జగ్గయ్యపేట రూరల్, ఆగస్టు 9: కృష్ణా, గుంటూరు, నల్లగొండ జిల్లాల సంగమంగా కృష్ణానదిపై నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్టుకు వరద చేరడంతో భారీగా నీరు ప్రవహిస్తోంది. 24 గేట్లకు గానూ 13గేట్లు బిగించిన అధికారులు వాటిని పూర్తిగా ఎత్తివేయడంతో మొదటి సారిగా జలకళతో అందమైన దృశ్యకావ్యం ఆవిష్కృతమై చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గేట్లు అమరిక చేయని కానాల నుండి సైతం వరద నీరు భారీగా కిందకు వెళుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద 24గేట్లు ఎత్తివేసి నీరు దిగువకు విడుదల చేయడంతో కృష్ణానది ప్రవాహంగా పులిచింతల చేరుకుంటోంది. సాగర్ నుండి సుమారు 2లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు కిందకు విడుదల చేయగా పులిచింతల నుండి రోజుకు 15వేల క్యూసెక్కుల చొప్పున మూడు రోజులుగా 45వేల క్యూసెక్కుల నీరు అధికారులు దిగువకు వదిలారు. వరద నీటి వల్ల గుంటూరు, నల్లగొండ జిల్లాల పరిధిలో కొన్ని గ్రామాలు సైతం ముంపునకు గురయ్యాయి. కృష్ణానది వరద వల్ల ప్రాజెక్టు వద్ద సర్వీస్ రోడ్డు కొట్టుకుపోయింది. గత మూడు రోజులుగా పులిచింతలకు వరద తాకుతుండగా గురువారం భారీగా వరద నీరు వచ్చింది. దీని వల్ల నిర్మాణ పనులు సైతం నిలిచిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణ జాప్యంపై ప్రధాన ప్రతిపక్షంతో సహా ఇతర వర్గాలు, రైతుల నుండి విమర్శలు ఎదురవ్వడంతో ఇటీవలే ప్రభుత్వం నిర్మాణాలను వేగవంతం చేసింది. ఆగస్టు నెలాఖరు నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సైతం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ దశలో వరద రావడం ఇబ్బందిగా పరిణమించింది. 2007నుండి పులిచింతల ప్రాజెక్టుకు వరద రావడం జరుగుతుండగా 2009,2011లో భారీగా వచ్చిన వరద వల్ల నిర్మాణాలకు ఆటంకం కలగడంతో పాటు కాపర్ డ్యామ్, సర్వీస్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అధికారులు ప్రాజెక్టు వద్ద మకాం పెట్టి నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు
మచిలీపట్నం (కోనేరుసెంటరు), ఆగస్టు 9: అవనిగడ్డ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లాలో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి ఉషాకుమారి సూచించారు. అవనిగడ్డ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి దినపత్రికలలో ప్రకటనలు, రేడియో, టీవలలో ప్రచారంపై ఏర్పాటు చేసిన మీడియా సర్ట్ఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా జాయింటు కలెక్టర్ అధ్యక్షతన జెసి చాంబరులో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో జెసి ఉషాకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన సంఘటనలు లేవన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు దినపత్రికలలో, ప్రకటనలు, పెయిడ్ ఆర్టికల్స్ జారీ చేస్తే వాటి వివరాలు వాటి ప్రచురణకు అయిన ఖర్చు తదితర అంశాలను తన దృష్టికి తీసుకురావాలని జిల్లా పౌర సంబంధాల అధికారి సదారావును జెసి కోరారు. ప్రతిరోజూ దిన పత్రికలు పరిశీలించి ప్రకటనల వివరాలను తెలపాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఉపయోగించే కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు షామియానా, వాహనాలు, ఆటోలు, రిక్షాలు, కార్లు, లౌడ్ స్పీకర్లు తదితర ప్రసార సామాగ్రికి సంబంధించిన ఖరీదును జెసి నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించారన్నారు. పోటీ ఉన్న అభ్యర్థులు ఖర్చు వివరాలు వారి ఖాతా పుస్తకంలో ప్రతి రోజు నమోదు చేయాలన్నారు. ఖర్చుల వివరాలను ప్రతి రోజు సరి చూసుకోవాలని జెసి ఆర్‌ఓకు సూచించారు. బ్యాలెట్, పోస్టల్, పేపరు ముద్రణ అంశాలను జెసి సమీక్షించారు. పోలింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశంలో అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి జి రవి, జిల్లా రెవెన్యూ అధికారి ఎల్ విజయచందర్, ఆర్డీవో సాయిబాబు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య
కంచికచర్ల, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్ విభజనకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి గుండె చెదిరి ఒక యువకుడు కంచికచర్లలో శుక్రవారం మధ్యాహ్నం ఉరి వేసుకొని మృతి చెందాడు. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న తోట విజయ్ (28) శుక్రవారం ఉదయం నుండి ఇంట్లో కూర్చుని టివి చూస్తున్నాడు. టివిల్లో పదేపదే వస్తున్న వార్తలు తెలంగాణ విడిపోతుందన్న బాధతో మనస్థాపం చెంది గదిలోకి వెళ్లి ఉరివేసుకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గమనించి గదిలోకి వెళ్లే సరికి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణా విడిపోవడంతో మనస్థాపం చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. విజయ్ మృతదేహాన్ని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు, విద్యార్థి ఐకాసా నాయకులు గంగిరెడ్డి రంగారావు, సిపిఎం నాయకులు సందర్శించి మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
రిలే దీక్షలతో కిక్కిరిసిన కోనేరు సెంటరు
