పృచ్ఛకుడు: అనేక మార్గాలు సూచించే ఆధ్యాత్మిక గురువులు ఎందుకున్నారు? ఎవర్ని గురువుగా స్వీకరించాలంటారు?
అరుణాచల రమణులు: ఎవరివద్దనైతే నీకు శాంతి లభిస్తుందో, వారిని ఎన్నుకో.
పృ: మీరు గురువంటూ ఎవరూ లేరని ఎందుకంటూ ఉంటారు?
ర: గురువును గురించి నీ నిర్వచనమేమిటో, దాని మీద ఆధారపడి ఉంటుంది. అతడు మానవాకారంలో వుండనవసరం లేదు. పృథ్వీ, వాయువూ మొదలైన పంచభూతాలతో సహా, దత్తాత్రేయుడికి, ఇరవై నలుగురు గురువులు ఉండేవారు. ఈ లోకంలోని అన్ని వస్తువులనీ ఆయన గురువుగానే పరిగణించేవారు.
గురువు తప్పక అవసరమే. మేధ, ఇంద్రియాలతో కూడుకున్న అరణ్యం నుండి, మనిషిని బయటపడేయడానికి గురువు ఒక్కడే శరణ్యమని ఉపనిషత్తులు ఘోషిస్తున్నై. అందువల్ల గురువు అవసరమే.
పృ: నేనడుగుతున్నది మానవాకారంలోని గురువు గురించి. భగవాన్‌కు మరి గురువు లేడు కదా?
ర: ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒక గురువు ఉండి వుండవచ్చు. అరుణాచలాన్ని ప్రశంసిస్తూ, శ్లోకాలు చదివాను కదా?
గురువంటే ఏమిటి? భగవంతుడు, ఆత్మయే గురువు. భౌతిక అవసరాలు తీర్చమని ప్రార్థించే కాలం చెల్లిపోయే రోజు వస్తుంది. కేవలం భగవంతుడే కావాలనే ప్రార్థన ప్రారంభమవుతుంది. భగవంతుడప్పుడు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తాడు; అది మానవాకారం కావచ్చు. అటువంటి గురువు, ఈ మనిషి ప్రార్థన నంగీకరించి, ఇతడి అవసరాన్ని అనుసరించి, ఆ భక్తుడు తనలోనికి తాను వెళ్లే దోవ చూపిస్తాడు.
పృ: ఒక గురువు యెడల విశ్వాసం కలిగుండి కూడా, మరొక గురువును గౌరవించవచ్చా?
ర: గురువు ఏనాడైనా ఒక్కడే. అతడికి భౌతిక రూపం లేదు. సాధకుడిలో దౌర్బల్యం వున్నంతకాలం, బాహ్యంగా ఏదో ఒక బలం కావాలనిపిస్తుంటుంది.
పృ: సత్యాన్ని సాక్షాత్కరించుకోవడానికి మహర్షి నాకు సహాయపడతారా?
ర: సహాయమనేది ఎల్లప్పుడూ ఉండనే ఉంటుంది.
పృ: ఎల్లప్పుడూ ఉంటుందనే మీరు చెప్పే సహాయం నా అనుభవంలో వుంటం లేదు.
ర: ప్రపత్తి నలవరచుకో. కనిపిస్తుంది.
పృ: నేనెల్ల వేళలా మీ చరణ దాసుడనే. మేము అనుసరించడానికి వీలైన ఉపదేశమేదైనా మహర్షి మాకు అనుగ్రహిస్తారా? లేకపోతే, ఆరొందల మైళ్ల దూరంలో వుండే నాకు, సహాయమెలా అందుతుంది?
ర: సద్గురువు నీలోనే వున్నాడు.
పృ: అది అర్థం చేసుకోడానికి నాకు సద్గురువు ఎంతైనా అవసరముంది.
ర: సద్గురువు లోపలే వున్నాడంటున్నాను కదా?
పృ: నాకు కంటికి కనిపించే గురువు కావాలి.
ర: ఆ కనిపించే గురువు, నీ సద్గురువు నీలోనే వున్నాడంటున్నాడు.
‘క్రైస్తవంలో ఒక శ్లోకమున్నది. అందులో ఏమని ఉందంటే, ‘ఓ గురూ, నీవెప్పుడూ నాతోనే వున్నావు. నేను విముక్తి చెందేవరకూ, నన్ను నిర్దేశిస్తూనే వున్నావు’ అదీ దాని తాత్పర్యం.
అవసరం వచ్చినప్పుడు ఈ ఆత్మే గురువుగా, బాహ్య రూపం ధరిస్తుంది. ఆ అవసరం రాకముందు, ఆ గురువు లోపలే వుంటూ తాను చేయవలసిన పని చేస్తుంటాడు.
భగవంతుడు, గురువు, ఆత్మ, మూడూ ఒక్కటే. ఆధ్యాత్మికత వైపు మొగ్గిన మనిషి, భగవంతుడు ఎల్లెడలా వున్నాడని కనుగొని, ఆ భగవంతుణ్ణే తన గురువుగా భావిస్తాడు. అటుపైన భగవంతుడే ఆ వ్యక్తికి, రూపమున్న ఒక గురువు తారసిల్లేట్లు చేస్తాడు; అప్పుడా వ్యక్తి ఇతడే సర్వస్వమని భావిస్తాడు. చివరకు ఆ గురువులే ఈ సాధకుడికి, ఆత్మ ఒక్కటే సత్యమని గ్రహించేట్లు చేస్తాడు. అప్పుడు ఆత్మయే గురువని ఆ మనిషి గ్రహిస్తాడు.
‘ఈశ్వరో గురురాత్మేతి’ ఈశ్వరుడు, గోవు, ఆత్మ మూడూ ఒక్కటే అని చెప్తున్నది; ఈ వాక్యం. (ముగింపు పై వారం)
నీలంరాజు నోట్‌బుక్
english title:
e
Date:
Sunday, August 11, 2013