Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కాంగ్రెస్ నీడలోనే

$
0
0

ఆంధ్రభూమి బ్యూరో, విశాఖపట్నం
రాష్ట్రం విడిపోతోందని తెలిసి గుండె పగిలిన వారు కొందరు. రాష్ట్రం ముక్కలవుతోందంటేనే లోలోన కుమిలిపోయేవారు ఇంకొందరు. మనసులో ఆవేదన ఉన్నా.. ఉద్యమించడానికి ఆస్కారం లేని వారు మరికొందరు. వీరందరిని ఒక తాటిపైకి తీసుకువచ్చి నడిపించాల్సిన బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలను భుజానకెత్తుకునే ప్రధాన రాజకీయ పార్టీలు అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ముందుకెళితే తెలంగాణా..వెనక్కెళితే సమైక్యాంధ్ర.. దేనిక జై కొట్టాలో..దేనికి నై కొట్టాలో తెలిసీ తెలియని సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో తమ వంతు పాత్రపోషించిన పార్టీలన్నీ ప్రత్యేక తెలంగాణతో కూడిన సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగానే వినిపిస్తున్నాయి. సమైక్యాంధ్ర రాష్ట్రంపై ఏపాటి మమకారం ఉన్నా.. ఈ దుర్భర వాదాలతో ఏవగింపు కలగక తప్పదు. రాష్ట్ర విజనకు కొద్ది గంటల ముందు సమైక్య నినాదాన్ని అందుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం పేటెంట్ హక్కులు తమవేనంటూ ప్రకటించుకుంటోంది. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి,న తెలుగుదేశం పార్టీ, సీమాంధ్రలో ఎక్కడ మనుగడ దెబ్బతింటుందోనన్న భయంతో సమైక్య నినాదంతో రోడ్డెక్కమని ఈ ప్రాంత తమ్ముళ్ళను ఉసిగొలిపింది. వీటన్నింటికీ మించి, రాష్ట్రాన్ని రెండుగా చీల్చి, సీమాంధ్రుల గుండెకు గాయం చేసి, ఆ బాధ ప్రజలకు తెలియకుండా సమైక్య ఉద్యమం పేరుతో చికిత్స మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఉద్యమాన్ని భుజానకెత్తుకుంది. దాన్ని కడవరకూ తీసుకువెళుతుందో..మధ్యలోనే వదిలి పారేస్తుందో ఇంకా తెలియదు. ఇలా వ్యవహరిస్తున్న ఈపార్టీలో జనం ఎవరిని నమ్మాలి? జరిగిన పొరపాటును సరిదిద్దుకోడానికో, ఉనికి కోల్పోకుండా ఉండడానికో, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి నాన్ పొలిటికల్ జెఎసిని ఏర్పాటు చేశారు. రాజకీయాల నుంచి రిటైర్ అయిన వారిని, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వారిని ఆహ్వానించారు. ఈ జెఎసికి ప్రాణం పోసిన వారంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఎమ్మెల్యే పదవులకు తామంతా రాజీనామా చేశామని వారు అంటే అనచ్చు. ఆ రాజీనామాలపైనే జనంలో తలెత్తిన అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు. ఈ నేపథ్యంలో పార్టీకి దూరంగా ఉన్నామని వీరు చెపితే, ఎవరు నమ్ముతారు? ఈ నాన్‌పొలిటికల్ జెఎసికి గంట కట్టిన గంటా శ్రీనివాసరావు కూడా పార్టీకి రాజీనామా చేయక్కర్లేదనే చెబుతున్నారు. పార్టీకి రాజీనామా చేయక్కర్కేదని ఆయనే చెప్పిన తరువాత ఆయన, ఆయన వెంట ఉన్న వారంతా కాంగ్రెస్ వాదులే. అటువంటప్పుడు ఇప్పుడు ఏర్పడిన నాన్ పొలిటికల్ జెఎసి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారి కనుసన్నలలోనే పనిచేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందువలన దీన్ని నాన్ పొలిటికల్ జెఎసి అనాలా? కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేయనున్న నాన్ పొలిటికల్ జెఎసి అనాలా? కాంగ్రెస్ పార్టీ ఊతంతో ఊపిరిపోసుకున్న ఈ జెఎసిని చంకనెత్తుకుని ముద్దులాడ్డానికి చాలా మందికి ఇష్టం లేదు.! ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమం ఏవిధంగా ఐక్యంగా ముందుకు సాగుతుందని భావించాలి? ఈ నాన్ పొలిటికల్ జెఎసితో కలిసి ఉద్యమించడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలే వెనకడుగు వేస్తున్నారంటే ఏమనుకోవాలి? ఉద్యమంలోకి స్వచ్ఛందంగా వచ్చిన వారి వెంట నడుస్తామంటున్నారు వీరు. అలాగే విపక్షాలు కూడా ఈ నాన్ పొలిటికల్ జెఎసిని విశ్వసించడం లేదు. వారు కొత్తగా మరో జెఎసి ఏర్పాటు చేస్తామని చెపుతున్నారు. రకరకాలుగా ఉన్న జెఎసిలను కలిసి ఒకే జెఎసిగా ఏర్పాటు చేయాలనుకుని రూపొందించిందే నాన్ పొలిటికల్ జెఎసి. దాన్ని కాదని ఇప్పుడు తలో జెఎసి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ దశలో ఉద్యమం ముందుకెళుతుందని పోరాట భావాలున్న ఏ ఒక్కరైనా నమ్ముతారా?