మచిలీపట్నం (కోనేరుసెంటరు), ఆగస్టు 9: సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పట్టణంలో శుక్రవారం రిలే దీక్షలు నిర్వహించారు. ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో స్థానిక కోనేరుసెంటరుకు చేరుకుని సమైక్యాంధ్ర ముద్దు రాష్ట్రాన్ని విడదీయోద్దు అంటూ చేసిన నినాదాలు కోనేరు సెంటరు దద్దరిల్లింది. అనంతరం పెద్ద ఎత్తున టెంట్లు వేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు రిలే దీక్ష చేశారు. రిలే దీక్షకు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ ఎర్నేని నాగేంద్రనాథ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటి పోరాటాలు భవిష్యత్తులో అనేకం ఎదుర్కోవాల్సి ఉంటుందని, గత సంవత్సరమే నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి చుక్కనీరు విడుదల చేయలేదని ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని విమర్శించారు. పంట భూములు బీడు భూములుగా మారే ప్రమాదం ఉందన్నారు. సాగు, తాగునీటి కోసం ప్రజలు ఇక్కట్లు తప్పవన్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు హైదరాబాద్‌లో విద్య పూర్తి చేసుకుని ఉపాధి పొందుతున్నారన్నారు. తెలంగాణ విడదీస్తే వీరి భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉంటుందని ఆవేదన చెందారు. 90 శాతం ఉద్యోగాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారికే దక్కుతున్నాయని ఆవేదన చెందారు. అనంతరం ఉపాధ్యాయులు వాలీబాల్, క్యారంబోర్డు, చెస్ తదితర ఆటలు ఆడి నిరసన తెలిపారు.
రంజాన్ వేళ రాజకీయ నినాదాలు
మైలవరం, ఆగస్టు 9: రంజాన్ వేడుకల్లో రాజకీయ నినాదంతో ముస్లింలు కంగుతిన్నారు. కొందరు ముస్లింలు నేతల ప్రసంగాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో చివరికి రంజాన్ వేడుకలు, సమైక్య నినాదం వైపు తమ ప్రసంగాలను మళ్ళించిన సంఘటన శుక్రవారం మైలవరంలో చోటుచేసుకుంది. రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొనేందుకు, సమైక్యాంధ్ర కోసం ముస్లింలు నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొనేందుకు శుక్రవారం మైలవరం వచ్చిన స్థానిక ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ రాజకీయ ప్రసంగాలు ఒక దశలో ముస్లింలకు కోపం తెప్పించాయి. వివరాల్లోకి వెళితే ముస్లింల పవిత్ర ప్రార్థనా మందిరమైన ఈద్గాలో ముస్లింలు నమాజ్ చేస్తున్న సమయంలో ముందుగా పెడన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అక్కడికి చేరుకుని వారితో కలిసి నమాజ్‌లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఆయన ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా అభివృద్ధికి 50 వేల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ముస్లింలకు అన్ని రంగాలలో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనన్నారు. ఆయన బాటలో పయనిస్తున్న ఆయన తనయుడు జగనన్న అధికారంలోకి రాగానే ముస్లిం అభివృద్ధికి అదే స్థాయిలో కృషి చేస్తారని పేర్కొన్నారు. జగన్, విజయమ్మల తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటుండగా అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడికి చేరుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి ఆయన సైతం రాజకీయ ప్రసంగాన్ని అందుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైలవరం పట్టణ చరిత్రలో ఒక ముస్లిం మహిళకు ఉప సర్పంచ్ పదవిని కట్టబెట్టిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కిందని స్పష్టం చేశారు. మున్ముందు కూడా ముస్లింల అభివృద్ధి టిడిపికే సాధ్యమని చెప్పారు. ఈద్గా అభివృద్ధికి లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు జోగికి పోటీగా ఉమ కూడా ప్రకటించారు. అనంతర వీరు బయటికి వస్తుండగా వైకాపా మైలవరం నియోజకవర్గ మరో సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్ అక్కడికి చేరుకుని వారితోపాటు వెనుదిరిగారు. అక్కడి నుండి సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లింలంతా భారీ ర్యాలీగా మైలవరం పురవీధులలో తిరిగారు. ర్యాలీకి ఉమ, జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్ అగ్ర భాగాన నిలిచి నడిచారు. ర్యాలీ బోసుబొమ్మ సెంటర్‌కు చేరుకున్న తర్వాత అక్కడ మళ్ళీ రాజకీయ ప్రసంగాలు మొదలయ్యాయి. ముందుగా మాట్లాడిన ఎమ్మెల్యే ఉమ రాష్ట్ర విభజన నిర్ణయం సహేతుకం కాదన్నారు. సమైక్యాంధ్రగా ఉండే విధంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విభజన నిర్ణయం ఏకపక్ష నిర్ణయం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అనంతరం మాట్లాడిన జోగి రమేష్ రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలదేనని ఆరోపించారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల రాజీనామాలన్నీ పెద్ద డ్రామాలని ధ్వజమెత్తారు. రాజీనామా చేసిన వారి ఉద్యమంలో చిత్తశుద్ధి లోపించిందని దుయ్యబట్టారు. ఈ సమయంలో టిడిపికి చెందిన కొందరు ముస్లిం పెద్దలు జోక్యం చేసుకుని ఇది రాజకీయ వేదిక కాదని, ఇందులో ఆరోపణలకు తావు లేదని అభ్యంతరం వ్యక్తం చేయటంతో జోగి రాజకీయాలకు అతీతంగా మాట్లాడారు. అనంతరం జ్యేష్ఠ రమేష్‌బాబు ముస్లింలు తమ పవిత్ర రంజాన్ పర్వదినాన సైతం సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించటం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో సమైక్యాంధ్ర కోసం అందరూ కలిసి పోరాటం చేయాలన్నారు.
