరిధిలోని 11 గిరిజన గురుకుల పాఠశాలలు, ఐదు కెజిబివిలకు సంబంధించి ఆహారపదార్థాలు పంపిణీకి సంబంధించి గురువారం రాత్రి టెండర్లను ఖరారు చేశారు. ఐటిడిఎ కార్యాలయంలోని గిరిమిత్ర భవనంలో నిర్వహించిన టెండర్లు నిర్వహణకు పీవో బి ఆర్ అంబేద్కర్ సారథ్యం వహించారు. ఈటెండర్ల నిర్వహణలో భాగంగా పాలు,గుడ్లు, కూరగాయలు, స్వీట్లు ఈవిద్యాసంవత్సరంలో ఈపాఠశాలల విద్యార్థులకు అందించడానికి టెండర్లు ఖరారు చేశారు. ఈకార్యక్రమానికి పార్వతీపురం, సాలూరు, గుమ్మలక్ష్మీపురం తదతర ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ వసంతకుమార్, గిరిజన గురుకులాల ఒయస్‌డి పి.గౌరీశంకరరావు తదితరులు పాల్గొన్నారు.

లంకాజోడులో ఆదివాసీ దినోత్సవం
కురుపాం, ఆగస్టు 9: మండలంలోని లంకాజోడు గ్రామంలో ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం ఆదివాసీ చైతన్యసేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలోని మహిళా యువజన సంఘాలు, గిరిజనులు, విద్యార్థులు ఆదివాసీ ప్రాధాన్యతను తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆదివాసీ చైతన్యసేవా సంఘం జిల్లా అధ్యక్షులు ఆరిక సూర్యనారాయణ మాట్లాడుతూ ఆదివాసీలకు ప్రత్యేక భద్రత కల్పిస్తు వారిని అభివృద్ధి చేయాలన్నారు. శ్రీకాకుళం నుంచి అదిలాబాద్ వరకు ఉన్న ఆదివాసీ ప్రాంతాన్ని మన్యసీమ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు ఎన్ని పథకాలు అమలు చేస్తున్న ఇంకా వెనకబాటుతనమే ఉంటుందని, దానికి కారణం చట్టాలు పటిష్టంగా అమలు చేయకపోవడమేనన్నారు. గిరిజన ప్రాంతంలో ఉన్న వౌళిక వనరులు సద్వినియోగమయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు. ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తు వారి హక్కులను కాపాడాలన్నారు. పాఠశాల హెచ్. ఎం. పెంటారావు మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతిని భావితరానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మొండెంఖల్, వలసబల్లేరు సర్పంచ్‌లు గౌరీశంకరరావు, విప్లవకుమార్‌లు, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకు ఉద్ధృతమవుతొంది. రాజకీయపార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజా
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>