వారిని రాజీనామా చేయమనండి!
నాన్ పొలిటికల్ జెఎసిలో చేరడానికి వైకాపా సిద్ధంగా లేదు.. వాస్తవారికి అది నాన్ పొలిటికల్ జెఎసి ఎలా అయింది? కాంగ్రెస్ నాయకులే దాన్ని నడిపిస్తున్నారంటూ వైకాపా కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తూ, తన నిర్ణయాన్ని ప్రకటించింది. దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమిస్తున్నారంటే ఎవరు నమ్ముతారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తే, జనం హర్షించి వారి వెంట నడుస్తారని, అలాకాకుండా పార్టీలోనే ఉంటూ ఉద్యమిస్తామంటే జనాన్ని మోసగించడం కాదా? అని ప్రశ్నించారు. తాము కొత్త జెఎసిని ఏర్పాటు చేసి ఉద్యమిస్తాం అని వంశీకృష్ణ అన్నారు.
రాజీకీయ పార్టీలకు ఆహ్వానం ఏదీ!
సమైక్యాంధ్ర కోసం ఉద్యమించడానికి నాన్ పొలిటికల్ జెఎసిని ఏర్పాటు చేశారు సరే.. ఈ సమావేశానికి రాజకీయ పార్టీలను ఎందుకు ఆహ్వానించలేదని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసన్నలలో నడుస్తున్న ఈ నాన్ పొలిటికల్ జెఎసిలో తామెలా చేరుతామని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా టిడిపి అధిష్ఠానం లేఖ ఇస్తే ఇచ్చిఉండచ్చు. కానీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము ఉద్యమిస్తున్నామని బండారు అన్నారు. నాన్ పొలిటికల్ జెఎసిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమాన్ని మరచిన
కాంగ్రెస్ నాయకులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 9: క్విట్ ఇండియా ఉద్యమ దినాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం జరుపుకొన్నారు. అయితే విశాఖ నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి కూడా పార్టీ నాయకులకు తీరికలేకుండా పోయింది. దేశ నాయకుల వర్థంతులు, జయంతులు, కొన్ని ముఖ్య దినోత్సవాలు నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరపడం ఆనవాయితీగా వస్తోంది. మరి క్విట్ ఇండియా ఉద్యమాన్ని నేటి నాయకులు ఎందుకు విస్మరించారో అర్థం కావడం లేదు.
బీచ్ రోడ్డు నుంచి హరి ఉద్యమం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 9: సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమించడానికి అనకాపల్లి ఎంపి సబ్బం హరి ముందుకు వచ్చారు. ఆయన ఆదివారం స్థానిక బీచ్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుంచి తన ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి బాలరాజు ఉద్యమానికి దూరంగా ఉంటే, గంటా శ్రీనివాసరావు నాన్ పొలిటికల్ జెఎసి పేరుతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. ఈనేపథ్యంలో సబ్బం హరి రంగ ప్రవేశంతో ఉద్యమం కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.
గస్తీ నౌక నేడు జల ప్రవేశం
విశాఖపట్నం, ఆగస్టు 9: సాగర గస్తీ నౌక శనివారం జల ప్రవేశం చేయనుంది. దీంతో కోస్ట్‌గార్డ్‌లో ఏడవ గస్తీ నౌక జల ప్రవేశం చేసినట్టు అవుతుంది. 50 మీటర్ల పొడవు కలిగి ఉన్న ఇండియన్ కోస్ట్‌గార్డ్ నౌక రాజ్‌వీర్ ఇన్‌షోర్ పెట్రోల్ వెసల్ (ఐపివి) జలప్రవేశాన్ని కేంద్ర రక్షణ కార్యదర్శి ఆర్ మాథూర్, ఇండియన్ కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ అనురాగ్ తప్లియాల్, కోస్ట్‌గార్డ్ రీజియన్ (ఈస్ట్) ఇన్స్‌పెక్టర్ జనరల్ ఎస్‌పి శర్మ సమక్షంలో నిర్వహిస్తారు. అత్యంత అధునాతన, సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న ఈ నౌకను కోల్‌కతాకు చెందిన జిఆర్‌ఎస్‌ఇ కంపెనీ నిర్మించింది. సమాచార వ్యవస్థకు సంబంధించి అధునాతన పరికరాలను కలిగి ఉంటుంది. 2720 కిలోవాట్ల సామర్థ్యం కలిగి, గరిష్టస్థాయిలో 31.5 నాటికన్ మైళ్ళ వేగంతో నడుస్తుంది. ఈ నౌకను ఐదుగురు అధికారులు, మరో 30 మంది ఉద్యోగులు కమాండెంట్ రాజీవ్ రంజన్ పర్యవేక్షణలో నిర్వహిస్తారు.
సీమాంధ్ర ప్రజల రక్తం మరుగుతోంది
* ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్
విశాఖపట్నం, ఆగస్టు 9: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అంతా కోరుకుంటుంటే కొంతమంది నేతలు స్వార్థ రాజకీయాలతో చేస్తున్న విమర్శలతో సీమాంధ్ర ప్రజల్లో రక్తం మరుగుతోందని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌పై స్పష్టం ఇచ్చిన తరువాతే ముందుకు వెళ్తామనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన వలన ఎదురయ్యే పరిణామాల గురించి వివరిస్తే స్వార్ణపూరిత రాజకీయాలతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, నిజాలను చెప్పడంలేదన్నారు. 1972లో దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటులో ఈ రాష్ట్రం ఐక్యంగా ఉంటుందని ప్రకటించారని, అప్పటి నుంచి హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరి అభివృద్ధి కలిగి ఉన్న హైదరాబాద్‌ను కోరుతూ తెలంగాణా యువత ఆశలపై నీళ్ళు చల్లుతోందన్నారు. సకల జనుల సమ్మె, తెలంగాణా మార్చ్ వంటి కార్యక్రమాల్లో సంయమనం పాటించి ఏ ఒక్కరికీ నష్టం కలిగించకుండా వ్యవహరించిన ముఖ్యమంత్రిపై విమర్శలు తగదన్నారు. రెచ్చగొట్టే ఉపన్యాసాలతో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఆ బలిదానాలను ఎందుకు ఆపలేకపోయారన్నారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యాలను విమర్శించే తెలంగాణావాదులు, తెలంగాణా కాంగ్రెస్ నేతలు వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీమాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారన్నారు. నాటి ముఖ్యమంత్రులు పివి నర్సింహరావు, జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, జనార్ధనరెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన వరకు అంతా రాష్ట్ర ప్రగతిని కోరుకున్న వారేనన్నారు. ఆంధ్రా ఉద్యోగులు ఉద్యమిస్తుంటే కెసిఆర్ బెదిరిస్తున్నారని, దీనికి అక్కడి కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడంలేదన్నారు.
రైల్‌రోకోలపై నిషేధం
* నిబంధనలు ఉల్లఘిస్తే నాన్ బెయిలబుల్ కేసులు
విశాఖపట్నం, ఆగస్టు 9: సమైక్యాంధ్రకు మద్ధ్థుగా విశాఖ జిల్లాలో ఎక్కడైనా రైల్‌రోకో నిర్వహిస్తే అటువంటి ఆందోళనకారులపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యమకారులు ఎవరైనా రైలురోకో చేసినా రైలు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించినా, రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదు చేయనున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న అన్ని రైల్వేస్టేషన్లలో,రైల్వే గేట్ల వద్ద రైలు పట్టాలపై రైల్‌రోకో చేసే ఆందోళనకారులను గుర్తించడానికి వీడియో కెమెరాలను పెట్టడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రైల్‌రోకోలు చేసే యువకులు, విద్యార్థులపై కేసులు నమోదు చేయడం వలన వీరి భవిష్యత్‌కు విఘాతం ఏర్పడుతుందన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించి రైలు ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఉద్యమాలు చేపడితే ఉద్యమకారులను ఎటువంటి పరిస్థితుల్లోను విడిచిపెట్టేదిలేదని ఆయన హెచ్చరించారు.
కొనసాగుతున్న సమైక్య ఉద్యమం
* బైక్ ర్యాలీలు...రోడ్డుపై స్నానాలు
విశాలాక్షినగర్, ఆగస్టు 9: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, పూర్ణామార్కెట్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు, ఏయు విద్యార్థులు, విధ ప్రజా సంఘాలు పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. దీనిలో భాగంగా విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసి ఆధ్వర్యంలో మద్దిలపాలెం వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో నాలుగు వైపుల ట్రాఫిక్ స్తంభించింది. అరగంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. డప్పుల వాయిద్యాలు, సమైక్యాంధ్ర జెండాలతో ఉద్యోగులు నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అనంతరం అక్కడ నుంచి ద్విచక్ర వాహనాల ర్యాలీ బయలుదేరింది. సత్యం కంప్యూటర్ జంక్షన్ మీదుగా గురుద్వారా జంక్షన్, అక్కయపాలెం, తాటిచెట్లపాలెం, కంచరపాలెంమెట్టు, ఊర్వశి థియేటర్ జంక్షన్, బిర్లా జంక్షన్, మర్రిపాలెం మీదుగా ఎన్‌ఏడి జంక్షన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జేఎసి ప్రతినిధులు గణపతి, శ్రీనివాసరావులు మాట్లాడుతూ సమైక్యాంధ్రాకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి మరీ దీనిని సాధిస్తామన్నారు.
ఆర్టీసీ ఎన్‌ఎంయు ఆధ్వర్యంలో
ఆర్టీసీ ఎన్‌ఎంయు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం మద్దిలపాలెం కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై కార్మికులు స్నానాలు చేసి నిరసన తెలిపారు. జిల్లావ్యాప్తంగా కార్మికులు హాజరై మద్ధతు తెలియజేశారు. యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వెంటనే కేంద్రం ప్రకటన చేయాలని, మభ్యపెట్టే ప్రకటనలను పక్కపెట్టాలన్నారు. విజయనగరం జోనల్ కార్యదర్శి, కమిటీ సభ్యులు పివివి మోహన్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ నాడు రోడ్డుపై స్నానాలు చేసి కార్మికులు కేంద్రం కళ్ళు తెరిపించడం ద్వారా సమైక్య ప్రకటన ఇప్పించాలని కోరుతున్నారన్నారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులు సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన 130 డిపోలు, 13 జిల్లాలు నాలుగు జోన్ల 70 వేల మంది కార్మికులు ఈ నెల 12న అర్ధరాత్రి నుండి ఎన్జీవోలతో పాటు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం ఆలోచన చేసి సమైక్య రాష్ట్ర ప్రకటన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర యూనివర్శిటీ జేఏసి నాయకులు ఆడారి కిషోర్‌కుమార్, విద్యార్థి నాయకులు, యూనియన్ ప్రతినిధులు సిహెచ్ వెంకటేశ్వరరావు, రూరల్ డివిజన్ నాయకులు ఎంవిఆర్ మూర్తి, టిఎస్‌రావు, కెవి రమణ, జెఎం నాయుడు, ఆర్ వసంతరావు, హరిప్రసాద్‌లు పాల్గొన్నారు.
* ఏయు ఆధ్వర్యంలో
ఆంధ్రవిశ్వవిద్యాలయం గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు దీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిని పలువురు పరామర్శి, సంఘీభావం తెలియజేస్తున్నారు.
* కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో
కేబుల్ ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 11న సమైక్యాంధ్ర సభకు హాజరుకావాల్సిందిగా పిలుపునిచ్చారు. అలాగే పూర్ణామార్కెట్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
ఘనంగా కుర్సుర సబ్‌మెరైన్ 11వ వార్షికోత్సవం
విశాఖపట్నం, ఆగస్టు 9: ప్రపంచ పర్యాటక రంగంలో విశాఖ నగరానికే కాకుండా యాతత్ భారతదేశానికే వనె్న తెస్తున్న కుర్సుర సబ్‌మెరైన్ మ్యూజియం 11వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నగరానికి చెందిన పాఠశాల విద్యార్ధినీ, విద్యార్థులు, సందర్శకులతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన జీవిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ, వుడా ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.యువరాజ్, జీవిఎసి అదనపు కమిషనర్ ఎం.జానకి, రైల్వే అధికారి సుదర్శనరావు, తూర్పు నౌకాదళం సబ్‌మెరైన్ యూనిట్ ఆఫీసర్ ఇన్‌చార్జి కమాండర్ రాజేష్ తదితరులు వార్షికోత్స వేడుకల్లో పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నారి యువరాజ్ హర్షిణి కేక్ కట్ చేసింది. కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ నౌకాదళంలో మూడు దశాబ్దాలకు పైగా విశిష్టమైన సేవలందించిన మొదటి తరం సబ్‌మెరైన్ కుర్సుర సబ్‌మెరైన్‌ను యుద్దసామాగ్రితో సహా యథాతధంగా సజీవంగా మ్యూజియం రూపంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నేవీ, వుడా సంయుక్త నిర్వహణలో ఈ మ్యూజియం నిర్వహణ విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తోందన్నారు. విశాఖ నగరాన్ని పర్యాటక స్వర్గంగా మరింతగా తీర్చిదిద్దేందుకు జీవిఎంసి, వుడా ప్రణాళికలు చేపడుతున్నారన్నారు. వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్ యువరాజ్ మాట్లాడుతూ సబ్‌మెరైన్ మ్యూజియంనకు అనుబంధంగా మరిన్ని సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ మ్యూజియంను ప్రముఖ సందర్శనా స్థలంగానే కాకుండా విజ్ఞానపరమైన అరుదైన కేంద్రంగా కూడా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. నౌకాదళంలో సబ్‌మెరైన్‌ల పనితీరు, సముద్ర గర్భంలో అవి పనిచేసే తీరుతెన్నులు, యుద్ధ సమయాల్లో పాటించే వ్యూహాలు తదితర అంశాలతో దృశ్య శ్రవణ ప్రదర్శనను, పెరిస్కోప్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కుర్సుర సబ్‌మెరైన్ మ్యూజియం ద్వారా సందర్శకుల ప్రవేశ రుసుము రూపంలో ఏటా కోటి రూపాయల వరకు ఆదాయం వస్తున్నా సుమారు 80 లక్షల వరకు మ్యూజియం నిర్వహణకే ఖర్చవుతాయని, అయితే దక్షిణాసియాలో ఏకైక సబ్‌మెరైన్ మ్యూజియంగఆ రికార్డుకెక్కిన కుర్సుర మ్యూజియంను లాభాపేక్షతో కాకుండా పర్యాటక పరంగా వుడా అందిస్తున్న అరుదైన కానుకగా అత్యత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు వీసి డాక్టర్ యువరాజ్ పేర్కొన్నారు. మ్యూజియం నిర్వహణలో తూర్పు నౌకాదళం ఎప్పటికపుడు సాంకేతిక, సలహా సహకారాన్ని అందిస్తోందన్నారు. తూర్పు నౌకాదళం సబ్‌మెరైన్ యూనిట్ ఆఫీసర్ ఇన్‌చార్జి కమాండర్ రాజేష్ మాట్లాడుతూ భారత నౌకాదళంలో మొదటితరానికి చెందిన కుర్సుర సబ్‌మెరైన్‌ను ఇప్పటికీ సజీవంగా మ్యూజియం రూపంలో చూస్తుండటం గర్వంగా ఉందన్నారు. వుడా కార్యదర్శ డాక్టర్ జిసి కిషోర్‌కుమార్, చీఫ్ ఇంజనీర్ ఐ.విశ్వనాథరావు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ జివి లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు డివి వర్మ,కుర్సుర మ్యూజియం క్యూరేటర్ జి.్ఫణిరాజు, సహాయ క్యూరేటర్ కెవి చలపతిరావు పాల్గొన్నారు.
ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల కోసం విసి చర్యలు
సాగర్‌నగర్, ఆగస్టు 9: ప్రైవేట్ భాగస్వామ్యంతో (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) వుడా చేపట్టిన పలు పిపిపి ప్రాజెక్టుల వ్యవహారాలను కొలిక్కి తెచ్చేందుకు వీలుగా వుడా ఉపాధ్యక్షులు డాక్టర్ యువరాజ్ చర్యలు ముమ్మరం చేసారు. వీటిలో కొన్ని ప్రాజెక్టులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉండటమే కాక మరికొన్ని ముందుకు కదలకుండా మిగిలిన నేపథ్యంలో సంస్థ ప్రతిష్ఠకు దోహదం చేసే రీతిలో వీటిన్నంటినీ కార్యాచరణలోకి తీసుకొచ్చేందుకుగాను విసి యువరాజ్ చర్యలు చేపట్టారు. గత నెలలో జరిగిన వుడా బోర్డు సమావేశంలో పిపిపి ప్రాజెక్టుల అంశాలను ప్రధానంగా చర్చకు పెట్టిన విసి కొన్నింటిపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి పరిష్కారం సూచించేలా బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ప్రైవేట్ భాగస్వాములతో శుక్రవారం సమావేశం నిర్వహించిన విసి రానున్న బోర్డు సమావేశంలో దాదాపు అన్ని ప్రాజెక్టుల సమస్యల్ని కొలిక్కి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు ముందుకు కదలకపోవడానికి గల కారణాలపై ఈ సందర్భంగా మరోసారి సమీక్షించారు. వుడా కార్యాలయం ఎదురుగా వాణిజ్య సముదాయం అభివృద్ధికి వైభవ్ సంస్థ, గురజాడ కళాక్షేత్రానికి ఆనుకుని ఆతిథ్య సేవలకుగాను ఫ్యూజన్‌ఫుడ్స్, పరదేశీపాలెం, మధురవాడ ప్రాంతాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులకు ఎల్ అండ్ టి, మెటాస్, వుడా పార్కులో వినోదం కోసం నిర్మిత సంస్థకు బోట్‌క్లబ్, బీచ్‌రోడ్డులో తెనే్నటిపార్కులో బిగ్‌స్క్రీన్, కైలాసగిరిపై రివాల్వింగ్ రెస్టారెంట్, కాటేజస్ నిర్మాణం, వైశాఖి జల ఉద్యానవనం, రేడియండ్ ప్రాపర్టీస్, దాకమర్రి వద్ద 99 ఎకరాల్లో అల్ట్రామోడరన్ లే అవుట్ అభివృద్ధికి వెన్సర్ సంస్థ తదితరమైన సుమారు 20 పిపిపి ప్రాజెక్టులను వుడా ఖరారు చేసి అభివృద్ధిపరిచేందుకు అప్పగించింది. నిర్ణీత కాలనీకి లీజు పద్ధతిపై కొన్ని, ఆదాయ విభజన పంపిణీ పద్ధతిపై మరికొన్ని, నిర్మాణ స్థలం పంచుకునే పద్ధతిపై కొన్ని ప్రాజెక్టులను పిపిపి విధానంలో వుడా అనుమతులు జారీ చేసింది. న్యాయపరమైన వివాదాలు, మరికొన్ని అభివృద్ధిదారుల వైపునుండి వైఫల్యాలు తదితర కారణాలపై ప్రాజెక్టుల కార్యాచరణలో జాప్యం నెలకొంది. ప్రాజెక్టుల కార్యాచరణలో విపరీతమైన జాప్యం ఫలితంగా ఇటు వుడాకు అటు అభివృద్ధిదారులకు కూడా సమస్యలు తెచ్చిపెడుతున్న పిపిపి ప్రాజెక్టులన్నింటినీ గాడిలో పెట్టేందుకు వీలుగా విసి అభివృద్ధిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు. ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ సమస్యలపై సంబంధిత విభాగాధిపతులు కూలంకషంగా అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేయాలని విసి ఆదేశించారు. పిపిపి ప్రాజెక్టుల భాగస్వాముల నుండి వారి అభిప్రాయాలు, ప్రతిపాదనలను వుడా నుండి కోరుతున్న సహకారాన్ని రాతపూర్వకంగా అందించాలని సమావేశంలో పాల్గొన్న వారికి విసి సూచించారు.
భక్తులతో కళకళలాడిన ఆలయాలు

విశాలాక్షినగర్, ఆగస్టు 9: శ్రావణమాస మొదటి శుక్రవారం నగరంలోని ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. ప్రతీ సంవత్సరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచడం ఆచారంగా వస్తోంది. శ్రీ మహాలక్ష్మిదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ శ్రావణమాసంలో అమ్మవారిని కొలిస్తే అనుకున్న కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. నగరంలోని పలు దేవాలయాల్లో శ్రీ మహాలక్ష్మిని పూజించడానికి మహిళలు వేకువ జామునుంచే బారులు తీరారు. వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మికి సహస్రనామ కుంకుమార్చనలు, విశేష పూజలు నిర్వహించారు. గోత్రనామాలతో పూజలు చేశారు. ఆలయ ప్రాంగణాల్లో శ్రీ లక్ష్మీదేవి వైభవాన్ని తెలుపుతూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

అప్పన్నకు భారీగా కానుకలు
* ఉద్యోగులకు నూతన వస్త్రాలు

సింహాచలం, ఆగస్టు 9: సింహాచలేశునికి శుక్రవారం పూజలు చేసి అనంతరం తన స్వస్థలానికి పయనమై వెళ్లారు లక్ష్మీకాంత్ నాయుకోదాస్. సింహాద్రినాధునికి భారీగా కానుకలు సమర్పించి ఇఓ, అర్చక పరివారంతో పాటు ఉద్యోగులందరికీ నూతన వస్త్రాలు పంపిణీ చేసి ఎదురొచ్చిన వారందరికీ దానాలు చేసారాయన. దేవస్థానం ఇఓ కె.రామచంద్రమోహన్ స్వామి వారి శేషవస్త్రాలు, ప్రసాదాలు ఆయనకు అందించారు. ఆయన వంశాచారం ప్రకారం మూడునెలలుగా సింహాద్రినాధునికి వివిధ రకాలైన సేవలు, పూజలు, విశేషపూజలతో పాటు నిత్యకల్యాణం, ఊంజల్‌సేవ వంటివి చేయించారు. దాసుడు సింహాద్రినాధుని సన్నిధానంలో ఉన్న మూడునెలల కాలంలో ఆ రాష్ట్ర పరిసర ప్రాంతాల నుండి సుమారు 2 లక్షల మంది వరకూ భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి వారందరికీ ఆయన తన సత్రంలో అన్నదానం చేసారు.
రధయాత్రకి సహకరించండి: ఇఓ
దేవాదాయశాఖ హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆదేశాల మేరకు దేవస్థానం ఆధ్వర్యంలో హిందూధర్మ ప్రచారం కోసం డిసెంబర్ నెలలో రథాన్ని ఒడిశా రాష్ట్రంలో పర్యటనకు పంపించనున్నట్లు ఇఓ లక్ష్మీకాంత్‌నాయకోదాస్‌కి చెప్పారు. ఆ పర్యటనలో తమకు సహకరించాలని ఇఓ ఆయనను కోరారు.

శ్రావణలక్ష్మికి లక్ష కుంకుమార్చన
* భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

సింహాచలం, ఆగస్టు 9: శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో కొలువుతీరి వున్న సింహవల్లితాయార్ (లక్ష్మీదేవి) అమ్మవారికి లక్ష కుంకుమార్చన వైభవంగా జరిగింది. భక్తులు ఆర్జితసేవగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ప్రధానార్చకుడు మోర్త సీతారామాచార్యుల నేతృత్వంలో అర్చక పరివారం ఆగమ శాస్త్రానుసారం పది ఆవృతులలో కుంకుమార్చన పూర్తి చేశారు. అర్చనలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసారు. కొండదిగువ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మికి శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు నిర్వహించారు. ఉదయం నుండి దేవాలయంలో భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం భారీ వర్షం కురిసినప్పటికీ భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అంతరాలయంలో వెంకటేశ్వరస్వామికి శ్రీ మహాలక్ష్మికి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు.

ప్రజలే నాయకులుగా సమైక్యాంధ్ర ఉద్యమం
* మంత్రి గంటా వెల్లడి
అనకాపల్లి, ఆగస్టు 9: రాజకీయాలకు అతీతంగా ప్రజలే నాయకులుగా సమైక్యాంధ్ర ఉద్యమం సాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయమై వెనక్కు తగ్గే నిర్ణయాన్ని తీసుకోక తప్పదని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానికంగా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వలన సాగునీరు, విద్యుత్ ఇతర సమస్యలు మ రింత తీవ్రతరం అవుతాయని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలను సమైక్యాంధ్రకు చెందిన మంత్రులంతా ఏకీభవిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్నిపార్టీల వారు అన్నిసంఘాల వారు చేస్తున్న ఉద్యమం ఈనెల 12వ తేదీ నుండి మరింత తీవ్రరూపం దాల్చనుందని అన్నారు. ఈనెల 14వ తేదీన విశాఖలో విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో జరిగే సమైక్యాంధ్ర సింహగర్జన కార్యక్రమానికి అనూహ్య సంఖ్యలో అన్నివర్గాల వారు హాజరై నిరసన తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నేపధ్యంలో ఆంటోనీ కమిటీ హైదరాబాద్‌లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మనోభావాలను తెలుసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం తరపున కోరామని మంత్రి గంటా తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, కాంగ్రెస్ నాయకులు కొణతాల రఘునాథ్, తుమ్మపాల సుగర్స్ మాజీ చైర్మన్ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.

సమైక్యాంధ్ర బంద్ విజయవంతం
అనకాపల్లి (నెహ్రూచౌక్), ఆగస్టు 9: సమైక్యాంధ్రకు మద్దతు కోరుతూ పలు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, హోటళ్లు మూతపడ్డాయి. ఒక్కరోజుకు కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభించాయి. స్వచ్చందంగా బంద్ పాటించి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు, రెడీమేడ్ అండ్ టెక్స్‌టైల్స్, టివిమెకానిక్ అసోషియేషన్స్, మెటల్ మర్చంట్స్, ఎడిబల్ ఆయిల్ డీలర్స్, కన్య్సూమర్స్ ప్రొడక్టు డిస్ట్రిబ్యూటర్లు, గోల్డ్ మర్చంట్స్, రైస్ మర్చంట్స్, పేపర్ ప్రింటర్స్, బుక్స్ అసోషియేషన్స్, సెల్‌షాప్ యజమానులు, పలు స్వచ్చంద సంస్థలు ఉద్యమంలో పాల్గొని స్థానిక చిన్న నాలుగురోడ్ల జంక్షన్ నుండి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి, సోనియా డౌన్‌డౌన్, కెసిఆర్ డౌన్‌డౌన్, తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర ముద్దు అని పలు నినాదాలతో నెహ్రూచౌక్ జంక్షన్‌కు చేరుకొని ఆందోళనను నిర్వహించారు. పట్టణంలో ఉన్న గూడ్సు ఆటోయూనియన్లు, ఓనర్లు, డ్రైవర్లు తమ ఆటోలతో ప్రదర్శన నిర్వహించారు. తొలుత పట్టణంలో ప్రధాన వీధుల గుండా సుమారు 200 ఆటోలు ర్యాలీగా స్థానిక నెహ్రూచౌక్ జంక్షన్‌కు చేరుకుని అక్కడ ఆటోలతో మానవహారంగా ఏర్పడి ఆందోళన చేశారు. అనంతరం సోనియా, కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్ సిపి ర్యాలీ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శుక్రవారం స్థానిక రింగ్‌రోడ్డులోగల కొణతాల రామకృష్ణ క్యాంపు కార్యాలయం నుండి వైఎస్సార్ సిపి పట్టణ కన్వీనర్ మందపాటి జానకిరామరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మలసాల కిషోర్ ఆధ్వర్యంలో రాష్టవ్రిభజనను నిరసిస్తూ నెహ్రూచౌక్ జంక్షన్‌కు తెలంగాణా వద్దు, సమైక్యాంధ్ర ముద్దు, కెసిఆర్ డౌన్‌డౌన్, జై తెలుగుతల్లి, జైజై తెలుగుతల్లి అంటూ పలు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నెహ్రూచౌక్ జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడి పలు నిరసనలు చేశారు. ఈ సందర్భంగా జానకిరామరాజు మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశామని డ్రామాలు ఆడుతున్నారని, పార్టీలకు అతీతంగా అన్నిపార్టీలు సమైక్య ఉద్యమంలో పాల్గొంటే కెసిఆర్ లాంటి వాళ్లు ఎంతమందైనా మన రాష్ట్రాన్ని తన్నుకుపోదామని చూసినా సరే సాధ్యపడదన్నారు. రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి కారణం వైఎస్సార్ పార్టీయేనని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయని, కానీ ప్రస్తుత అధికార పార్టీయే రాష్ట్రాన్ని విభజించడానికి కారణమని అన్నారు. సోనియా తనయుడు రాహూల్‌గాంధీని ప్రధానిని చేయడమే ఉద్ధేశ్యంగా భావించి రాష్ట్రాన్ని విభజించి కెసిఆర్‌కు హైదరాబాద్ వనరులన్నీ అంటగడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి రామ అప్పారావు, అరకు నాగేశ్వరరావు, కెఎం నాయుడు, మంత్రి సత్తిబాబు, దాడి కుమార్, గోల్డ్ శివ, ఏడువాక నారాయణరావు, పీలా నాగశ్రీను, కుండల రామకృష్ణ పాల్గొన్నారు.
ఆదివాసీ చట్టాల అమలుకు ఉద్యమించాలి
* ప్రపంచ ఆదివాసీల దినోత్సవం
పాడేరు, ఆగస్టు 9: ఆదివాసుల రక్షణకు, సంక్షేమానికి ఉద్ధేశించిన చట్టాలను సమర్థంగా అమలు చేసుకునేందుకు ఆదివాసీ సంఘాలన్నీ సంఘటితంగా ఉద్యమించాలని పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ఎన్.హెచ్.అక్బర్ పిలుపునిచ్చారు. స్థానిక గిరిజన భవన్‌లో పలు రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ ఆదివాసుల హక్కులు అనాదిగా కాలరాయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాలపై అవగాహన లేకపోవడం వలనే ఆదివాసీ సమాజం నిరంతరం దోపిడీకి గురవుతుందని ఆయన అన్నారు. చట్టాల అమలుకు ఆదివాసీ సంఘాలు ఉద్యమబాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. నిరక్షరాస్యులైన గిరిజనులకు ఆదివాసీ చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఆదివాసీ సంఘాలపై ఉందన్నారు. ఆదివాసుల భూముల సంరక్షణకు భూ బదలాయింపు చట్టం అమలులో ఉన్నప్పటికీ కచ్చితంగా అమలు చేయకపోవడంతో ఖనిజ సంపదను ప్రభుత్వమే లూటీ చేసే ప్రయత్నాలు చేస్తుందన్నారు. మన్యంలో బాక్సైట్ ఖనిజాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం విదేశీ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధమైందని, ఇటువంటి నిర్ణయాలు ఆదివాసీ చట్టాలను ఉల్లంఘించడమేనని చెప్పారు. ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తే ఆదివాసుల మనుగడ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సభలో మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి మాట్లాడుతూ భూ బదలాయింపు, పీసా, అటవీ హక్కుల చట్టం ఎన్నో ఉన్నప్పటికీ కచ్చితంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. ఆదివాసీ చట్టాలను సమర్థంగా అమలు చేయగలిగితే ఈ ప్రాంత గణనీయంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు. మాజీ శాసనసభ్యుడు లకే రాజారావు మాట్లాడుతూ దోపిడీ ప్రభుత్వాల హయాంలో ఆదివాసులు దోపిడీకి గురవుతున్నారన్నారు. ఆదివాసీ ప్రయోజనాలను కాపాడేందుకు ఏ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి ఉప ప్రణాళిక పేరుతో ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన చట్టం ఎంతవరకు సమర్థంగా అమలు ప్రశ్నార్థకమేనని అన్నారు. ఉప ప్రణాళిక నిధులను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కుట్ర పన్నుతుందని ఆమె ఆరోపించారు.

* నాన్ పొలిటికల్ జెఎసిపై అనుమానాలు * ఆ జెఎసికి దూరమంటున్న విపక్షాలు * అదే బాటలో కొంతమంది కాంగ్రెస్ నేతలు * కొత్త జెఎసి ఏర్పాటుకు సన్నాహాలు
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>