విభజనను వ్యతిరేకిస్తూ 13, 14 తేదీల్లో గుడివాడ బంద్
గుడివాడ, ఆగస్టు 9: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో గుడివాడ బంద్ నిర్వహిస్తున్నట్టు జెఎసి కన్వీనర్ యార్లగడ్డ వెంకటేశ్వరప్రసాద్ చెప్పారు.
శుక్రవారం స్థానిక ఎన్‌జీవో హోంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనజీవనం స్తంభించేలా సమైక్యాంధ్రను పరిరక్షించుకునేందుకు బంద్ చేపడుతున్నామన్నారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రజలకు జరిగే నష్టాలను బహిరంగంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. ఉద్యమ సమయంలో జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేయరాదని, శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొనాలని ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు. అన్నిరంగాల ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు జెండాలు, అజెండాలను పక్కనపెట్టి ఉద్యమంలో పాల్గొనాలన్నారు. 10, 11, 12 తేదీల్లో నిరసన ర్యాలీలు, వంటావార్పులు, మానవహారాలు నిర్వహిస్తామన్నారు. 15వ తేదీన జాతీయ పతాకాలతో పాటు తెలుగుతల్లి చిత్రాలతో కూడిన సమైక్యాంధ్ర జెండాలను ఎగరవేయాలని కోరారు. ఆంటోని కమిటీ దృష్టికి ఎటువంటి అంశాలనూ తీసుకువెళ్ళడం లేదన్నారు. ఎన్‌జీవోల అసోసియేషన్ గుడివాడ తాలూకా యూనిట్ అధ్యక్షుడు షేక్ ఫరీద్‌భాషా మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీలోగా ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు. జెఎసి ఉద్యమ పర్యవేక్షణ కమిటీ సభ్యులుగా ఎం మధుబాబు, కె అప్పారావును నియమించారు.
పరిపూర్ణ మానవులుగా తీర్చిదిద్దే రంజాన్
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 9: మానవులను పరిపూర్ణ మానవులుగా రంజాన్ మాసం తీర్చిదిద్దుతుందని ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ హుస్సేన్ అన్నారు. స్థానిక ఈద్గాలో రంజాన్ పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక నమాజు నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ స్ర్తి, బాల, వృద్ధులు, వితంతువులను ఆదరించాలని, పేదలకు ఆర్థిక సహాయం చేయాలని, అన్ని మతాల వారితో కలిసి మెలసి ఉండి శాంతి సౌభాగ్యాలకు బాటలు వేయాలని కోరారు.
భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కుంకుమార్చనలు
కూచిపూడి, ఆగస్టు 9: శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు. దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీ కృష్ణాశ్రమంలో ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం, కమల దంపతుల పర్యవేక్షణలో వందలాది మంది మహిళలు కుంకుమర్చనలో పాల్గొన్నారు. ఆత్మకూరి లక్ష్మణదాసు వేద మంత్రోచ్ఛరణల మద్య భక్తిశ్రద్ధలతో శ్రీ వరద లక్ష్మీదేవిని పూజించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని దేవతామూర్తుకు ప్రత్యేక పూజలు జరిపారు. నిత్యానుష్టాన పఠనం, కృష్ణా అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామ పారాయణ జరిపారు. ముత్తీవి గౌరాకృష్ణ, కార్యదర్శి తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, ఆనంద్, యతీంద్ర సేవా సమితి భక్తులు అన్నసమారాధనలో పాల్గొన్నారు. మొవ్వ భీమేశ్వరాలయం, కూచిపూడి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిగాయి.